Tags

, , ,

ఎంకెఆర్‌

    దేశంలో వుప్పు కొరత ఏర్పడిందనే పుకారుతో కొద్ది రోజుల క్రితం కిలో ఏడు వందల రూపాయల వరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంత మంది అతిశయోక్తి అని కొట్టివేసినా మూడు వందల రూపాయల వరకు ధరలను పెంచినట్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వార్తలు వెల్లడించాయి. కొంత మంది ఏడాది, రెండు సంవత్సరాలకు సరిపడే పరిమాణంలో వుప్పు బస్తాలను మోసుకుపోవటాన్ని కూడా చూశాము. ఏడున్నరవేల కిలోమీటర్ల పొడవు సముద్రతీరం వున్న దేశంలో వుప్పు కొరత ఏమిటనే ప్రాధమిక ఆలోచన కూడా రాకుండా జనం ఎగబడటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?

   ప్రధాని నరేంద్రమోడీ ‘ఎంతకైనా సమర్ధుడే ‘ అనే గట్టి విశ్వాసం జనంలో వుండటం తప్ప మరొక కారణం కనిపించటం లేదు. గుజరాత్‌లో గోద్రా రైలు వుదంతం దరిమిలా మైనారిటీలపై మారణ కాండ దగ్గర నుంచి తాజా పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వరకు అనేక అంశాలు మోడీ ‘ఖ్యాతిని’ అంతర్జాతీయస్ధాయికి తీసుకుపోయాయి. ప్రతిపక్షాలు ఏమని వర్ణించినా, వ్యాఖ్యానించినా చాలా మంది జనంలో ‘ఎంతకైనా సమర్ధుడే ‘ అనే అభిప్రాయం వుంది. ఆయనపై ఈగను కూడా వాలనివ్వకుండా కాపుకాసే ఆయన భక్తులు పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని బయటకు తీశామన్న సంబరాలలో మునిగిపోయి, సామాజిక మీడియాలో అనుకూల ప్రచారంలో మునిగిపోయారు తప్ప వుప్పు బ్లాక్‌ మార్కెట్‌లోకి పోతుంటే, విపరీత ధరలకు అమ్ముతుంటే, జనాన్ని నిలువు దోపిడీ చేస్తుంటే ఎక్కడా రోడ్ల మీద కనపడలేదు. పుష్కలంగా వుప్పు వుందని మంత్రులు చెప్పినా జనం విశ్వసించలేదెందుకని? అనేక వుదంతాలను చూసినపుడు ఒక విషయం స్పష్టం అవుతోంది. మన వంటి వెనుకబడిన దేశాలలో గుడ్డినమ్మకాలు ప్రబలినపుడు ఇలాంటి పుకార్లు షికార్లు చేయటం చాలా సులభం. నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వంటి వారు తమ మాంత్రిక దండాలతో అద్బుతాలు చేస్తారని చాలా మంది గత రెండున్నర సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. వారు ఏమైనా చేయగలరనే విశ్వాసం ఇంకా బలంగానే వుంది.

    నల్లధనాన్ని వెలికి తీసేందుకంటూ 500,1000 రూపాయల నోట్లను రద్దు చేయటం, వాటి స్ధానంలో తక్షణమే కొత్త కరెన్సీని ప్రవేశపెట్టలేకపోవటం, చిల్లర నోట్ల కొరత కారణంగా సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో నాటకీయంగా నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాన్ని అనేక మంది తొలుత ఎంతగానో సమర్ధించారు. తీరా నోట్ల కొరత ఏర్పడి సామాన్యజనం ఇబ్బందులు పడటాన్ని చూసిన తరువాత వేళ్లమీద లెక్కించదగిన నల్లధనులను గాక కేంద్ర ప్రభుత్వం కోట్లాది తెల్లధనులను ఇబ్బందులకు గురి చేస్తోందని అర్ధం చేసుకున్నారు. ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటికే నిప్పు పెట్టినట్లుగా నల్లధనులు ఎవరో అందరికీ తెలిసినప్పటికీ వారిని పట్టుకోవటం చేతగాని ప్రభుత్వం తమను ఇబ్బందుల పాల్జేయటాన్ని జీర్ణించుకోలేని జనం మోడీ ఎంతకైనా సమర్ధుడే ఏమో గతంలో పప్పుల మాదిరి వుప్పు ధర కూడా కొండెక్కుతుందేమో అని జనం గట్టిగా విశ్వసించటంలో ఆశ్చర్యం ఏముంది? అన్నింటి కంటే ఏదైనా ఒక వస్తువు బ్లాక్‌ మార్కెట్‌లోకి పోతోందంటే ప్రభుత్వాలు దానిని అరికడతాయనే విశ్వాసాన్ని జనం ఎప్పుడో కోల్పోయారు. భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పటికీ వ్యాపారుల ప్రతినిధిగానే చూసేవారు తక్కువేమీ కాదు. దొంగ వ్యాపారులను ఒక్కరిని కూడా శిక్షించిన వుదంతం గత రెండున్నర సంవత్సరాలలో గానీ అంతకు ముందుగానీ జనం చూడలేదు. తమ పార్టీ ప్రత్యేకమైంది అని బిజెపి స్వంత ప్రచారం చేసుకోవటం తప్ప జనంలో అలాంటి భావం లేదని తాజా వుప్పు వుదంతం నిరూపించింది. వుండి వుంటే వుప్పు బ్లాక్‌ మార్కెట్‌ను మోడీ, ఆయన అనుయాయులైన చంద్రబాబు నాయుడు వంటి ముఖ్యమంత్రులు అరికడతారని భరోసాగా వుండేవారు.

