Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

   వ్యాపార సరళతరం సూచికలో భారత్‌ తన స్ధానాన్ని 131 నుంచి 130కి పెంచుకొని గత ఏడాది కంటే ఒక పాయింట్‌ అదనంగా సాధించిందని ప్రపంచబ్యాంక్‌ 2017 నివేదికలో ప్రకటించింది. నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రకటించిన సంస్కరణలన్నీ వూకదంపుడు వుపన్యాసాలే తప్ప ఆచరణ రూపం దాల్చనందున ప్రపంచ బ్యాంకు వాటిని పరిగణనలోకి తీసుకోలేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. భారత్‌లో వ్యాపార విషయాలను చూసే కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి రమేష్‌ అభిషేక్‌ తాజా సూచికపై స్పందిస్తూ ప్రభుత్వం అమలు జరుపుతున్న 12 సంస్కరణలను ప్రపంచబ్యాంకు పరిగణనలోకి తీసుకోలేదని, వచ్చే ఏడాది నివేదికలో ఈ అంశాలను చేర్చేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు అక్కర లేదా ఆవేదనలను తీర్చుతామని కూడా వెల్లడించారు. దివాలా, ఐపి నిబంధనలను ఈ ఏడాది చివరికి ఖరారు చేస్తామని, జిఎస్‌టిని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి అమలు జరిపితే మన సూచిక గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.http://www.livemint.com/Industry/uOrtVTE4CgFpPnwV3wATmK/India-ranked-130-in-World-Banks-Doing-Business-survey.html

    భారత్‌లో సులభంగా వ్యాపారం చేసుకోవటానికి చర్యలు తీసుకోవటం అంటే ఏమిటో ఈ పాటికే కొంత అర్ధమయ్యే వుంటుంది. సూటిగా చెప్పాలంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలా వచ్చి వ్యాపారాన్ని పెట్టి అలా లాభాలు తీసుకుపోయేందుకు అనువైన పరిస్ధితులు కల్పించటమే. ఒక వేళ అలా వచ్చిన వారు ఎవరైనా ఇలా దివాలా తీస్తే వారికి నష్టం కలగకుండా చూసేందుకు దివాలా, ఐపి నిబంధనలను కూడా సరళతరం చేస్తామన్నదే మన పరిశ్రమల శాఖ కార్యదర్శి వివరణ ఆంతర్యం. వీటికి సంస్కరణలని ముద్దు పేరు. మన దేశానికి ఈస్టిండియా కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్‌, పోర్చుగీసు, డచ్‌, ఫ్రెంచి వారందరూ సులభంగా వ్యాపారం చేసుకొనేందుకే కదా వచ్చారు. వారికి నాటి మన రాజులు, రంగప్పలు సులభంగా అనుమతులు ఇవ్వబట్టే కదా ఏకులా వచ్చి మేకులా మారి మన తలపై కూర్చున్నారు. మరి దానికీ దీనికీ పెద్ద తేడా ఏమిటి అన్నది మౌలిక ప్రశ్న. నాడు వంశపారంపర్య రాజులు అనుమతిస్తే నేడు వారి స్ధానంలో ప్రజలెన్నుకున్న ప్రభువులు ఇవ్వటం తప్ప మరొకటి ఏమైనా వుందా ? విదేశీ కంపెనీలను అనుమతిస్తే అవి మన మూలుగులను పీల్చి పిప్పి చేయటమే కాదు, మన మీద పెత్తనం చెలాయిస్తాయని నాటి మేథావి వర్గానికి తెలిసినా లేదా వేదాల్లో అవి కూడా రాసి వున్నాయని నాటి సంస్కృత పండితులు ఎవరికైనా అనుమానం వచ్చినా కచ్చితంగా వ్యతిరేకించి వుండేవారు. కానీ ఇప్పుడు అన్నీ వేదాల్లో వునాయష అని చెబుతున్నవారు, చరిత్రను తిరగేసి మరగేసి చూసిన మేథావులనబడేవారు కూడా విదేశీ కంపెనీలకు స్వదేశీ ఎర్రతివాచీ పరిచి, దేశ భక్తి భాజా భజంత్రీలతో స్వాగతం పలుకుతున్నారు. నాడు తెలియక చేస్తే నేడు తెలిసి చేస్తున్నారు. దీనికి భిన్నమైనదేమైనా వుంటే చరిత్రకారులు, మేథావులు చెప్పాలి.

