Tags

, , , ,

Image result for narendra modi on flying horse

సత్య

   రెక్కల గుర్రాలు ఎక్కి చుక్కల లోకాలు చూసే బాల్యం నాటి వూహలు, కథలు జీవితాంతం గుర్తుంటాయి. మన పూర్వీకులు పెట్రోలు, పైలట్లతో పని లేకుండా ఒక లోకం నుంచి మరో లోకానికి, పైకీ, కిందికీ, ఎటుబడితే అటు తిప్పుతూ ఎంత మంది ఎక్కినా మరొకరికి సీటు వుండే విమానాలలో తిరిగే వారని వయస్సు వచ్చిన వారికి, అందునా చదువుకున్న వారికి చెప్పటమే కాదు, వారి చేత నమ్మింప చేస్తున్న రోజులి. ఇక ప్రతిదానినీ ముందుగానే వూహించి చెప్పారంటున్న పోతులూరి వీరబ్రహ్మంగారి ప్రవచనాలను మనకు సరికొత్తగా అందించే మహానుభావుల సంగతి సరే సరి. ఈ కారణంగానే మన నిఘంటువులో అసాధ్యం అనే దానికి ఒక్క వుదాహరణ కూడా దొరకని తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాం.దీనికి తోడు సామాజిక మాధ్యమం వచ్చిన తరువాత అది సంక్షోభ స్థాయికి చేరింది.

    లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్నది తెలుగు సామెత. ఒక పేదవాడు పండుగకో, పబ్బానికో అని కొనుక్కున్న దుస్తుల మీద ఏదైనా పడితే మరకగా మారుతుందేమోనని ఎంత కంగారు పడిపోతాడో తెలిసిందే. ఆత్మగౌరవం గల వ్యక్తులు తమ వ్యక్తిత్వాల మీద ఒక మరక పడితే తల్లడిల్లి పోతారని పాత పుస్తకాల్లో చదువుకున్నాం. అంతరించి పోతున్న అలాంటి వారు ఎక్కడన్నా కనపడతారేమోనని పాతాళభైరవి దురి&భిణి వేసి చూసినా కనిపించటం లేదు . ఇక ‘బ్రహ్మం గారు చెప్పినట్లు ‘ అధికారం రుచి మరిగిన మన రాజకీయ నాయకుల గురించి ఇక చెప్పుకోనవసరం లేదు. ఎన్ని మరకలు పడితే అంతగా మార్కెట్లో డిమాండు వుంటుందనే సత్యాన్ని బోధి చెట్టు కింద కూర్చోకుండానే తెలుసుకున్న అపర జ్ఞానులు. ఎదుటి వారి మీద మరకలు వేయటం, తాము వేయించుకోవటంలో ఆరితేరిన వారు. ఒక వ్యాపారి ‘మరకు మంచిదే ‘ అంటూ తన వుత్పత్తులను అమ్ముకోవటానికి ఒక మరక నినాదాన్ని సృష్టించి నిజంగా మరక పడటం మంచిదే అని జనం అనుకునేట్లుగా వాణిజ్య ప్రకటనలను తయారు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ వ్యాపారులు కూడా అలాంటి ఎక్కువ మరకలున్నవారి కోసం నిత్యం ఎదురు చూస్తూ కొనుగోలుకు ప్రయత్నిస్తుంటారు. ఆ సరకులకు ‘నియోజక వర్గ అభివృద్ధికోసం, కార్యకర్తల అభీష్టం మేరకు, మా నేత అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు, స్వగృహ ప్రవేశం ‘ వంటి ఎన్నో ట్యాగులను కూడా రూపొందించిన మేథావులు.

