Tags

, , , , ,

ప్రపంచీకరణ – పర్యవసానాలు -1

ఎం కోటేశ్వరరావు

   ప్రపంచంలో నిత్యం అనేక అంశాల గురించి చర్చలు జరుగుతూనే వుంటాయి. చర్చ అంటేనే విరుద్ధ అంశాల మధనం. పురాణాలలో చెప్పిన దాని గురించి నమ్ముతున్నారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే నమ్మే వారు చెప్పిన క్షీర సాగర మధనం అమృతం కోసమే జరిపినప్పటికీ ఆ క్రమంలో అనేకం బయట పడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన మధనం ప్రపంచీకరణ లేదా దాని మరోపేరు సరళీకరణ ఫలితాలు, పర్యవసానాల గురించే అన్నది తెలిసిందే. నేతి బీరకాయలో నెయ్యి మాదిరి దానికి పెట్టిన పేరు వుదారవాదం. పెట్టుబడిదారీ విధానం దుష్టమైందన్న పేరు బాగా ప్రాచుర్యంలోకి రావటంతో ఎంతో తెలివిగా దాని పేరు మార్చారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ప్రపంచవాణిజ్య సంస్ధ ఇలా అనేకం ఏ పేరుతో పని చేసినా కార్పొరేట్ల లాభాలను, ఆ వ్యవస్ధను కాపాడే రూపాలు, ఆయుధాలే. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఎన్ని అవతారాలేత్తినా దుష్ట సంహారం కోసమే అని చెప్పినట్లుగా పెట్టుబడిదారులు కూడా కార్మికవర్గాన్ని దోచుకొనేందుకు వర్తమానంలో ఎత్తిన అవతారమే ప్రపంచీకరణ. దానిపై జరుగుతున్న మధనంలో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

   ప్రపంచబ్యాంకు 2017వ సంవత్సరానికి మనకు ప్రధానం లేదా దానం చేసిన వ్యాపార ర్యాంకు 131, అంతకు ముందు సంవత్సరం 130 వుంది.మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు బాధ పడి నట్లుగా మన ప్రధాని, కేంద్ర మంత్రుల పరిస్థితి తయారైందంటే అతిశయోక్తి కాదు. ఎలాగంటే మన దేశం ఒక ర్యాంకును మెరుగుపరచుకుంటే పొరుగుదేశం పాకిస్థాన్‌ 148 నుంచి 144కు పెరిగి నాలుగు స్ధానాల ఎగువకు వెళ్లింది. చైనా 80 నుంచి 78 కి పెంచుకొని తన స్ధానాన్ని మెరుగు పరుచుకుంది. దాంతో మన కంటే ఇతర దేశాలు మంచి సామర్ధ్యాన్ని ప్రదర్శించినట్లే అనే కొందరు చేసిన వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లయింది. తాను అనేక సంస్కరణలను చేపట్టినా ప్రపంచబ్యాంకు వాటిని ఎందుకు పట్టించుకోలేదు, గతేడాది కంటే మన ర్యాంకును గణనీయంగా ఎందుకు పెంచలేదు అని ప్రధాని నరేంద్రమోడీ ఒక రాత్రంతా తనలో తాను తెగ మధన పడిపోయారు. తన మంత్రులు, అధికారులతో కూడా మధించి నెలరోజుల్లో నివేదిక ఇమ్మని ఆదేశించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన ర్యాంకు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ను మరింత కుంగదీసింది. రానున్న కొద్ది సంవత్సరాలలో మన ర్యాంకు 50కి చేర నుందని ఈ ఏడాది మే నెలలోనే ఆమె ఆనందంగా ఆశాభావం వెలిబుచ్చారు. తీరా దరిదాపుల్లో లేకపోవటంతో తీసుకున్న చర్యలన్నీ ప్రపంచబ్యాంకు విధించిన గడువులోగా అమలులోకి రానందున వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, వచ్చే ఏడాది ర్యాంకులో ఫలితం కనిపిస్తుందని ట్వీట్‌ చేశారు.

