Tags

, , ,

ఎంకెఆర్‌

   ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని ఒడిషా మల్కన్‌గిరి జిల్లాలోని బలిమెల ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్న ఎన్‌కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టు నక్సల్స్‌ దుర్మరణం చెందారు. ఆ పార్టీకి ఇదొక పెద్ద దెబ్బ, విషాద, విచారకర వుదంతం. ఎప్పటి మాదిరే విరసం నాయకులు బంధుమిత్రులతో కలసి ఆ ప్రాంతానికి వెళ్లి గుర్తించిన మృతదేహాలను తీసుకువచ్చారు. అది ఎన్‌కౌంటర్‌ కాదు నిదురపోతున్నవారిని కాల్చి చంపారని చెబుతున్నారు. లేదు ఎన్‌కౌంటర్లన్నీ తెల్లవారు ఝామునే జరుగుతాయి కనుక అది వాస్తవ ఘటనే అని ఆంధ్రప్రదేశ్‌ డిజిపి ప్రకటించారు. ఎవరే డిమాండ్లు చేసినా, ఎన్‌కౌంటర్‌గా చెబుతున్న వుదంతంపై విచారణ జరపని కోరినా ఈవాళపోతే రేపటికి రెండు అన్నట్లుగా గతంలో జరిగినట్లు చెప్పిన ఎన్‌కౌంటర్ల తరువాత ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోందని జనం భావిస్తున్నారు. ఏం జరిగినా పట్టించుకోకపోవటం జనానికి అలవాటయి పోయిందా, అంగీకరిస్తున్నారా అన్న సందేహం కొంతమందికి కలుగుతోంది. ఇంత పెద్ద సంఘటన జరిగినపుడు మావోయిస్టు సానుభూతి పరులకే ఈ అనుమానం రానక్కర లేదు, వారి రాజకీయాలు, ఆచరణతో విబేధించేవారిలో కూడా ఏం జరుగుతున్నా జనం పట్టించుకోవటం లేదేమిటన్న ఆలోచన రావటం సహజం. అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు, మత కొట్లాటలకు పాల్పడుతున్నదెవరో, నేరగాళ్లెవరో, మంచివారెవరో అరటి పండు వలచి చేతిలో పెట్టినట్లుగా తెలిసినా ఎన్నికలలో జనం ఏం చేస్తున్నారో చూస్తున్నదే. తమ పొట్టకొడుతున్నా, కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా మనకెందుకులే అని వెళ్లిపోవటం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు దుర్బేధ్యమైన అడవులలో జరిగిందని చెబుతున్న ఘటనల గురించి, నిర్ధారణ కాకుండా అందునా పోలీసులకు వ్యతిరేకంగా జనం స్పందిస్తారని ఆశించగలమా ? వూహించగలమా ?రెండు వైపులా విశ్వసనీయత సమస్య లేదా ?

    తమపై లేదా గిరిజనులపై జరుపుతున్నదాడులకు ప్రతీకారంగా లాండ్‌మైన్‌లు పేల్చి, దాడులు చేసి, బలిమెల జలాశయంలో లాంచీపై దాడిచేసి పోలీసులను, ప్రత్యేక దళాలను, తమ గురించి సమాచారం ఇచ్చిన పోలీసు ఇన్ఫార్మర్లను ప్రజాకోర్టులో విచారించి ప్రజలే హతమార్చినట్లు నక్సల్స్‌ చేసిన ప్రకటనలను కూడా పోలీసులు చెప్పే ఎన్‌కౌంటర్ల మాదిరే జనం ఒకే విధంగా స్వీకరించటానికి అలవాటు పడిపోయారన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో అలాంటి ఘటనలు జరగటం లేదు గానీ గతంలో పలు ప్రాంతాలలో సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీల నాయకులను కూడా ప్రజలే చంపివేసినట్లు ప్రకటించినపుడు, ఒక దశలో తమతో విభేదించిన వారందరికీ రివిజనిస్టులనే ముద్రవేసి నక్సలైట్లు ఏ గ్రూపు వారు ఎవరిని ఎందుకు చంపుతున్నారో తెలియని గందరగోళ సమయంలో, అమాయకులైన కాకతీయ రైలు ప్రయాణీకులను సజీవ దహనం చేసినపుడు కూడా జనం మామూలుగానే తీసుకున్నారు. తరువాత ప్రయాణీకులను చంపటం తప్పిదమేనని ప్రకటించటాన్ని కూడా అలాగే తీసుకున్నారు. కోవర్టులు పోలీసులలో వున్నట్లే నక్సల్స్‌లో కూడా వుండటం కూడా మామూలేనని జనం భావించటం సాధారణమైపోయింది. గతాన్ని విస్మరించి జన స్పందన గురించి ఆలోచిస్తే ప్రయోజనం వుంటుందా ? బెంగాల్లో సిపిఎంకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ వంటి వారికి మద్దతు ఇచ్చి జనాన్ని సానుకూలంగా స్పందింప చేసిన విషయం తెలిసిందే. ఆమె ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీని(మల్లోజుల కోటేశ్వరరావు) మట్టుబెట్టించినపుడు కూడా అదే జనం అదే విధంగా స్పందించటాన్ని చూశాము.