    1848లో కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రాసిన కమ్యూనిస్టు మానిఫెస్టోను కమ్యూనిస్టు పార్టీలు అనేక ముద్రణలు, ప్రపంచ భాషలన్నింటిలోనూ తర్జుమా చేయటం మామూలు విషయం. ఈ విషయంలో బైబిల్‌తో పోటీ పడేది ఏదైనా గ్రంధం వుందంటే అది ముమ్మాటికీ కమ్యూనిస్టు మానిఫెస్టో ఒక్కటే. కార్మికుల శ్రమ శక్తి నుంచి లాభాలను పిండుకోవటం గురించి తేటతెల్లం చేసిన ఆగ్రంధాన్ని, అది వ్యాపింపచేసిన భావజాలం కమ్యూనిజాన్ని వ్యతిరేకించని పెట్టుబడిదారుడు, బడా వ్యాపారి వుండడు అంటే అతిశయోక్తి కాదు. కానీ అదే పెట్టుబడిదారులు, వ్యాపారులు ఆ కమ్యూనిస్టు మానిఫెస్టోకు మార్కెట్‌లో వున్న గిరాకీని బట్టి దానిని ముద్రించి లాభాలు ఆర్జించటమే అసాధారణం. ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పుకుంటున్న ఇండోనేషియాలో ఈనెలలోనే ఒక పుస్తక ప్రదర్శనలో కమ్యూనిస్టు మానిఫెస్టో గ్రంధాన్ని చూసిన మిలిటరీ గూఢచారులు ఇంకేముంది ఇండోనేషియాలో కమ్యూనిజాన్ని వ్యాపింప చేస్తున్నారంటూ పుస్తకాలు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి గంటల కొద్దీ విచారణ పేరుతో నిర్బంధించారు. దానిని ప్రచురించిన వారు అబ్బే మాకు కమ్యూనిజం ఏమిటి, దాన్ని వ్యాపింప చేయట ఏమిటి, అమ్ముడు పోయే పుస్తకాలన్నీ ప్రచురించటం, అమ్ముకోవటం తప్ప మాకేమీ తెలియదని చెప్పిన తరువాత వారిని వదలి వేశారు. తమకు లాభదాయకం అనిపించింది కనుకనే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు కమ్యూనిస్టు వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించి లాభపడ్డారు. అదే సామ్రాజ్యవాదులు కమ్యూనిజాన్ని కూడా సొమ్ము చేసుకోవచ్చు అని గ్రహించి చైనాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే లాభం వస్తే వ్యాపారి అవసరమైతే తనను తానే అమ్ముకోవటానికి కూడా వెనుతీయని ‘త్యాగశీలి’.

   పెట్టుబడిదారులు, వ్యాపారులు లాభాల కోసమే కదా ఇండియాకు సముద్రమార్గం కనుగొనమని కొలంబస్‌ను పురికొల్పారు. దారి తెలియనపుడే అంతగా తహతహలాడిన వారు ఇప్పుడు ఎక్కడ లాభం వస్తుందో స్పష్టంగా తెలిసిన తరువాత అక్కడ వాలిపోవటంలో ఆశ్చర్యం ఏముంది? లాభానికి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో ఎప్పుడూ దేశ భక్తి వుండదు. లాభం వస్తే ప్రాణాలు హరించే వరదల్లో కూడా వెళ్లేందుకు సిద్దపడే వ్యాపారులు మన మార్కెట్లో ప్రవేశించేందుకు సామ,దాన,బేధో పాయాలను ప్రయోగించారు. వివిధ ప్రాంతాలలో వేర్పాటు, వుగ్రవాద శక్తులు వాటిలో భాగమే. కమ్యూనిజం అని మడి కట్టుకు కూర్చుంటే లాభాలు వస్తాయా మీ పిచ్చిగానీ అని అవగతం చేసుకున్న వారు ప్రపంచంలో అతి పెద్ద ఎగుమతి, దిగుమతి మార్కెట్టు కమ్యూనిస్టు చైనాను వదులుకుంటారా ? అలా వదులు కున్న వారు నిజంగా దేశ భక్తులే ! కుందేటి కొమ్మును సాధించ వచ్చు గాని అలాంటి వారిని ఎవరినైనా ఒక్కరిని చూపగలరా ? అమెరికా వ్యాపారులు పాతాళ భైరవిలోని దుష్ట గురువుల వంటి వారైతే, భారత వ్యాపారులు ఆ గురువు శిష్యుని వంటి వారు. అందుకే కమ్యూనిస్టు చైనాను వ్యతిరేకించటమే దేశ భక్తికి గీటు రాయి అని వూరూ వాడా ప్రచారం చేసిన సంఘపరివారం తీరా తాము అధికారానికి వచ్చిన తరువాత అదే చైనాతో భాయీ భాయీ అన్నట్లుగా వాజపేయి హయాంలో వున్నారు, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా దగ్గరయ్యారు. గతంలో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన వారు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారేమిటి అని ఎవరైనా అడుగుతారేమోనన్న భయంతో అనధికారికంగా చైనా వ్యతిరేకతను వ్యాపింప చేయటంలో కూడా వారే ముందుంటున్నారు. ముఖ్యంగా సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ఆపని చేస్తున్నారు. వారి ద్వంద్వ ప్రవత్తికి అది పెద్ద తార్కాణం.

