Tags

, ,

సత్య

     గురువారం నాటి ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ‘భారత్‌కు మొరగడమే తెలుసు ! ‘ అనే శీర్షికతో ఒక వార్తను ప్రచురించారు. చైనా పత్రిక భారత ప్రభుత్వంపైనే కాదు, భారతీయ కార్మికులపైనా నోరు పారవేసుకుంది అని రెచ్చగొట్టే విధంగా ఆ కధనం సాగింది. చైనా నుంచి వెలువడే గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక బుధవారం నాటి సంపాదకీయంలో భారత్‌పై రకరకాలుగా రెచ్చిపోయింది అంటూ కొన్ని విషయాలు రాశారు. గోవాలో బ్రిక్స్‌ సమావేశం జరిగింది. వచ్చిన వారు ఒక ప్రకటన చేసి వెళ్లిపోయారు. వెంటనే ఒక చైనా పత్రిక ఇలా రాయటం ఏమిటి ? ఆ పత్రిక కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక కాదు. చైనా డైలీ అధికార పత్రిక. అయినప్పటికీ చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్నదే అన్నది స్పష్టం.దానిలో అనేక విషయాలు రాస్తుంటారు, అవన్నీ చైనా కమ్యూనిస్టు పార్టీ, లేదా ప్రభుత్వ విధానాలతో ఏకీభవించనవసరం లేదు. అలాగని అదేమీ చైనా ప్రభుత్వ, కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక కాదు. ఇటీవలి కాలంలో చైనా-భారత్‌ సంబంధాలను గమనిస్తున్నపుడు ఇటు నరేంద్రమోడీ అటు చైనా ప్రభుత్వం రెండూ కూడా లోపల ఎటువంటి అభిప్రాయాలున్నప్పటికీ ఎంతో సంయమనం పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. వుభయులూ  అధికారికంగా ఎక్కడానోరు జారటం లేదు.ఈ పూర్వరంగంలో చైనా ప్రభుత్వ మద్దతుతో నడిచే ఒక పత్రిక సంపాదకీయంలో భారత్‌కు వ్యతిరేకంగా అలాంటి వ్యాఖ్యలు చేయటమంటే అది తీవ్ర విషయమే. తానుగా విబేధాలను కొని తెచ్చుకోవటం చైనా దౌత్యనీతికే విరుద్ధం. అందువలన ఆ వార్తలో నిజమేమిటో చూడాలనిపించింది.

   ఆంధ్య్రజోతి తరహా వార్తనే ఇండియా టీవీ బుధవారం మధ్యాహ్నం ప్రసారం చేసినట్లు దాని వెబ్‌సైట్‌ను బట్టి అర్ధమైంది.http://www.indiatvnews.com/business/india-india-can-only-bark-its-calls-for-boycotting-chinese-products-rabble-rousing-chinese-media-352958 ఆంధ్రజ్యోతి పత్రిక దానిని స్వీకరించి వార్తగా )ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆ వార్త తీరుతెన్నులను చూస్తే ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పత్రిక ఏం ప్రచురించిందో కూడా నిర్ధారణ చేసుకోకుండానే ‘కాళిదాసు కవిత్వానికి తన పైత్యం జోడించినట్లు ‘గా స్పష్టమైంది. గ్లోబల్‌ టైమ్స్‌ పత్రికలో ప్రచురించినదానితో ఈ వ్యాఖ్యాత ఏకీభవిస్తున్నాడా లేదా అన్నది ఇక్కడ సందర్భం కాదు. జర్నలిజం తీరుతెన్నులను తెలియచెప్పటమే లక్ష్యం. కార్మికుల మీద, కార్మిక సంఘాల మీద అనుచిత వ్యాఖ్యలు వున్నాయి. అలాంటి వ్యాఖ్యలు మన దేశంలోని కమ్యూనిస్టులు తప్ప ఇతర పార్టీల నేతలందరూ బహిరంగంగా చేస్తున్నవే అని గమనించాలి. కార్మికులను నిందించారని బొటబొటా కన్నీరు కార్చుతూ రాసిన ఆంధ్రజ్యోతి కార్మికుల ఆందోళనల సమయంలో వార్తలు ఎలా ఇస్తుందో అందరికీ తెలిసిందే.