మోడీ బృందం ఎందుకు భంగపాటుకు గురైంది ? నిజానికి ఈ ర్యాంకులు అంకెల గారడీ తప్ప మరొకటి కాదు. మన విద్యావిధానాల మాదిరి ఒకేడాది నిర్ణయించిన ప్రమాణాలు మరొక ఏడాది వుండవు. వాటికి ఇచ్చే మార్కులు కూడా అంతే. కొన్ని ర్యాంకుల తీరుతెన్నులను గమనించండి. నా చిన్న తనంలో గ్రామాలలో బుర్ర కథలు, హరికథల వంటి కళారూపాలను ప్రదర్శించే వారు తమకు మంచి భోజనాలు, భారీ ఎత్తున ధన ధాన్యాలతో సత్కారాలు పొందేందుకు ఏ వూరు వెళితే ఆ వూరి వారిని వుబ్చించేవారు. చుట్టుపక్కల 66 వూళ్లకు మీ వూరు పోతుగడ్డ అని చెప్పగానే నిజమే కావాలనుకొని ప్రతి వూరి వారూ నరేంద్రమోడీ చెప్పినట్లు రొమ్ములు చరుచుకొనే వారు. తమ వ్యాపారాలకు రాయితీలు పొందేందుకు, సులభంగా అనుమతులు సంపాదించుకొనేందుకు కాస్త రూపం మార్చి ‘పోతుగడ్డ’ టెక్నిక్‌ను వాడుతున్నారు.

ఆ క్రమంలో గత రెండున్నర సంవత్సరాలలో అనేక సంస్ధలు నరేంద్రమోడీ సర్కార్‌ను ఆకాశానికి ఎత్తుతున్నాయి. ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్‌ ఒక్కసారిగా 16 దేశాలను దాటి 39వ ర్యాంకుకు చేరినట్లు ప్రపంచ ఆర్ధిక వేదిక( డబ్ల్యుఇఎఫ్‌ ) ప్రకటించింది. చంద్రబాబు నాయుడు వంటి వారికి ఇదొక పవిత్ర స్ధలం. ప్రతి ఏటా వెళ్లి వచ్చి ఆర్భాటం చేస్తుంటారు. వెళ్లి రావటం ఒక ఘనతగా ప్రచారం చేసుకుంటారు. అవినీతి విషయంలో అవినీతి విషయంలో ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్ధ సూచికలో ఏకంగా భారత్‌ తొమ్మిది పాయింట్లను మెరుగుపరచుకుందని వార్తలు వచ్చాయి. http://timesofindia.indiatimes.com/india/Indias-ranking-on-global-corruption-index-improves/articleshow/45358144.cms  చిత్రం ఏమిటంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరునెలలు పూర్తి అవుతున్న సమయంలో ఈ ర్యాంకుల ప్రకటన జరిగింది. దాని ప్రకారం మన్మోహన్‌ సింగ్‌ అధికార చివరి సంవత్సరం 2013లో 94వ ర్యాంకులో వుండగా 2014లో 85వ స్ధానానికి మెరుగుపరచుకుంది. దీనికి మోడీ ప్రభుత్వం తీసుకున్న అవినీతి రహిత చర్యలే కారణమంటూ ఆయన భక్తులు బాపు సినిమా ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు ఏర్పాట్లను గుర్తు చేశారు. మరుసటి ఏడాదికి ఆ ర్యాంకు 76కు చేరింది. మరో తొమ్మిది ర్యాంకులను పెంచారు.http://www.transparency.org/cpi2015#results-table  ఇది ఆ సంస్ధ అధికారిక వెబ్‌సైట్‌ చిరునామా. దీని ప్రకారం 2012,13 మనకు వచ్చిన మార్కులు నూటికి 36, మోడీ హయాం 2014,15లో వచ్చినవి 38. ఇదే సమయంలో పాకిస్థాన్‌ 27 నుంచి 30కి పెంచుకుంది. మిగిలిన దేశాలలో అవినీతి పెరిగి మన ర్యాంకు మెరుగుపడింది తప్ప మన మార్కులు పెరిగి కాదన్నది స్పష్టం అవుతోంది.

ఇక కొత్త కల్పనల సూచిక వరుసగా ఐదు సంవత్సరాలు పడిపోతూ వున్నది కాస్తా 81నుంచి 2015లో 66కు పెరగటం కూడా నరేంద్రమోడీ ఘనతే అని చెప్పారు.http://www.dnaindia.com/money/report-india-s-rank-on-global-innovation-index-improves-to-66-2247413 కొత్త కల్పనలు రహస్యంగా వుండేవేమీ కాదు. దేశ ప్రజలకు తెలియకుండా అల్లా వుద్దీన్‌ అద్బుత దీపం ఏమైనా మోడీ సర్కార్‌కు దొరికిందా అన్న అనుమానం వచ్చింది. మంత్రులు చెప్పేది, మీడియాలో వచ్చే వార్తలు ఎలా వుంటాయో తెలుసు కనుక సంస్ధ అధికారిక వెబ్‌ సైట్‌ను ఆశ్రయిస్తే http://www.wipo.int/edocs/pubdocs/en/economics/gii/gii_2013.pdf ప్రకారం 2013లో మనకు వచ్చిన మార్కులు 36.17 శాతంగానూ ర్యాంకు 66గానూ దర్శన మిచ్చింది. దీంతో మరింత ఆసక్తి పెరిగి 2016 ర్యాంకింగ్‌ల కోసం చూస్తే దానిలో మన మార్కులు 33.61శాతానికి తగ్గినా ర్యాంకు మాత్రం 66గానే వుంది. ఇదే సమయంలో మన ఇరుగు పొరుగుదేశాల స్ధితి ఎలా వుంది అన్న సందేహం కలగటం సహజం కదా ! పాకిస్తాన్‌ 23.33 మార్కులు, 137 ర్యాంకు నుంచి 22.63 మార్కులు 119వ ర్యాంకుకు మెరుగు పడింది. ఇదే సమయంలో చైనా విషయానికి వస్తే తన మార్కులు 44.66, ర్యాంకు 35 నుంచి 50.57 ర్యాంకు 25 తెచ్చుకుంది.

