Tags

, , , ,

సత్య

     కొంత మంది రాజకీయ నాయకుల మాటలు చూస్తే నేను లేస్తే మనిషిని కాదు అన్న దివ్యాంగుడైన మా మల్లయ్య మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఒక ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన మల్లయ్య కాలక్షేపానికి అరుగుమీద కూర్చుంటే కొంటె పిల్లలు ఆట పట్టించేవారు. తన చేతిలోని కర్రను చూపుతూ రేయ్‌ నేను లేస్తే మనిషిని కాను జాగ్రత్త అని హూంకరించే వాడు. పిల్లలు భయపడినట్లుగా నటించే వారు. మరుసటి రోజు కథ మళ్లా మామూలే. నల్లధనంపై ప్రధాని నరేంద్రమోడీ మాటలు కూడా మల్లయ్య కథ మాదిరే వున్నాయంటే ఆయన భక్తులకు కోపం రావచ్చు. మంత్రసాని తనం ఒప్పుకున్నాక బిడ్డొచ్చినా, మరొకటొచ్చినా పట్టక తప్పనట్లే రాజకీయాలలో వున్నతరువాత పొగడ్డలు వచ్చినపుడు జబ్బలు చరుచుకోవటం లేదా రొమ్ము విరుచుకోవటమే కాదు విమర్శలు వచ్చినపుడు ‘సహించాలి ‘ మరి.

      నరేంద్రమోడీ రెండున్నర సంవత్సరాల క్రితం చేసిన అనేక బాసలు, వూసులతో పాటు నల్లధనం వెలికితీత వాగ్దానాన్ని కూడా జనం మరచిపోయిన సమయంలో దాని గురించి మౌనం దాల్చకుండా మాట్లాడటం ఎందుకు చెప్పండి ? అది కూడా సర్జికల్‌ దాడులతో ముడిపెట్టి ‘మేం కనుక ఈ విషయంలో కూడా సర్జికల్‌ దాడులు చేస్తే ఎంత బయటికి వస్తుందో మీరు వూహించుకోవచ్చు ‘ అని నల్లధనం గురించి గుజరాత్‌లోని వడోదరాలో ప్రధానే ఆశ్చర్యం వ్యక్తం చేశారట.http://indianexpress.com/article/india/india-news-india/pm-narendra-modi-warns-of-surgical-strikes-against-blackmoney-corruption-3097294/ ప్రధాని అంతటి వ్యక్తి ఏదైనా అనూహ్యమైన విషయాన్ని ప్రకటిస్తే జనం, ప్రతిపక్షం, పాకిస్థాన్‌ ఆశ్చర్యపోవాలి గానీ ఆయన చెప్పినదానికి ఆయనే ఆశ్చర్యపోవటం వింతైన విషయమే. తనే జోక్‌ వేసి తానే అందరికంటే ముందుగా పెద్దగా నవ్వే వారిని గుర్తుకు తెచ్చారు కదూ ! నల్లధనం సంగతేమోగానీ సర్జికల్‌ దాడుల ఘనత తమదే అని స్వయంగా ప్రధాని చెప్పుకోవటం దీనిలో స్పష్టమైంది. కాంగ్రెస్‌, ఇతర అధికార యావ రాజకీయ పార్టీల వారి మాదిరే విజయాలన్నీ తన ఖాతాలో వేసుకొనే తహ తహ, తపనలో మోడీ కూడా పోటీ పడుతున్నారనుకుందాం.

     నల్ల ధనాన్ని వెలికి తీసిన ఖ్యాతిని కూడా మూట కట్టుకోమనే కదా దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. అందుకోసం సర్జికల్‌ దాడులు చేయకుండా మీ ప్రభుత్వానికి ఎవరు అడ్డుపడ్డారన్నదే ప్రశ్న. నల్లధనాన్ని స్వచ్చందంగా వెల్లడించండి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పధకం ఘోరంగా విఫలమైందని మీడియాలో విశ్లేషణలు వచ్చిన తరువాత బహుశా వాటిని జనం మరిచిపోయి వుంటారనే గట్టి నమ్మకంతో నరేంద్రమోడీ దానినొక పెద్ద విజయంగా చెప్పి తన భుజాన్ని తానే చరుచుకున్నారు. మన ప్రభుత్వాలు నిజాయితీగా వేతనం నుంచే పన్ను మొత్తాన్ని చెల్లించే వుద్యోగులకు రాయితీలు ఇవ్వటానికి ముందుకు రావన్నది అందరికీ తెలిసిన నిజం. కానీ ఎలాంటి పన్నులు చెల్లించకుండా గాదె కింది పందికొక్కుల్లా బలిసి పోతున్న వారికి మాత్రం క్షమాభిక్ష లేదా స్వచ్చందంగా ఆదాయ వెల్లడికి పధకాలను ప్రకటించి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు అవకాశమిస్తాయి. అందువల్లనే ప్రతి ఏటా పన్ను చెల్లించటం ఎందుకు? ప్రభుత్వం ఎర్ర తివాచీ పరచి పన్ను ఎగవేతదార్లకు అవకాశం ఇచ్చినపుడు ఎంతో కొంత చెల్లిద్దాము లెమ్మనే దేశ భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

