Tags

, , , , , , ,

ఎం కోటేశ్వరరావు

    వూహల పల్లకిలో తేలుతున్న ప్రధాని నరేంద్రమోడీకి వారం రోజుల్లోనే రెండు చెడువార్తలు. సరళతర వాణిజ్య సూచికలో ప్రపంచ బ్యాంకు మన స్ధానాన్ని 131 నుంచి కేవలం 130కి మాత్రమే తాజాగా సవరించింది. పులి మీద పుట్రలా ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే అమెరికా రేటింగ్‌ సంస్ధ స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ (ఎస్‌అండ్‌ పి) వచ్చే రెండు సంవత్సరాల వరకు ప్రస్తుతం అత్యంత నాసిగా వున్న భారత్‌ రేటింగ్‌ను సవరించేది లేదని తేల్చి చెప్పింది. అంటే మన ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌ ‘పని తీరు మీద అంతగట్టి విశ్వాసం ‘ ఏర్పరుచుకుందన్న మాట. తాను రాగానే అంతర్జాతీయ సమాజంలో గత ప్రభుత్వ హయాంలో గతించిన భారత ప్రతిష్టను ఎంతగానో ఇనుమడింప చేశానని తనకు తానే కితాబు ఇచ్చుకున్న నరేంద్రమోడీకి దీన్ని పెద్ద తిట్టు, అవమానంగా భావిస్తారా ? లేక సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటారా ? ఆ సంస్ధ మనకు ఇచ్చిన రేటింగ్‌‘ BBB-/A-3’ . దీన్ని వాణిజ్య పరిభాషలో చెప్పాలంటే పెట్టుబడులకు సంబంధించి అత్యంత తక్కువ గ్రేడ్‌ ఇది. ఇప్పుడున్న స్ధితి, జోస్యాలను బట్టి ఈ గ్రేడ్‌ అయితే స్ధిరంగా వుంటుందని, వచ్చే ఏడాది కూడా దీనిని సమీక్షించే అవకాశం లేదని, ప్రభుత్వ సంస్కరణలు, ద్రవ్య పరిస్ధితిని మెరుగు పరిస్తే, ప్రభుత్వ రుణం జిడిపికి 60శాతం కంటే తగ్గితే అప్పుడు రేటింగ్‌ సవరణ గురించి సమీక్షిస్తామని చెప్పటం పుండుమీద కారం చల్లటం వంటిది. సెప్టెంబరు నెలలో మూడీస్‌ సంస్ధ కూడా ఇదే విధంగా ఒకటి రెండు సంవత్సరాల తరువాతే సమీక్షిస్తామని చెప్పటాన్ని మరిచిపోరాదు. ప్రస్తుతం మన ప్రభుత్వ రుణ భారం 69శాతం వుంది. అంటే మనకు వంద రూపాయల ఆదాయం వస్తుందనుకుంటే అప్పు 69 రూపాయలు వున్నట్లు. మన జిడిపి పెరుగుదల గురించి మంచి మాటలు చెప్పిన ఎస్‌ఆండ్‌ పి 2016లో 7.9శాతం, 2016-18 సంవత్సరాలలో సగటున ఎనిమిది శాతం పెరుగుదల వుంటుందని, జిఎస్‌టి వంటి చర్యల పట్ల అభినందనలు కూడా తెలిపింది. అయితే ఈ బలంతో పాటు తక్కువగా వున్న తలసరి ఆదాయం, ప్రభుత్వ ఖజనా బలహీనంగా వుండటం, బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల వంటి బలహీనతలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటదని తేల్చి చెప్పింది.

    ఈ ప్రకటనతో హతాశురాలైన ప్రభుత్వం పెట్టుబడిదార్ల ఆలోచన, రేటింగ్‌ ఏజన్సీల మధ్య సంబంధాలు లేనట్లు కనిపిస్తున్నదని ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ ద్వారా వ్యాఖ్యానించింది.ఆర్ధిక వ్యవస్ధను పటిష్ట పరిచేందుకు, జిడిపి అభివృద్ధిని పెంచేందుకు, వుద్యోగ కల్పనకు ప్రయత్నిస్తామని కూడా దాస్‌ చెప్పారు.రేటింగ్‌ను మెరుగు పరచనంత మాత్రాన ప్రభుత్వం పెద్దగా ఆందోళన చెందటం లేదని, సంస్ధ నివేదికలో పేర్కొన్నట్లుగా వివిధ అంశాలను పోల్చుకుంటే భారత్‌తో సమంగా మరొక ఆర్ధిక వ్యవస్ధ వుందా అని ప్రశ్నిస్తూ రేటింగ్‌ ఇవ్వబోయే ముందు ఆత్మావలోకనం చేసుకోవాలని కూడా దాస్‌ అన్నారు. భారత రేటింగ్‌ను తక్కువ చూపుతున్నారని ప్రపంచ మదుపుదార్లు భావిస్తున్నారని, వారి ఆలోచనలు- రేటింగ్‌ సంస్ధలకు మధ్య సంబంధం లేనట్లుగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.