   ఇటీవలి కాలంలో మీడియాలో, సామాజిక మీడియాలో దేశాలు, వ్యాపారం, వస్తువులు, దేశభక్తి గురించి చర్చ పొంగి పొర్లుతోంది. అయితే ఒకటి మాత్రం నిజం మనుస్మృతి, బైబిల్‌,ఖురాన్‌లో చెప్పిందానికి తిరుగులేదు చర్చ లేకుండా పప్పుసుద్దల్లా పడి వుండటం, తలాడించాలని చెప్పే అపర వ్యాఖ్యాతలు, నిర్ధేశకుల నిరంకుశ భావజాలం కంటే ఏదో ఒక చర్చ జరపటం మంచిదే. మరకలు పడినా, కావాలని సిరాలు చల్లినా చర్చంటూ జరిగితే కదా తెలియని విషయాలు బయటికి వచ్చేది. మూఢ భక్తులు తమ మూఢ గురువు ముందు ఎవరైనా ప్రశ్నిస్తే సహించరు, సామాజిక మీడియాలో వారికి ఇష్టం లేకపోయినా భిన్న వాదనలు, ప్రశ్నలు ఎదురవుతాయి. అవి వారిని మార్చకపోయినా ఎదుటి వారి వాదనలను కూడా వినాలనే సహనం గల ఆలోచనా పరులకు వుపయోగం కనుక ఆ చర్చలో ప్రతివారూ పాల్గొనాలి.

    ఈ నేపధ్యంలో కొన్ని అంశాలను చూద్దాం. మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లూ అంతే దూరంలో వుంటుంది అన్న సూక్ష్మ విషయం కూడా తెలియని వారు కొద్ది రోజుల పాటు చైనా వస్తువులను కొనకుండా, అమ్మకుండా, వుపయోగించకుండా వుంటే చైనా మన కాళ్ల దగ్గరకు వస్తుందన్నంతగా కొంత మంది సూచనలు చేస్తున్నారు. ఇది నిజానికి కొత్త అయిడియా కాదు, అరువు తెచ్చుకున్నదే. మన స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్తుబహిష్కరణ పేరుతో ఒక పెద్ద అధ్యాయమే వుంది. దాన్నుంచి వచ్చిన ఆలోచన ఇది. ఆ వుద్యమానికి నాయకత్వం వహించిన ఆ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలే విదేశీ వస్తువుల వరదకు తలుపులు తెరిచారు.స్వదేశీ జాగరణ మంచ్‌పేరుతో ఒకవైపు కాస్త హడావుడి చేసినా ఆ విధానాన్ని బిజెపి పెద్దలు పూర్తిగా బలపరిచారు.తమకు అధికారం వచ్చిన తరువాత ఆ స్వదేశీ జాగరణ మంచ్‌ ఏమైందో తెలియదు. కాంగ్రెస్‌ను తలదన్నేలా మరిన్ని సంస్కరణల పేరుతో విదేశీ వస్తువుల సునామీకి తెరతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Image result for Riding on flying horsesIndia

