Tags

, , , , , , ,

ప్రపంచీకరణ పర్యవసానాలు-2

     ప్రపంచీకరణ గురించి రెండు అభిప్రాయాలు వున్నాయి. అది ప్రపంచానికి మంచి చేస్తుందని కొందరంటే చెడు చేస్తుందని మరికొందరు చెబుతారు. చరిత్రలో వర్గాలు లేనటు వంటి ఆదిమ సమాజాన్ని( దాన్నే ఆదిమ కమ్యూనిస్టు సమాజం అని కూడా పిలుస్తారు) మినహాయిస్తే సమాజంలో వర్గ విభజన జరిగినప్పటి నుంచి ప్రతి కొత్త దశలోనూ దాని మంచి చెడ్డలపై రెండు అభిప్రాయాలు వెలువడుతూనే వున్నాయి. బానిస, అర్ధబానిస లేదా ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ వ్యవస్థలన్నింటా ఒక వర్గానికి మేలు జరుగుతూనే వుంది. అలాంటి వారంతా దానిని కాపాడుకొనేందుకు అవసరమైన సాహిత్యం, మూఢనమ్మకాలు, నమ్మకాలు, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేశారు. నష్టపోయిన వర్గం ఆ వ్యవస్ధలను కూల్చివేసేందుకు, జనాన్ని కూడగట్టేందుకు తనదైన సాహిత్యం, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం చర్చనీయాంశంగా వున్న ప్రపంచీకరణ భావన, పద్దతుల గురించి కూడా ఇదే విధమైన రెండు రకాల సాహిత్యాలు వెలువడుతున్నాయి. ఒక గుణాత్మక మార్పు పరిమాణాత్మక మార్పుకు దారితీయాలంటే అందుకు అనువైన పరిస్థితులు తయారు కావాలి. ఆవిరి రావాలంటే నీరు వంద డిగ్రీల వుష్ణోగ్రత వరకు మరగాల్సిందే. ఆలోగా కుండ లేదా పాత్ర లోని నీటిలో అనేక మార్పులు జరుగుతాయి తప్ప అవి మనకు కనిపించవు. అందరూ ఇష్టపడే అందమైన సీతాకోక చిలుక అవతరించటానికి ముందు అది అసహ్యించుకొనే గొంగళి పురుగు రూపంలో వుంటుంది. ప్రపంచీకరణ అన్నది పెట్టుబడిదారీ వర్గం రూపొందించిన తాజా అధునాతన దోపిడీ అస్త్రం.కార్మికవర్గం గుర్తించలేనంత సమ్మోహనంగా వుండి, వారి మద్దతు కూడా పొందేంత అంటే అతిశయోక్తికాదు. తెలిసో తెలియకో కార్మికవర్గం మద్దతు లేదా వుపేక్ష కారణంగానే అదింకా బతికి బట్టగలుగుతోంది. బానిస, ఫ్యూడల్‌ వ్యవస్ధలను అదుపు చేసిన వర్గాలు అవి కూలిపోయేంత వరకు శాశ్వతమనే భ్రమించాయి,భావించాయి. జనంలో చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఆ వ్యవస్ధలలో కూడా పాలకవర్గం సంస్కరణలు ప్రవేశపెట్టకపోలేదు. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్ధ కూడా అదే భావంతో, అదే బాటలో వుంది. సహజం.

     ప్రపంచీకరణను వ్యతిరేకించే వారు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారా ? కానే కాదు, ముందటి సమాజాలు, తరతరాల అనుభవసారం నుంచి దానిని గ్రహించారు.ఒక విధానం మంచిదా కాదా అని నిర్ధారించటానికి ఎంత కాలం కావాలి? ప్రాతిపదికలేమిటి ? ప్రపంచీకరణ పేరుతో తీసుకున్న లేదా ఇంకా ప్రతిపాదిస్తున్న చర్యలన్నీ సామాన్య జనానికి తక్షణం హాని చేసేవి, అయితే శరీరంలో దెబ్బతిన్న భాగాన్ని తొలగించాలంటే శస్త్ర చికిత్స చేయాలి, తొలుత బాధగానే వున్నప్పటికీ తరువాత జీవితాంతం సుఖం అనుభవిస్తారు కనుక తాత్కాలిక బాధను భరించాలని ప్రపంచీకరణ వాదులు నమ్మబలుకుతారు.చిత్రం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచీకరణ కోరుకున్న వారే భిన్న స్వరాలు వినిపిస్తున్నారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/world-faces-long-period-of-stagnation-ahead  సత్యజిత్‌ దాస్‌ అనే ఒక బ్యాంకరు ‘ నిండుకున్న ప్రపంచ అమ్ముల పొది’ అనే పేరుతో బ్లూమ్‌బెర్గ్‌ వెబ్‌సైట్‌లో ఒక వ్యాసం రాశారు. ‘ పురోభివృద్ధిని పునరుద్దరించేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు తాము చేయగలిగినవి ఇంకా ఎన్నో వున్నాయని చెబుతూనే వున్న ప్రపంచ విధాన రూపకల్పనవేత్తలు ఎవరూ కూడా ఓటమిని అంగీకరించటానికి సిద్ధ పడటం లేదు. రెండు కాళ్లూ పొగొట్టుకొని దారిలో పడివున్న మల్లయ్య నేను లేస్తే మనిషిని కాను అని విజయం సాధించిన వారిని బెదిరించే మాదిరి వారి తీరు వుంది. వాస్తవం ఏమిటంటే ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకుల దగ్గర ఇంక ఆయుధాలేమీ మిగల్లేదు.’ ఇలా ప్రారంభమైంది.