    ప్రపంచబ్యాంకును సంతృప్తి పరచటం అంటే అది ప్రాతినిధ్యం వహించే అంతర్జాతీయ కార్పొరేేట్ల అక్కర తీర్చటమే. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌తో నరేంద్రమోడీ పోటీ పడుతున్నారు. తానే పెద్ద సంస్కరణ వాదిని అని నిరూపించుకొనేందుకు తహతహలాడుతున్నారు. సింగ్‌ గారి హయాంలో అంటే 2012లో సరళతర వ్యాపారంలో మన దేశ ర్యాంకు 131 అన్న విషయం గుర్తు చేయటం అవసరం.http://www.thehindu.com/business/Economy/india-slips-in-ease-of-doing-business-list-world-bank/article5286594.ece తరువాత అది 134కు పడిపోయింది.అందువలన ఈ ర్యాంకులను చూసి లేదా చూపి పాలకులు తాము సాధించిన ఘనత అని చెప్పుకుంటే జనాన్ని మోసం చేయటం తప్ప మరొకటి కాదు. ప్రతి ఏటా ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకులు కేటాయించే పద్దతులలో మార్పులు చేస్తూ వుంటుంది. దేశాల సంఖ్య కూడా మారిపోతూ వుంటుంది. నిజానికి ఇదొక అంకెల గారడీ. మన దేశ ర్యాంకు పెరగటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న అంశాలలో విద్యుత్‌ సరఫరా, కనెక్షన్ల ప్రక్రియను సులభతరం చేయటం ప్రధానంగా పని చేస్తున్నది.

  మన దేశంలో వ్యవసాయానికి విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వటానికి రైతాంగాన్ని ఎంత సతాయిస్తారో తెలిసిందే. కానీ అదే పారిశ్రామికవేత్తల విషయానికి వస్తే పరిశ్రమ పెట్టకుండానే కనెక్షన్‌ సిద్ధం అన్నట్లుగా వుంటుంది. వుపాధి కల్పిస్తున్నదనే పేరుతో దానికి రాయితీలు అదనం. మన పాలకులు ప్రతి ఏటా అన్ని లక్షల కోట్లు ,ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులుగా తెచ్చామని ఎంత వూదర గొడుతున్నప్పటికీ మన దేశంలో విద్యుత్‌ వినియోగంలో పరిశ్రమల వాటా తగ్గిపోతున్నది.2012లో 32శాతం వుండగా 2014నాటికి 29శాతానికి పడిపోయింది. దానిలో స్వల్ప మార్పు లేదా స్ధిరంగా వుంటున్నది తప్ప పెరగటం లేదు. దానికి కారణాలలో పరిశ్రమల మూత, ఖాయిలా ఒక ప్రధాన కారణం,అయితే వాటి స్ధానంలో కొత్తవి రాకపోవటం మరొకటి. విద్యుత్‌ సరఫరా మెరుగు పడటానికి గతంలో శంకుస్థాపన చేసిన అనేక విద్యుత్‌ కేంద్రాలు ఈ రెండు సంవత్సరాల కాలంలో వుత్పాదన ప్రారంభించటం కూడా ఒకటి. అందువలన సరేంద్రమోడీ సంస్కరణలకు దీనికి సంబంధం వుందని చెప్పలేము.

   గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ దేశమంతటా చేసిన ప్రచారంలో గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి ఒకటి. ఎన్నికలు ముగిసిన తరువాత ఒక్కసారి కూడా దాని గురించి మాట్లాడినట్లు ఎక్కడా నేను వినలేదు. తిరిగి వచ్చే ఎన్నికలలో చెబుతారేమో తెలియదు. ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ సంక్షేమాన్ని తాము తప్ప మరొకరు పట్టించుకోరు అని అక్కడ ఎన్నికల సభల్లో చెబుతున్నారు.http://indianexpress.com/article/business/economy/gujarat-clocks-over-48000-sick-msme-units-in-2014/ నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా వుండి గుజరాత్‌ను ఎలా అభివృద్ధి చేశారో పై వార్తను చూస్తే ఆ ప్రచార బండారం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 2014లో రిజర్వుబ్యాంకు రూపొందించిన సమాచారంతో చిన్న, సన్నకారు, మధ్యతరగతి పరిశ్రమల శాఖ లోక్‌సభలో మోడీ సర్కారే ఒక ప్రశ్నకు సమాధానంగా విడుదల చేసిన సమాచార సంక్షిప్త వివరాలు ఇలా వున్నాయి. 2014 మార్చి ఆఖరు నాటికి వుత్తర ప్రదేశ్‌లో 63,268, గుజరాత్‌లో నమోదైన చిన్న, సన్నకారు పరిశ్రమలలో ఐదో వంతు అంటే 48,000 ఖాయిలా పడ్డాయి. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పాలన చివరి సంవత్సరంలో మూత పడిన వాటి సంఖ్య 20,452 నుంచి 48వేలకు పెరిగాయి. అంతకు ముందు 2011లో ఖాయిలా యూనిట్లు 4321 మాత్రమే. 2013 సచేతన గుజరాత్‌( వైబ్రంట్‌ గుజరాత్‌) పేరుతో నిర్వహించిన హంగామాకు ముందు స్వయంగా గుజరాత్‌ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం కేవలం ఐదుశాతం మాత్రమే చిన్న పరిశ్రమలు ఖాయిలా పడ్డాయి. కానీ సచేతన గుజరాత్‌ వుత్సవాల సందర్భంగా తీసిన లఘుచిత్రాలలో చిన్న పరిశ్రమలు ఎంతో గొప్పగా వున్నట్లు చిత్రించారు. ఏ ఏటికాయేడు ఎన్నో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవగాహనా ఒప్పందాలు జరిగినట్లు అంకెలను ప్రకటించారు.

   నరేంద్రమోడీయే సచేతన గుజరాత్‌ పేరుతో అంత హడావుడి చేసి చిన్న పరిశ్రమల మూతకు పుణ్యం కట్టుకుంటే అంతకంటే పెద్ద జాదూతనంతో అలరిస్తున్న చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌ వారి వారసులు తెస్తున్నట్లు చెబుతున్న పెట్టుబడుల గురించి చెప్పాల్సిందేముంది. రాష్ట్రాలలో వాణిజ్య సంస్కరణల విషయమై ర్యాంకుల గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు.అసలు పరీక్ష రాయకుండానే మొదటి ర్యాంకులు ఎలా తెచ్చుకుంటారో ఇటీవల మనం చూశాం. అందువలన రాష్ట్రాల ర్యాంకులు కూడా అదే విధంగా వున్నాయా ?ఏమో తెలియదు. ప్రస్తుతం 99.09శాతంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు రాష్ట్రాలు మొదటి ర్యాంకులో వున్నాయట. ప్రశ్నా పత్రం ముందే లీకైతే తప్ప ఒకే మార్కులు ఎలా సాధ్యం అన్న అనుమానం ఎవరికైనా రావచ్చు.ఈ ఏడాది ర్యాంకులను త్వరలో ప్రకటించనున్నట్లు వార్తలు. ర్యాంకులు అనేవి సాధించిన విజయాలుగా ప్రచారం చేసుకోవటానికి తప్ప సామాన్య జనానికి కల్పిస్తున్న వుపాధి, మరొక ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. ఒక పాత సినిమాలో మీలో పెద్ద వెధవను నేను ప్రేమిస్తాను అంటే ఎవరు ఎలాంటి ‘ఘనకార్యం’ చేశారో చెప్పుకొనేందుకు పోటీ పడతారు. ఇక్కడ మెరుగైన వాణిజ్య వాతావరణం అంటే గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన నీకది, నాకిది పద్దతిలో వాటాల లెక్కలను మరింత పకడ్బందీగా అమలు జరపటం, ప్రజల సొమ్మును పంచుకోవటం తప్ప మరొకటి కాదని ఇప్పటికే తెలుగు జనాలందరికీ అర్ధం అయింది. రాబోయే రోజుల్లో ఈ పోటీ మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు.