సత్య
జాతీయ వాదం, జాతీయ వాదుల నిర్వచనాలు మారిపోతున్నాయి. వచ్చే దీపావళికి చైనాలో తయారైన బాణా సంచా కాల్చేవారు జాతి ద్రోహులు అన్న విధంగా కొందరు వుద్రేక పడుతున్నారు. చైనా సరకు సంగతి పక్కన పెట్టండి. మన దేశంలో తయారయ్యేదైనా కాల్చటం అవసరమా అని ఆలోచిస్తే మంచిది. దీపావళి సందర్భంగా కొన్నివేల కోట్ల రూపాయల బాణ సంచా కాల్చి డబ్బును వృధా చేయటంతో పాటు పర్యావరణానికి హాని కలిగించటం ఎందుకు?
జనం ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించటంలో మన దేశంలోని కొందరు మేథావులకు వున్న తెలివితేటలను సమస్యలను పరిష్కరించటానికి వుపయోగిస్తే ఎంత బాగుండునో అన్నది ఎప్పటి నుంచో వున్న పగటి కల. చైనా నుంచి అక్రమంగా వస్తున్న దిగుమతుల కారణంగా మన దేశంలోని పరిశ్రమలు దెబ్బతింటున్నాయనటం ఒక తిరుగులేని వాస్తవం. ఇది ఆర్ఎస్ఎస్ సృష్టి అయిన స్వదేశీ జాగరణ మంచ్ పుట్టక ముందే మనకు తెలుసు. గ్లాస్గో, మాంచెస్టర్ నుంచి దిగుమతి అయిన జౌళి వుత్పత్తులు మన దేశంలోని చేనేత పరిశ్రమ నడుం విరగొట్టాయి. అందుకే స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్త్ర, వస్తు బహిష్కరణ నినాదం ఒక పెద్ద వుద్యమ రూపాన్నే తీసుకుంది. ఇటీవలి కాలంలో సంస్కరణల పేరుతో మన దేశ మార్కెట్‌ను తెరిచిన తరువాత గత పాతిక సంవత్సరాలలో విదేశీ వస్తువు లేకుండా మనకు తెల్లవారటం లేదన్నది పచ్చి నిజం. మారుతీ కార్లను అనుమతించటంతో మన అంబాసిడర్ కారు మాయం లేదా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. శాంసంగ్, సోనీ తదితర కొరియా, జపాన్ టీవీల సునామీతో మన ఇసి, భారత్, డయనోరా వంటి స్వదేశీ టీవీలు కనపడకుండా పోయాయి. మనం కంప్యూటర్ల మీద పనిచేసే ఇంజనీర్ల తయారీకి ప్రాధాన్యత ఇచ్చాము గాని కంప్యూటర్ల తయారీ గురించి పట్టించుకోని కారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇలా కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. ఆ పరంపరలోనే చైనా బాణ సంచా మన దేశంలోని శివకాశి కార్మికుల పొట్టలు కొట్టిందన్నది వాస్తవం. దీనికి కారకులెవరు ? కాంగ్రెస్,బిజెపి, తెలుగుదేశం, దాని నుంచి పుట్టిన టిఆర్ఎస్ వంటివాటికి ఇలాంటి పరిస్థితి తలెత్తటంలో బాధ్యత లేదా ? ఎవరి బాధ్యతేమీ లేకుండానే విదేశీ వస్తువులు ఆకాశం నుంచి వూడిపడుతున్నాయా ?
చైనా నుంచి వస్తున్న బాణ సంచాకారణంగా తమిళనాడులోని శివకాశిలో ఐదులక్షల కుటుంబాలకు వుపాధి పోయిందని, ఆరువేల కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగిందని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి దీపావళి సందర్భంగానే మీడియాలో వార్తలు వచ్చాయి.http://www.ibtimes.co.in/chinese-exports-hit-sivakasi-firecracker-makers-5-lakh-families-suffer-losses-610963 రెండు సంవత్సరాల క్రితం చైనా నుంచి బాణ సంచా అడపాతడపా దిగుమతి అయింది. ఈ ఏడాది విపరీతంగా పెరిగిపోయి, తాము తయారు చేసిన సరకులో 35శాతం మిగిలిపోయిందని 2014 అక్టోబరులోనే బాణ సంచాతయారీదార్ల ప్రతినిధి వాపోయారా లేదా ? అక్రమంగా దిగుమతి అయిన వాటిని నాశనం చేయకుండా అపరాధ రుసుం విధించి దిగుమతి చేసుకున్నవారికి అప్పగిస్తున్నారా లేదా ? ఆ తరువాత ఆ దిగుమతులు ఇంకా విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి బాధ్యత ఎవరిది ? అక్రమ దిగుమతులను సక్రమంగా మార్చిన ప్రభుత్వానిదా, చౌకగా వున్నందున కొనుగోలు చేస్తున్న జనానిదా ? నిబంధనలను అమలు జరపాల్సింది ప్రభుత్వమా, మరొకరా ? మన దేశం నుంచి బాణ సంచా ఎగుమతి చేసేందుకు గాను నిల్వ వుంచటానికి తగినంత అవకాశం లేదంటూ మన రేవుల ఆధికారులు అనుమతించటం లేదని, స్వదేశీ ఎగుమతులకు గేట్లు మూసి విదేశీ దిగుమతులకు గేట్లు బార్లా తెరిచారని శివకాశీ తయారీదార్లు వెలిబుచ్చిన ఆవేదనను ఎవరైనా పట్టించుకున్నారా ?