   తాము విశ్వసించని వ్యవస్ధను, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని హతమార్చటానికి తమకు హక్కుందని తిరుగుబాటుదారులు చెప్పినపుడు, రాజ్యానికి వ్యతిరేకంగా వున్న తిరుగుబాటుదారులను అదుపులోకి తెచ్చేందుకే తామున్నట్లు రాజ్యవ్యవస్ధ, దాని అంతర్భాగాలు చెప్పినపుడు ఎవరి వాదన వారికి సరైనదిగానే జనం భావిస్తున్నారు. తమ కులం వాడైతే గూండా అయినా, రౌడీ అయినా, అవినీతి, పార్టీ ఫిరాయింపు రాజకీయ నాయకుడు, వుద్యోగి ఎవరైనా సమర్ధించే దుస్థితిలో వున్నాం. చరిత్రలో అనేక మంది తిరుగుబాటుదార్లను రాజ్యవ్యవస్ధ అణచివేసినపుడు జనం పెద్ద ఎత్తున స్పందించి వీధులలోకి వచ్చిన వుదంతాలు ఎన్నో వున్నాయి. ఇప్పుడయినా మరొకపుడైనా అలాంటి స్పందన రావటం లేదంటే జనానికి ఏమైందని వారి గురించి ఆలోచించ వద్దని కాదు గానీ దానితో పాటు రెండోవైపు నుంచి ఏదైనా లోపమున్నదా అని అవలోకించాల్సిన అవసరం లేదా ? సాధారణ జనం కంటే తిరుగుబాట్లను, తిరుగుబాటుదార్లను సమర్ధించేవారు, వారి చర్యల ద్వారా ఏదో సాధించామని నమ్ముతున్నవారు మరింత ఎక్కువగా అంతర్మధనం చేసుకోవాలి.

    మల్కన్‌గిరి వుదంతానికి ప్రతీకారంగా మావోయిస్టులు రాసినట్లు చెబుతున్న లేఖ గురించి కూడా చర్చ జరుగుతున్నది. దానిలో వాడిన భాష, పేర్కొన్న ప్రతీకార చర్యలను చూస్తే అది రాసింది నక్సల్స్‌ కాదని మీడియాలో వార్తలు వచ్చాయి. కాదు మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల వారే దానిని రాశారని విశాఖ ఎస్పీ వెంటనే ప్రకటించారు. వివిధ సందర్బాలలో పోలీసులు అనుసరించే పద్దతుల ప్రకారం నకిలీ లేఖలు తయారు చేసి మీడియాకు పంపి జనాన్ని తప్పుదారి పట్టించటం, గందరగోళ పరచటం, తమ చర్యలను సమర్ధించుకోవటం బహిరంగ రహస్యం. బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగినపుడు మావోయిస్టు లేదా ఇతర నక్సల్స్‌ నుంచి ఇలాంటి లేఖలు రావటం కూడా సాధారణమే. అందువలన దాన్ని నిర్ధారించటం కష్టం. ఒక వేళ పోలీసులే రాసి వుంటే దానిలోని ఆత్మాహుతి దాడి, కుటుంబ సభ్యుల ప్రస్తావన ఇంతవరకు లేని కొత్త ఆలోచనలను కలిగించటం, ముందుకు తేవటం తప్ప వేరు కాదు. ఒక వేళ నిజంగా నక్సల్సే రాసి వుంటే తీవ్రమైన ఎదురు దెబ్బతగిలిందన్న కసితో కొత్త పద్దతుల్లో దాడులకు పూనుకుంటారని అనుకోవాల్సి వుంటుంది.