    మన ప్రభుత్వ రుణ భారం 1991లో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభించిన సమయంలో జిడిపిలో 75.33 శాతం వుండేది. అది 1998లో బిజెపి నేత వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్‌డిఏ అధికారానికి వచ్చే నాటికి 68.09 శాతానికి తగ్గింది. తమ పాలనలో భారత్‌ వెలిగిపోతోంది అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగి బిజెపి ఓడిపోయిన సమయానికి 2003లో అప్పును రికార్డు స్ధాయికి 84.24 శాతానికి బిజెపి సర్కార్‌ తీసుకుపోయింది. ఆ తరువాత 2013 నాటికి 67.96 శాతానికి తగ్గింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015 నాటికి 69.07 శాతానికి పెరిగింది.http://countryeconomy.com/national-debt/india 2015 వివరాల ప్రకారం ప్రపంచంలోని 184 దేశాల జాబితాలో జడిపి-రుణం నిష్పత్తిలో మన దేశం 140 స్ధానంలో తలసరి అప్పులో 69లో వుంది.

Image result for worried arun jaitly

    మన దేశంలో కొంత మంది దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో వుండేందుకు ప్రయత్నిస్తారు. అనేక సందర్భాలలో చైనా, పాకిస్తాన్‌లతో మన దేశాన్ని పోల్చుకుంటారు. తప్పులేదు. అందుకే మచ్చుకు కొన్ని పోలికలు చూడండి.http://countryeconomy.com/countries/compare/china/india సమాచారం ప్రకారం 2015వ సంవత్సరంలో కొన్ని వివరాలు ఇలా వున్నాయి. జిడిపి మిలియన్‌ డాలర్లలో, తలసరి ఆదాయం డాలర్లుగా గమనించాలి.

