Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

    గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధిని దేశమంతటికీ వర్తింప చేస్తామని వూరూ వాడా ప్రచారం చేసిన నరేంద్రమోడీ అండ్‌ కో ఇప్పుడు దాని గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. అది మంచిదా, చెడ్డదా అన్న విషయాన్ని పక్కన పెడితే తాను అమలు జరిపినట్లు చెప్పుకున్న దానినే మోడీ ఎందుకు అమలు జరపటం లేదని అది మంచి విధానం అనుకొనే వారు కూడా మోడీని ప్రశ్నించటం లేదు. ఫలితాలు చూపకుండా ఎవరి డబ్బా వారు ఎంత కాలం కొట్టుకుంటారు, ఆ స్ధితిలో ఏదో ఒక సంస్ధ ఇచ్చే కితాబు కోసం ఎవరైనా ఎదురు చూస్తారు. ఇప్పుడు నరేంద్రమోడీ ఆ స్థితిలో వున్నారు కనుకనే ప్రపంచబ్యాంకు ర్యాంకింగుల  ఇండెక్సు, రేటింగ్‌ సంస్ధల రేటింగ్‌ల కోసం వెంపర్లాడుతున్నారు. గతంలో ఇందిరా గాంధీని ఏవమ్మా ధరలు పెరుగుతున్నాయేమంటే కారణం విదేశీ హస్తం అని చెప్పేవారని జోక్‌ చేసేవారు. ఎందుకంటే విదేశీ హస్తాన్ని ఆమె అంతగా వాడుకున్నారు. చివరకా విదేశీ హస్తానికే ఆమె బలికావటం విషాదం అనుకోండి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన ఎగుమతులు నెలనెలా పడిపోతున్నట్లు వార్తలు రావటమే తప్ప పెరిగినట్లు ఇంతవరకు వినలేదు. కారణం విదేశాలలో పరిస్ధితులు బాగోలేవు అని చెబుతున్నారు. అది ఒక్క మన దేశానికేనా మిగతా దేశాలకు వర్తించవా ? అని ఎవరైనా అడిగితే దేశద్రోహి అన్నట్లుగా విరుచుకుపడతారు.

     మరో రెండు సంవత్సరాల వరకు రేటింగ్‌ను మార్చాల్సినంత సీన్‌ లేదని స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ రేటింగ్‌ సంస్ద గాలి తీసింది. దాని కొనసాగింపా అన్నట్లుగా ఇప్పుడు క్రిసిల్‌ అనే మరో సంస్ధ మన ఎగుమతులు పడిపోవటానికి ప్రతికూల పరిస్ధితులే కారణమని సాకు చెపితే కుదరదని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవటంతో పాటు దేశీయంగా వినియోగాన్ని కూడా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తాజాగా రూపొందించిన ఒక విశ్లేషణ పత్రంలో పేర్కొన్నది. ప్రధాని ఇచ్చిన మేకిన్‌ ఇండియా పిలుపును జయప్రదం చేయాలంటే రెండు మార్గాలు అనుసరించాలని సూచిస్తూ ఆ పత్రానికి ‘బైఫోకల్‌ ప్లీజ్‌ ‘ ( దయచేసి రెండు మార్గాల్లో నడవండి ) అని పేరు పెట్టింది.http://www.thehindu.com/business/Economy/global-situation-not-to-blame-for-fall-in-exports-crisil-study/article9301285.ece గత కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించిన దివాలా కోరు విధానాలను కొనసాగిస్తూ, సంక్షేమ చర్యలకు మరింత కోత విధిస్తూ, పౌరుల ఆదాయాల పెంపునకు అవసరమైన విధానాలు అమలు జరపకుండా దేశీయ వినియోగాన్ని పెంచటం నరేంద్రమోడీ సర్కార్‌కు సాధ్యమేనా అన్నది ప్రశ్న. కుండలో కూడు తరగ కూడదు పిల్లాడు మాత్రం బొద్దుగా తయారు కావాలంటే సాధ్యమేనా ? రేటింగ్‌ సంస్ధలు చేసే విమర్శలు, విశ్లేషణలన్నీ కార్పొరేట్లకు అనుకూలంగానే వుంటాయన్నది గమనంలో వుంచుకోవాలి. క్రిసిల్‌ రేటింగ్‌ సంస్ధ విశ్లేషణతో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడితే అసలదేం చెప్పిందో చూద్దాం.