    భరత్‌ ఝన్‌ఝన్‌ వాలా  పెట్టుబడిదారీ విధాన సమర్ధకుడు. ఆయన చేసిన వ్యాఖ్యలే కనుక ఏ రాజకీయ పార్టీనేతో, అభ్యుదయ భావాలు వున్నవారో చేసి వుంటే ఈ పాటికి దేశ ద్రోహుల, చైనా అనుకూల జాబితా పెరిగి పోయి వుండేది. భిన్నాభి ప్రాయాన్ని వ్యక్తం చేయకుండా వుండటం కోసం అలాంటి ముద్రలు వేయటం ఒక పదునైన ఆయుధం. ‘ చైనాకు మన ఎగుమతులు తక్కువగా వుండటమనేది సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు తగ్గిపోవటమే అసలు సమస్య. ఎగుమతుల నుంచి మనం తక్కువ ఆర్జిస్తున్నాము. వాషింగ్టన్‌ ఆపిల్స్‌, స్విస్‌ చాకొలెట్స్‌ దిగుమతులకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నాము. చైనా వారి పద్దతి పూర్తిగా భిన్నమైనది. చైనా రైతు పొలాలకు నీటిని తీసుకు వచ్చే కాలువలలో నీరు సదా నిండుగా వుంటుంది.ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన దుర్గతి అతనికి లేదు. మన రైతులతో పోల్చితే చైనా రైతు వుత్పత్తి వ్యయం తక్కువ. అలాగే చైనా మన దేశంలో తన వుత్పత్తులను కుమ్మరించటం కూడా ఈ వాణిజ్యలోటుకు కారణం కానే కాదు. ఆర్జిస్తున్నదాని కంటే ఎక్కువగా వినియోగం చేసేలా మన ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అప్పు చేసి పప్పుకూడు తినమంటున్నది. వాణిజ్య లోటుకు చైనాను తప్పు పట్టటం మాని మన అసమర్ధతను అంతర్గతంగా ఎదుర్కోవాలి.’ ప్రస్తుత పరిస్థితులలో ఇలా చెప్పటం నిజంగా పెద్ద తెగింపే. ఇష్టంలేని వారు చెప్పింది ఇనుప రింగులతో , ఇష్టం వున్నవారు వుంగరాల చేతో మొట్టినట్లుగా వుంటుంది.

    భరత్‌ ఝన్‌ఝున్‌ వాలా రాసిన పై వ్యాసంతో పాటు ఆంధ్రజ్యోతిలో వి.శ్రీనివాస్‌ అనే రచయిత మరొక వ్యాసం కూడా దీని గురించే రాశారు. ‘ ‘దేైశభక్త రాజకీయాలతో ‘ సంబంధం వున్న ప్రతి నేతా ఇప్పుడు పాకిస్తాన్‌ అంతు చూడటం, చైనాకు బుద్ధి చెప్పటం గురించే మాట్లాడుతున్నారు. భారతీయులు నిష్టగా ‘చైనా వస్తు బహిష్కరణ వ్రతం ‘ ఒక్క నెల రోజులు పాటించినా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలటం ఖాయమంటూ సోషల్‌ మీడియాలో గణాంకాలు షికార్లు చేస్తున్నాయి. ఈ దీపావళికి చైనా టపాసులను ముట్టుకోబోమని ప్రతి భారతీయుడు ప్రతిజ్ఞ చేయాలన్న ప్రబోధాలు వినవస్తున్నాయి. చైనాను దారిలోకి తెచ్చుకొనేందుకు వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించే వ్యూహంలో భారత్‌ వున్నట్లు నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. చైనా వస్తువుల క్రయ విక్రయాల్లో భారీ లాభాలు మూట కట్టుకుంటున్న దేశీయ వ్యాపార కూటముల మాటేమిటి ? ఎవరి లాబీయింగ్‌ దేశీ మార్కెట్లో చైనా సరకులకు బాట వేసింది ? ఎవరి లాభ కాంక్ష దేశీయ చిన్న పరిశ్రమల వుసురు తీసింది. ద్వైపాక్షిక వాణిజ్యంలో పెరుగుతున్న అసమతౌల్యం ఆర్ధిక రంగానికి విఘాతంగా మారుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదు? చైనా ధోరణి అంతర్జాతీయ వేదికలపై భారత ప్రయోజనాలను దెబ్బతీసేట్లుగా వున్నప్పటికీ వాణిజ్య బంధం సడల కుండా ఎందుకు పోషిస్తోంది? మనం కొన్ని వస్తువులను బహిష్కరిస్తే మనకు అత్యవసరమైన కొన్ని వస్తువుల దిగుమతులను నిలిపివేయట ద్వారా చైనా వుల్టా మనపై వత్తిడి చేయగల పరిస్ధితి ఇప్పుడు వుంది.’ ఇలా సాగింది. దీని అర్ధం ఏమిటో ఎవరికి వారు తీసుకోవచ్చు. ఎందుకంటే సూటిగా చెబితే ఇక్కడా దేశ భక్తి ముద్ర వేయటానికి కొందరు సిద్దంగా వుంటారు.

