Tags
Mody's sarkar, Narendra Modi, petro surgical looty, petrol price, petrol price build up, petrol price build up in india, subsidies
మోడీ పాలనా విధానం దానికి గుజరాత్ నమూనా అంటారో లేక న్యూఢిల్లీ నమూనా అని పేరు పెడతారో తెలియదు గానీ జనం కోల్పోయిన సబ్సిడీల మొత్తం రు. 1,16,167 కోట్లు, తమ జేబుల్లోంచి అదనంగా చెల్లించింది లక్ష కోట్లు, అంటే మొత్తం జరిగిన లూటీ రు 2,16,000 కోట్లు, అదీ ఒక్క ఏడాదికి మాత్రమే సుమా ! ఇది ఒక్క పెట్రోలియం రంగంలో చేసిన మాజిక్ మాత్రమే. పోనీ పెట్రోలియం సబ్సిడీలు ఎత్తివేసి గతంలో లేని అదనపు సంక్షేమ కార్యక్రమం ఏదైనా ప్రారంభించారా అంటే లేదు. వుంటే చెప్పమనండి.
ఎం కోటేశ్వరరావు
చెప్పింది వినటం, గొర్రెల్లా తలూపటం తప్ప ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు వేస్తే దేశద్రోహులుగా పరిగణించే రోజులివి. అయినా సరే గట్టిగా ఎవరైనా కాదంటే నరేంద్రమోడీ భక్తులు భౌతిక దాడులకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. అంతగా అసహనం పెరిగిపోయింది. అలాంటి స్ధితిలో మన కంటే పాకిస్థాన్‌లో పెట్రోలు ధరలు ఎందుకు తక్కువగా వున్నాయి అని ఎవరైనా ప్రశ్నించి బతక్కగ్గలరా ? నిజంగా అక్కడ తక్కువగా వున్నాయా ? అయినా అడగక తప్పదు. అయితే వారి వద్ద సమాధానం వుండదు. లేదూ ఎవరైనా స్వంతబుర్రలు వున్నవారు వుంటే వారికి తెలిసినా చెప్పరు. సామాజిక మీడియాలో దీనికి సంబంధించిన చర్చ ప్రస్తావనకు వచ్చినపుడు వస్తున్న సమాధానాలు చదివిన తరువాత కలిగిన అభిప్రాయమిది. ఒక పోస్టులో పాకిస్థాన్‌లో పెట్రోలు లీటరు 26 రూపాయలు అని సామాజిక మీడియాలో తిరుగుతున్నది. కొందరు వాస్తవాలు సరిచూసుకోవాలని చెప్పారు. మరికొందరు పెంచిన పన్నులు యుపిఏ హయంలో నిర్ణయించినవి తప్ప మోడీ సర్కార్ పెంచలేదు అన్నారు. మరికొందరు జిఎస్టి అమలులోకి వచ్చిన తరువాత ధరలు తగ్గుతాయి అన్నారు.