వివిధ వసతుల కల్పనాంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచబ్యాంకు లాజిస్టిక్స్‌ సామర్ధ్య సూచికలను ప్రకటిస్తుంది.http://www.dnaindia.com/money/report-india-moves-up-to-35th-rank-on-world-bank-s-logistics-performance-index-2230168 దీని ప్రకారం 2014లో 54వ స్ధానంలో వున్నది కాస్తా 2016 నాటికి 35వ ర్యాంకుకు చేరిందని ప్రశంసలు కురిపించారు. ప్రపంచబ్యాంకు రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే వివరాల ప్రకారం 2007లో మన ర్యాంకు 39, మనకు వచ్చిన మార్కులు 3.07, 2012లో 46 -3.08, 2014లో 54 – 3.08, 2016లో 35 -3.42 వచ్చాయి. మార్కులలో పెద్ద తేడాలు లేకపోయినప్పటికి 2007-14 మధ్య ర్యాంకు 39 నుంచి 54కు పడిపోయింది. అందువలన ఈ ర్యాంకుల గురించి సంబరపడి, అది తమ సామర్ధ్యమే అని చెప్పుకుంటే అంతకు మించి జనాన్ని మోసం చేయటం మరొకటి వుండదు.

ఇక సులభతర వాణిజ్య ర్యాంకుల విషయానికి వస్తే 2007లో మనకు వచ్చిన ర్యాంకు 116 అక్షరాలా నూట పదహారు. అది 2014 నాటికి 142కు పడిపోయింది. ర్యాంకులు కేటాయించిన పద్దతిని ప్రపంచబ్యాంకు సవరించటంతో అది 134గా నిర్ధారణ అయింది. 2015 జూన్‌ నాటికి మన ర్యాంకు 130కి మెరుగు పడింది, తరువాత దానిని 131కి సవరించారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన ర్యాంకు 130 అంటే ఎదుగూ బొదుగూ లేకుండా వుండి పోయింది. ఇది జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యవేత్తలలో నరేంద్రమోడీ పలుకుబడిని తగ్గించేది లేదా అనుమానాలను రేకెత్తించేది కనుకనే నరేంద్రమోడీ, ఆయన మంత్రులు అంతగా కంగారు పడుతున్నారు.

    ప్రపంచీకరణ అంటే విదేశీ సంస్ధలు మన దేశంలో సులభంగా వ్యాపారం చేసుకొనే అవకాశాలను కల్పించటం, దానికి ప్రశంసగా ప్రపంచబ్యాంకు ఇచ్చే ర్యాంకుల పిచ్చి ముదిరి వాటి కోసం మన ప్రధాని, దానికి అనుకరణగా కేంద్రం ప్రవేశ పెట్టిన ర్యాంకు కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. అదింతటితో ఆగదు, మరిన్ని పర్యవసానాలకు దారితీస్తుందని గుర్తించాలి. ప్రపంచ పెట్టుబడిదారులకు మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా తెరిచేందుకు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోనున్నారు.