   దీనంతటికీ కారణం ఏమిటి అంటే పాచిపోయిన రోత పుట్టించే సమాధానం అది కమ్యూనిస్టు నియంతృత్వ దేశం, మనది ప్రజాస్వామ్య వ్యవస్ధ అని కూడా చెబుతారన్నది తెలిసిందే. వసుధైక కుటుంబమనే విశాల భావన మనది అని చెప్పుకుంటూనే ఇరుగు పొరుగు దేశాలపై కాలు దువ్వే వారి సంగతి పక్కన పెడితే కాసేపు చైనా సంగతి వదిలేద్దాం. మన పరిశ్రమలను, మన రైతులను కాపాడు కోవద్దని లేదా దెబ్బతీయమని మన ప్రజాస్వామ్య వ్యవస్ధ చెప్పిందా లేదే ! దీనికంతటికీ కారకులు కాంగ్రెస్‌ నేతలే అని వెంకయ్య తన భాషా చాతుర్యాన్ని వుపయోగించి ప్రాసతో సహా చెప్పగలరు. మన దేశ పరిశ్రమలు, రైతులను దెబ్బతీసే దిగుమతులను నిరోధించటానికి అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఇవ్వాల్సింది నరేంద్రమోడీ సర్కారే కదా ? ఎందుకు నిలిపివేయలేదు ? దేశ భక్తి ఎక్కడికి పోయింది. ఝన్‌ఝన్‌ వాలా చెప్పినట్లు విలువైన విదేశీ మారక ద్రవ్యంతో వాషింగ్టన్‌ ఆపిల్స్‌, స్విస్‌ చాకొలేట్లు దిగుమతి చేసుకోకపోతే మనకు రోజు గడవదా ? నరేంద్రమోడీకి తెలియదు అనుకుంటే అన్నీ ఎక్కువగా వున్న అపర కౌటిల్యుడు సుబ్రమణ్యస్వామి, ఎప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పటికి తగిన విధంగా చక్రం తిప్పే చంద్రబాబు నాయుడి వంటివారి సేవలను ఎందుకు వుపయోగించుకోవటం లేదు ?