    ఎగుమతుల పోటీ తత్వాన్ని పెంచేందుకు కార్మిక చట్టాలలో వున్న కాఠిన్యతను తొలగించాలి, భూ సేకరణతో ముడిపడిన సవాళ్లను పరిష్కరించాలి, అరకొరగా వున్న రోడ్లు,రేవులు, విద్యుత్‌ వంటి వాటిని పుష్కలంగా సమకూర్చాలి, నైపుణ్యం లేని మానవశక్తి స్ధానంలో నిపుణులను అందుబాటులోకి తేవాలి. ప్రపంచబాంకు సమాచారం ప్రకారం 2014లో ఒక కంటెయినర్లో వస్తువులను ఎగుమతి చేయాలంటే భారత్‌లో ఖర్చు 1332 డాలర్లు, అదే బంగ్లాదేశ్‌కు 1281, చైనాకు 823, వియత్నాంకు 610, ఇండోనేషియాకు 572 డాలర్లుగా వుంది. చైనా తక్కువ విలువ ఆధారిత వుత్పత్తులైన వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, బొమ్మల నుంచి వైదొలగి అధిక విలువ వుండే వస్తువుల వైపు మరలుతున్నందున దాని ఖాళీలో భారత్‌ ప్రవేశించాలంటే పైన పేర్కొన్న చర్యల వంటి వాటిని తీసుకోవాలి. అయితే ఇప్పటివరకు అందుబాటులో వున్న సమాచారం మేరకు ఇంతవరకు ఇలాంటి చర్యలు లేవు. వుదాహరణకు జౌళి రంగంలో భారత ఎగుమతులు 2001-15 మధ్య కాస్త అటూ ఇటూగా ఒకే విధంగా వున్నాయి. బంగ్లాదేశ్‌, వియత్నాం ఎన్నో రెట్లు పెంచాయి. పాదరక్షల విషయంలో కూడా భారత వాటా గిడసబారి పోగా వియత్నాం దూసుకుపోయింది.

      ఈ నివేదికలో పేర్కొన్న డిమాండ్లను విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు ఇప్పుడేదో కొత్తగా తెచ్చినవి కాదు, ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం భూ సేకరణ చట్ట సవరణకు పూనుకుంది. రూపాయి విలువ పెంచకుండా, సాధ్యమైన మేరకు తగ్గించేందుకు నరేంద్రమోడీ తన సర్వశక్తులు ధారపోస్తున్నారు. ఈ పూర్వరంగంలోనే తెలంగాణా,ఆంధ్రప్రదేశ్‌లలో పూలింగ్‌ పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుంటున్నారు. ప్రశ్నించిన రైతులను అరెస్టు చేస్తున్నారు, బెదిరించి దారికి తెచ్చుకుంటున్నారు. కార్మిక చట్టాలు వున్నప్పటికీ వాటి అమలును పక్కన పడేశారు, ఎక్కడైనా కార్మికులు ప్రశ్నిస్తే పోలీసులను రంగంలోకి దించి పారిశ్రామిక, వాణిజ్య వేత్తలకు భరోసా, ధైర్యం కల్పించే చర్యలకు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దివీస్‌ లాబ్‌ విస్తరణ, తుందుర్రులో రొయ్యల శుద్ధి కర్మాగారం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారిపై జరుగుతోంది ఇదే. క్రిసిల్‌ చెప్పిన ఒక మార్గంలో ఇవన్నీ భాగమే. ఇక అది చెప్పిన రెండవ మార్గం స్ధానిక వినిమయం లేదా డిమాండ్‌ పెంచటం గురించి చూద్దాం. ఇక్కడే మన దేశానికి చైనాకు కనిపిస్తున్న ప్రధాన వైరుధ్యం. ఎవరైనా దీన్ని ప్రస్తావిస్తే అది కమ్యూనిస్టు నియంతృత్వ దేశం, మనది స్వేచ్చా ప్రజాస్వామిక దేశం అన్న సమాధానం టక్కున చెప్పేస్తారు. ప్రజాస్వామ్యంలో వేతనాల పెంపుదల ద్వారా ప్రజల ఆదాయాలు తద్వారా వినిమయాన్ని పెంచవద్దని ఎవరైనా చెప్పారా ? పోనీ కమ్యూనిస్టు నియంతృత్వంలో బలవంతగా వేతనాలు పెంచేట్లు చేశారనుకుందాం, ప్రజాస్వామ్యంలో స్వచ్చందంగా పెంచవచ్చు కదా ? ఎందుకు ఆ పని చేయటం లేదు.