నరేంద్రమోడీ ఏలుబడిలో గతేడాది రెండో దీపావళి జరుపుకున్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిషేధాలు, నిరోధాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదని గత నవంబరులో వార్తలు వచ్చాయి.http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Ban-on-Chinese-crackers-fails-to-cheer-fireworks-industrythis-Diwali-Survey/articleshow/49714653.cms గుజరాత్ రాజధాని అహమ్మదాబాద్, రాజస్థాన్ రాజధాని జైపూర్, మహారాష్ట్ర రాజధాని ముంబై, ఢిల్లీ, లక్నో నగరాలు అక్రమంగా దిగుమతి చేసుకున్న బాణ సంచా పెద్ద ఎత్తున నిల్వకేంద్రాలుగా వున్నాయని అసోచెమ్ చేసిన సర్వేలో గతేడాది వెల్లడైంది. వీటిలో మొదటి మూడు కేంద్రాలు బిజెపి ఏలుబడిలో వున్న రాష్ట్రాల రాజధానులు. వుత్తర భారత్ నుంచి డిమాండ్ తగ్గిపోయిందని శివకాశీ తయారీదార్లు చెప్పారు. చైనా నుంచి అక్రమంగా దిగుమతి కావటంతో పాటు రూపాయి విలువ పతనమైన కారణంగా అల్యూమినియం పౌడర్, బేరియం నైట్రేట్ వంటి ఇతర ముడి సరకుల దిగుమతి ఖర్చు కూడా పెరిగి బాణ సంచా వుత్పత్తి ఖర్చు పెరిగిందని కూడా వారు చెప్పారు.
శివకాశీ నుంచైనా, చైనా నుంచైనా బాణా సంచా కొనుగోళ్లు దీపావళికి కొన్ని నెలల ముందుగానే జరుగుతాయి. ఇప్పుడు చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పటమంటే బడా వ్యాపారుల నుంచి కొనుగోలు చేసిన చిన్న వ్యాపారులను ముంచటం తప్ప వేరు కాదు. బాణా సంచా విక్రయించటానికి చిరు వ్యాపారులకు లైసన్సు అవసరం తమిళనాడులో అధికారులు జారీ చేసిన లైసన్సులలో విదేశీ బాణ సంచా అమ్మరాదనే నిబంధన లేదట. విదేశీ బాణ సంచా అమ్మబడదు అని పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని మౌఖికంగా చెబుతున్నారని వార్త.http://www.thehindu.com/news/national/tamil-nadu/chinese-crackers-may-sneak-in-this-deepavali/article9231948.ece చైనా వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చి సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించిన ఆర్ఎస్ఎస్ సంస్ధ స్వదేశీ జాగరణ మంచ్ ఆకస్మికంగా ప్లేటు ఫిరాయించింది. చైనా నుంచి దిగుమతి చేసుకొనే భారీ యంత్రాల వంటి వాటిని బహిష్కరణ నుంచి మినహాయించినట్లు ప్రకటించింది.http://timesofindia.indiatimes.com/city/nagpur/Swadeshi-Jagran-Manch-excludes-capital-goods-from-anti-China-drive/articleshow/54965515.cms ఎంత అవకాశవాదం? సామాన్య, మధ్యతరగతి కొనుగోలు చేసే బాణ సంచాపై పెద్ద రగడ సృష్టించింది. కానీ కార్పొరేట్లు దిగుమతి చేసుకొనే యంత్రాలను మాత్రం బహిష్కరణ నుంచి మినహాయించింది. అంటే ప్రచారం జనాల కోసం ! పని చేసేది కార్పొరేట్ల కోసమా !! చైనా వస్తుబహిష్కరణ తమ ప్రయోజనాలకు నష్టదాయకమని కార్పొరేట్లు చేసిన వత్తిడికి లొంగటం తప్ప దీనిలో ‘దేశభక్తి ‘ కనిపించటం లేదు. మన ఔషధ కంపెనీలు వుపయోగించే రసాయనాలలో 65 శాతం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాలన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలతో పనిచేస్తున్నాయని అసలు విషయాన్ని స్వదేశీ జాగరణ్ మంచ్‌కు నాయకత్వం వహిస్తున్న కాశ్మీరీ లాల్ వెల్లడించారు. అందుకే ఆర్ఎస్ఎస్ చైనా వస్తు బహిష్కరణ పాతాళ భైరవిలో మాంత్రికుడి శిష్యుడు చెప్పినట్లు అంతా మోసం గురూ !