Tags

, ,

ఎంకెఆర్‌

      తన గుడిలో ఎవరైనా వివాహం చేసుకుంటే ఆంజనేయ స్వామికి ఎలా వుంటుంది. తన బ్రహ్మచారి వ్రతాన్ని భంగం చేశారనే ఆగ్రహం కలగదా ? విశ్వాసం వున్నవారు చెప్పాలి. ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌కు పునర్జన్మంటూ వుంటే తన వాంఛలకు భిన్నంగా ఇవ్వటం ఏమిటని కమిటీ సభ్యులను తన పేరుతో ఇస్తున్న కొన్ని బహుమతుల విషయమై నిలదీస్తాడని మాత్రం చెప్పవచ్చు. తాజాగా స్వేచ్చా మార్కెట్‌ భావజాలపు ఆర్ధికవేత్తలిద్దరికి ఈ బహుమతి ఇచ్చారు. ప్రపంచవ్యాపితంగా ఏ కాంట్రాక్టు కార్మిక విధానాన్నయితే కార్మికులందరూ వ్యతిరేకిస్తున్నారో ఆ విధానంపై పని చేసిన వ్యక్తులు వారు. అది యజమానులకు మరిన్ని లాభాలు చేకూర్చి పెడుతోంది తప్ప కార్మికులకు కాదన్నది ఇప్పటికే విదితమైంది.కొన్ని సందర్భాలలో బహుమతుల ఎంపిక తీవ్ర విమర్శలకు దారితీసింది. మచ్చుకు కొన్నింటిని చూద్దాం.

    1918లో రసాయశాస్త్రంలో నోబెల్‌ బహుమతి తీవ్ర వివాదాస్పదమైంది. ప్రస్తుతం వ్యవసాయానికి అవసరమైన ఎరువుల తయారీలో వుపయోగిస్తున్న అమోనియాను పెద్ద మొత్తంలో తయారు చేసే ప్రక్రియను కనుగొన్న ఫిట్జ్‌ హెబర్‌కు బహుమతి ఇచ్చారు. అయితే సదరు శాస్త్రవేత్త మొదటి ప్రపంచ యుద్ధంలో మారణహోమానికి వినియోగించిన రసాయన క్లోరీన్‌ వాయువును కూడా కనుగొన్నాడు. యుద్ధంలో ఆ వాయువుతో రసాయన ఆయుధాలు తయారు చేసి ప్రయోగించటాన్ని ఆ పెద్ద మనిషి జీవితాంతం సమర్ధించాడు. అలాంటి వ్యక్తికి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే శాస్త్రవేత్తలకు ఇచ్చే బహుమతిని ప్రదానం చేయటం ఏమిటని తీవ్ర నిరసన వ్యక్తమైంది. డైనమైట్‌ను కనుగొన్న ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ దానితో పాటు ఇతర ఆయుధ వ్యాపారాలలో పెద్ద మొత్తం సంపాదించాడు. అయితే ఒక ఫ్రెంచి దినపత్రిక అతనిని ఒక ‘మృత్యు వ్యాపారి ‘ అని వర్ణించటాన్ని తట్టుకోలేకపోయాడు. దాంతో తాను సంపాదించిన దానిని శాంతియుత, ప్రజా ప్రయోజనాలకు వినియోగించేందుకు ఆ దిశగా కృషి చేసే వారికి ఇవ్వాలని తన సంపదతో ఒక ట్రస్టును ఏర్పాటు చేశాడు.

   వియత్నాంపై రసాయనిక దాడులతో సహా సకల దుర్మార్గాలకు నాయకత్వం వహించిన వారిలో అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసెంజరు ఒకడు. కాల్పుల విరమణ గురించి ఒకవైపు చర్చలు జరుపుతూనే మరో వైపు హానోయ్‌పై దాడులు జరపాలని స్వయంగా ఆదేశమిచ్చిన దుర్మార్గుడు. దురాక్రమణ, యుద్ధంలో ఓడిపోయిన అమెరికన్లు చివరకు ఒప్పందం చేసుకొని వియత్నాం నుంచి నిష్క్రమించిన విషయం తెలిసినదే. అలాంటి కిసింజరుకు, నాటి వుత్తర వియత్నాం నేత లీ డక్‌ థోకు కలిపి 1973లో వుమ్మడిగా శాంతి బహుమతిని ప్రకటించారు. దీనికి నిరసనగా బహుమతి తీసుకొనేందుకు లీ తిరస్కరించారు.కీసింజర్‌ను ఎంపిక చేయటాన్ని నిరసిస్తూ అవార్డు కమిటీ సభ్యులిద్దరు రాజీనామా చేశారు.