   http://www.businesstoday.in/magazine/features/textile-sector-target-one-crore-jobs-in-three-years/story/238641.html బిజినెస్‌ టుడే తాజా సంచికలో జౌళి రంగం గురించి రాసిన వ్యాసంలో వివిధ దేశాలలో ఆ రంగంలో పని చేస్తున్న కార్మికుల వేతనాల గురించి ప్రస్తావన వుంది. దాని ప్రకారం చైనాలో నెలకు 314, వియత్నాంలో 145, భారత్‌లో 120, బంగ్లాదేశ్‌లో 68 డాలర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చైనాలో మన కంటే వేతనాలు తక్కువ కారణంగా అది చౌకగా దుస్తులను ఎగుమతి చేయగలుగుతున్నదని ఎవరైనా వాదిస్తే దీనికి ఏం జవాబు చెబుతారు ? ఒక్క ఈ రంగంలోనే కాదు అన్నింటా వేతనాలు పెరుగుతున్నాయని అమెరికా ఆర్ధికవేత్తలే చెబుతున్నారు. ఈ కారణంగానే 2008 నుంచి ధనిక దేశాలలో తలెత్తిన మాంద్మం కారణంగా చైనా ఎగుమతులు తగ్గిపోయినప్పటికీ, వాటి స్ధానాన్ని దేశీయ వినియోగం పెంచటం ద్వారా భర్తీ చేస్తున్నది. అందుకే పెద్దగా సమస్యలు రాలేదు. ఎగుమతి ఆధారిత విధానం నుంచి క్రమంగా దేశీయ డిమాండ్‌ పెంపుదలకు తీసుకుంటున్న చర్యలను విస్మరిస్తే సరైన అంచనాకు రాజాలము.http://www.sify.com/finance/struggling-indian-savers-threaten-modi-s-growth-ambition-news-economy-qk2eEhagffebf.html ఇది గతనెలాఖరులో రాయిటర్స్‌ ఇచ్చిన వార్త. చైనా నుంచి అభివృద్ధి పతాకాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తున్న భారత కలలకు పడిపోతున్న పొదుపు రేటు ఒక హెచ్చరిక అని మన స్ధూల జాతీయాదాయం (జిడిపి)లో జాతీయ పొదుపు మొత్తం 2003వ సంవత్సరం తరువాత అతి తక్కువగా ఈ ఏడాది 30.2శాతానికి పడిపోయిందని, రానున్న రెండు సంవత్సరాలలో కూడా ఇది తగ్గుతుందని అంతర్జాతీయ వాణిజ్య సంస్ధ అంచనా వేస్తున్నట్లు దానిలో వుంది. రాయిటర్స్‌గానీ, ఐఎంఎఫ్‌ గానీ మోడీ వ్యతిరేక సంస్ధలు కావని గుర్తించాలి. మన జనం పైసా పైసా కూడ బెట్టి బ్యాంకులు, పోస్టాఫీసులు తదితర సంస్ధలలో దాచుకుంటారు. వుద్యోగులు ప్రావిడెంట్‌ ఫండ్స్‌, బీమా పధకాల వంటి వాటిలో జమ చేస్తారు. ఈ మొత్తాలను పారిశ్రామిక వాణిజ్య వేత్తలు తమ పెట్టుబడులుగా వుపయోగించుకుంటారు. విజయ మాల్య, కావూరు సాంబశివరావు, సుజనా చౌదరి వంటి వారు కూడా వారిలో వుంటారనుకోండి, ఆ కథలు వేరే. దేశీయంగా పొదుపు మొత్తం తగ్గితే వారు మన కంటే తక్కువ వడ్డీకి వచ్చే విదేశీ పెట్టుబడులపై ఆధారపడతారు. అయితే దాని ఇబ్బందులు దానికి వుంటాయి.