   ప్రియమైన పాఠకులారా ఇవేవీ నరేంద్రమోడీతో సహా ఎందరో మహానుభావులు ఎవరికీ తెలియకుండా జరుగుతున్నవి కాదు, అంత అమాయకులెవరూ లేరని ముందుగా మనం తెలుసుకోవాలి. ఆరు వందల సంవత్సరాల నాటి పెట్టుబడిదారీ మేథావులు తమ యజమానుల లాభాలకు కొత్త మార్కెట్ల కోసం కొలంబస్‌లను పంపించారు. ఆధునిక పెట్టుబడిదారీ మేథావులు అంతకంటే తెలివి గల వారు కనుక లాభాల వేటకు హైటెక్‌ పద్దతులను కనిపెట్టారు. గ్రామాలలో ధనిక రైతులు వ్యవసాయాలు మానేసి తమ పొలాలను కౌలుకు ఇస్తున్నారంటే అర్ధం ఏమిటి ? సూటిగా చెప్పాలంటే పంట పండించకుండానే ఫలితాన్ని పొందటమే కదా ? స్వంతంగా వ్యసాయం చేస్తే ఎంత మిగులుతుంతో తెలియదు, కౌలుకు ఇస్తే వ్యవసాయం ఏమయినా, కైలు రైతు మట్టి కొట్టుకుపోయినా ఆ మొత్తం గ్యారంటీగా భూ యజమానికి వస్తుంది. అలాగే ఇంతకాలం లాభాలు సంపాదించి కవిలె కట్టలు గుట్టలుగా పెట్టుకున్న పెట్టుబడిదారులు ధనిక రైతులు లేదా భూస్వాముల కంటే మరింత మెరుగైన పరిస్థితిలో వున్నారు. ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టకుండా, వ్యాపార సంస్ధలు ఏర్పాటు చేయకుండానే కొత్త పద్దతుల్లో ప్రపంచంలో ఎక్కడ అవకాశం వుంటే అక్కడ లాభాలు పిండుకుంటున్నారు. అందుకు అనేక కొత్త పద్దతులు కనుగొన్నారు. నూతన ప్రపంచాన్ని కనుగొన్న ఆ కొలంబసే కనుక ఇప్పుడు తిరిగి వస్తే పెద్ద షాపింగ్‌ మాల్లో ఏం చేయాలో తెలియని పల్లెటూరి అమాయకుడిలా నోరెళ్ల బెట్టటం తప్ప జరుగుతున్నదేమిటో అర్ధం చేసుకోలేడంటే అతిశయోక్తి కాదు.

    అమెరికాలో ఒక కార్మికుడు ఒక గంట పని చేస్తే కనీస వేతనంగా ఏడు నుంచి పది డాలర్ల వరకు వుంది. ఒక డాలరు విలువ 67,68 రూపాయలు. అంటే రోజుకు ఎనిమిది గంటలు అంటే ఎనభై డాలర్లు సంపాదిస్తారు, దాదాపు ఐదు వేల రూపాయలు. కనీసంగా గంటకు 15 డాలర్లను సాధించుకోవాలని అక్కడి కార్మిక వర్గం పోరాటాలు చేస్తోంది. కొన్ని చోట్ల అంగీకరించారు. ఆ స్ధితిలో అమెరికా పెట్టుబడిదారులు రోజుకు కనీస వేతనంగా ఐదు వేల రూపాయలు ఇచ్చి ఒక కార్మికుడితో పని చేయించుకోవటం కంటే చౌకగా శ్రమశక్తి దొరికే చోట నెల మొత్తానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి పనిచేయించుకున్నారనుకున్నా ఒక్కొక్క కార్మికుడి మీదే నెలకు యాభైవేల రూపాయలు మిగులుతాయి. జపాన్‌ వారు మన దేశంలో మారుతీకార్ల తయారీ (కూర్పు) కేంద్రాలు, కొరియా వారు శాంసంగ్‌ టీవీలు, ఫోన్ల తయారు చేసినా లాజిక్‌- మాజిక్‌ ఇదే. యుద్దనపూడి సులోచనా రాణి నవలల్లోని ఆరడుగుల అందగాడు ఒయ్యారాలు ఒలికించే ఇంపాలా కారులో దిగాడని ఒకపుడు మనం చదువు కున్నాం. ఇప్పుడు వాటి తాతలను మన దేశంలోనే తయారు చేయగల పరిస్థితి వుంది. కార్లు, టీవీలు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువుల విడిభాగాలను మన దేశానికి తీసుకువచ్చి తెల్లవారే సరికి వాటిని బిగించి మన దేశంలో అమ్మటంతో పాటు విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాము.