   పశ్చిమాసియాలో అశాంతికి కారణం ఇజ్రాయెల్‌ యూదు దురహంకారం, పాలస్తీనా దురాక్రమణ. వాటికి వ్యతిరేకంగా పోరాడిన పాలస్తీనా విమోచనా సంస్ధ నాయకుడు యాసర్‌ అరాఫత్‌. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల పతనం తరువాత అమెరికన్ల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌తో ఓస్లో ఒప్పందంపై సంతకాలు చేసి విమర్శలకు గురైనప్పటికీ పోరాట యోధుడిగా అరాఫత్‌ పాత్రను చరిత్ర విస్మరించజాలదు. అలాంటి యోధుడికి, పాలస్తీనియన్లపై దుర్మార్గాలకు పాల్పడిన ఇజ్రాయెల్‌ ప్రధాని రాబిన్‌, విదేశాంగ మంత్రి పెరెజ్‌కు కలిపి 1994 శాంతి బహుమతి ప్రకటించారు. ఇంతవరకు స్వతంత్ర పాలస్తీనా కల నెరవేరలేదు. నిత్యం అరబ్బులపై దాడులు జరుగుతూనే వున్నాయి. ఒక నిర్భంధ శిబిరంలో వున్నట్లు వారి జీవితం వుంది.

    అధికారానికి వచ్చి కేవలం తొమ్మిదినెలలు మాత్రమే గడిచిన తరువాత 2009లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు ‘శాంతి ‘ బహుమతి ఇచ్చారు. ఒబామాకు ఇస్తున్నది నోబెల్‌ బహుమతి, ‘జార్జి బుష్‌ అవార్డు ‘ కాదు అంటూ యుద్ధ,జాత్యంహంకార వ్యతిరేక వుద్యమ నేత బ్రెయిన్‌ బెకర్‌ దుయ్యబట్టారు. బహుమతి ఇవ్వటం ద్వారా ఒబామా బలపడతారని అనుకున్నాం, అదేమీ జరగలేదు, అనేక మంది ఒబామా మద్దతుదార్లు కూడా బహుమతి ఇవ్వటం తప్పిదమే అని భావించారు ‘ అని నోబెల్‌ సంస్ధ మాజీ డైరెక్టర్‌ గెయిర్‌ లాండెస్టెడ్‌ 2015లో తన ఆత్మకధలో రాసుకున్నాడు. మహాత్మాగాంధీకి శాంతి నోబెల్‌ బహుమతి ప్రదానం చేయకపోవటం అతి పెద్ద తప్పిదమని కూడా లాండ్‌ స్టెడ్‌ పేర్కొన్నారు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు రెండుసార్లు, తరువాత మూడు సార్లు ఆయన పేరును కమిటీ పరిగణనలోకి తీసుకున్నది. అయితే ప్రపంచానికి అధినేతగా వున్న బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపిన యోధుడిగా వున్న గాంధీని గుర్తించేందుకు నాటి కమిటీలోని పెద్దలు సుముఖత చూపలేదు. దీన్ని బట్టే నోబెల్‌ కమిటీ ఎంపికలు సైద్ధాంతిక, రాజకీయ ప్రాతిపదికన జరుగుతాయన్నది తేలిపోయింది.

     ఆరుదశాబ్దాల పాటు ప్రపంచంలో శాంతి, సామరస్యాలు, మానవహక్కుల పరిరక్షణకు చేసిన కృషి పేరుతో 2012లో ఐరోపా యూనియన్‌కు శాంతి బహుమతిని ప్రదానం చేశారు. వాస్తవానికి ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, లిబియా తదితర దేశాలపై అమెరికా నాయకత్వాన జరిపిన దుర్మార్గమైన దాడులు, లక్షలాది మంది ప్రాణాలు, నిర్వాసితులను చేసిన దుష్టత్వంలో ఐరోపా యూనియన్‌ అగ్రదేశాలన్నీ ముందున్నాయి. పొదుపు చర్యల పేరుతో అప్పటికే గ్రీసు పౌరుల నవరంధ్రాలను బిగించటం ప్రారంభించింది ఆ సంస్ధ. ‘నిరాయుధీకరణకు కృషి చేసిన వారికి బహుమతి ఇవ్వాలన్న ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వాంఛకు వ్యతిరేకంగా ఈ బహుమతి ఇచ్చారని ‘శాంతికోసం పనిచేసే మామ్మల సంస్ధ ‘ ప్రతినిధి ఎల్సా బ్రిట్‌ ఎంగర్‌ వ్యాఖ్యానించారు. ఐరోపా యూనియన్‌ ఆ పని చేయకపోగా ప్రపంచంలో ఆయుధాలను ఎక్కువగా తయారు చేసే వాటిలో ఒకటిగా వుందన్నారు. గతంలో శాంతి బహుమతులు పొందిన ఆర్చిబిషప్‌ డెస్మండ్‌ టూటూతో సహా అనేక మంది ఈ బహుమతి ప్రకటనను విమర్శిస్తూ బహిరంగంగా ప్రకటన చేశారు.

