Tags

, , , , , , ,

మీడియా స్వేచ్ఛకు ప్రమాద ఘంటికలు

ఎం కోటేశ్వరరావు

    చచ్చిన చేప వాగు వాలున కొట్టుకుపోతుంది. బతికున్న చేప మాత్రమే ఎదురు ఈదుతుంది. దేన్నయినా ప్రశ్నిస్తేనే రచ్చ, చర్చ ప్రారంభమౌతుంది. ఫలానా రోజు ఫలానా చర్యను ఎందుకు ప్రశ్నించలేదు, దీన్ని మాత్రమే ఇప్పుడు ఎందుకు తప్పు పడుతున్నారు అంటే కుదరదు. హేతుబద్దత లేకుండా అసంబద్ధతో మరొకటో వుంటేనే ఎవరైనా నిలదీస్తారు. సమర్ధించుకోవటానికి సరైన కారణాలు దొరకనపుడే చర్చను పక్కదారి పట్టించేందుకు చూస్తారు. వ్యూహాత్మకమైన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారని ఆరోపించి ఎన్‌డిటివీ హిందీ ఛానల్‌ ప్రసారాలను నవంబరు తొమ్మిది-పది తేదీలలో ఒక రోజంతా నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దండన విధించింది. అత్యవసర పరిస్థితి పేరుతో కాంగ్రెస్‌ నియంతృత్వ పోకడలను వ్యతిరేకించిన ఘనత తమకు వుందని కమలనాధులు తరచూ చెప్పుకుంటారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించటానికి ఒక కారణం, చట్టమూ, అధికారమూ కావాలి. కానీ అనధికారికంగా అమలు జరపటానికి అధికారం వుంటే చాలని నేటి కేంద్ర ప్రభుత్వం ఆచరణలో చూపింది. హేతుబద్దంగా ఆలోచించే వారందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించి నిషేధం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఒక రోజు నిషేధం మీడియా స్వేచ్చకు, ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి సమయంలో కాంగ్రెస్‌ నేతల మాదిరి తమ చర్యను సమర్ధించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఎదురుదాడులకు పూనుకున్నారు. తమ ద్వంద్వ స్వభావాన్ని బయట పెట్టుకున్నారు.జనానికి విచక్షణా జ్ఞానం వుంటుందనే అంశాన్ని కూడా మరచిపోయి అసంబద్ద వాదనలను ముందుకు తెస్తున్నారు.

    కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌డిటివీ యాజమాన్యం సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దీంతో పాటు దేశ, విదేశాలలో నిరసన,మోడీ సర్కార్‌ అప్రజాస్వామిక చర్యపై విమర్శలతో భయపడిన కేంద్రం నిషేధం విషయమై ప్రభుత్వానికి విన్నవించిన కారణంగా ఎన్‌డిటివీ వాదనలు చెప్పుకొనేందుకు మరో అవకాశం ఇస్తున్నామంటూ నిషేధ నిర్ణయం అమలును వాయిదా వేసుకుంది. రద్దు చేయలేదు. ఈ ప్రకటన చేయబోయే ముందు సాయంత్రం వరకు నిషేధాన్ని సమర్ధించిన సమాచార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు రాత్రికి నిషేధాన్ని నిలిపివేసినట్లు అధికారుల చేత ప్రకటన చేయించారు. నవంబరు ఎనిమిదవ తేదీన ఎన్‌డిటివీ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ఇద్దరు జడ్జీల సుప్రీం కోర్టు బెంచ్‌ తదుపరి విచారణను డిసెంబరు ఐదవ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం విధించిన నిషేధం అమలును వాయిదా వేసినందున ప్రసారంపై అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని వుభయపక్షాల అంగీకరించటంతో కోర్టు వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం మరొక మలుపు తిరిగింది.

    సమస్య తాత్కాలికంగా సర్దుమణిగింది, నిషేధాన్ని వాయిదా వేశారు తప్ప ఎత్తివేయలేదు. అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకీ చర్యకు పాల్పడింది. మీడియా, ప్రజాస్వామిక వాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పర్యవసానాలేమిటి ? ఎప్పటి మాదిరే దీనిపై కూడా ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యాసం రాసే సమయం వరకు నోరు విప్పలేదు. కనీసం ట్విటర్‌ ద్వారా కూడా స్పందించలేదు. మన్‌కీ బాత్‌లో ఏమైనా బయటపడతారో లేదో చూడాలి. తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై నోరు విప్పకపోవటం నరేంద్రమోడీ వ్యవహార శైలి అన్నది గత రెండున్నర సంవత్సరాల అనుభవం రుజువు చేసింది.