ఏ కారణం చేత అయినా మోడీ భక్తులలో తెలివిగల వారు, నిజాలు తెలిసిన వారు వాస్తవాలు చెప్పటానికి ఎందుకో జంకుతున్నారు. బహుశా వారికి కూడా ఏదో ఒక ముద్ర వేస్తారని భయం కావచ్చు. వారి పట్ల జాలి చూపుదాం. మన దేశానికి సంబంధించిన సమాచారాన్ని మన చమురు సంస్ధల నుంచే తీసుకోవచ్చు. ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రపంచంలో చమురు రేట్లు గణనీయంగా తగ్గాయి. కావాలంటే దీన్ని కూడా ఆయన సాధించిన విజయాల ఖాతాలోకే వేద్దాం. మన చమురు సంస్ధల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణ విధానాన్ని ఎత్తివేసింది. ఎందుకంటే సంస్ధల మధ్య పోటీ పెరిగి పెట్రోలు, డీజిల్, కిరోసిన్ వంటి పెట్రోలియం వుత్పత్తుల ధరలు తగ్గుతాయని చెప్పింది. అదే సమయంలో జనాన్ని ఆకర్షించేందుకు ప్రపంచంలో ధరలు పెరిగితే ఆమేరకు ఆటోమేటిగ్గా మీకూ పెరుగుతాయి, తగ్గితే అదే మాదిరి తగ్గుతాయంటే జనమంతా నిజమే కదా అనుకున్నారు. ఆ ముసుగులో మన సర్కార్ చేసిందేమిటంటే అప్పటివరకు ఇస్తున్న సబ్సిడీలు తగ్గించేందుకు పూనుకుంది. అన్నింటి మీదా ఒకేసారి తొలగిస్తే వచ్చే ప్రతికూల పర్యవసానాలకు భయపడి క్రమంగా తగ్గించటం ప్రారంభించింది. తొలుత పెట్రోలుపై పూర్తిగా ,తరువాత డీజిల్‌పై క్రమంగా మొత్తం ఎత్తేశారు. ఇప్పుడు కిరోసిన్‌పై ప్రతినెలా కొంత మొత్తం తగ్గిస్తూ రబ్బరు సుత్తితో కొడుతున్నారు. సబ్సిడీలు ఎత్తివేసినప్పటికీ ప్రపంచ మార్కెట్లో తగ్గిన మేరకు మన వినియోగదారులకు ధరలు తగ్గకపోగా పెరిగాయి అన్న నిజాన్ని మోడీ భక్తులు ఒక పట్టాన అంగీకరించరు.
పెట్రోలియం రంగం మన ఖజానాకు సంపాదించి పెడుతున్న సొమ్ము కాస్తా కూస్తా కాదు. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో అన్ని రకాల ఆదాయం రు. 3,05,360 కోట్లు (అక్షరాలా మూడు లక్షల ఐదువేల మూడు వందల అరవై కోట్లు) ఇది 2014-15లో 3,32,620 కోట్లు, 2015-16లో 4,18,652, వర్తమాన ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో 1,02,711 కోట్లు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఏ ప్రభుత్వం 2010 జూన్ 25 నుంచి పెట్రోల్‌పై సబ్సిడీని పూర్తిగా తగ్గించి వేసింది. మోడీ అధికారానికి వచ్చాక 2014 అక్టోబరు 18 నుంచి డీజిల్‌పై పూర్తిగా రద్దు చేశారు. ప్రస్తుతం ప్రజాపంపిణీ వ్యవస్ద ద్వారా సరఫరా చేసే కిరోసిన్‌పై మాత్రమే కొనసాగిస్తున్నారు. యుపిఏ హయాంలో 2013-14లో పెట్రోలియం వుత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం భరించిన సబ్సిడీ మొత్తం రు.1,43,738కోట్లు కాగా మోడీ వచ్చాక 2014-15లో 76,282 కోట్లకు 2015-16లో రు.27,571 కోట్లకు తగ్గిపోయింది. ఆదా రు. 1,16,167 కోట్లు. కిరోసిన్‌పై కూడా పూర్తిగా పుణ్యం కట్టుకుంటే ఏడాదికి రు.1,43,738కోట్లు మిగిలినట్లే . ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 2013-14లో ఎక్సైజ్ పన్ను రూపంలో 77,982 కోట్లు, 2014-15లో 99,184 కోట్లు, 2015-16లో 1,78,591 కోట్లకు పెరిగింది. పెరిగిన ఆదాయం లక్ష కోట్లరూపాయలు. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు పెట్రోలియం వాడకం పెరిగింది కదా ఆ మేరకు ఆదాయం పెరిగి వుండవచ్చు అన్న సందేహం వెలిబుచ్చవచ్చు. రెండు సంవత్సరాలలో వినియోగం రెట్టింపు పెరగటం అనేది ఏ దేశ చరిత్రలోనూ లేదు. మన వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్ మరియు విశ్లేషణ విభాగం (పిపిఏసి http://ppac.org.in/content/147_1_ConsumptionPetroleum.aspx ) ప్రకారం 2013-14లో అన్ని రకాల పెట్రోలియం వుత్పత్తుల వినియోగం నెలవారీ సగటు 1,32,00,583 టన్నులు 2015-16లో 1,53,87,000 టన్నులు. వర్తమాన సంవత్సరంలో అక్టోబరు వరకు నెల సగటు 1,61,69,428 టన్నులు. మోడీ భక్తులేమో కొత్తగా పన్నులు పెంచలేదంటారు, అయితే ఆదాయం ఇంత పెరుగుదల ఎలా సాధ్యమైంది? మోడీ మంత్రం వేసి పెంచారా ? మోడీ పాలనా విధానం దానికి గుజరాత్ నమూనా అంటారో లేక న్యూఢిల్లీ నమూనా అని పేరు పెడతారో తెలియదు గానీ జనం కోల్పోయిన సబ్సిడీల మొత్తం రు. 1,16,167 కోట్లు, తమ జేబుల్లోంచి అదనంగా చెల్లించింది లక్ష కోట్లు, అంటే మొత్తం జరిగిన లూటీ రు 2,16,000 కోట్లు, అదీ ఒక్క ఏడాదికి మాత్రమే సుమా ! ఇది ఒక్క పెట్రోలియం రంగంలో చేసిన మాజిక్ మాత్రమే. పోనీ పెట్రోలియం సబ్సిడీలు ఎత్తివేసి గతంలో లేని అదనపు సంక్షేమ కార్యక్రమం ఏదైనా ప్రారంభించారా అంటే లేదు. వుంటే చెప్పమనండి. మన దేశంలోకి వుగ్రవాదులను పంపిన పాక్‌పై మన సైన్యం సర్జికల్ దాడులు చేస్తే మనమంతా అభినందించాం. దానికైన ఖర్చు వందల కోట్లు లేదా అంతకంటే తక్కువే కావచ్చు. కానీ మోడీ సర్కార్ ప్రతి ఏటా జనంపై పెట్రో రంగంలో జరుపుతున్న సర్జికల్ దాడులవలన జనానికి వదులుతున్న చేతి చమురు మాత్రం రెండు లక్షల కోట్లకు పైమాటే.
పెట్రోలియం రంగం నుంచి ఒక్క ఏడాదిలో లక్ష కోట్ల అదనపు ఆదాయాన్ని ఎలా పిండారు ? 2014 మార్చినెల ఒకటవ తేదీన అంతర్జాతీయ మార్కెట్లో పీపా చమురు ధర రవాణా ఖర్చుతో సహా 118 డాలర్లు. ఒక డాలరుకు రూపాయి విలువ రు.62.12 లు. చమురు కంపెనీలు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రు.47.18, డీలరుకు విక్రయించింది రు.49.50, ఎక్సయిజ్ పన్ను రు.9.48, డీలరు కమిషన్ రు.2.02, న్యూఢిల్లీలో వాట్ 20శాతం చొప్పున( రాష్ట్రాల రేటును బట్టి మారుతుంది) రు.12.20, మొత్తం వినియోగదారుడికి (హెచ్‌పి) ధర రు.73.20.
తాజా పరిస్ధితికి వస్తే నవంబరు ఆరున హెచ్‌పి కంపెనీ వివరాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో పీపా చమురు ధర రవాణా ఖర్చుతో సహా 61.87 డాలర్లు. ఒక డాలరుకు రూపాయి విలువ రు.66.81 లు. చమురు కంపెనీలు శుద్ధి కర్మాగారాలకు ఒక లీటరు పెట్రోలుకు చెల్లించిన ధర రు.26.64, డీలరుకు విక్రయించింది రు.29.39 ఎక్సయిజ్ పన్ను రు.21.48, డీలరు కమిషన్ రు.2.43, న్యూఢిల్లీలో వాట్ 27శాతం చొప్పున( రాష్ట్రాల రేటును బట్టి మారుతుంది) రు.14.39, మొత్తం వినియోగదారుడికి (హెచ్‌పి) ధర రు.67.70. ఎక్సయిజ్ పన్ను రు.9.48 నుంచి 21.48కి పెంచటమే ఆదాయ పెరుగుదల రహస్యం.