     ‘ ప్రపంచవ్యాపితంగా డిమాండ్‌ మందగించటం, అనేక పరిశ్రమలు సామర్ధానికి మించి వుండటం వంటి పర్యవసానాలతో పెట్టుబడి నలిగిపోతోంది. కొన్ని బ్యాంకుల దగ్గర కొండల మాదిరి కారుచౌకగా దొరికే డబ్బు పేరుకుపోతున్నప్పటికీ రుణాలు తీసుకొనే వారు ముందుకు రావటం లేదు. ధన చలన వేగం చాలా తక్కువగా వుంది. తక్కువ లేదా ప్రతికూల వడ్డీ రేట్ల కారణంగా నిధులు సమకూర్చటం, బ్యాంకుల లాభాలు దెబ్బతింటున్నాయి. తమ పొదుపును మరోచోటికి బదలాయించుకోవటం, నగదుగా మార్చుకోవటం వంటి చర్యలను ప్రభుత్వాలు నిషేధించటం వంటి చర్యలు చేపడితే తప్ప వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు వాటిని ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు. పెన్షన్‌ నిధులు, వుద్యోగ విరమణ తరువాత ఇచ్చే లబ్ది గురించి చేసుకున్న ఒప్పందాలు, బీమా కంపెనీల సామర్ధ్యాలను ఇప్పటికే ప్రతికూల వడ్డీ రేట్లు ప్రశ్నిస్తున్నాయి. అనేక ప్రభుత్వ, కార్పొరేట్‌ బాండ్లు, చివరికి కంపెనీల వాటాలను కూడా కొనుగోలు చేయటం ద్వారా విత్త మార్కెట్లను ప్రభావితం చేస్తున్నప్పటికీ జపాన్‌ రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఆ పని చేసింది.ఆర్ధిక వ్యవస్ధపై ప్రభుత్వ పట్టు పూర్తిగా వుండేందుకు లెనిన్‌ హయాంలో సోవియట్‌ యూనియన్లో జరిగిన మాదిరి రిజర్వుబ్యాంకులు తమ అధికార కత్తులను ఝళిపించటం పెరిగిందన్నది నిజం. ఇదే సమయంలో ఈ విధానాల పరిమితులన్నీ అయిపోతున్నట్లు అందరికీ కనిపిస్తోంది. జపాన్‌, ఐరోపా దేశాల రిజర్వు బ్యాంకులకు కొనుగోలు చేసేందుకు తగిన బాండ్లు కనిపించటం లేదు. అంతా అనివార్యమని చెప్పలేముగాని వడ్డీ రేట్ల మరింత తగ్గింపు, పరిమాణాత్మక ఆంక్షలు మరింత సడలింపు మార్కెట్‌ రేట్లు, ఆస్థుల ధరలు లేదా నగదు విలువలపై పెద్ద ప్రభావమే చూపుతాయి.

     ఈ పరిస్ధితి మాంద్యంగా వున్న వాటికి ప్రభుత్వాలు ఆర్ధిక వుద్దీపనలు కలిగించటం అనే ఒక నూతన ఏకాభిప్రాయాన్ని పురికొల్పింది. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలు లోటుతో నడుస్తున్నాయి.కొన్ని వ్యవస్ధాగతమైన లోపాలతో వున్నాయి. వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు అదనంగా ఖర్చు చేస్తే తరువాత అది ప్రభావశీలంగా వుండాలంటే తరువాత కూడా కొనసాగించాల్సిందే. మౌలిక వసతుల వంటి వాటికి పెట్టుబడులు పెడితే తరువాత ప్రాజెక్టును బట్టి దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయి. ఎందుకంటే ప్రభుత్వాలు కృత్రిమంగా తక్కువ వడ్డీ రేటు లేదా ప్రతికూల వడ్డీ రేట్లతో డబ్బు తీసుకు వచ్చి ఖర్చు చేయటం అంటే దాని అర్ధం ప్రతిఫలం లభిస్తుందని కాదు. పెద్దగా ప్రయోజనం లేని ఆస్థులపై పెట్టిన పెట్టుబడిగా మారే ప్రమాదం వుంది.’

      ప్రపంచీకరణ వెనక్కు నడుస్తోంది అనే పేరుతో మరొక సమర్ధకుడు ఒక విశ్లేషణ చేశారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/globalization-goes-into-reverse ఇది కూడా ఆసక్తి కలిగించేదే. నోవా స్మిత్‌ అనే రచయిత తన విశ్లేషణను ఇలా ప్రారంభించాడు.’ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అనేక పశ్చిమ దేశాలలో ప్రతి క్రియ జరుగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం, వలసలకు సంబంధించి అమెరికన్లు ఇప్పటికీ సానుకూల అంశాల గురించి చెప్పవచ్చు, రాజకీయ అభ్యర్ధులైన ట్రంప్‌, బెర్నీ శాండర్స్‌ వంటివారు ఒక దశాబ్దం క్రితం వూహించటానికే అవకాశం లేని ఈ రెండింటిని వ్యతిరేకించే వారిని నుంచి ఒక పరిధి మేర ఎంతో మద్దతు పొందుతున్నారు. వాణిజ్య లావాదేవీలలో అంతగా తెలియని పసిఫిక్‌ సముద్ర రాజ్యాల భాగస్వామ్య (టిపిపి) ఒప్పందం ప్రమాదంలో పడింది. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడాకులు తీసుకోవటాన్ని కూడా ప్రపంచీకరణకు తిరస్కరణే అన్నది ఏక కంఠంతో చెప్పిన భాష్యం. కానీ నేటి ప్రపంచీకరణ వ్యతిరేక యుద్ధ వీరులు నిన్నటి యుద్ధం గురించి పోరాడుతున్నారు. ఏ విధంగా చూసినప్పటికీ 2008 సంక్షోభం నాటి నుంచి ప్రపంచీకరణ పూర్తి తిరోగమనంలో వుంది. మొదటిది వాణిజ్య విషయానికి వస్తే 2008 వరకు ఆరోగ్యకరంగా పెరిగింది. సంక్షోభం, మాంద్యం తరువాత ఇంతవరకు పూర్వపు స్థాయికి చేరుకోలేదు. రెండవది వలసల విషయానికి వస్తే ప్రపంచవ్యాపితంగా నెమ్మదిగా వలసలు పెరుగుతున్నాయి. అమెరికాకు అనూహ్య పెరుగుదల ఆగిపోయింది. మెక్సికో నుంచి అమెరికాకు వలసలు ఒక పెద్ద రాజకీయ వివాదంగా వుండేవి కాస్తా ఆ సమస్య ఇప్పుడు అటుదిటు అయింది. 2008 నుంచి 2014 వరకు అమెరికాలో నివశించే మెక్సికన్ల జనాభా పదిలక్షల మంది తగ్గిపోయారు.కారణం, అధికారికంగా నమోదు కానటువంటి మెక్సికన్‌ వలసదారులు పెద్ద సంఖ్యలో తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. తరువాత ఆర్ధికం గురించి, సంక్షోభానికి ముందు వున్న స్ధాయితో పోల్చితే అంతర సరిహద్దుల మధ్య జరిగే నగదు బదిలీలు తగ్గినట్లు యుబిఎస్‌ బ్యాంకు వివరాలు వెల్లడిస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే ప్రపంచీకరణ అనూహ్య పెరుగుదల ఇరవయ్యవ శతాబ్ది చివరి నాటికే అంతమైంది. ఇరవై ఒకట శతాబ్ది ప్రారంభం ముగిసింది, ప్రపంచీకరణ చుట్ట విడిపోవటం ప్రారంభం కూడా కావచ్చు. పది సంవత్సరాల ఆలస్యంగా ప్రపంచీకరణ అపస్మారకం గురించి ఆందోళన పడుతున్నట్లుగా వుంది.’

   ఇంత త్వరగా ప్రపంచీకరణపై పెట్టుబడిదారీ మేథావులలో భ్రమలు వైదొలగటం ప్రారంభం అవుతుందని ఎవరూ వూహించలేదంటే అతిశయోక్తి కాదు.మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో వచ్చిన సంక్షోభాలు, తీవ్ర ఆర్ధిక మాంద్యం కారణంగా అనేక దేశాలు తమ పరిశ్రమలు, వాణిజ్య రక్షణ చర్యలను తీవ్రతరం చేశాయి.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి చిన్నా, చితకా దేశాలు తప్ప వలసలు పూర్తిగా అంతరించటంతో యుద్ధ సమయంలోనే అమెరికా-బ్రిటన్‌లు యుద్ధం ముగిసిన తరువాత వాణిజ్య ఏర్పాటు ఎలా వుండాలో చర్చలు ప్రారంభించాయి. వాటి ఫలితమే 1947 ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు జెనీవాలో 23 దేశాల చర్చలు ఫలించి ప్రపంచీకరణకు తెరతీసిన పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (గాట్‌) కుదిరింది. అక్కడే అత్యంత సానుకూల దేశ హోదా కూడా పురుడు పోసుకుంది. ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు సభ్య దేశాల వస్తువులకు పన్నులు, ఇతర ఆటంకాలను తగ్గించటం, ఎత్తివేయటమే గాట్‌లోని కీలకాంశం. తరువాత 2000 సంవత్సరం నుంచి దాని కొనసాగింపుగా ప్రపంచ వాణిజ్య సంస్ద రంగంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

    ప్రపంచీకరణను ముందుకు తెచ్చిన ధనిక దేశాల ఆశలు, ఆకాంక్షలు, అంచనాలకు భిన్నంగా, వివిధ దేశాల మధ్య అసమాన ప్రయోజనాలు వస్తున్నాయని అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. చైనాను చూసి ప్రయివేటు పెట్టుబడులు అక్కడ పొందుతున్న లబ్దిని చూసి భారత్‌ సంస్కరణలు మొదలు పెట్టిందా లేక సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పెట్టుబడిదారీ ధనిక దేశాలతో అంటకాగితే ప్రయోజనం వుంటుందని పాలకవర్గం భావించి సంస్కరణలకు శ్రీకారం చుట్టిందా అన్నది ఒక చర్చ నీయాంశం. సోవియట్‌ కూలిపోక ముందే 1988లో ప్రధాని రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన జరపటం ఒక కీలకాంశం. నూతన ఆర్ధిక విధానం పేరుతో రాజీవ్‌ గాంధీ మాట్లాడిన పూర్వరంగం సంస్కరణలలో భాగమే. తరువాత సోవియట్‌, తూర్పు ఐరోపా రాజ్యాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత పీవీ నరసింహారావు రూపంలో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను తెరిచేందుకు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్కరణలు ఏ దేశానికి ఎక్కువ ప్రయోజనం కలిగించాయో తెలిసిందే. జపాన్‌కు చెందిన ‘రీతి’ సంస్ధ పరిశోధన ప్ర కారం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో మన వ్యవస్థను ముడివేసిన కారణంగా మన పరిశ్రమలు లబ్ది పొందటంతో పాటు వుపాధి అవకాశాలు కూడా పెరిగాయి. http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html అయితే అవి చైనాతో పోల్చుకుంటే చాలా పరిమితం. ఈ రెండింటితో పాటు మరికొన్ని దేశాలు లబ్ది పొందితే ఆ మేరకు ధనిక దేశాలు నష్టపోయాయి. 1995-2011 మధ్య కాలంలో ప్రపంచ విలువ గొలుసులో భారత పరిశ్రమలు చేసిన వుత్పత్తిలో తమ ఆదాయ వాటాను దాదాపు రెట్టింపు చేసుకున్నాయి. అందువలన మిగతా పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయని వేరే చెప్పనవసరం లేదు.ఈ విషయంలో మన పరిశ్రమలు రెండు నుంచి నాలుగుకు పెరిగితే చైనా నాలుగు నుంచి 16కు ఎదిగింది. ఇదే సమయంలో కేవలం విదేశాల కోసం చేసిన వుత్పత్తి విలువ మన దేశంలో 18 నుంచి 28కి పెరిగితే చైనాలో 35 నుంచి 42కు మాత్రమే పెరిగింది. అంటే చైనా కంటే విదేశాల కోసం తయారు చేసే సరకుల విషయంలో మన దేశం ఎంతో ముందుకు పోయింది. ఈ కారణంగానే మన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు మేకిన్‌ ఇండియా, మేకిన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో భారత్‌లో సరకులు తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోండి మంచి అవకాశాలు కల్పిస్తామని వెంపర్లాడుతున్నారు. రాయితీలు ప్రకటిస్తున్నారు. కేవలం ఎగుమతుల మీద ఆధారపడి ఆర్ధిక వ్యవస్థలను నిర్మించుకోవటం మంచిది కాదని లాటిన్‌ అమెరికా అనుభవం గ్రహించిన చైనా 2008 సంక్షోభం తరువాత తన అంతర్గత డిమాండ్‌ను పెంచటంపై కేంద్రీకరించింది. ఈ కారణంగానే సంక్షోభ ప్రభావం దాని ఆర్ధిక వ్యవస్ధపై పరిమితంగా పడిందన్నది కొందరి విశ్లేషణ.

     వస్తూత్పత్తి రంగంలో నానాటికీ నిపుణులైన కార్మికుల అవసరం పెరుగుతోంది. ఈ విషయంలో కూడా మనం చైనాతో పోల్చుకోవటానికి లేదు. 1995-2011 మధ్య మన దేశంలో వున్నత నిపుణులైన కార్మికులు 106.8శాతం పెరిగితే చైనాలో 211.2 శాతం పెరిగారు, పరిమిత నిపుణులైన వారు చైనాలో 35.6, భారత్‌లో 49.4 శాతం పెరిగారు. నైపుణ్యం లేని కార్మికుల శాతాలు 6.3, 4.4 శాతం చొప్పున మాత్రమే పెరిగారు. మన దేశంలో మధ్య తరగతి, చివరికి కార్మికవర్గంలో కూడా ప్రపంచీకరణకు అనుకూలత వ్యక్తం చేయటానికి ఈ పరిణామం కూడా దోహదం చేసినట్లుగా కనిపిస్తున్నది. మిగతావారితో పోల్చితే నిపుణులైన కార్మికులకు వేతనాలు సహజంగానే ఎక్కువ వుంటాయి కనుక, అవి ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను ప్రపంచ వ్యవస్ధతో ముడిపెట్టిన కారణంగానే వచ్చాయి కనుక ఆ విధానాలకు ఆకర్షితులు అవుతున్నారు. 1991-2014 మధ్య మన దేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులు పని చేసే పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగింది. నైపుణ్యం లేని కార్మికులు పని చేసే పరిశ్రమలు అంతకంటే ఎక్కువగా తగ్గిపోయాయి.

Image result for globalisation: why do people are opposing and supporting ?

    ఇదే సమయంలో ధనిక దేశాలలో పరిస్థితి ఏమిటి ? అమెరికాలో వున్నత నైపుణ్యం, పరిమిత నైపుణ్యం, నైపుణ్యం లేని కార్మికుల సంఖ్య స్ధిరంగా కూడా లేకపోగా 9.6,32.6,46.6 శాతాల చొప్పున, జపాన్‌లో 7.7, 29.8, 65.7 శాతాల చొప్పున తగ్గారు. ‘రీతి’ సర్వే చేసిన దేశాలలో ఒక్క చైనా, భారత్‌లో తప్ప మిగతా ప్రధాన దేశాలైన దక్షిణ కొరియాలో 66.5, తైవాన్‌లో 36.7, జర్మనీలో 17.7, ఇండోనేషియాలో 12.3 శాతం చొప్పున తగ్గారు. అందువలన సహజంగానే అక్కడి పౌరులలో ప్రపంచీకరణ వుత్పత్తి విధానం పట్ల తద్వారా ఆదాయాలు తగ్గటం వలన ప్రపంచీకరణ వ్యతిరేకత పెరుగుతోందన్నది స్పష్టం. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన అక్కడ ఆర్ధిక అసమానతలు వున్నప్పటికీ కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగాయన్నది అందరూ అంగీకరిస్తున్న సత్యం. అక్కడ పెరుగుతున్న వేతనాలను చూస్తే http://money.cnn.com/2016/03/17/news/economy/china-cheap-labor-productivity/ అనుకున్నంత చౌక కాదని అమెరికన్లే చెబుతున్నారు. అమెరికాతో పోల్చితే నాలుగు శాతమే తక్కువని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ చెప్పిన విషయాన్ని నిర్ధారించుకోవాల్సి వుంది. చైనాతో పోల్చితే మన దేశంలో అత్యంత నిపుణులైన కార్మికులకు కూడా వేతనాలు తక్కువే అన్నది తెలిసిందే. ఇది కూడా మోడీ వంటి వారిని మేకిన్‌ ఇండియా నినాదాలకు పురికొల్పింది. ఒకవైపు ఇది పారిశ్రామికవేత్తలను వుత్సాహపరుస్తుంటే మరోవైపు ప్రపంచీకరణ ఫలితాలు కొంత మంది చెప్పినట్లు ఊట మాదిరి దిగువకు దిగటంలేదు. అందుకే ఆర్ధిక అసమానతలు తీవ్రం అవుతున్నాయి.నైపుణ్యం లేని, పరిమిత నైపుణ్యం గల కార్మికులందరూ కాంట్రాక్టు వుద్యోగులుగా, తక్కువ వేతనాలకు పని చేసే అసంఘటి పని వారిగా మారిపోతున్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలన్నీ ఆటోమేషన్‌ కొద్ది మంది కార్మికులతో నడిచేవి తప్ప ఎక్కువ మందితో అవసరం వుండదు. అందువలన అంకెలలో అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ అది వుపాధి రహితంగా వుంటోంది. రానున్న రోజుల్లో ఈ ధోరణిని మరింతగా పెంచాలని, వున్న కార్మిక చట్టాలను కూడా క్రమంగా ఎత్తివేయాలన్నది పాలకుల లక్ష్యంగా వుంది.