    ప్రతి తరం అత్యవసర పరిస్థితి నాటి కాలాన్ని నిష్పక్షపాతంగా చూస్తే మరొక నేత ఎవరూ అటువంటి తప్పు చేయాలన్న తలంపుకే రారు అని ప్రధాని నరేంద్రమోడీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక అవార్డుల సభలో వుద్బోధ చేశారు. చిత్రంగా ఆ మరుసటి రోజే అత్యవసర పరిస్థితిని ప్రకటించకుండానే ఎన్‌డిటివీపై ఆ కాలం నాటి నిరంకుశ వైఖరిని ప్రతిబింబిస్తూ ఒక రోజు నిషేధం విధించటం గమనించాల్సిన అంశం. నరేంద్రమోడీకి తెలియకుండానే ఇది జరిగిందా అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. ఇదొక ముఖ్యపరిణామం, అందునా మోడీ అంతరంగం అందరికంటే బాగా ఎరిగిన వెంకయ్య నాయుడు శాఖ, మీడియా స్వేచ్చకు సంబంధించింది, దీని పర్యవసానాల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు అని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రక్షణ, హోం, తదితర అంతర మంత్రిత్వశాఖల కమిటీ సిఫార్సుల మేరకు నవంబరు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి పదవ తేదీ అర్ధరాత్రి వరకు కార్యక్రమాల ప్రసారాన్ని నిషేధించారు. ఈ ఏడాది జనవరి రెండు నుంచి ఐదువ తేదీ వరకు పఠాన్‌కోట్‌ సైనిక కేంద్రంపై పాకిస్ధాన్‌ వైపు నుంచి ప్రవేశించిన తీవ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఆ దాడికి సంబంధించి జనవరి నాలుగవ తేదీన ఎన్‌డిటివి ప్రసారం చేసిన అంశాలలో మన రక్షణ రహస్యాలను బహిర్గతం చేశారని ప్రభుత్వం ఆరోపించింది. అందుకు గాను 30 రోజుల పాటు నిషేధం విధించాల్సి వున్నప్పటికీ ఒక రోజుకు పరిమితం చేసినట్లు తెలిపింది.ఈ చర్య మీడియా స్వేచ్ఛను ప్రత్యక్షంగా వుల్లంఘించటమే అని, అత్యవసర పరిస్థితి నాటి అవశేషమిదని కూడా భారత సంపాదకుల మండలి (ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా) పేర్కొన్నది.

     జనవరి నాలుగవ తేదీన ఎన్‌డిటివి వార్తలను ప్రసారం చేయగా 29వ తేదీన సమాచార, ప్రసార శాఖ సంజాయిషీ నోటీసు జారీ చేసింది. వ్యూహాత్మకంగా రహస్యమైన సమాచారాన్ని ప్రసారం చేసినందున భద్రతా దళాలు చేపట్టిన ప్రతిక్రియలను అడ్డుకొనేందుకు నేరం చేసిన వారు వుపయోగించుకొనే అవకాశం వున్నందున, అది నిబంధనలకు విరుద్దమైనందునా ఎందుకు ప్రసారం చేశారో సంజాయిషీ ఇవ్వాలని దానిలో కోరింది.2015లో సవరించిన 1995 కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌(నియంత్రణ) చట్టం ప్రకారం భద్రతా దళాలు చేపట్టే ఏ విధమైన వుగ్రవాద నిరోధక చర్యలనైనా ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఆ చట్టం నిర్దేశించిన ప్రసార స్మృతిలో పేర్కొన్నారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్ధావరంపై పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వుగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు మిలిటరీ జవాన్లు, ఒక పౌరుడు మరణించారు. తీవ్రవాదులు దాడి కొనసాగుతుండగానే జనవరి నాలుగున ఎన్‌డిటివి రిపోర్టర్‌ ఆ వార్తలో చెప్పిన అంశం ఇలా వుందని ప్రభుత్వం పేర్కొన్నది.’ ఇద్దరు మిలిటెంట్లు ఇంకా సజీవంగానే వున్నారు, వారు మందుగుండు సామగ్రి డిపో పక్కనే వున్నారు. మిలిటెంట్లు మందుగుండు సామగ్రి డిపోను చేరుకున్నట్లయితే వారిని నిర్వీర్యం చేయటం కష్టమౌతుందని దాడిని ఎదుర్కొంటున్న జవాన్లు ఆందోళన చెందుతున్నారు.’ అని వ్యాఖ్యానించారని, ఆ ప్రసారంలో వైమానిక స్ధావరం గురించి కూడా సమాచారాన్ని వెల్లడించారంటూ ‘ దానిలో మిగ్‌ యుద్ధ విమానాలు, రాకెట్‌ లాంచర్లు, మోర్టార్లు, హెలికాప్టర్లు, ఇంధన నిల్వలు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు వున్నాయని కూడా పేర్కొన్నట్లు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో తెలిపింది.ఈ సమాచారాన్ని స్వయంగా టెర్రరిస్టులు లేదా వారిని ప్రయోగిస్తున్నవారు గానీ వుపయోగించుకోవచ్చని పేర్కొన్నది.

  చట్టం ముందు ఎన్‌డిటివీగానీ మరొక ఛానల్‌ గాని అమలులో వున్న నిబంధనలను పాటించాలనటంలో ఎలాంటి విబేధం లేదు, ఎవరూ అందుకు విరుద్ధంగా మాట్లాడటం లేదు. ఎవరైనా అలా చేస్త్తే చర్యతీసుకోవాలి, చట్టం తనపని తాను చేసుకుపోతుంది. అందుకు కోర్టులు, చట్టాలున్నాయి. చట్ట ప్రకారం తప్పుచేస్తే అందరికీ దండన విధించాలి. ఎన్‌డిటివీ, దానిపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న సంపాదకుల మండలి, ప్రయివేటు టీవీ ఛానల్స్‌ సభ్యులుగా వున్న నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ ఇతర అనేక జర్నలిస్టు సంఘాల అభ్యంతరం కూడా అలాంటి వార్తలనే ఇచ్చిన ఇతర సంస్ధలపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఒక్కదానిపై మాత్రమే దండన ఎందుకు విధిస్తున్నారన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. ఏదైనా ఒక శిక్ష అది చిన్నదా పెద్దదా అనేదానితో నిమిత్తం లేకుండా తగిన అధికారాలుగల సంస్ధ లేదా పదవిలో వున్నవారు మాత్రమే విధించాలి. కానీ శిక్ష విధించే అధికారాన్ని సమాచార,మంత్రిత్వశాఖ తనకు తాను పుచ్చుకోవటం ఏమిటని కూడా మీడియా సంస్ధలు సవాలు చేశాయి.

    ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు ఫిబ్రవరి ఐదున ఎన్‌డిటివీ సమాధానమిచ్చింది. తమ వార్త బాధ్యతాయుతంగా,సముచితంగా వుందని, వార్తలో పేర్కొన్న అంశాలు తాము ప్రసారం చేయటానికి ముందే వార్తా పత్రికలలో వచ్చాయని తెలిపింది. వాటికి సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వానికి తెలిపింది. జనవరి మూడవ తేదీన ఐఎఎన్‌ఎస్‌ (వార్తా సంస్ధ) ఇచ్చిన వార్తను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిందని, దానిలో ‘మిగ్‌ 21 యుద్ధ విమానాలు, ఎంఐ 35 యుద్ధ హెలికాప్టర్లు, ఇతర ముఖ్యమైన సొత్తు ‘ వైమానిక స్ధావరంలో వుందని దానిలో పేర్కొన్నారు. జనవరి మూడున టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో వుపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, నిఘారాడార్లు వున్నాయని తెలిపారు. జనవరి నాలుగున ఒక సైనిక బ్రిగేడియర్‌ను వుటంకిస్తూ హిందుస్తాన్‌ టైమ్స్‌ పత్రిక ‘ ఇద్దరు వుగ్రవాదులు ఒక రెండంతస్ధుల భవనంలో వుండిపోయారని, అక్కడ వైమానిక దళ సిబ్బంది నివాసముంటారని ‘ పేర్కొన్నది. వాటిపై తీసుకోని చర్య తమకు ఎలా వర్తిస్తుందని ఎన్‌డిటివీ ప్రశ్నించింది.

     నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బిఏ) సెక్రటరీ జనరల్‌ ఆనీ జోసెఫ్‌ ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వ చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వార్తలను ఇతర మీడియా కూడా ఇచ్చిందని అవన్నీ బహిరంగంగా అందుబాటులోనే వున్నాయని పేర్కొంటూ ఎన్‌డిటివీ ఒక్కదానిపైనే చర్య తీసుకోవటం ఆశ్చర్యంగా వుందన్నారు. అంతర మంత్రిత్వ శాఖల కమిటీ, సమాచార మంత్రిత్వశాఖ ఈ అంశాన్ని కేబుల్‌ చట్టంలోని పక్కా నిబంధనల మేరకు గాక రాజ్యాంగంలో హామీ ఇచ్చిన మీడియా స్వేచ్చ కోణం నుంచి చూడాలని, ఒక వేళ ఎన్‌డిటివీ నిబంధనలను వుల్లంఘించిదనుకుంటే ఆ విషయాన్ని ఎన్‌బిఏ ఏర్పాటు చేసిన స్వయం నియంత్రణ సంస్ధ న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్స్‌ అధారిటీ (ఎన్‌బిఎస్‌ఏ)కు నివేదించి వుండాల్సిందని, ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఎన్‌బిఏ కోరింది.

   ప్రభుత్వ నిర్ణయం అసాధారణమైందని ఖండిస్తూ తక్షణమే వెనక్కు తీసుకోవాలని భారత సంపాదకుల మండలి కోరింది.’ ఒక ఛానల్‌ను ఒక రోజు పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకోవటం మీడియా, తద్వారా దేశ పౌరుల స్వేచ్చపై ప్రత్యక్ష వుల్లంఘన, అంతేకాదు కఠినమైన సెన్సార్‌షిప్పును విధించటం అత్యవసరపరిస్థితి నాటి అవశేషమే. వార్తలు ఇచ్చిన తీరుతో ఎప్పుడైనా ప్రభుత్వం అంగీకరించకపోతే మీడియా పనిలో జోక్యం చేసుకొనే అధికారాన్ని స్వయంగా పుచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రసారాలను నిలిపివేయటం ఇదే మొదటిసారి. బాధ్యతా రహితంగా వార్తలను ఇచ్చినపుడు పౌరులు, రాజ్యానికి కోర్టు ద్వారా చర్యలు తీసుకోవటానికి చట్టపరమైన పలు పరిష్కార మార్గాలు వున్నాయి. న్యాయపరమైన జోక్యం లేకుండా నిషేధం విధింపు స్వేచ్చ, న్యాయమనే ప్రాధమిక సూత్రాలను వుల్లంఘించటమే.’ అని తన ప్రకటనలో పేర్కొన్నది. బ్రాడ్‌కాస్టర్స్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ కూడా ఒక ప్రకటన చేసింది.నిషేధం విధించటం భావ ప్రకటనా స్వేచ్చను వుల్లంఘించటమే అని, నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని కోరింది. ఈ వుదంతంపై తరువాత ఒక సమగ్రనివేదికను తయారు చేస్తామని తెలిపింది.

     ఎన్‌డిటీవిపై నిషేధాన్ని మీడియా రంగానికి చెందిన ఎడిటర్స్‌ గిల్డ్‌, బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌, అనేక జర్నలిస్టు సంఘాలు వ్యతిరేకించాయి. కారణాలు ఏమైనప్పటికీ కొంత మంది మౌనం పాటించారు. నిషేధాన్ని విమర్శిస్తే కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్‌డియే పక్షాల రాష్ట్ర ప్రభుత్వాలకు కోపం వస్తుందని కావచ్చు, కొన్ని మీడియా సంస్ధలు ఆ విషయాన్ని ప్రచురించకుండా లేదా అప్రాధాన్యత ఇచ్చిగానీ మొత్తం మీద ఏదో తప్పనిసరై వార్త ఇవ్వాల్సి వచ్చిందిగానీ ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదన్న సందేశాన్ని చేరవేశాయి. జెఎన్‌యు విద్యార్ధుల జాతీయ వ్యతిరేక నినాదాల ఆరోపణల గురించి నకిలీ వీడియోలను ప్రసారం చేసిన జీ మీడియా , ప్రముఖ పారిశ్రామిక సంస్ధ ఎస్సెల్‌ గ్రూప్‌ అధిపతి, రాజ్యసభ సభ్యుడిగా వున్న సుభాష్‌ చంద్ర మాత్రం ఎన్‌డిటివీని ఒక రోజు నిషేధించటం అన్యాయం, చిన్న శిక్ష , అసలు పూర్తిగా నిషేధించాలని ప్రకటించారు. ఒక వేళ అది కోర్టుకు వెళ్లినా అక్కడ చీవాట్లు తింటుందని కూడా ముందే చెప్పారు. అంతేకాదు, యుపిఏ హయాంలో తమ జీ న్యూస్‌ను నిషేధించాలనే ప్రతిపాదన వచ్చినపుడు మేథావులు, ఎడిటర్స్‌ గిల్డ్‌, ఎన్‌డిటివీ కూడా మౌనం వహించాయని కూడా సుభాష్‌ చంద్ర పేర్కొన్నారు.

    నిబంధనలను వుల్లంఘించినందుకు గాను ప్రభుత్వం 2005 నుంచి 28సార్లు ఇలా నిషేధ నోటీసులు జారీ చేసిందని వాటిలో 21 యుపిఏ హయాంలో జారీ అయినవే అని అధికారుల ద్వారా ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకొనేందుకు చూసింది. దానిలో భాగంగానే ఎన్‌డిటీవీ తరువాత మరో రెండు ఛానల్స్‌పై తీసుకున్న చర్యలను వెల్లడించింది. ఇది జనాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడ. నిబంధనలను వుల్లంఘించి అన్ని ఛానల్స్‌, పత్రికలపై చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టటం లేదు. ఒకే తప్పు చేసిన మిగతావారిని వదలి ఒక్క ఎన్‌డిటివీపై మాత్రమే ఎందుకు చర్య తీసుకున్నారు? అన్నదే ప్రశ్న. గతంలో చర్యలు తీసుకున్నపుడు ఆయా ఛానల్స్‌ నిషేధాన్ని సవాలు చేయలేదు. అంటే అవి తప్పు చేసినట్లు అంగీకరించినట్లే. వాటిలో బూతు దృశ్యాలను చూపించిన కేసులు కూడా వున్నాయి.

    మీడియాలోని ప్రభుత్వ భక్తులు కొందరు విచిత్ర వాదనలను ముందుకు తెస్తున్నారు. భారత్‌లో మీడియా స్వేచ్చ తక్కువగానే వుందని చెబుతారు. అయితే అంటూ చైనా, బంగ్లాదేశ్‌, టర్కీ వంటి దేశాలలో ఇంతకంటే దారుణంగా వున్నాయనే వాదనలను ముందుకు తెస్తున్నారు.అంటే నిషేధాన్ని సమర్ధిస్తున్నట్లా ? మనకు కావాల్సిన నేత ఎలా వుండాలంటే ఎవరైనా గాంధీ గురించి చెబుతారు తప్ప అనేక మందితో పోల్చితే గాడ్సే మంచివాడే అన్నట్లుగా వుంది ఈ సమర్ధన. మన కంటే పత్రికా స్వేచ్చ మెరుగ్గా వున్న దేశాలతో పోల్చుకుంటే మనం ఎక్కడ ? ఇలాంటి చర్యలతో మనం ఎక్కడకు పోతున్నాం అన్నది ప్రశ్న.

    తన తప్పుడు చర్యను సమర్ధించుకొనేందుకు ప్రభుత్వం అనేక అసంబద్ద కారణాలను చూపుతోంది. టీవీ ఛానల్స్‌లో విలేకర్లు చెప్పిన సమాచారాన్ని వుగ్రవాదులు వుపయోగించుకొని దాడులు చేసే ప్రమాదం వుందట. వెనుకటి కెవడో అమాయకుడు నా పేరు ఫలానా రెడ్డి నీకు తెలివి వుంటే నా కులం ఏమిటో కనుక్కో అన్నాడట. ఏ దేశంలో అయినా సైనిక శిబిరాలలో సైనికులు, ట్యాంకులు, విమానాలు, మందుగుండు సామాగ్రి వుంటుందని వేరొకరు చెప్పాల్సిన అవసరం వుంటుందా ? అంతెందుకు మన ప్రభుత్వం ప్రకటించినట్లు మన సైన్యం జయప్రదంగా నిర్వహించిన సర్జికల్‌ దాడులు ఎక్కడ జరపాలో మన సైన్యం ఏ టీవీ, పత్రికా వార్తలను చూసి నిర్ణయించుకుందో ఎవరైనా చెప్పగలరా ? గూగుల్‌ మాప్‌లను చూస్తే ఎక్కడ ఏ సంస్ధలు వున్నాయో, ఎలా వెళ్లాలో కూడా ప్రపంచానికంతటికీ తెలుసు. అయినా దాడికి తెగబడిన వుగ్రవాదులు గానీ లేదా వారిని అంతంచేసేందుకు పూనుకున్న సాయుధ బలగాలు గానీ టీవీ వార్తలు చూసి తమ దాడి, ప్రతిదాడి వ్యూహాలను నిర్ణయించుకుంటారా ? ప్రభుత్వ వాదన ప్రకారమైతే దాడులకు ఒక చేత్తో ఆయుధం, మరో చేత్తో టీవీ పట్టుకోవాలి. పోనీ టీవీలో ఒక ఛానల్‌ కాదుగా అనేక ఛానల్స్‌ వుంటాయి. ఏ ఛానల్‌ ఏ సమాచారం తెలుస్తుందో రిమోట్‌లు నొక్కుతూ కాలక్షేపం చేస్తారా ? ఫఠాన్‌ కోట సైనిక శిబిరంపై దాడికి తెగబడ్డ వుగ్రవాదులను అంతం చేసిన మన సైన్యం వారి శవాల వద్ద టీవీ సెట్లు వున్నట్లు చెప్పలేదు. అత్యాధునికమైన ఇతర పరికరాలతో వారు ప్రవేశించినట్లు కదా ప్రకటించారు.

     ఒక వుదంతం గురించి దాదాపు ఒకే విధంగా వార్తలు ఇచ్చిన పత్రికలు, ఛానల్స్‌లో ఒక్క సంస్ధను మాత్రమే వేరు చేసి చర్య తీసుకోవటం వెనుక ఇతర కారణాలు వున్నాయా ? మోడీ సర్కార్‌ వివక్షను ప్రదర్శించిందా ? ఢిల్లీలోని ఆంగ్ల పత్రికలు, న్యూస్‌ ఛానల్స్‌ తమ పార్టీకి వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అన్యాపదేశంగా గతంలో తరచూ ఆరోపించేది. ఇప్పుడు కూడా మీడియా పట్ల ఆ పార్టీ, దాని మిత్రపక్షాలకు సదభిప్రాయం లేదు. విమర్శనాత్మకంగా వుండటమే దానికి కారణం.విలేకర్లను ప్రెస్టిట్యూట్స్‌ అని ఏకంగా కేంద్రమంతి వికె సింగ్‌ నిందించారు. ఇంతకాలమైనా ప్రధాని నరేంద్రమోడీ మీడియాను కలవకుండా తప్పించుకోవటానికి ఆంగ్ల భాషా సమస్యతో పాటు ఇదొక కారణమని కూడా చెబుతారు.

    ఎన్‌డిటివీ విషయానికి వస్తే ఆ ఛానల్‌ అన్నా, దానిలో పనిచేసిన కొందరు జర్నలిస్టులన్నా నరేంద్రమోడీకి పడదు. బిజెపికి వీరాభిమాని అయిన జర్నలిస్టు, రచయిత్రి అయిన మధు కిష్వెర్‌ 2013లో మోడీ నామా పేరుతో తన పత్రికలో నరేంద్రమోడీ గురించి ఆకాశానికెత్తుతూ అనేక వ్యాసాలు రాశారు, తరువాత వాటిని పుస్తకంగా ప్రచురించారు.2014లో ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ ఆమెకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు జర్నలిస్టులు బర్ఖాదత్‌, రాజదీప్‌ సర్దేశాయి కారణంగానే 2002లో గుజరాత్‌లో ఘర్షణలు చెలరేగాయని మోడీ ఆరోపించారు. ‘తొలి 72 గంటలు(నాలుగు రోజులు) ఘర్షణలు అదుపులో వున్నాయి. తరువాత ఏమైంది ? కొన్ని సంఘటనలను జర్నలిస్టులు సంచలనాత్మకం గావించారు. సూరత్‌ నుంచి బర్ఖాదత్‌, ఒక దేవాలయ్యాన్ని విధ్వంసం చేశారని అంజార్‌ నుంచి సర్దేశాయి ప్రత్యక్ష ప్రసారాలలో వార్తలను అందించారు. సూరత్‌ నగరం ప్రశాంతంగా వుందని, అక్కడ పోలీసులెవరూ లేనందున అలజడులు జరిగే అవకాశముందని బర్ఖాదత్‌ పదే పదే చెప్పారని, ఆమెను పిలిచి మీరు విధ్వంసకారులను సూరత్‌కు ఆహ్వానిస్తున్నారా అని నిలదీశానని, ఆరోజే ఆ ఛానల్‌ను తాను నిషేధించానని మోడీ చెప్పారు. అయితే తరువాత తానసలు సూరత్‌ వెళ్లలేదని బర్ఖాదత్‌ వివరణ ఇచ్చారని వార్తలు వచ్చాయి. నిజానికి గుజరాత్‌ మారణకాండ సందర్భంగా అనేక ఛానల్స్‌ సంచలనాత్మక కధనాలు ఇచ్చినప్పటికీ నరేంద్రమోడీ వాటిని పట్టించుకోలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ఒక్క ఎన్‌డిటీవితో తప్ప ఇతర అన్ని ఛానల్స్‌కు ఇంటర్వూ ఇచ్చారు.

    ఇటీవలి కాలంలో ఢిల్లీ జెఎన్‌యు ఘటనలు, గుజరాత్‌లో అమిత్‌ షా సభను ఆటంక పరిచిన పటేళ్ల ఆందోళన, దళితులపై దాడులకు వ్యతిరేకంగా జరిగిన జరిగిన యాత్ర, గుజరాత్‌ దళితనేత జిగ్నేష్‌ మేవానీ, గుజరాత్‌లో అమ్‌ పార్టీ నేత కేజిరీవాల్‌ సభ గురించి బిజెపి, నరేంద్రమోడీ అండ్‌కోకు నచ్చని రీతిలో ఎన్‌డిటివీ వార్తలను ప్రసారం చేసింది. జెఎన్‌యు ఘటనల సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్‌ వ్యవహరించిన తీరును ఎండగడుతూ ఎన్‌డిటివీ హిందీ ఛానల్‌ అరగంటపాటు బొమ్మలు లేకుండా కేవలం అక్షరాలనే ప్రదర్శించి తనదైన శైలిలో వ్యవహరించింది. ఇది కూడా బిజెపి నేతలకు ఆగ్రహం తెప్పించింది. పాలకపార్టీ, ప్రభుత్వ తీరుతెన్నులను బహిర్గత పరుస్తున్న కారణంగానే ఎన్‌డిటివీ యాజమాన్య నిర్వహణ, ఆర్ధిక వ్యవహారాల గురించి వేధింపులకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. టేకోవర్‌ నిబంధనలను సరిగా పాటించలేదంటూ సెబి, విదేశీ మారక ద్య్రవ నిబంధనలను వుల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్‌ ద్వారా ఒక నోటీసు పంపి వేధింపులకు పూనుకుందన్న విమర్శలు వున్నాయి.