    ప్రస్తుతం ప్రపంచీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నది ఎవరు అంటే కొంత మంది విశ్లేషణ ప్రకారం ధనిక దేశాలలోని కార్మికవర్గం, దానితో పాటు అక్కడి పెట్టుబడిదారీ వర్గం అంటే అతిశయోక్తి కాదు. గతంలో వర్ధమాన, తృతీయ ప్రపంచ దేశాలలో ప్రపంచీకరణకు వ్యతిరేక గళాలు బలంగా వినిపించాయి, ఇప్పటికీ అడపాతడపా వినిపిస్తూనే వున్నాయి. అయితే గతం మాదిరి పెద్ద ఎత్తున లేవన్నది వాస్తవం. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గతంలో మాదిరి సామాజిక వేదికల (సోషల్‌ ఫోరాలు) సదస్సులు ఇప్పుడు జరగటం లేదు, వెనుక పట్టు పట్టాయి. అవి సాధించిన విజయాలేమిటి ? వాటికి వున్న పరిమితులు ఎంతవరకు అన్న విషయాలను ఇక్కడ విశ్లేషించటం లేదు. మొత్తం మీద ప్రపంచీకరణ కోరుకున్న పెట్టుబడిదారులు, వారి సమర్ధకులదే పైచేయిగా వుంది, దానితో లాభాలు పొందవచ్చని కార్పొరేట్లు భావిస్తున్న కారణంగానే మరింతగా సంస్కరణల పేరుతో చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అందుకు నరేంద్రమోడీ సమర్ధకుడు అని భావించిన కారణంగానే గద్దెనెక్కించటమే గాక, తమ చేతులలో వున్న ప్రచార మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున వూదరగొడుతున్నారు. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగిన వుద్యమాలు సాధించిన ఫలితాలు, కార్మికులు కోల్పోయిన వాటి గురించి, పర్యవసానాల గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి వుంది. కండ్లు లేనివారు ఏనుగును వర్ణించినట్లుగా ఎవరికి వారు తమ అనుభవంలోకి వచ్చిన అంశాల గురించి రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. వాటన్నింటినీ కొట్టి వేయలేము, అలాగని వాటినే అంతిమ నిర్ధారణలుగా అంగీకరించలేము. అందువలన ఆ పరిమితులకు లోబడి ఈ సందర్భంగా కొన్ని విషయాలను పాఠకుల దృష్టికి తెస్తున్నాను.

     కొద్ది నెలల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలా వద్దా అనే విషయమై బ్రిటన్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. దానిలో ఎక్కువ మంది వైదొలగటానికే మొగ్గు చూపారు. సభ్య దేశాలపై పొదుపు చర్యల పేరుతో కార్పొరేట్ల లాభాలలో కోత పడకుండా చూసేందుకు ఐరోపా యూనియన్‌ రుద్దిన పొదుపు చర్యలకు జనంలో వ్యతిరేకత వ్యక్తం కావటంతో పాటు, ఒక యూనియన్‌లో వుండి దాని తరఫున ఒక సభ్య దేశంగా ప్రపంచ మార్కెట్‌ వాటాను పరిమితంగా పంచుకోవటం కంటే విడిగా వుండి ఎక్కువ వాటాను తెచ్చుకోవచ్చన్న బ్రిటన్‌ కార్పొరేట్ల వత్తిడికూడా ఈ నిర్ణయాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ముగిసిన ప్రచారంలో కూడా వాణిజ్యంపై చర్చకు పెద్ద పీట వేయటం, ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి అమెరికా బయటకు రావాలని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించటం, కెనడా-ఐరోపా యూనియన్‌ మధ్య చర్చలలో వున్న సమగ్ర ఆర్ధిక, వాణిజ్య ఒప్పందం(సిఇటిఏ) పట్ల వెల్లడౌతున్న వ్యతిరేకత ధనిక దేశాలలో ప్రపంచీకరణకు కార్మికవర్గం కంటే పెట్టుబడిదారీ వర్గంలోనే పెరుగుతున్న వ్యతిరేకతను సూచిస్తోంది. ఇది ఆయా దేశాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధల రక్షణాత్మక చర్యలకు దారితీస్తోంది. ధనిక దేశాల నుంచి ప్రారంభమైన ఈ క్రమం అన్ని దేశాలకు తరతమ తేడాలతో విస్తరించటం అనివార్యం.

