Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

     ప్రపంచ గతినే ఒక పెద్ద మలుపు తిప్పిన వుదంతం 1917 రష్యన్‌ అక్టోబరు విప్లవం.ఆ మహత్తర ఘటన జరిగి నూరు సంవత్సరాలు కావస్తోంది. ఆ సందర్భంగా ప్రపంచంలోని పలు కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలు నిర్వహించి ఆ విప్లవ ప్రాధాన్యతను నేటి తరాలకు పరిచయం చేసేందుకు పూనుకున్నాయి. ఒకవైపు ప్రపంచంలో కమ్యూనిజాన్ని ఏడు నిలువుల లోతున పాతివేసి విజయం సాధించామని చంకలు కొట్టుకుంటూనే అనేక చోట్ల పాలకవర్గాలు చివరికి చే గువేరా బొమ్మ, ఎర్ర రంగు టీషర్టులు, కమ్యూనిజానికి చెందిన పుస్తకాలు అమ్మటం కనిపించినా వులిక్కి పడటాన్ని ఇండోనేషియా వంటి అనేక చోట్ల చూస్తున్నాం. వూరంతా కావమ్మ మొగుడు అంటే కామోసనుకున్నాను, ఇప్పుడు కాదంటున్నారు కనుక నా కర్రా బుర్రా ఇస్తే నాదారిన నే పోతా అన్న మాదిరి 1991లో సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చి వేసిన తరువాత అనేక మంది కమ్యూనిస్టు జండాలు తిప్పేశారు.

   పాతిక సంవత్సరాలు గడిచిన తరువాత అనేక చోట్ల పూర్వపు సోషలిస్టు దేశాలలో అంతర్మధనం జరుగుతోంది. వున్న సంక్షేమ వ్యవస్ధ పోయింది, పెట్టుబడిదారీ విధానం అదనంగా అన్న వస్త్రాలు ఇవ్వకపోగా వున్న వస్త్రాలను లాగివేసుకుందని, కడుపు మాడుస్తోందని జనం గ్రహించారు. పెట్టుబడిదారీ వ్యవస్ధకు తలమానికమైన అమెరికాలో నిన్న మొన్నటి వరకు సోషలిస్టు, కమ్యూనిస్టు అని చెప్పుకోవాలంటేనే జనం వణికిపోయే పరిస్థితి. ఇప్పుడు అవును మేము సోషలిస్టులమే అయితే ఏమిటి అని మిలియన్ల మంది యువత ప్రశ్నిస్తున్నారంటే పరిస్థితిలో ఎంత మార్పు ! అమెరికాలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక మాంద్యం అక్కడి కార్మిక, మధ్యతరగతి పౌరుల జీవితాలను అతలాకుతలం చేయటమే దీనికి కారణం, పెట్టుబడిదారీ వ్యవస్ధ విఫలమైందని అనేక మంది అంగీకరిస్తున్నారు. ప్రత్యామ్నాయం ఏమిటని శోధిస్తున్నారు. ఆ క్రమంలో అనేక మంది అటకెక్కించిన కమ్యూనిస్టు మానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాలను దించి దుమ్మదులిపి అసలు వాటిలో ఏం రాశారు ? మనకేమైనా పరిష్కారం చూపుతాయా అని అధ్యయనం చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది ?

   ప్రపంచ చరిత్రలో ఎన్నో రకాల విప్లవాలు సంభవించాయి. అనేక పరిణామాలు నాటకీయంగానే ప్రారంభమయ్యాయి. పైకి అలా కనిపించినప్పటికీ వాటికి తగిన భూమిక తయారై వున్నందునే అలా జరిగాయి. అయితే ఎక్కడ, ఏ రూపంలో, ఎలా జరుగుతుందన్నదే అనూహ్యం. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన బ్రిటన్‌, జర్మనీ వంటి చోట్ల సోషలిస్టు విప్లవం వస్తుందని కారల్‌మార్క్సు-ఎంగెల్స్‌ అంచనా వేశారు. అందుకు భిన్నంగా రష్యాలో వచ్చింది. లెనిన్‌తో సహా బోల్షివిక్‌ పార్టీ నాయకత్వం ఎక్కువ భాగం ప్రవాసంలో వుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో జారు చక్రవర్తుల పాత్రపై జనం ఆగ్రహంతో వున్నారు. ఈ స్ధితిలో బోల్షివిక్‌లకు అవకాశం ఇవ్వకుండా రష్యా పాలకవర్గం 1917ఫిబ్రవరిలో కెరెన్సీని రంగంలోకి దించి తిరుగుబాటు పేరుతో జారును తొలగించి బూర్జువా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. అయితే అక్టోబరు నాటికి బోల్షివిక్‌ నేత లెనిన్‌ ప్రవాసం నుంచి తిరిగి వచ్చి కెరెన్సీ ప్రభుత్వాన్ని తొలగించి సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచాన్ని కుదిపివేసిన పదిరోజులు అనే పేరుతో జాన్‌ రీడ్‌ అనే అమెరికన్‌ రచయిత ఈ మహత్తర విప్లవం పరిణామాలను గ్రంధస్ధం చేశారు.