యుపిఏ హయాంలో రూపాయి విలువ నాటి అర్ధిక మంత్రి వయస్సు పెరిగినట్లు పతనం అవుతోందని స్వయంగా నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు.http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2389308/India-2014-elections-Yes-Yes-Modi-launches-BJPs-poll-campaign-massive-rally-Hyderabad.html మోడీ చెప్పినట్లు 1947లో మన రూపాయి విలువ ఒక డాలరుకు ఒక రూపాయిగా వున్నమాట నిజం. కాంగ్రెస్ దిగిపోయే నాటికి అంటే రు.62.12కు దిగజారింది. అంటే 67 సంవత్సరాలకు సగటున ఏడాదికి 93 పైసలు పడిపోయింది. అదే మోడీ హయాంలో 62.12 నుంచి 66.81కి పతనమైంది. ఏడాదికి రు 2.34 తగ్గిపోయింది. ఇది కూడా మోడీ ఘనతే అంటారా ? మన దేశంలో పెట్రోలు ధరలు తగ్గకపోవటానికి ఇదొక కారణం. అన్నింటి కంటే పై వివరాలను బట్టి నరేంద్రమోడీ హయాంలో బాదిన ఎక్సయిజ్ పన్ను లీటరుకు పన్నెండు రూపాయలు. జనం జేబుల లూటీ ఇక్కడ జరుగుతోంది. దీన్ని కాదనే ధైర్యం ఎవరికైనా వుందా ?
ఇక పాకిస్థాన్‌లో పెట్రోలు ధరలు తక్కువగా వున్నాయని మోడీ భక్తులు అంగీకరిస్తారో లేదో తెలియదు. వారు కూడా మన మాదిరే పెట్రోలు దిగుమతి చేసుకుంటారు. ఈనెల 9వ తేదీన పాకిస్ధాన్లో పెట్రోలు, డీజిల్ ధరలు ఇలా వున్నాయి. అక్కడ పెట్రోలు కంటే డీజిల్ ధరలు ఎక్కువ.http://www.hamariweb.com/finance/petroleum_prices/ దీనిలో వున్న వివరాల ప్రకారం పెట్రోలు ధర రు. 64.27, డీజిల్ ధర రు.72.52 వుంది. వీటిని చూసి మోసపోయే అవకాశం వుంది. రెండు చోట్లా కరెన్సీ రూపాయే అయినప్పటికీ విలువలు వేరు. పై ధరలను మన రూపాయిల్లోకి మారిస్తే డీజిల్ ధర రు.46.44, పెట్రోలు ధర రు.41.15 వుంటుంది. దీనికి కారణం అక్కడ పన్నులు తక్కువగా వుండటమే.http://www.globalpetrolprices.com/gasoline_prices/ ఈ లింక్‌లోని సమాచారం ప్రకారం వివిధ దేశాలలో డాలర్లలో పెట్రో వుత్పత్తుల ధరలు ఎలా వున్నాయో ఎవరైనా పోల్చుకోవచ్చు.
ఇక చాలా మంది పెట్రోలియం వుత్పత్తులను జిఎస్టి పరిధిలోకి తెస్తారని, దాంతో ధరలు తగ్గుతాయనే అభిప్రాయంతో వున్నారు. ఇప్పటి వరకు జరిగిన చర్చలు, వెల్లడైన అభిప్రాయాల ప్రకారం పెట్రోలియం వుత్పత్తులను వెంటనే జిఎస్టి పరిధిలోకి తీసుకురారు. ప్రస్తుతం పెట్రోలు కొనుగోలు ధర లీటరుకు రు.29.39 అయితే దానిపై విధిస్తున్న పన్నులు రు.35.87 వున్నాయి. జిఎస్టి పద్దతిలో పన్ను మీద పన్ను వుండటానికి వీలుండదు. ప్రస్తుతం అన్ని కలుపుకుంటే 122శాతం వసూలు చేస్తున్నారు. ఇంత మొత్తాన్ని వదులుకొని ఏ ప్రభుత్వమైనా పన్ను తగ్గిస్తుందని ఎవరైనా వూహించుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది. అలాంటి వారి భ్రమలను త్వరలోనే నరేంద్రమోడీ తొలగిస్తారని వేరే చెప్పాలా ?