    ఒక తత్వం ప్రకారం ఎప్పుడూ ప్రపంచీకరణ అనుకూలత, ప్రపంచీకరణ వ్యతిరేకత వ్యక్తమౌతూనే వుంటాయి. రుతువుల మాదిరి పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాంద్యాలు రావటం, దాని నుంచి ఏదో విధంగా బయట పడటం సైకిలు చక్రం మాదిరి ఒకదాని వెంట ఒకటి సంభవిస్తుంటాయి. దాని పర్యవసానాలు ప్రపంచీకరణ మీద పడతాయి. గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ పర్యవసానంగా ధనిక దేశాలలో నష్టపోయిన సాంప్రదాయ మధ్యతరగతి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో వుంది.లబ్ది పొందిన వారిలో ప్రస్తుతం ప్రపంచీకరణ విధానానికి వున్న పరిమితులు తమ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా ప్రదర్శించటానికి వీలు కల్పించటం లేదనే తరగతి కూడా అదే ధనిక దేశాలలో ప్రపంచీకరణను మరొక వైపు నుంచి విమర్శిస్తుంది. ప్రపంచీకరణ విధానాన్ని కనిపెట్టిన వారు దాని పర్యవసానాలను వూహించలేకపోయారు. ప్రపంచీకరణ ఆర్ధిక అసమానతలను జెట్‌ వేగంతో పెంచింది. ఫలితంగా వలసలు పెరిగిపోయాయి. వలసలకు ఇతర అనేక కారణాలు వున్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం ప్రపంచీకరణే. ఇది కొన్ని దేశాల నుంచి వలసలను పెంచితే మరికొన్నింటి నుంచి తగ్గించిందని కూడా వెల్లడైంది. శ్రమను కారుచౌకగా ఆమ్ముకొనే వలస కూలీలను ప్రోత్సహించటం కూడా ప్రపంచీకరణలో భాగమే అన్నది ఇక్కడ మరిచి పోరాదు. ధనిక దేశాలలో ప్రపపంచీకరణ తెచ్చిన అసంతృప్తికి, పేద దేశాల నుంచి సామూహికంగా వస్తున్న వలస కార్మికుల సమస్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.2008లో ప్రారంభమైన ధనిక దేశాల ఆర్ధిక మాంద్యం సమస్యను మరింత సంక్లిష్టం గావించింది. అనేక చోట్ల నిరుద్యోగం, దారిద్య్రం, వేతనాలలో కోతలు పెరిగిపోయాయి. పర్మనెంటు వుద్యోగాలు తగ్గి తక్కువ వేతనాలు లభించే తాత్కాలిక వుపాధిలో చేరే పరిస్థితికి కార్మికవర్గం చేరింది. ఇవన్నీ ప్రపంచీకరణ ఫలితమే అని భావించటంతో ధనిక దేశాలలో వ్యతిరేక గళం వినిపించటం ప్రారంభమైంది. ఇది ఒక కోణం. మరోవైపు నుంచి పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కూడా పర్యవసానాలు ప్రతికూలంగా తయారయ్యాయి. అదెలా వుందో తాజాగా వెల్లడైంది.

    ఇటీవల రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకానమీ, ట్రేడ్‌, ఇండస్ట్రీ అనే సంస్ధ ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది.http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html దానిలో వున్న వివరాల ప్రకారం ప్రపంచీకరణ వివిధ దేశాల మధ్య అసమాన లబ్దికి దారితీసింది. అలా లబ్ది పొందిన వాటిలో భారత్‌ ఒకటి, అయితే చైనాతో పోల్చితే చాలా తక్కువ ప్రయోజనం కలిగింది. ఈ లబ్ది పారిశ్రామికవేత్తలతో పాటు కార్మికవర్గానికి కూడా దక్కింది. ఎవరు ఎక్కువ అంటే ఈ కాలంలో దేశంలో పెరిగిన ఆదాయ, ఆర్ధిక అసమానతలు, పెరిగిన బిలియనీర్లను చూస్తే కార్మికుల కంటే పారిశ్రామిక, వాణిజ్యవర్గాలే ఎక్కువ లబ్ది పొందాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే నరేంద్రమోడీ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని వారంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ సంస్కరణలు కొత్త సమస్యలను తీసుకువస్తాయని తెలిసినప్పటికీ తక్షణం లాభదాయకంగా వుంది కనుక రాబోయే పర్యవసానాల గురించి వారు అంతగా ఆలోచించటం లేదు.అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా తిరుగులేని శక్తిగా అవతరించింది. జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది. తనకున్న ఆర్ధిక శక్తి కారణంగా స్వేచ్చా వాణిజ్య నిబంధనలు, విధానాన్ని మరింత గట్టిగా అమలు జరపాలని అది కోరుతోంది. దాని దెబ్బకు గిలగిలలాడుతున్న ధనిక దేశాలు తాము ముందుకు తెచ్చిన స్వేచ్ఛా వాణిజ్యవిధానాన్ని పక్కన పెట్టాలని కోరుతున్నాయనటానికి ముందే చెప్పినట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి వైదొలుగుతానని బెదిరించటం పక్కా నిదర్శనం. పైన పేర్కొన్న పరిశోధనా పత్రంలో ప్రపంచీకరణ పర్యవసానాల గురించి ఏం చెప్పారు ? వచ్చే భాగంలో చూడండి.