   మెరిల్‌ లించ్‌ కంపెనీ వెల్లడించిన నివేదికల ప్రకారం 2007 నాటికి మన దేశంలో అధిక నిఖర సంపద వున్నవారి సంఖ్య లక్ష దాటింది. గతేడాది నాటికి ఆ సంఖ్య 4.2లక్షలకు చేరింది. 1997లో నల్లధనం దాచుకున్నవారికి క్షమా భిక్ష పేరుతో నాటి కాంగ్రెస్‌ పాలకులు ఒక పధకాన్ని ప్రకటించారు. దానిలో 33వేల కోట్ల రూపాయలను ప్రకటించి పది వేల కోట్ల రూపాయల పన్ను చెల్లించి గౌరవం పొందారు.అప్పటితో పోల్చితే ఇప్పుడు కనీసం పది రెట్లు దేశ ఆర్ధిక వ్యవస్ధ పెరిగింది. ఆ లెక్కన కనీసం మూడులక్షల కోట్ల రూపాయలకు పైగా నల్లధనాన్ని వెల్లడించి వుండాలి. కానీ 65వేల కోట్లే అదీ ఒక్కొక్కరు సగటున ఒక కోటి వంతున మాత్రమే వెల్లడించారంటే మోడీ గారి పధకం ఎంత ప్రహసన ప్రాయంగా మారిందో చెప్పనవసరం లేదు. నిబంధనల ప్రకారం 40శాతం పన్ను రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పాతికవేల కోట్ల రూపాయలకు పైబడే, దాన్నే పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు.

     బిజెపి, ఎన్‌డిఏ పక్షాలు కాంగ్రెస్‌ అవినీతిని గురించి నిత్య పారాయణం చేస్తుంటాయి. తప్పులేదు, ఆ పార్టీ అందుకు తగినదే. కానీ బిజెపి పాలనలో నరేంద్రమోడీ ఏలుబడి కుంభకోణం మాటేమిటి ? ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము రాకుండా వ్యక్తుల జేబుల్లోకి పంపేందుకు తోడ్పటమే కదా అవినీతి అంటే.తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగవేసి దర్జాగా విదేశాలకు పారిపోతుంటే ఎటు పోతున్నాడో చూడండి తప్ప అరెస్టు చేయటం వంటి అమర్యాద పనులు చేయవద్దని ఆదేశించిన ఘనత నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలోనే జరిగింది. ఆ మాల్యనే ఇంతవరకు పట్టుకోలేకపోయారు. అలాంటి మల్లయ్యలు బ్యాంకుల నుంచి తీసుకొని దాదాపు ఎగవేసిన సొమ్ము పదకొండులక్షల కోట్ల రూపాయలు. వారిలో ఏ ఒక్కడూ కూడా వ్యాపారంలో, పరిశ్రమలో నష్టం వచ్చిందని మన రైతుల మాదిరి ఆత్మహత్య చేసుకున్నవారు లేరు. వారి ఆస్థుల నుంచి కనీసం పదో వంతు వసూలు చేసినా లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చి వుండేది. ఆ పనేమీ చేయకపోగా గత రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ అనుమతితో బ్యాంకులు రద్దు చేసిన అలాంటి బాకీల మొత్తం 1.12లక్షల కోట్ల రూపాయలున్నదన్న సంగతి ఎంత మందికి తెలుసు. ఎందుకంటే ఈ విజయాన్ని ఎక్కడా మోడీ భక్తులు కీర్తించరు ! రైతుల రుణాలు రద్దు చేయమంటే డబ్బు లేదంటారు . మరి వీరికి ఎక్కడి నుంచి వచ్చింది ? గత సంవత్సరం ప్రభుత్వం అందచేసిన లెక్కల ప్రకారమే వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు, ఎగుమతి దిగుమతులకు ఇచ్చిన రాయితీల వలన ప్రభుత్వానికి రావాల్సి రాకుండా పోయిన ఆదాయం ఆరులక్షల పదకొండువేల కోట్లు. ఈ మొత్తంలో లక్షా పదహారు వేల కోట్లరూపాయలు బంగారం, వజ్రాల దిగుమతులు చేసుకున్న మన దేశంలోని ‘ అత్యంత నిరుపేదలకు ‘ నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన రాయితీ అంటే ఎవరైనా నమ్ముతారా ? ఇలాంటి రాయితీలు కాంగ్రెస్‌ హయాంలో మొదలై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ హయాంలో కూడా పెరిగాయి తప్ప తరగలేదు ! కానీ ఈ విషయంలో మాత్రం నరేంద్రమోడీకి ఆశ్చర్యం కలగలేదు, సర్జికల్‌ దాడులు గుర్తుకు రాలేదు !! చంద్రబాబు నాయుడి వూతపదం ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను అన్నట్లుగా ఈ పాలన ఇలా ముందుకు పోవాల్సిందేనా ? జనానికి కబుర్లు, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వాల్సిందేనా ? అన్నింటి కంటే ప్రహసనం ఏమంటే నల్లధనాన్ని అరికట్టేందుకు గతంలో వంద రూపాయల నోట్లను రద్దు చేస్తే సగం అంతరిస్తుందనుకున్నారు. ఇప్పుడు ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాలని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన చంద్రబాబు నాయుడు బహిరంగంగానే సలహా ఇచ్చారు. కానీ కేంద్ర త్వరలో రెండువేల రూపాయల నోట్లను చలామణిలోకి తేనున్నదని వార్తలు అంటే నల్లధన కుబేరులకు మరింత సౌకర్యం కల్పించటమేనా ?