   వీళ్లు కాకుండా మరికొందరున్నారు. వారు ఇప్పటికే మన వంటి దేశాలలో వున్న పరిశ్రమలు, వ్యాపార సంస్ధల వాటాలను స్టాక్‌ మార్కెట్లో కొంటారు. తెలుగు సినిమాల్లో విలన్లు చివరికి మనకు కనిపిస్తారు. వీరసలు ఎలా వుంటారో కూడా తెలియదు. మన విజయ మాల్య మాదిరి రోజుకు ఒక కిరాయి భామను పక్కనే పెట్టుకొని ఎక్కడో ఒక విహార కేంద్రంలో కూర్చొని కంప్యూటర్ల ద్వారా వుదయం పూట షేర్లు కొని గోలు చేసి లాభం వస్తే సాయంత్రానికి అమ్మి సొమ్ము చేసుకుంటారు. ముంబైలో లాభాలు రాలేదనుకోండి మరుసటి రోజు ఏ దక్షిణాఫ్రికాలోనో లేక ఏ బ్రెజిల్‌లోనో కొని అమ్ముతారు.

   ఇంకా కొందరు వున్నారు. విజయవాడ-హైదరాబాదు మధ్య కార్లు సర్రున దూసుకుపోయే రోడ్లు వేయటానికి మన దేశంలోని జిఎంఆర్‌ వంటి కంపెనీలకు డబ్బు పెట్టుబడిపెడతారు. వాటి చేత మన దగ్గర టో(తో) లు వలిచి పన్ను వసూలు చేయిస్తారు. వాటిలో తమ వాటా తాము పట్టుకుపోతారు. మరి కొందరున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారి చేత తక్షణమే విద్యుత్‌ వుత్పత్తి కేంద్రాలు పెట్టకపోతే అంధకారం అలుముకుంటుందని పెద్ద ఎత్తున వూదరగొట్టిస్తారు. గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని గ్యాస్‌ విద్యుత్‌ కేంద్రాలు అలా పెట్టినవే. గ్యాస్‌ లేక అవి పనిచేయకపోయినప్పటికీ, ఒక్క యూనిట్‌ విద్యుత్‌ వుత్పత్తి చేయకపోయినా స్ధిర ఖర్చు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించిన విషయం తెలిసిందే. అధిక ధరలను చూపి నిర్మాణ ఖర్చును రెట్టింపుగా చూపుతారు. విదేశాలలోని తమ కంపెనీల నుంచే బొగ్గు దిగుమతి చేయించి సముద్రతీరంలోని ఏ నెల్లూరు దగ్గరో శ్రీకాకుళంలోనో విద్యుత్‌ కేంద్రాలన్నింటినీ పెట్టిస్తారు. కాలుష్యాన్ని జనానికి వెదజల్లి లాభాలను మాత్రం పట్టుకుపోతారు. వాటికి అవసరమయ్యే యంత్రాలను కూడా విదేశాలలోని తమ కంపెనీలు లేదా ఏజంట్ల నుంచే తెప్పిస్తారు. మొత్తానికి వుత్పత్తి ప్రారంభించకుండానే తమ ఖర్చును రాబట్టుకుంటారు.వాటంగా వుంటే కొంతకాలం వుంటారు లేకపోతే ఎవరో ఒకరికి విక్రయించి తప్పుకుంటారు.

