Tags

, , , , , , ,

అరే నేనేమిటో మీరు చూసింది చాల తక్కువే

ఎం కోటేశ్వరరావు

     పేరులో ఏమున్నది పెన్నిధి అని చులకనగా మాట్లాడారు గానీ పేరులోనే వుంది పెన్నిధి. ఇప్పుడు కుంభకోణాన్ని ఆ పేరుతో పిలవకూడదు. మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు, కుంభకోణం అంటే కుంభకోణం కాదు, నరేంద్రమోడీ అని కొత్త అర్ధాలు రాసుకోవాల్సిన రోజులు వచ్చాయంటున్నారు. కాంగ్రెస్‌ పాలకులు అనేక కుంభకోణాలకు తెరతీశారు. వాటిని దేశమంతా చూసింది. అదే బాటలో బిజెపి పాలకులు నడిస్తే కిక్కేముంటుంది? అంతకంటే పెద్ద కుంభకోణాలకు వారు తెరతీశారు. వాటినింకా జనం చూడలేదు. అంతే తేడా ! కాంగ్రెస్‌ రుణాలిచ్చి విజయమాల్య వంటి వారిని పెద్దలుగా మారిస్తే జనానికి కిక్కు ఎక్కించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ విజయ మాల్యను మర్యాదగా దేశం దాటించటానికి తన తెలివి తేటలను వుపయోగించింది. అలాంటి వారు దేశం విడిచి పోతుంటే ఎక్కడకు పోతున్నారో తెలుసుకోవాలి తప్ప పోవటాన్ని అడ్డగించకూడదన్న మార్గదర్శకాల కారణంగా నిఘాసిబ్బంది అదే పని చేశారు. కాంగ్రెస్‌ పాలకులు రుణాలు ఇస్తే బిజెపి పాలకులు గత రెండున్నర సంవత్సరాలుగా వాటిని ఎడా పెడా రద్దు చేస్తున్నారు. మాల్య వంటి 63 మంది పెద్దలు తమ బ్యాంకులకు ఎగవేసిన మొత్తాలలో తాజా విడతగా 7016 కోట్లను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) రద్దు చేసింది. ఇది గత 23 సంవత్సరాలుగా నడుస్తోంది. ఇప్పుడు పెద్ద రగడ కావటంతో ఇక్కడే పేచీ వచ్చింది. దాన్ని రద్దు అన కూడదు, లెక్కలలో సర్దుబాటు అనాలని,ఆ మొత్తాలను వసూలు చేస్తారని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ సెలవిచ్చారు.ఆంగ్లంలో రైట్‌ ఆఫ్‌ అన్న పదానికి అర్ధం ‘బే వుమ్మేజు, రానిబాకీగా లెక్కలలో తీసివేయుట ‘ అని దిగవల్లి వెంకటశివరావు 1934లో, ‘రద్దు చేయు, తీసివేయు ‘ అని బూదరాజు రాధాకృష్ణ 2008లో అర్ధం చెప్పారు.