    భారతీయ జనతా పార్టీ తన అధికారాన్ని వుపయోగించి అధికారుల ద్వారా ఈ విధమైన వేధింపులకు పాల్పడటంతో పాటు ఎన్‌డిటివీపై తన అనుచరగణాన్ని వుసిగొల్పి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున దాడి చేయిస్తున్నది. ఇది ఒక విధంగా బ్లాక్‌ మెయిలింగ్‌ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఒక సంస్ధ తప్పు చేస్తే దానిపై ఫిర్యాదు చేయవచ్చు, కేసులు దాఖలు చేయవచ్చు. కానీ ఆ సంస్ధలలో పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తిగత జీవితాలపై సామాజిక మీడియాలో ప్రచారం చేయటం హేయం. అది ముదిరితే ఏదో ఒకనాటికి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు బిజెపి, దాని నేతలపైన కూడా దానిని ప్రయోగిస్తారని వారు తెలుసుకోవటం లేదు. వారు ఒక్క జర్నలిస్టుల గురించే కాదు, తమను వ్యతిరేకించే వారందరి పట్ల ఇదే విధంగా వ్యవహరిస్తారనే విమర్శ వుంది. స్వంత పార్టీలోనే నరేంద్రమోడీని వ్యతిరేకించిన సంజయ్‌ జోషి ఒక మహిళతో వున్నట్లు చూపే బూతు సీడీలను ఆ పార్టీ వారే పంపిణీ చేయించారనే విమర్శలు వున్న విషయం తెలిసిందే. ఆ సంజయ్‌ జోషికి తిరిగి పార్టీలో పదవి ఇచ్చినందుకు గాను పదవి నుంచి తొలగించే వరకు తాను పార్టీ సమావేశాలకు రానని 2009లో నరేంద్రమోడీ బెదిరించిన విషయం, అందుకు పార్టీ తలొగ్గిన విషయం తెలిసిందే. అందువలన ఒక ఛానల్‌, ఒక పత్రికపై జరుగుతున్న దాడిగా దీనిని చూస్తే రాబోయే ముప్పును విస్మరించినట్లే. అధికారంలో వున్న పార్టీ ఈ విధంగా తనకు నచ్చని మీడియాను వేధించటమంటే లొంగదీసుకొని భజన చేయించుకొనేందుకే తప్ప మరొకటి కాదు. ఈ రోజు ఒక పార్టీ అధికారంలో వుంటే రేపు మరొక పార్టీ రావచ్చు. అప్పుడు మరికొన్ని ఛానల్స్‌, పత్రికల పని పట్టవచ్చు. తెలంగాణాలో ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ను కేబుల్‌ ఆపరేట్ల ద్వారా అడ్డుకోవటాన్ని ఖండించిన తెలుగు దేశం పార్టీ తాను అధికారంలో వున్న ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ఛానల్‌ను కూడా అదే పద్దతుల్లో అడ్డుకున్న విషయం చూశాము. ఆంధ్రజ్యోతిని అడ్డుకున్నపుడు సాక్షి మౌనం వహిస్తే సాక్షిపై దాడి జరిగినపుడు ఆంధ్రజ్యోతి కూడా అదే పని చేసింది. ఇది మీడియాలో అవాంఛనీయ పోకడ. యాజమాన్యాల వైఖరి కారణంగా ఆయా సంస్ధలలో పని చేసే జర్నలిస్టులు ఇరకాటంలో పడుతున్నారు. యాజమాన్యాలతో పాటు వారిని కూడా శత్రువులుగా చూస్తున్నారు. ఇప్పుడు ఎన్‌డిటీవి విషయంలో కూడా కొన్ని మీడియా యాజమాన్యాల వైఖరి అలాగే వుంది. పాలకపార్టీలకు ముఖ్యంగా అన్ని వ్యవస్ధలను తమ చెప్పుచేతల్లో వుంచుకోవాలని చూస్తున్న శక్తులకు కావాల్సింది ఇదే. ముందు విమర్శనాత్మకంగా వున్న వాటిని తొక్కిపెడితే మిగిలిన వాటిని అదుపు చేయటం వాటికి చిటికెలో పని. అందుకే జర్నలిస్టులు యాజమాన్యాల వైఖరితో నిమిత్తం లేకుండా స్వతంత్ర వైఖరిని కలిగి వుండి, మీడియా, తద్వారా భావ ప్రకటనా స్వేచ్చపై జరిగే దాడిని ఎదుర్కోవటంలో ముందుండటం అవసరం.

గమనిక :నవంబరు నెల వర్కింగ్‌ జర్నలిస్టు సమాచార స్రవంతి మాస పత్రికలో ప్రచురణ నిమిత్తం రాసినది