    అభివృద్ధిలో చైనాను వెనక్కు నెట్టి వుద్యోగాలు కావాలనే వారి జాబితాలో ప్రతినెలా చేరు తున్న కోటి మంది యువతీ యువకులకు వుపాధి కల్పిస్తామనే నినాదంతో కదా నరేంద్రమోడీ అధికారానికి వచ్చింది. నూట ముఫ్ఫై కోట్ల జనాభాలో మూడింట రెండు వంతుల మంది 35 సంవత్సరాల వయస్సు లోపు వారే, ఇంత మొత్తం గతంలో ఎన్నడూ లేరు. వారందరికీ వుపాధి కల్పించాలంటే నిరంతర అభివృద్ధి జరిగేందుకు ప్రధాన షరతుగా చెప్పాలంటే దేశీయ పొదుపు మొత్తం 35శాతానికి తగ్గకూడదని సీనియర్‌ ఆర్ధిక వేత్త హన్నా లుచినకావా చెప్పారు. మన దేశంలో ఏడాది క్రితం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మన పొదుపు 29.6శాతానికి పడిపోయింది. చైనా, తూర్పు ఆసియా దేశాలలో దశాబ్దాల తరబడి పొదుపు రేటు 30శాతానికి మించే వుంటున్నది. ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలను మౌలిక సదుపాయాల కల్పన పేరుతో ఖర్చు చేశారు. ఇంకా అంతరం వున్నందున పూర్తిగా సమకూర్చాలంటే మరొక లక్షా 70వేల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు అవసరం అవుతాయని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.

    పాలకులు అనుసరించిన విధానాల కారణంగా మరోవైపున సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన వుద్యోగ కల్పన, వున్నవి కూడా అరకొరవేతనాలు, అభివృద్ధి మందగింపు వంటి అనేక అంశాలు జనం జేబులను ఖాళీ చేస్తున్నాయి. అప్పులలో ముంచుతున్నాయి. ఈ స్ధితిలో పొదుపు చేయటానికి వారి దగ్గర డబ్బెక్కడ వుంటుంది ? న్యూఢిల్లీలోని ఒక ఎలక్ట్రిక్‌ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పని చేస్తున్న 50 ఏండ్ల టేక్‌ మోహన్‌లాల్‌ గత మూడు సంవత్సరాలుగా తనకు సగటున ఏడాదికి ఎనిమిదిశాతం వేతనం పెరిగిందని అయితే పిల్లల విద్య, తల్లికి మందుల ఖర్చు 40శాతం పెరిగిందని చెప్పినట్లు రాయిటర్స్‌ తెలిపింది. ప్రయివేటు వుద్యోగుల పరిస్ధితి దాదాపు అన్ని చోట్లా ఇంతే వుంది. ద్రవ్యోల్బణం తగ్గిందంటూ రిజర్వు బ్యాంకు ఇటీవలి కాలంలో 175 పాయింట్ల మేరకు వడ్డీ రేట్లను తగ్గించింది. దాంతో బ్యాంకులు కూడా ఆ మేరకు డిపాజిటర్లకు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇవి పొదుపు చేసే వారిని ఆకర్షించటం లేదు. కొన్ని ధనిక దేశాలలో ఎవరైనా బ్యాంకులలో డబ్బు దాచుకుంటే వారే బ్యాంకులకు ఎదురు వడ్డీ ఇచ్చే పరిస్ధితి వుంది. మన దేశంలో అధిక వడ్డీ రేటు కోసం పొదుపర్లు చూసే విషయం తెలిసిందే. బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించిన కారణంగా గత 53 సంవత్సరాలలో తొలిసారిగా బ్యాంకు డిపాజిట్ల అభివృద్ధి రేటు తగ్గిపోయింది.

