Tags

, , , ,

సత్య

    అర  నుంచి ఇటీవలనే పొడుగు లాగూలకు మారిన ఖాకీ వాలాలు వీధులు, ఇంటర్నెట్‌ సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక చిందులు వేస్తున్నారు. వాటి బదులు మన ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన ‘ మేకిన్‌ ఇండియా ‘ పిలుపు మేరకు ఒక చిన్న వస్తువునైనా తయారు చేసి కసితో చైనాతో సహా ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తే వారి ‘దేశ భక్తి ‘ మరింత ఇనుమడించి వుండేది. ఏం చేయాలనేది ఎవరిష్టం వారిది కనుక వీరంగం వేసే వారిని వదిలేద్దాం. గత వారంలో మన సైనికులు సరిహద్దులలో చైనా సైన్యంతో కలిసి మన భూభాగంపై సంయ్తు విన్యాసాలు చేశారు. అదీ యురీ సైనిక శిబిరంపై పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులు దాడి జరిపి మన సైనికుల ప్రాణాలు బలిగొనటం, ఆ విషయంలో మనకు గాక పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇస్తున్నదని పెద్ద ఎత్తున ‘ ప్రచారం’ జరిపి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన పూర్వరంగంలో చైనా మిలిటరీతో కలసి విన్యాసాలు జరిపినట్లు మన సైన్యమే అధికారికంగా ప్రకటించింది. తేడా ఏమిటంటే సర్జికల్‌ దాడులకు మాదిరి సైన్యంగానీ లేదా అంతకు మించి యుద్ధం చేస్తున్న మన మీడియా గానీ ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రాధాన్యత, ప్రచారం ఇవ్వలేదు. కారణం ఏమిటో అందరికీ తెలుసు గనుక సైన్యానికి ఎలాంటి వుద్ధేశ్యాలను ఆపాదించటం లేదు. కానీ మీడియా విషయానికి వస్తే దాని రేటింగ్‌ పెరగదని మార్కెటింగ్‌ విభాగం చెబితే ఎంత పెద్ద వార్తనైనా పక్కన పడేస్తుంది సంపాదక విభాగం, ఎందుకంటే మీడియాను నడిపేది సంపాదకులు కాదు, బిజినెస్‌ మేనేజర్‌, డబ్బు సంపాదించే విభాగాలే.

  అసలు కంటే కొసరు హడావుడి ఎక్కువ చేస్తుందన్న విధంగా మన ఆర్‌ఎస్‌ఎస్‌ ఖాకీ సైని కమాండర్లు మాత్రం బాణా సంచాలకు మినహా మిగిలిన పెద్ద వస్తువుల దిగుమతికి మినహాయింపులు ప్రకటిస్తుంటే దిగువ సైన్యం మాత్రం వీరంగం వేయటం ఇంకా కొనసాగిస్తూనే వుంది. నిజానికి బాణ సంచా దిగుమతులపై కేంద్ర ప్రభుత్వ నిషేధం వుంది. దాన్ని సక్రమంగా అమలు జరపకపోవటమే దేశ ద్రోహం. చైనా మిలిటరీతో కలసి మనం జమ్మూలో విన్యాసాలు జరపటం దేశ భక్తా, ద్రోహమా లేక చైనా అనుకూలమా ? పిల్లలను స్టెరాయిడ్లతో వుద్రేక పరిచిన ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు చెప్పాలి మరి ?

    అణు సరఫరా గ్రూపులో మన సభ్యత్వానికి చైనా మోకాలు అడ్డిందని, పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకుంటున్నది అనే విషయాలపై అనేక మంది తమ రచనలలో ఖండన మండనలు జరుపుతున్న సమయంలో వాటిని పట్టించుకోకుండా మిలిటరీ విన్యాసాలు కొనసాగించటం విశేషమే. సర్జికల్‌ దాడులకు రాజకీయ నాయకత్వం అనుమతి ఇచ్చిందని, దానికి తాము ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో పెరగటమే కారణమని రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఇప్పటికే ప్రకటించారు కనుక ఈ విన్యాసాల గురించి ఏం చెబుతారు ? అనుమతించినట్లా లేదా ?