    సరళీకరణ, ప్రపంచీకరణ వలన కలిగే లాభాలను ఎలా చూడాలి ? తాజ్‌ మహల్‌ కట్టించిందెవరు అని కాదు, దానికి రాళ్లెత్తిన కూలీల గురించి చూడాలని శ్రీశ్రీ చెప్పినట్లుగా మన దేశంలో ఏటేటా పెరుగుతున్న ధనికుల గురించి వార్తలను లొట్టలు వేసుకుంటూ చదువుతున్నాం, చూస్తున్నాం తప్ప అందుకు దోహదం చేసిన స్ధితి గురించి ఎందరు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రతి వ్యక్తికి ఎంత లాభం, నష్టం వచ్చిందని చూడటం సాధ్యం కాని మాట నిజమే. ఈ విధానాలకు అనుగుణ్యంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు, మినహాయింపులు ఇస్తున్నాయి. ప్రస్తుతం అవి ఏడాదికి ఆరులక్షల కోట్ల రూపాయలు దాటాయి. విద్య, వైద్యం వంటి సేవలకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను చూస్తే మనకు పరిస్ధితి అర్ధం అవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో కనీసం విద్యార్ధినులకు కూడా అన్ని చోట్లా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోతే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇవ్వాల్సిన దుస్ధితి ఈ సంస్కరణల కాలంలోనే జరిగింది.http://www.freshwateraction.net/content/all-govt-schools-must-have-toilet-november-end-supreme-court-india నిజానికి ఇతర సబ్సిడీలను కలుపు కుంటే అంతకంటే ఎక్కువే వుంటాయి.అన్నింటి కంటే దారుణం ఏమంటే కార్పొరేట్‌ కంపెనీలు సకల రాయితీలు పొందుతూనే చెల్లించాల్సిన పన్నులను కూడా ఏదో ఒక రూపంలో ఎగవేస్తున్నాయి.http://timesofindia.indiatimes.com/budget-2016/union-budget-2016/Budget-2016-Tax-forgone-gets-a-fancy-name-but-still-a-burden/articleshow/51202028.cms కార్పొరేట్‌ పన్ను 32.45 శాతం చెల్లించాల్సి వుండగా కేవలం 24.67 శాతమే చెల్లిస్తున్నాయని 2014-15 సంవత్సరం గురించి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అంటే దయామయులైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రాయితీలు పొంది, పన్నులు పూర్తిగా చెల్లించటం లేదన్నది స్పష్టం. ధనికులకు మరిన్ని రాయితీలిచ్చేందుకు చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతులు కల్పించేందుకు కూడా ప్రభుత్వాలకు లేకపోయిందంటే ప్రపంచీకరణ ఎవరికోసం ? ఎవరికి వుపయోగపడినట్లు ?  ధనిక దేశాలలో ప్రపంచీకరణ వ్యతిరేకత ఏ రూపాలలో వ్యక్తమౌతోంది ? వచ్చే భాగంలో చదవండి.