    గతేడాది నరేంద్రమోడీ సర్కార్‌ ఇచ్చిన పప్పు షాక్‌ నుంచి జనం తేరుకోలేదు. కోడి మాంసం కంటే పప్పుల ధరలు పెరిగిపోయి చరిత్రలో రికార్డును స్ధాపించిన ఘనత నరేంద్రమోడీదే. జనం ప్రస్తుతం ఆ ధరలకు అలవాటు పడిపోయారు. పప్పుధరలను అరికట్టలేని వారు వుప్పుధర విషయంలో పని చేస్తారన్న విశ్వాసం జనంలో ఎలా కలుగుతుంది? గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలో పప్పుల వుత్పత్తిలో పెద్ద హెచ్చు తగ్గులు లేవు. తొలిసారిగా గరిష్ట మొత్తంలో 2014లో పప్పులను దిగుమతి చేసుకున్న పూర్వరంగం వుంది.కాంగ్రెస్‌ హయాంలో అనేక కుంభకోణాలు జరిగి లక్షల కోట్ల మేరకు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము రాకుండా పోయింది. నరేంద్రమోడీ హయాంలో ఇప్పటివరకు దాదాపు అంతకంటే పెద్ద కుంభకోణమే జరిగింది. గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే మోడీ హయాంలో జనం జేబుల నుంచి సొమ్ముకొట్టి వేశారు. అది వుల్లి , పప్పుల ధరల బ్లాక్‌మార్కెట్‌, ధరల పెంపుదల రూపంలో జరిగింది. ఇలాంటి వాటిలో జనం కోల్పోయిన మొత్తం తక్కువేమీ కాదు.http://indiatoday.intoday.in/story/the-great-indian-dal-scam-revealed/1/527130.html ప్రధాని నరేంద్రమోడీ గట్టి మద్దతుదారైన అదానీ విదేశాల నుంచి చౌకగా పప్పులను దిగుమతి చేసుకొని అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్న విషయం తెలిసిందే.http://www.khabarbar.com/politics/explosive-adani-snatched-dal-from-your-plate-potential-scam-worth-%E2%82%B9190000-crore-unearthed/ . వుల్లి ధరలు కూడా కిలో వందరూపాయల వరకు పెరిగి జనానికి కన్నీళ్లు తెప్పించిన విషయం తెలిసిందే. కొన్ని వేల కోట్ల రూపాయలను కొన్ని వారాలలోనే వ్యాపారులు జనం జేబుల నుంచి లూటీ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇవన్నీ కళ్ల ముందే జరిగాయి.http://www.rediff.com/business/interview/interview-once-in-two-years-onion-crisis-is-bound-to-arise-in-india/20150824.htm అలాగే వుప్పు విషయంలో కూడా ఏదైనా జరుగుతోందో ఏమో అని సామాన్యులకు ఆందోళన కలగకుండా ఎలా వుంటుంది.

   పప్పుల సంగతి జనం మరిచిపోతున్నారు. నోట్ల రద్దు గురించి చేసిన ప్రకటనలు, ఆచరణలో తాము పడిన ఇబ్బందుల పూర్వరంగాన్ని కూడా వుప్పు పుకార్లలో చూడాలి. దొంగ సొమ్ము దాచుకున్న వారి పని పట్టేందుకు రద్దు అని మీడియాలో వూదరగొడుతుంటే బ్యాంకుదగ్గర బారులు దీరిన జనానికి ఒక్క నల్లధన కుబేరుడు కూడా వరసల్లో కనపడలేదు. అందరూ తమబోటి సామాన్యులే. పంటల ధరలు ఆస్మాత్తుగా పడిపోయినపుడు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు జరిగే నష్టాన్ని తలచుకొని రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం అందరికీ తెలుసు. పాత నోట్లను మార్చుకొనేందుకు వరుసల్లో నిలబడి కూలిపోయిన వృద్దులు, పొలం పుట్రా అమ్ముకొని శుభకార్యాలకు దాచుకున్న సొమ్ము పనికిరాకుండా పోయిందని ఆవేదనతో ప్రాణాలు పొగొట్టుకున్న వారి గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. నల్లకుబేరులను దెబ్బతీశానని మోడీ, బిజెపి నేతలు చెప్పటమే తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా రైతుల మాదిరి నల్లడబ్బు పనికిరాకుండా పోయిందని జీవితాన్ని చాలించిన వుదంతాలు, కనీసం ఆసుపత్రి పాలైన ఘటనలు మీడియాలో రాలేదెందుకని? గంటల తరబడి వరుసల్లో నిలబడి తమ వద్ద వున్న నోట్ల మార్పిడి లేదా చెక్కుల ద్వారా బ్యాంకులలో డబ్బు తీసుకొనేందుకు వచ్చిన వారు వుబుసుపోక నల్లధనులు తమ వద్ద వున్న నోట్లను ఎంత సునాయాసంగా తెల్లధనంగా మార్చుకుంటున్నారో కథకథలుగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ చూస్తున్న సామాన్య జనం వుప్పు కొరత ఏర్పడిందంటే నమ్మటంలో, పదులకొద్దీ కిలోలు అధిక ధరలకు కొనేందుకు ఎగబడటంలో ఆశ్చర్యం ఏముంది ?