   మొదటి ప్రపంచ యుద్ధం అనివార్యంగా కనిపిస్తున్న పరిస్ధితులలో 1914లో అంతర్జాతీయ సోషలిస్టు వుద్యమం ఒక విధంగా కుప్పకూలిపోయింది. నాటి కార్మివర్గ పార్టీలలో ముఖ్యమైన జర్మన్‌ మ్యూనిస్టుపార్టీ యుద్ధానికి అనుకూలంగా ఓటు చేసింది. కొద్ది మంది మైనారిటీలు మాత్రమే ఇది ప్రజల యుద్ధం కాదు, ప్రజలపై యుద్ధం అని వాదించారు. అలాంటివారిలో లెనిన్‌ నాయకత్వంలోని బోల్షివిక్‌ పార్టీ ఒకటి. ఆ కారణంగానే అది సరైన ఎత్తుగడలు అవలంభించి పాలకవర్గ బలహీనతను వుపయోగించుకొని మహత్తర సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేయగలిగింది.

    అక్టోబరు విప్లవం గురించి 1918లో లెనిన్‌ ఒక సందర్బంగా రాసిన దానిలో ‘ సోవియట్‌ తరహా నూతన రాజ్యాన్ని సృష్టించి కష్టతరమైన సమస్యలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే పరిష్కరించగలిగాము. ప్రధాన ఇబ్బంది ఆర్ధిక రంగంలో వుంది’ అని చెప్పారు. విప్లవ సమయంలో మిగతా ఐరోపాతో పోల్చితే రష్యా అనేక విధాలుగా వెనుకబడే వుంది. అంతర్గతంగా భూస్వామిక శక్తులు, పెట్టుబడిదారులు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించారు. బయట మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలు, పరాజిత దేశాలూ రెండు కూటములూ సోవియట్‌ చుట్టూ దానిని నమిలి మింగేసేందుకు అవకాశం కోసం చూస్తున్న సామ్రాజ్యవాదులు, కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు చుట్టుముట్టి వున్నాయి. 1917లో సంభవించిన విప్లవం 1989 నాటికి సామ్రాజ్యవాదుల కుట్రలకు బలై ఎలా కూలిపోయిందీ తెలుసుకోకుండా దాని ప్రాధాన్యతను , నేటికీ దానికి వున్న విలువ ఏమిటో అర్ధం చేసుకోలేము.

    అక్టోబరు విప్లవానికి ముందు విదేశాంగ విధానమంటే సామ్రాజ్యవాదులు ఏ ప్రాంతాన్ని ఎలా ఆ క్రమించుకోవాలి, ఎవరైనా పోటీకి వస్తే వారిని ఎలా దెబ్బతీయాలనేదే తప్ప మరొకటి మనకు కనపడదు. ఆధునిక చరిత్రలో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే విదేశాంగ విధానానికి రూపకల్పన జరిపింది సోవియట్‌ యూనియన్‌ వునికిలోకి వచ్చిన తరువాతే. కమ్యూనిస్టు పార్టీలు, సామ్రాజ్యవాద వ్యతిరేక, జాతీయ వుద్యమాలు, వివిధ ప్రజా సంఘాలకు రూపకల్పన చేసింది కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ అన్నది తెలిసిందే. దాన్ని ఒక విధానంగా ఆచరణలోకి తెచ్చింది, అభివృద్ది చేసిందీ సోవియట్‌ యూనియన్‌. అక్టోబరు విప్లవం ఫలితంగా ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ అనేక దేశాలలో కమ్యూనిస్టు విప్లవ సంస్ధల ఏర్పాటుకు, జాతీయ విముక్తి, విప్లవాలకు తోడ్పాటునందించింది. చైనా విముక్తికి ప్రత్యక్షంగా తోడ్పడింది, సోవియట్‌ లేకుంటే చరిత్ర మరోవిధంగా వుండి వుండేది. సోవియట్‌లో కష్టజీవుల రాజ్యం ఏర్పడిందని, ఎలా వుంటుందో చూద్దామని అష్టకష్టాలు పడి వెళ్లిన వారు అనేక మంది కమ్యూనిస్టులుగా మారి తమ దేశాలలో కూడా అలాంటి వ్యవస్ధలను ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు, 1920 తాష్కెంట్‌ నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు ఆ విధంగా జరిగిందే . సంపూర్ణ స్వాతంత్య్రం కావాలనే డిమాండ్‌ను మన స్వాతంత్య్రం వుద్యమంలో ముందుకు తెచ్చింది కమ్యూనిస్టులే. ఈ కారణంగానే తమ దోపిడీకి రాగల ముప్పును గమనించి సామ్రాజ్యవాదులు సోవియట్‌ను మొగ్గలోనే తుంచేందుకు ప్రయత్నించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలు, పరాజితులూ ఇరు పక్షాలూ సోవియట్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. దాన్ని గమనించే లెనిన్‌ ప్రారంభంలోనే జర్మన్‌ సామ్రాజ్యవాదులతో బ్రెస్ట్‌లిటోవస్కీ సంధి చేసుకొని విప్లవ ఫలితాన్ని రక్షించారు. అక్టోబరు విప్లవం జాతీయ స్వాతంత్య్ర, విముక్తి వుద్యమాలకు వూపునివ్వటంతో మన దేశంతో సహా అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీల పుట్టుకకు పురుడు పోసింది. పర్యవసానంగా రెండవ ప్రపంచ యుద్దం నాటికి సామ్రాజ్యవాదులు తమ వలసలను ఇంకేమాత్రం నిలుపుకోలేని పరిస్ధితులు ఏర్పడ్డాయి. దీంతో సోవియట్‌ను దెబ్బతీసేందుకు అమెరికాతో సహా అన్ని సామ్రాజ్యవాద దేశాలూ జర్మన్‌ నాజీ హిట్లర్‌ను అన్ని విధాలుగా ప్రోత్సహించాయి.ఈ కుట్రను ముందుగా పసిగట్టిన స్టాలిన్‌ హిట్లర్‌ వ్యతిరేక కూటమితో ఒప్పందాలు చేసుకొనేందుకు ప్రయత్నించారు. ముందుగా హిట్లర్‌ను సోవియట్‌పైకి పంపి దానిని పతనం చేసిన తరువాత తాము తేల్చుకోవచ్చని ఇతర సామ్రాజ్యవాదులు దురాలోచన చేశారు.

    అందుకే తగిన సన్నాహాలు చేసుకొనేందుకు మరోసారి 1939తో జర్మనీతో రష్యన్లు పరస్పర దాడుల నిరోధ ఒప్పందం చేసుకున్నారు. సోవియట్‌ను ఏక్షణంలో అయినా లేపివేయవచ్చు, ముందు గతంలో తమను ఓడించిన ఇతర సామ్రాజ్యవాదుల పని బట్టాలని నిర్ణయించుకున్న హిట్లర్‌ తన వ్యూహం అమలు జరిపాడు. వరుసగా విజయాలు సాధించిన వూపులో సోవియట్‌ను కూడా ఆక్రమించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించిన హిట్లర్‌ 1941లో అంతకు ముందు చేసుకున్న ఒప్పందాన్ని వుల్లంఘించి సోవియట్‌పై దాడులకు దిగాడు. ఇది ప్రపంచగతిని మరోమలుపు తిప్పుతుందని ఎవరూ వూహించలేదు. ఐక్యరాజ్యసమితి ఏర్పడటానికి ముందు నానాజాతి సమితి వుండేది. దాని వైఫల్యాల తీరుతెన్నులను గమనించి రెండవ ప్రపంచ యుద్దానికి ముందు దురాక్రమణదారులకు వ్యతిరేకంగా ఒక భద్రతా వ్యవస్ధను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది నాటి సోవియట్‌ యూనియన్‌ మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. ఆ తరువాత అంతకంటే పటిష్టమైన ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అయితే ఇది కూడా నానాజాతి సమితి వైఫల్యాల బాటలోనే పయనిస్తున్నది, అందుకు బాధ్యత ఎవరిది, నిబంధనలను వుల్లంఘిస్తున్నది ఎవరంటే అమెరికా, దాని మిత్రరాజ్యాలే మనకు కనిపిస్తాయి.