                                చైనా                    భారత్‌                 పాకిస్తాన్‌

జిడిపి                  11,181,556             2,073,002             271,050

జిడిపి తలసరి                8,141                   1,581                 1,428

జిడిపిలోరుణశాతం           42.92                   69.07                 63.57

జిడిపిలోలోటుశాతం            2.69                     6.91                   5.24

     నరేంద్రమోడీ లేదా గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వమైనా అనుసరిస్తున్నది విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ అనుకూల విధానాలే అన్నది స్పష్టం. వివిధ దేశాలలోని రేటింగ్‌ సంస్ధలన్నీ వారి కనుసన్నలలో నడిచేవే, వారి లాభాలను కాపాడేవే అన్నది గమనంలో వుంచుకోవాలి. ఈ పూర్వరంగంలో ప్రపంచబ్యాంకు సూచికను చూసినా, ప్రస్తుత ఎస్‌ఆండ్‌ పి రేటింగ్‌ను గమనించినా మన దేశ పాలకవర్గం నుంచి ఇంకా మరిన్ని రాయితీలు, మరింతగా మన ఆర్ధిక వ్యవస్ధను తెరవాలని వత్తిడి చేస్తున్నాయన్నది స్పష్టం. జిఎస్‌టి అమలు వలన సమీప భవిష్యత్‌లో ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదని ఎస్‌ అండ్‌ పి పేర్కొన్నది. గత రెండు దశాబ్దాల తీరుతెన్నులను గమనిస్తే సంస్కరణలు అమలు జరుపుతున్నామని చెబుతున్నప్పటికీ రెండు దశాబ్దాలలో జిడిపిలో ద్రవ్యలోటు 8.8శాతం, గత ఐదు సంవత్సరాల సగటు ఏడు శాతంగా వుంది. దీని పర్యవసానంగా మన దేశ రుణ భారంతో పాటు దానికి చెల్లించే వడ్డీ కూడా గణనీయంగా పెరుగుతోంది. జిడిపిలో మన ఆదాయం 21శాతం తక్కువగా వున్నదని, ఖర్చులో సబ్సిడీలు గణనీయంగా వున్నట్లు తాజా నివేదికలో పేర్కొన్నారు. అంటే అర్ధం పన్నులు,సెస్సుల వంటి వాటిని పెంచి ఆదాయం పెంపు, సబ్సిడీలకు మరింత కోత విధించి పొదుపును పెంచాలని పరోక్షంగా వత్తిడి చేయటమే. జిఎస్‌టి ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుందని అయితే అది వెంటనే ఫలితాలను ఇవ్వదని, సబ్సిడీ కోతలు ఆలశ్యమౌతాయని స్పష్టంగా చెప్పింది. బ్యాంకులు ప్రత్యామ్నాయ వనరుల ద్వారా పెట్టుబడులను సమకూర్చుకోలేని పక్షంలో బాసెల్‌-3 ప్రమాణాల ప్రకారం 2019 నాటికి 45 బిలియన్‌ డాలర్ల మేరకు ప్రభుత్వం పెట్టుబడి నిధులను సమకూర్చాల్సి వుంటుందని, ప్రస్తుతం ప్రభుత్వం వాగ్దానం చేసిన 11 బిలియన్‌ డాలర్లను గణనీయంగా పెంచాలని తెలిపింది. ద్రవ్యోల్బణం రేటును 2017 మార్చి నాటికి ఐదు శాతానికి రిజర్వుబ్యాంకు పరిమితం చేయగలదనే ఆశాభావాన్ని వెలిబుచ్చింది. సంస్కరణల నిలిపివేత, అభివృద్ధి గిడసబారటం, నిర్ధేశిత లక్ష్యాలను అమలు జరపటంలో వైఫల్యం లేదా విదేశీ చెల్లింపుల పరిస్ధితి దిగజారితే రేటింగ్‌ను తగ్గించే అవకాశం వుంది. వీటిపై మోడీ ప్రబుత్వం తీసుకొనే చర్యల పట్ల విశ్వాసం లేక లేదా గట్టిగా అమలు జరిపించేందుకు రేటింగ్‌ ఏజన్సీలు ప్రస్తుతం ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రపంచబ్యాంకు,రేటింగ్‌ ఏజన్సీలను సంతృప్తి పరచే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పటమంటే రానున్న రోజులలో కార్మికులు, వుద్యోగులు, సామాన్య జనానికి మరిన్ని కష్టాలు మూడబోతున్నట్లే భావించాలి.

    రేటింగ్‌ ఏజన్సీల వత్తిడి ఇప్పుడేదో ఆకస్మికంగా ప్రారంభం అయింది కాదు. ద్రవ్య పరిస్ధితిని పటిష్ట పరచేందుకు రూపొందించిన పధకానికి కట్టుబడి వుండకపోతే అనుకున్న ప్రకారం ఆదాయం పెరగకపోవటం, సబ్సిడీల కోత ఆలస్యం కావచ్చని ఇదే ఎస్‌ అండ్‌ పి సంస్ధ ఈ ఏడాది జనవరిలోనే హెచ్చరించింది. http://articles.economictimes.indiatimes.com/2016-01-31/news/70222497_1_services-tax-subsidy-cuts-finance-minister-arun-jaitley సంస్ధ విశ్లేషకుడు కైరన్‌ కరీ పిటిఐ వార్తా సంస్ధతో మాట్లాడుతూ ద్రవ్యలోటు లక్ష్యం చేరుకోవటాన్ని ఒక ఏడాది పాటు వాయిదా వేసి 2015-16 బడ్జెట్‌లో ప్రభుత్వం దారి తప్పిందని, అనుకున్న విధంగా ఆదాయం రాకపోవటం, ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీల కోతపై ఆటంకాలను ఎదుర్కొన్నదని చెప్పాడు. కార్పొరేట్‌ సంస్ధల వత్తిడి, రేటింగ్‌ సంస్ధలను సంతృప్తి పరచటం కోసమే నరేంద్రమోడీ సర్కార్‌ పెట్రోలు, డీజిల్‌పై ఎక్సయిజ్‌ సుంకం, సేవాపన్ను పెంపు,కిరోసిన్ పై నెలవారీ సబ్సిడీ తగ్గింపు , స్వచ్చభారత్‌, కృషి కల్యాణ్‌ వంటి రకరకాల సెస్సులను ఈ కాలంలో విధించి మరో ఔరంగజేబుగా మారిన విషయం తెలిసిందే. అయితే జనంపై మరిన్ని భారాలు మోపి 2019లో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి, దాని మిత్ర పక్షాలు ఓట్ల కోసం జనం ముందుకు వెళతాయా? అధికారం కోసం విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు కోరుతున్న సంస్కరణలను ఏం చేస్తారు అన్నది చూడాల్సి వుంది.