   1948 నుంచి 1970 దశకం వరకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశాలు పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందకుండా కమ్యూనిస్టు చైనాను అడ్డుకున్నాయి. సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీతో విబేధాల కారణంగా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయాయి. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ కేంద్రంగా వున్న హాంకాంగ్‌, మకావో దీవుల కౌలు గడువు తీరిన తరువాత 2000 సంవత్సరం నుంచి ప్రధాన భూభాగం చైనాలో విలీనం అవుతాయని ముందే నిర్ణయం అయింది. అక్కడ వున్న సంస్ధల పెట్టుబడులు, చైనీయుల పెట్టుబడుల గురించి ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరించాల్సిన పూర్వరంగంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం ఆకర్షణ, ప్రవాస చైనీయుల పెట్టుబడుల ఆకర్షణ, ఇతర పెట్టుబడిదారీ దేశాల నూంచి కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్దిక వ్యవస్ధను పరిమితంగా విదేశీ సంస్థలకు తెరిచేందుకు సంస్కరణలను రూపొందించింది. తద్వారా కలిగే ఫలితాన్ని జనానికి చేరే విధంగా ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమలు, ఇతర వ్యాపారాల నిర్వహణ వంటి విధానాలను రూపొందించింది. హాంకాంగ్‌ కేంద్రంగా వున్న పెట్టుబడులు చెదరకుండా వుండేందుకు 2050 వరకు ఒకే దేశం రెండు ఆర్ధిక వ్యవస్ధల పేరుతో ప్రధాన భూభాగంలో సోషలిస్టు విధానం, హాంకాంగ్‌, మకావుల్లో పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించేందుకు పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది. దాంతో ప్రవాస చైనీయులు పెట్టుబడులతో పాటు, భారీ ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకు వచ్చారు. ప్రభుత్వం పరిశోధన-అభివృద్ధికి భారీ ఎత్తున ఖర్చు చేసింది. ఇలా బహుముఖ చర్యలతో చైనా అనూహ్య అభివృద్దిని సాధించింది. అది కింది వరకు వూట మాదిరి కింది వరకు దిగే విధానాలు అనుసరించింది. ఈ కారణాలన్నింటితో చైనా నుంచి బుల్లెట్‌ రైళ్ల నుంచి బుల్లి బుల్లి దీపావళి చిచ్చు బుడ్ల వరకు మన వంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశంలోని బడా వ్యాపారులు తెల్లవారేసరికి లాభాలు కావాలంటే వాటిని దిగుమతి చేసుకొని సాయంత్రానికి అమ్మి రాత్రికి లాభాల లెక్కలు వేసుకోవచ్చు. ఫ్యాక్టరీలు పెట్టి, తయారు చేసి వాటిని అమ్ముకోవటం కంటే ఏది లాభం ? దీనికి మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ వంటి వారు పురచేయి అడ్డుపెడితే ఆగేవారు ఎవరైనా వుంటారా ? కావాలంటే వారిని ఎత్తి గోడవతల పారవేసి నోర్మూసుకొని చూస్తుండేవారిని గద్దెపై కూర్చో పెడతారు.

   అమెరికా,ఐరోపాలోని ధనిక దేశాలలోని వ్యాపారులు కూడా చైనా నుంచి సరకులు దిగుమతి చేసుకోవటం ద్వారా తమ లాభాలకు ఎలాంటి ఢోకా వుండదని గ్రహించి దానికే మొగ్గు చూపటంతో అటు చైనా ఇటు ధనిక దేశాలలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు లాభపడ్డారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు చైనాలో పెట్టుబడులు పెట్టటానికి వీలు కలిగింది. ఎగుమతులపై ఆధారపడిన ఆర్ధిక వ్యవస్థలతో తలెత్తే చిక్కులేమిటో లాటిన్‌ అమెరికా అనుభవం నుంచి నేర్చుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం దేశీయంగా వినిమయాన్ని పెంచేందుకు వీలుగా పౌరుల ఆదాయాలను కూడా క్రమంగా పెంచుతూ వచ్చింది. ఈ కారణంగానే 2008లో ప్రారంభమైన పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధల సంక్షోభం పరిమితంగానే చైనాపై ప్రభావం చూపింది. బయటి దేశాల పరిశీలకులు ఈ కోణాన్ని చూడకుండా 2008 కంటే ముందున్న వేగం తగ్గింది కదా అని తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఇప్పటికీ చైనాలో సమస్యలు వున్నట్లు చైనా నాయకత్వమే చెబుతోంది.వారేమీ దాచుకోవటం లేదు. ఇంకా తమది వర్ధమాన దేశమే అని చెప్పటంలో అర్ధం అదే. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా మన సంస్కరణలకు, చైనా సంస్కరణల విధానాలకు ఎంతో తేడా వుంది. భరత్‌ ఝన్‌ఝన్‌ వాలా చెప్పినట్లు చైనాను తప్పు పట్టటం మాని మన అసమర్ధతను అంతర్గతంగా ఎదుర్కోవాలి, రెక్కల గుర్రం ఎక్కి చుక్కలు లోకం చూడొద్దని అంటే నన్ను దేశ భక్తి లేనివాడిగానో, చైనా అనుకూల వాదిగానో చిత్రీకరించరు కదా !