    ఐరోపాను గడగడలాడించిన హిట్లర్‌ సేనలను మట్టుబెట్టటమే గాక, హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చావాల్సిన పరిస్ధితిని కల్పించిన మొనగాడుగా సోవియట్‌ ప్రపంచం ముందు నిలిచింది. అంతే కాదు తూర్పుఐరోపాను, ఆసియాలో వుత్తర కొరియాను విముక్తి చేసి సోషలిస్టు శిబరాన్ని విస్తరింపచేసింది. చైనాలో సోషలిస్టు విప్లవం జయప్రదమయ్యేందుకు ఎంతో తోడ్పడింది.రష్యాలో అక్టోబరు విప్లవం జరగపోయి వుంటే, అది బలపడి రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ మూకలను ఓడించకుండా వున్నట్లయితే ప్రపంచంలో ఏమి జరిగి వుండేది ? నాజీలు, ఫాసిస్టులు, ఇతర సామ్రాజ్యవాదులు మరో రూపంలో ప్రపంచాన్ని తిరిగి పంచుకొని వుండేవారు కాదా ? ఆ ముప్పును తప్పించింది, వలస రాజ్యాలన్నింటికీ స్వాతంత్య్రం వచ్చింది కమ్యూనిస్టుల వలనే కాదా ?

Image result for 2nd world war ,stalin

   అక్టోబరు విప్లవంతో ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ ఒక కుట్ర ఫలితమని సామ్రాజ్యవాదులు వర్ణిస్తారు. ఒక ప్రయోగంగా కొందరు వర్ణిస్తే , మరికొందరు దానిని అంగీకరించరు. 1871 మార్చి 18 నుంచి మే 28వరకు వునికిలో వున్న పారిస్‌ కమ్యూన్‌ను దిగ్బంధం చేసి అణచివేసిన మాదిరి ప్రపంచంలో ఆరోవంతు వున్న సోవియట్‌ యూనియన్‌ను భౌతికంగా దిగ్బంధం చేయటం సాధ్యం కాదని పెట్టుబడిదారీ వర్గం ప్రారంభంలోనే గుర్తించింది.అందుకే తొలుత అంతర్గత తిరుగుబాట్లు, అంతర్యుద్ధ కుట్రల ద్వారా దానిని దెబ్బతీయాలని చూసింది. ఆ తొలి ఎత్తుగడ విఫలమైంది. అటువంటి వ్యవస్ధ రెండు దశాబ్దాలపాటు కొనసాగి స్ధిరపడటమేగాక అనేక విజయాలు సాధించి ప్రపంచ కార్మివర్గాన్ని ఆకర్షించింది. దీనికి తోడు రెండవ ప్రపంచ యుద్ధంలో అనూహ్యంగా హిట్లర్‌ను ఓడించి ప్రపంచ హీరోగా నిలబడింది. దీంతో భౌతికంగా అంతం చేయలేమని , కార్మిక వర్గం మొత్తంగా తమ దోపిడీకి చరమ గీతం పాడుతుందని పెట్టుబడిదారులు నిర్ధారణకు వచ్చి పన్నిన సుదీర్ఘకుట్ర ఫలితమే ప్రచ్చన్న యుద్దం.