    సాధారణంగా రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు అనగానే మూడో దేశాన్ని భయపెట్టటానికో, బెదిరించటానికో అన్నది సాధారణంగా అందరూ అనుకుంటారు. అమెరికా వంటి సామ్రాజ్యవాదుల మిలిటరీ ప్రమేయం వున్నపుడు అందులో వాస్తవం కూడా లేకపోలేదు. కానీ చైనాతో మన వారు జరిపింది మరొక దేశాన్ని బెదిరించటానికో మరొకందుకో కాదు. ప్రకృతి ప్రళయాలు సంభవించినపుడు సరిహద్దులలోని జనాన్ని ఎలా ఆదుకోవాలో నేర్పేందుకు, నేర్చుకునే లక్ష్యంతో చేసినవి ఇవి. సరిహద్దులలో భూ కంపం వచ్చినపుడు ఒక గ్రామంలోని వారిని ఎలా ఆదుకోవాలన్న విషయమై విన్యాసాలు రోజంతా సాగాయి. వైద్య సహాయంతో సహా జనాన్ని రక్షించేచర్యలు తీసుకోవటంలో పెద్ద విజయం సాధించామని, వుభయ సైనికుల మధ్య విశ్వాసం,సహకారం మరింతగా పెరిగాయని మన మిలిటరీ ప్రకటించింది. సరిహద్దులలో శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు కూడా వీటిని తలపెట్టినట్లు పేర్కొన్నది. లడక్‌ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ ప్రాంతంలో చైనా ప్రాంతంలో ఫిబ్రవరి ఆరున జరిపిన విన్యాసాల కొనసాగింపుగా ఇది కొనసాగింది. ‘చేతిలో చేయి ‘ అన్న కార్యక్రమాలలో భాగంగా ఇవి జరుగుతున్నాయి. దాని కొనసాగింపుగానే నవంబరు 15-27 మధ్య మన మిలిటరీ దక్షిణాది ప్రధాన కార్యాలయం వున్న పూనేలో మన సైన్యంతో కలిసి చైనా సైన్యం వుగ్రవాద వ్యతిరేక చర్యలపై విన్యాసాలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది చైనాలోని ఏనాన్‌ రాష్ట్రంలోని చెంగ్‌డూ మిలిటరీ ఏరియాలో మన దేశం నుంచి వెళ్లిన నాగా రెజిమెంట్‌ సైనికులు చైనీయులతో కలసి ఇలాంటి విన్యాసాలే జరిపి వచ్చారు.

    ఒకవైపు చైనాకు వ్యతిరేకంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంత దేశాలతో పాటు భారత్‌ను కూడా తనవైపు లాక్కునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ఇవి కానసాగటాన్ని గమనించాలి. ప్రస్తుతం చైనా ఆధీనంలో వున్న కొంత లడఖ్‌ ప్రాంతం మనదే అని మన దేశం, మన ఆధీనంలో వున్న అరుణాచల్‌ మాదని చైనా వాదిస్తున్న విషయం తెలిసినదే. 1962లో వుభయ దేశాల మిలిటరీ యుద్ధానికి తలపడిన ప్రాంతంలోనే ఇప్పుడు చేయి చేయి కలిపి రెండు మిలిటరీలు విన్యాసాలు చేశాయి. సరిహద్దు వ్యవహారాలపై తగు పద్దతుల్లో వ్యవహరించేందుకు వుభయ సరిహద్దు సేనల మధ్య జరిగే సాధారణ విన్యాసాలు తప్ప మూడో దేశానికి వ్యతిరేకంగా కాదని చైనా విదేశాంగ శాఖ కూడా అక్టోబరు 19న జరిపిన విన్యాసాల గురించి ప్రకటించింది. కాశ్మీర్‌ సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలనే తమ వైఖరిలో కూడా ఎలాంటి మార్పు లేదని రాతపూర్వక వివరణలో చైనా స్పష్టం చేసింది. సరిహద్దు దేశాలు కనుక మంచో చెడో మన రెండు దేశాలు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరపటం ద్వారా వుభయుల మధ్య అనుమానాలు తొలగిపోవటానికి దారి తీస్తుంది. కానీ గతేడాది అమెరికా, జపాన్‌ సైన్యంతో కలసి మలబార్‌ విన్యాసాలు జరపటం, ఈ ఏడాది మన దేశంలోని వుత్తరాఖండ్‌లో అమెరికా మిలిటరీతో కలసి మన సైన్యం విన్యాసాలు జరపనుండటం గురించి కొంత మందిలో అనుమానాలు లేకపోలేదు. ఎవరి అనుమానాలు, ఎవరి అభిప్రాయాలు వారికి వున్నా ఇటీవలి కాలంలో మిలిటరీ విన్యాసాలు అనేవి ఒక బల ప్రదర్శన, దౌత్య ఎత్తుగడలలో భాగంగా జరుగుతున్నాయి. అన్నీ శాంతియుత ప్రయోజనాలకే అని చెప్పలేము, అదే విధంగా యుద్ధ చర్యలలో భాగమని అనలేము. ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిందేమంటే మనం ఇతరులతో కలసి విన్యాసాలు జరుపుతున్నట్లే ఇతరులు కూడా జరుపుతారు. వ్యతిరేకించాల్సి వస్తే అన్నింటి పట్ల ఒకే వైఖరిని తీసుకోవాలి. మనం చేసేదే సరైనది, ఇతరులు చేసేది మనకు వ్యతిరేకం అనుకుంటేనే తేడాలు వస్తాయి. ఇదే సమయంలో మన భద్రతా చర్యలు మనం తీసుకోకతప్పదు.