   2013 నుంచి సవరించిన వృత్తుల నూతన వర్గీకరణ సమాచారం ప్రకారం http://indianexpress.com/article/india/india-others/rural-wage-growth-lowest-in-10-years-signals-farm-distress-falling-inflation/ మన దేశంలో 2014 నవంబరు మాసంలో గత పది సంవత్సరాలలో అతి తక్కువ గ్రామీణ వేతనం నమోదైంది. సగటున గ్రామీణ ప్రాంత వేతనాలు నవంబరు నెలలో 3.8శాతం వార్షిక పెరుగుదల కాగా 2005 తరువాత అది కనిష్టంగా వున్నట్లు తేలింది. నిజానికి కార్మికశాఖ లెక్కలు వాస్తవ పరిస్ధితులను ప్రతిబింబించవు అనే అభిప్రాయం ఒకటి వున్నప్పటికీ వాటి ప్రకారం కూడా తగ్గింది. 2011 జూన్‌లో గరిష్టంగా 23శాతం వరకు పెరిగింది. తరువాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బొగ్గులేరుకోవటానికి భలే అవకాశం వచ్చిందిలే అని మరొకడు సంబరపడినట్లుగా గ్రామీణ వేతనాల పెరుగుదల రేటు తగ్గుదల వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం కంటే తక్కువగా వున్నందున వడ్డీ రేట్లు ఇంకా తగ్గించటానికి అవకాశాలు మెరుగుపడ్డాయని రిజర్వుబ్యాంకు విధాన నిర్ణేతలు భావిస్తుండటం ఆందోళనకరం. గ్రామీణ వేతన రేట్ల పెరుగుదల తగ్గటం అంటే వారి ఆదాయాలు పడిపోవటమే, దాని పర్యవసానం కొనుగోలు శక్తి క్షీణిస్తుంది అది దేశీయ డిమాండ్‌ తగ్గటానికి దారితీసి పరిశ్రమల మూత వంటి పరిణామాలకు దారితీస్తుంది. గత ఐదు సంవత్సరాల కాలంలో గ్రామీణ వేతనాలు వేగంగా పెరిగినందున అది ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ పెరుగుదలకు దారితీసిందనే తప్పుడు సిద్ధాంతాన్ని చెబుతున్నారు. 2007 నుంచి గ్రామీణ వేతనాల పెరుగుదలకు కారణం వ్యవసాయేతర వుపాధి అవకాశాలు పెరగటం, దానికి తోడు వుపాధి హామీ పధకం తోడైందని, రైతాంగ పంటలకు మంచి ధరలు వచ్చినందున పెరిగిన వేతనాలను రైతాంగం భరించగలిగిందని సూత్రీకరిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణ, వుత్పాదక రంగం బలహీనపడటం, పంటల ధరలు పడిపోవటం వంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాలలో వేతనాల పెరుగుదల రేటు పడిపోయింది. దానికి తోడు వుపాధి హామీ పధకానికి తూట్లు పొడుస్తున్నందున గ్రామీణ వేతన రేట్లు ఇంకా పడిపోయే అవకాశం వుంది.

   గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సామాన్య, మధ్యతరగతి వారి ఆదాయాలను హరిస్తున్నవాటిలో విద్య, వైద్య ఖర్చులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు గాక రుణ వూబిలో కూరుకుపోవటం గురించి మాత్రమే తెలుసు ఇప్పుడు గ్రామీణ, పట్టణ పేదలు, సామాన్య రైతాంగం విద్య, వైద్య ఖర్చుల రుణ వూబిలో దిగబడిపోతున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లి బయటకు రావాలంటే అప్పులు చేయటం మినహా మరొక మార్గం లేదన్నది అందరికీ తెలిసిందే. ఇటు వంటి స్ధితిలో పొదుపు మరింతగా పడిపోవటం అనివార్యం. దానితో పాటు పారిశ్రామిక వస్తువుల డిమాండ్‌ కూడా పడిపోతుంది. అపుడు క్రిసిల్‌ పేర్కొన్న రెండవ రోడ్డు మార్గం మూసుకుపోతుంది.