   సోవియట్‌, తదితర దేశాల వ్యవస్ధలను కూల్చివేయటానికి, కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు సామ్రాజ్యవాదులు దాదాపు పది లక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేశారని అంచనా. కమ్యూనిజం పనికిరాదు, అసంగతం అని చెప్పిన వారు దాన్ని దెబ్బతీసేందుకు ఇంత భారీ మొత్తం ఖర్చు చేయటాన్ని బట్టే దానికున్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. శ్రామికవర్గంతో ప్రత్యక్ష పోరు సల్పితే ప్రయోజనం లేదన్నది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దోపిడీ వర్గం నేర్చుకున్న పెద్ద పాఠం. కొత్త పద్దతులను ఎంచుకుంది. ఎదుటి పక్షంలోని లోపాలు, బలహీనతలను ఎంచుకొని వాటిమీద కేంద్రీకరించటం ద్వారా సైద్ధాంతిక దాడి, కుట్రలు, అనుమానాలు, గందరగోళంలో పడవేయటం వంటి సకల చాణక్య ఎత్తుగడులను అమలు జరిపి తమ చేతికి మట్టి అంటకుండా దెబ్బతీయటం ప్రచ్చన్న యుద్ద లక్షణం. దాన్ని ఒక్క సోవియట్‌, తూర్పు ఐరోపాకే పరిమితం చేయలేదు. క్యూబాను భౌతికంగా అష్టదిగ్బంధనం గావించారు. కమ్యూనిస్టు చైనాను రెండు దశాబ్దాలకు పైగా అసలు గుర్తించేందుకు, ఐక్యరాజ్యసమితిలో ప్రాతినిధ్యం వహించేందుకే లేకుండా అడ్డుకున్నారు. వియత్నాం, కంపూచియా, లావోస్‌లపై దశాబ్దాల తరబడి యుద్ధాలు చేసి కమ్యూనిజాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.

    పుట్టిన దగ్గర నుంచి కూలిపోయే వరకు ఏడు దశాబ్దాల పాటు సోవియట్‌ వనరులలో ఎక్కువ భాగం దానిని కాపాడు కొనేందుకు ఖర్చు చేసిన ఫలితంగానే అది ఎలాంటి భౌతికదాడులకు గురికాలేదన్నది ఒక వాస్తవం. అయితే అదే సమయంలో పెట్టుబడిదారీ దేశాలు విసిరిన సవాలును స్వీకరించిన కమ్యూనిస్టులు సోవియట్‌ అభివృద్దికి అనుసరించిన కొన్ని పద్దతులు, ప్రయోగాలు ఎన్నో విజయాలతో పాటు కొన్ని వ్యతిరేక ఫలితాలనిచ్చాయన్న అభిప్రాయాన్ని కాదనలేము.వాటిలో కమ్యూనిస్టులు బ్యూరాక్రాట్లుగా మారటం ఒకటి. అనేక ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ సోవియట్‌ సాధించిన విజయాలను తక్కువ చేసి చూడలేము. స్టాలిన్‌ హయాంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ సాధించిన అభివృద్ధి కారణంగానే ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఫాసిస్టు హిట్లర్‌ను మట్టుబెట్టటం సాధ్యమైంది. అణురంగంలో అమెరికాతో ధీటుగా వుండబట్టే మరో నాగసాకి, హిరోషిమాలు పునరావృతం కాలేదు. ప్రణాళికా బద్ధమైన ఆర్ధిక వ్యవస్ధను అమలు జరిపి అనేక విజయాలు సాధించి ఈనాడు అనేక దేశాలకు మార్గదర్శకంగా వున్నది కూడా సోవియట్‌ యూనియనే. సోవియట్‌ ప్రయోగాలు ప్రపంచానికి అనేక గుణపాఠాలు కూడా నేర్పాయి.