    మొదటి విషయం: అది గ్లోబల్‌ టైమ్స్‌ బుధవారం నాడు రాసిన సంపాదకీయం కాదు. చైనా-ఫిలిప్పైన్స్‌ దగ్గర కావటాన్ని అమెరికా ఎందుకు నిరసిస్తోంది అనే శీర్షికతో ఆ రోజు సంపాదకీయం వుంది.http://www.globaltimes.cn//content/1012531.shtml కనుక గ్లోబల్‌ టైమ్స్‌ సంపాదకీయంలో భారత్‌, కార్మికులపైనా నోరు పారవేసుకుంది అన్నది అబద్దం.

    రెండవది : అది సంపాదకీయం కాదని తేలిపోయింది, మరి వార్త రాసిన పెద్ద మనిషి సంపాదకీయం అని ఎందుకు చెప్పినట్లు ? ఇండియా టీవీ వార్తలో కూడా సంపాదకీయం అని లేదు, సంపాదకీయం ప్రచురించే పేజీలో అని మాత్రమే వుంది. జ్యోతి అనువాదకులు సంపాదకీయం అని తగిలించారు. మూలంలోకి వెళ్లి వుంటే ఆ పని చేసి వుండేవారు కాదు.

    మూడవది: ఆ రచన గ్లోబల్‌ టైమ్స్‌ వాణిజ్య వార్తల పేజీలో ప్రచురించింది. http://www.globaltimes.cn/content/1012145.shtml

    నాల్గవది, అత్యంత ముఖ్యమైనది, ఇండియా టీవీ కావాలని దాచిపెడితే, దాన్ని నమ్మి ఆంధ్రజ్యోతి పప్పులో కాలు వేసింది. ఆ వ్యాఖ్యానం రాసింది గౌరవ త్యాగి అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు. అతనెవరో ఇప్పటికే అర్ధమై వుంటుంది. చైనాలోని గాన్సు రాష్ట్రంలోని బైయిన్‌లో నివశిస్తున్న భారతీయ సంతతి వ్యక్తి. ‘అంతర్గత నేత్రం’ (ఇన్‌సైడర్‌ ఐ) శీర్షిక కింద దానిని ఒక అభిప్రాయంగా ప్రచురించారు.

    ప్రస్తుతం దేశంలో వాణిజ్య, వ్యాపార కార్పొరేట్‌ మీడియాకు సంచలనాలు, బాగా అమ్ముడు పోయే వార్తలు కావాలి. అందుకోసం కొందరు జర్నలిస్టులు ఏ గడ్డి కరిచైనా తమ యజమానుల మెప్పు పొందేందుకు గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు. తప్పుడు ప్రచారాన్ని తలకు ఎక్కించుకున్న కొందరు జర్నలిస్టులు కూడా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు చైనా వ్యతిరేకత మంచి వాటంగా వుంది. ప్రస్తుతం సామాజిక మీడియాలో ఆ గాలి వీస్తున్నది. దున్న ఈనిందంటే వెంటనే దూడను గాటను కట్టేయమన్నట్లుగా దానికి అనేక మంది ప్రభావితులౌతున్నారు. అంతా చదివిన తరువాత సంపాదకీయం గాక పోతే మరొకటి, చైనా వాడు గాకపోతే మరొకడు చైనా పత్రికలో రాశాడా లేదా అని అడ్డంగా ఎవరైనా మాట్లాడితే చేసేదేమీ లేదు. తెగించిన వారికి తెడ్డే లింగం సామెత వూరికే పుట్టలేదు !