    తాజా వివాద విషయానికి వస్తే ప్రపంచీకరణలో ఒక ముఖ్యాంశమైన కాంట్రాక్టు విధానం గురించి పరిశోధనలు చేసిన ఆర్ధికవేత్తలు ఆలివర్‌ హర్ట్‌, బెంట్‌ హామ్స్‌ట్రోమ్‌లను బహుమతికి ఎంపిక చేశారు. ప్రపంచీకరణ విఫలమైందని, ఆర్ధిక అంతరాలు ఎన్నటి కంటే పెరిగాయని థామస్‌ పికెటి వంటి పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలే స్పష్టం చేయటం, అనేక దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకోవటం, దానిలో భాగంగానే ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ తప్పుకొనేందుకు నిర్ణయించిన ఈ తరుణంలో ప్రజావ్యతిరేకమైన కాంట్రాక్టు సిద్దాంతానికి గౌరవం కల్పించటం నిజంగా గర్హనీయం. ఏ కృషి అయినా జనానికి వుపయోగపడేదిగా వుండాలి తప్ప వారి శ్రమను దోపిడీ చేసే వారికోసం పని చేసిన వారిని గొప్పవారిగా గుర్తించటం కంటే దురన్యాయం కంటే మరొకటి లేదు. కార్మికులను దోచుకొనే స్వేచ్చామార్కెట్‌ ఆర్ధిక సిద్దాంతాలకు పెద్ద పీట వేయటానికే స్వీడిష్‌ పెట్టుబడిదారులు నిర్ణయించి ఆ మేరకు ఈ బహుమతులను ప్రారంభించారు. నిజానికి ఆర్ధిక శాస్త్రవేత్తలను బహుమతి ఇవ్వాలని నోబెల్‌ కోరలేదు.ఈ బహుమతుల ప్రదానం ప్రారంభించిన 70 సంవత్సరాల తరువాత తొలిసారిగా 1969లో ఆర్ధిక రంగంలో ఇచ్చారు. వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తిగా ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌కు పేరుంది. అలాంటి వ్యక్తి హృదయ పూర్వకంగా చెప్పాలంటే వ్యాపారాన్ని తాను అసహ్యించుకుంటున్నానని, తాను ఒక సోషల్‌ డెమోక్రాట్‌ అని ఒక సందర్భంగా చెప్పాడు. సోషల్‌ డెమోక్రాట్లు వ్యతిరేకించే స్వేచ్చా మార్కెట్‌ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయే వారికి తప్ప వ్యతిరేకించే వారికి ఇంతవరకు ఈ బహుమతి ఇవ్వలేదు.

   ఈ ఏడాది సాహిత్యరంగంలోతొలి సారిగా గీత రచనకు బహుమతి ప్రకటించిన అమెరికన్‌ పాప్‌ గాయకుడు, రచయిత బాబ్‌ డైలాన్‌ ఎంపికపై కొందరు విమర్శలు చేయటంతో డిసెంబరు పదవ తేదీన డైలాన్‌ బహుమతి స్వీకరిస్తారా లేదా అన్నది సందేహంలో పడింది. తాము బహుమతి ప్రదానం గురించి తెలిపేందుకు, స్వీకారోత్సవానికి ఆహ్వానించేందుకు అనేక సార్లు ప్రయత్నించినా డైలాన్‌ నుంచి స్పందన లేదని తామింక ఆ ప్రయత్నాలు మానుకున్నట్లు నోబెల్‌ అకాడమీ కార్యదర్శి సారా డానియెస్‌ ప్రకటించారు.బహుమతి ప్రకటించిన రోజే లాస్‌ వేగాస్‌లో కచేరీ చేసిన డైలాన్‌ తనకు వచ్చిన బహుమతి గురించి ప్రస్తావించలేదు. ఆయన సాహిత్యానికి నోబెల్‌ బహుమతి స్ధాయి లేదని కొందరు ఆరోపించారు. డెభ్బై అయిదు సంవత్సరాల వయసులో కూడా కచేరీలు చేస్తున్న డైలాన్‌ తన పాటలతో ఎన్నో తరాలను ప్రభావితం గావించారు.