    లాభం లేనిదే వ్యాపారి వరదన పోడన్న సామెత తెలిసిందే.సోవియట్‌ యూనియన్‌ ఏర్పాటు, పురోగమనం, ఫాసిజంపై యుద్ధ విజయం కారణంగా జనం కమ్యూనిస్టులవైపు మొగ్గకుండా చూసేందుకే పాలకవర్గాలు జనానికి వెసులుబాటునిచ్చే కొన్ని సంక్షేమ చర్యలను చేపట్టకతప్పని పరిస్ధితులు ఏర్పడ్డాయని గ్రహించటం అవసరం. ఇదే క్రమంలో లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండంలో నియంతలకు మద్దతు ఇచ్చే విధానాలను అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులు విరమించుకోవాల్సి వచ్చింది. తమ లాభాల రేటు తగ్గకుండా చూసుకొనేందుకు మరోవైపు పెట్టుబడిదారీ వర్గం వుత్పత్తిని మరింతగా పెంచే, కార్మికుల సంఖ్యను తగ్గించే పరిజ్ఞానంవైపు కూడా దృష్టి సారించింది. అది సోషలిస్టు దేశాలకు విస్తరించకుండా ఇనుప తెరలను ఏర్పాటు చేసింది. దానిలో భాగంగానే సోవియట్‌తో సంబంధాలున్న మనవంటి దేశాలకు కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసింది. అయినా అంతరిక్ష రంగంలో సోవియట్‌ అమెరికా కంటే ఎంతో ముందుకు పురోగమించింది. గతంలో సోవియట్‌,తరువాత దాని వారసురాలిగా రష్యా మనకు అందించిన అంతరిక్ష ప్రయోగ పరిజ్ఞాన ఫలితమే ఈ రోజు మనం జయప్రదంగా అంతరిక్ష , క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ అగ్రరాజ్యాల సరసన నిలబడగలుగుతున్నామన్నది మరిచి పోరాదు. ప్రచ్చన్న యుద్ధం పేరుతో సామ్రాజ్యవాదులు సాగించిన కుట్రల తీవ్రతను అర్ధం చేసుకోవటంలో, ఎదుర్కోవటంలో వైఫల్యం, వైరిపక్ష బలాన్ని తక్కువగా అంచనా వేయటం, సంస్కరణల అమలులో వైఫల్యం వంటి అంశాలు , రాజకీయంగా మితవాదానికి గురికావటం చివరకు బోరిస్‌ ఎల్సిన్‌ వంటి శక్తులు పార్టీ నాయకత్వ స్ధానాలలోకి ఎదగటంతో సామ్రాజ్యవాదులు తమ కుట్రలను సులభంగా అమలు చేసి సోవియట్‌ను కూల్చివేయగలిగారు.

    సోవియట్‌, తూర్పు ఐరోపా పతనం వలన ఆయా దేశాల పౌరులతో పాటు ప్రపంచం కూడా ఎంతో నష్టపోయింది. అమెరికా చెప్పిందే వేదం. సోవియట్‌ అంతరిస్తే తమ ఖండం నుంచి అమెరికా సేనలు తిరుగుముఖం పడతాయని ఆశించిన ఐరోపా ధనిక దేశాల ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ పాలకవర్గ అంచనాలు తప్పాయి. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలకు వ్యతిరేకంగా నాటో కూటమిని ఏర్పాటు చేసిన అమెరికా అక్కడి సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేసిన తరువాత దానిని రద్దు చేయకపోగా గత పాతిక సంవత్సరాలలో మరింతగా పటిష్ట పరుస్తున్నారంటే వారి ఎజండా ఇంకా మిగిలే వుందన్నది సుస్పష్టం. అంటే మిగతా సోషలిస్టు దేశాలు, కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తూనే వున్నారు. ఐరోపా ధనిక దేశాలపై తన పట్టు కొనసాగాలంటే నాటో కూటమిని కొనసాగించటం అవసరం. సోవియట్‌ లేకపోయినా దాని స్ధానంలో వచ్చిన రష్యా నుంచి ఐరోపాకు ముప్పు తొలగలేదనే కొత్త పల్లవిని అమెరికన్లు అందుకున్నారు.

     సోవియట్‌ అంతరించిన తరువాత దాని బూచిని చూపితే నడవదు. అందుకు గాను వుగ్రవాదంపై పోరు పేరుతో సరికొత్త అజెండాకు తెరలేపింది. ఆ పేరుతో పశ్చిమాసియా ఆక్రమణకు పూనుకుంది. ఇజ్రాయెల్‌కు ఇంకా ముప్పు తొలగలేదనే పేరుతో ఆ ప్రాంతంలో కొనసాగేందుకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నది. సోవియట్‌ను కూల్చివేసిన తరువాత పాతిక సంవత్సరాల పాటు ఒక చిన్న కమ్యూనిస్టు దేశం క్యూబాను దెబ్బతీసేందుకు ప్రయత్నించి సాధ్యంగాక దానితో అమెరికన్లు తాత్కాలికంగా అయినా రాజీపడి సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలలో ఎన్నికైన వామపక్ష ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఆసియాలో తమకు లాభదాయకంగా వున్న కారణంగా చైనాతో భారీ ఎత్తున వాణిజ్య లావాదేవీలు నడుపుతూనే మరోవైపున దానిని దెబ్బతీసేందుకు నిరంతరం కుట్రలు పన్నుతూనే వున్నాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని చైనా ఆధీనంలో వున్న దీవులపై తమకు హక్కు వుందంటూ జపాన్‌, ఫిలిప్పైన్స్‌ తదితర దేశాలతో వివాదాలను రెచ్చగొడుతూ ఆ ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేస్తున్నారు.

    ప్రపంచ మానవాళి సోవియట్‌కు, స్టాలిన్‌కు తీర్చలేని విధంగా రుణపడిందంటే అతిశయోక్తికాదు. స్టాలినే లేకుంటే తరువాత కాలంలో ఆయనను నియంత అని నిందించిన వారు, హిట్లర్‌తో మతిలేని పోలికలు తెచ్చిన వారు బతికి వుండేవారు కాదు, వారి వారసులు అసలు పుట్టివుండేవారు కాదు. ప్రపంచాన్ని హిట్లర్‌ అనే నియంత ఆక్రమించ కుండా కాపాడింది, తమ ప్రాణాలు అర్పించిన రెండు కోట్ల మంది సోవియట్‌ పౌరులు, వారిని అంతటి మహత్తర త్యాగాలకు సిద్దపరిచిన స్టాలిన్‌ నాయకత్వమే. ఒక దుర్మార్గుడు ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకుంటే లొంగిపోయి సలాం కొట్టినవారిని, బానిసలుగా మారిన వారిని, గుడ్లప్పగించి చూసిన వారిని ప్రపంచ చరిత్ర చూసింది గానీ, ఆత్మగౌరంతో బతికేందుకు ఇలాంటి త్యాగాలు చేయటం మరొక వుదంతంలో ఎక్కడా కానరావు.

    ఐరోపాలో లేదా మన వంటి వర్ధమాన దేశాలలో ప్రభుత్వాలు సంక్షేమ చర్యలను చేపట్టటం రష్యాలో అక్టోబరు విప్లవం, సోవియట్ల ఏర్పాటు తరువాతనే ప్రారంభమైంది అని గుర్తించాలి. ఆ సోవియట్‌ కూలిపోయిన తరువాత గత పాతిక సంవత్సరాలలో ఆ సంక్షేమ చర్యలను ఒక్కొక్కటిగా పెట్టుబడిదారీ దేశాలన్నింటా వుపసంహరించటాన్ని గమనిస్తున్నాము. గతం మాదిరి జనం పోల్చుకోవటానికి ప్రత్యామ్నాయ వ్యవస్ధ లేదని, తమ లాభాల్లో జనానికి వాటా పెట్టాల్సిన అవసరం లేదని పెట్టుబడిదారులు భావిస్తుండటమే సంక్షేమ చర్యలకు కోత, వుపసంహరణ.

   ఇతరులకు జోస్యం చెప్పిన బల్లి కుడితిలో పడి గిలగిలా కొట్టుకున్నట్లు సోషలిస్టు వ్యవస్ధలు ఫలితాలు సాధించలేవని, ఆచరణ సాధ్యం కాదని ప్రచారం చేసిన పెట్టుబడిదారీ వ్యవస్ధలు తామే తీవ్ర సంక్షోభంలో పడి బయటకు రాలేక దిక్కుతోచకుండా వున్నాయి. మరోవైపున సంక్షుభిత పెట్టుబడిదారీ దేశాల మార్కెట్లపై ఆధారపడిన చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాల ఎగుమతుల ఆర్ధిక లావాదేవీలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షోభంలో పడలేదు. విజయవంతంగా నడుస్తున్నాయి. దివాళాకోరు ఆర్ధిక విధానాలు అమలు జరుపుతున్న మనవంటి దేశాలు రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా వాటి దుష్పలితాలను అనుభవిస్తున్నాయి. సోవియట్‌ కూలిపోయిన తరువాత ప్రపంచంలోని వామపక్షాలు కూడా నూతన సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

      కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతుల వుద్యమాలు వెనుకపట్టు పట్టాయి. యజమానులు తమ షరతులను ముందుకు తెస్తూ ఎదురుదాడులు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు తమ వస్తువులను అమ్ముకొనేందుకు తెచ్చిన నూతన సాంకేతిక పద్దతులతో గొలుసుకట్టు ప్రపంచ మార్కెట్‌ను తమ అదుపులోకి తెచ్చుకుంటున్నాయి. దీంతో సరిహద్దులతో నిమిత్తం లేకుండా వస్తువులు ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుతున్నాయి. దీని అర్ధం ఏమంటే తమ ఆర్ధిక వ్యవస్థల మీద ఆయాదేశాలకు అదుపు వుండదు. కార్మికులు యూనియన్లు పెట్టుకోవటానికి, తమ న్యాయమైన హక్కులను సాధించుకొనేందుకు కష్టమౌతుంది. ఎక్కడ కార్మిక శక్తిని దోచుకొనేందుకు అవకాశం వుంటే అక్కడికి పరిశ్రమలను తరలించి లేదా కొత్తగా ఏర్పాటు చేసి వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేస్తున్నాయి. ఈ కారణంగా మన ప్రధాని నరేంద్రమోడీ మేకిన్‌ ఇండియా నినాదం ఇచ్చి, తమ దగ్గర ఎటువంటి అవకాశాలు వున్నాయో ప్రపంచదేశాలన్నింటా చెబుతున్నారు. అవసరమైతే కార్మిక చట్టాల రద్దు, నామమాత్రంగా చేసి యజమానుల ఇష్టారాజ్యానికి అవకాశం కల్పిస్తామని ప్రాధేయపడుతున్నారు. కార్మిక సంఘాల ఏర్పాటును కఠిన తరం చేసే నిబంధనలు చేరుస్తున్నారు.తక్కువ సంఖ్యలో కార్మికులున్న పరిశ్రమలలో వారిని తొలగించేందుకు, మూసివేసేందుకు యజమానులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నారు. అప్రెంటిస్‌ల పేరుతో ఏండ్ల తరబడి నామమాత్ర వేతనాలకు పనిచేయించుకొనే వెసులుబాటును కల్పిస్తున్నారు. చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావు వంటి ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇవన్నీ పరోక్షంగా సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయిన పర్యవసానాలే అన్నది గమనించాలి.

    అక్టోబరు విప్లవం ప్రపంచంలో తెచ్చిన మార్పులు, దానికి తగిలిన ఎదురు దెబ్బల కారణంగా ప్రపంచంలో సామ్రాజ్యవాదుల ఆధిక్యం పెరిగిపోవటం, వారిని ఎదిరించేవారు లేకపోవటంతో వర్ధమాన దేశాలకు తిరిగి ముప్పు ఏర్పడటం, కార్మిక,కర్షక వుద్యమాలు వెనుకపట్టుపట్టం, యజమానుల దోపిడీ పెరగటం,సంక్షేమ చర్యలకు కోత ద్వారా ప్రజలపై భారాలు మోపటం వంటి పర్యవసానాల గురించి చెప్పుకున్నాము. సోవియట్‌ పతనం నుంచి గుణపాఠాలు తీసుకోవటమంటే పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం నుంచి వైదొలగి ఆ దుర్మార్గ విధానానికి సలాం కొట్టటం కాదు. అక్టోబరు విప్లవం గురించి మరింతగా మధనం చేయాలి. లోపాలను పునరావృతం కాకుండా చూసుకోవాలి. దానిని వర్తమాన పరిస్ధితులకు అన్వయించుకోవాలి. ప్రతి వైఫల్యం విజయానికి ఒక మెట్టు అని అంగీకరిస్తే అక్టోబరు విప్లవం, సోవియట్‌ ప్రయోగం కూడా అలాంటిదే. ప్రస్తుతం సాంప్రదాయ పెట్టుబడిదారుల స్ధానంలో ద్రవ్య పెట్టుబడిదారులు ప్రపంచంపై ఆధిపత్యం వహిస్తున్నారు. వారి నూతన ఎత్తుగడలను కార్మికవర్గం నూతన పద్దతులలో చిత్తుచేయటం తప్ప మరొక మార్గం లేదు. ఈ క్రమంలో పెట్టుబడిదారీ సిద్దాంత వేత్తలు ముందుకు తెచ్చే గందరగోళ సిద్ధాంతాలు లేదా వాదనలను వారి తీరుతెన్నుల నుంచే ఎండగట్టాలి. రెండు రెళ్లు నాలుగు అన్నది ఏ కాలంలో అయినా ఒకటే. అలాగే కార్మికులు, కర్షకులు దోపిడీకి గురవుతున్నంత వరకు దానిని ఎలా అంతం చేయాలన్నదానిలోనూ ఎలాంటి గందరగోళం, మార్పూ వుండకూడదు.