     ఈ పేరు, అర్ధం వివాదం రేగగానే మా ప్రాంత పెద రావూరు ఖాతాల వ్యవహారం గుర్తుకు వచ్చింది. నా చిన్నతనంలో మా వూర్లో ఒక వృద్ధుడు నాకు ఫలానా వారి కుటుంబం నుంచి ఇంత బాకీ రావాలి, అంతరావాలి అని కనిపించిన వారందరికీ పెద్ద మొత్తంలో లెక్కలు చెబుతుండే వాడు. అది నిజమేనా అని అడిగితే నిజమే అవన్నీ పెద రావూరు ఖాతాలో వున్నాయి అని పెద్దల నుంచి సమాధానం వచ్చింది. అర్ధం అయ్యేట్లు చెప్పమంటే అవి వచ్చేవి కాదు, పెట్టేవి కాదు, ఆ ముసలోడు అలాగే చెబుతూనే వుంటాడు అన్నారు. ఇప్పుడు జెట్లీ చెబుతున్నది కూడా పెదరావూరు ఖాతాల గురించే మరి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్ధితి నుంచి ఎలా బయటపడాలా అని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఎస్‌బిఐ రుణాల రద్దు వార్త కూడా తోడైంది. అయితే సామాన్యులకు తప్ప కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. తమదంతా ‘పారదర్శపాలన’ అని చెప్పుకుంటారు గనుక దానికి అనుగుణంగా ‘మూసి’పెట్టారు. ప్రభుత్వం ఇబ్బందులలో పడింది అనగానే ఎస్‌బిఐ దానికి ఒక చిట్కాను కనిపెట్టింది. ఆ ఏడువేల కోట్ల రూపాయల మొత్తాన్ని రైటాఫ్‌ (రద్దు) చేయలేదు, మేము అసలు ఆ పదాన్ని వుపసంహరించుకుంటున్నాము. ఆ మొత్తాన్ని ‘వసూలులో వున్న ఖాతా'(ఎయుసి-ఎకౌంట్‌ అండర్‌ కలెక్షన్‌) సొమ్ము అని పిలుస్తున్నాము అంటూ ఒక వివరణ ఇచ్చింది. సామాన్య రైతులు పంటలు పోయి తీసుకున్న రుణం చెల్లించకపోతే వూరంతా టాంటాం వేయిస్తారు.ఇంట్లో సామాను బయటకు వేసి అవమానాలు పాలు చేస్తారు. ఇండ్ల కోసం రుణాలు తీసుకున్నవారు కిస్తీలు చెల్లించకపోతే వారి పేర్లజాబితాను పత్రికలలో ప్రకటించి ఆస్ధులను వేలానికి పెడతారు. బ్యాంకులు వారి మొత్తాలను కూడా ఎయుసి ఖాతాలలో వేసి శక్తి వచ్చినపుడు ఎందుకు వసూలు చేసుకోవు ? బడాబాబుల పేర్లు పత్రికలలో ప్రకటించి ఆస్ధులను ఎందుకు వేలం వేయటం లేదు ?

    సాంకేతికంగా రైట్‌ ఆఫ్‌ అంటే రద్దు కాదన్నది వాస్తవమే. అయితే ఆచరణలో జరుగుతున్నదేమిటో ఆరుణ్‌ జెట్లీ వంటి పెద్దలు, లేదా బ్యాంకర్లు చెప్పటం లేదు. మాల్య వంటి పెద్ద మనుషులకు వేల కోట్ల రూపాయలను అప్పులు, అడ్వాన్సులుగా ఇవ్వటం వారు వాటిని తప్పుడు మార్గాలలో దారి మళ్లించి దాచుకోవటం, తరువాత చెల్లించటంలో విఫలమయ్యారనే పేరుతో కొంత కాలం గడిచిన తరువాత నిరర్ధక ఆస్థుల జాబితాలో ఎక్కించటం, తరువాత రాని బాకీల ఖాతాలో రాయటం, ఆ మేరకు జనం సొమ్మును బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించటంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరితేరింది. అది వారి హయాంలో పిల్లకాలువగా వుండేది. దానిని నరేంద్రమోడీ సర్కార్‌ దానిని ఓడలు ప్రయాణించే పనామా, సూయజ్‌ కాలువల సైజుకు పెంచింది. నరేంద్రమోడీ అనుయాయులైన సరికొత్త దేశభక్తులకు ఇలా అన్నందుకు ఆగ్రహం కలగవచ్చు.http://www.slideshare.net/deepakshenoy/kc-chakrabarty-on-npas-in-india ఇది రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన కెసి చక్రవర్తి తయారు చేసి 2013లో ఒక సమావేశంలో సమర్పించిన పత్రం. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం 2001 మార్చినెలతో అంతమైన ఆర్ధిక సంవత్సరం నుంచి 2013 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరాలలో ప్రభుత్వ, ప్రయివేటు, విదేశీ అన్ని బ్యాంకులు రైట్‌ ఆఫ్‌ (రద్దు ) చేసిన మొత్తం అక్షరాలా ఒక లక్షా 98వేల అరవయ్యారు( 1,98,066) కోట్ల రూపాయలు. ఇదే కాలంలో వసూలు చేసిన మొత్తం కేవలం 37,955 కోట్లు మాత్రమే. దీనికి తనది బాధ్యత ఎలా అవుతుంది అని నరేంద్రమోడీ అమాయకంగా హావభావాన్ని ప్రదర్శించవచ్చు. ఆయన అధికారానికి వచ్చిన తరువాత గత రికార్డులను తిరగరాస్తూ భారీ మొత్తాలలో పెద్దల బకాయిలను రైటాఫ్‌ లేదా రద్దు చేసి అతి పెద్ద భారీ కుంభకోణానికి తెరతీశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానిని తిప్పికొట్టాలంటే తాను అధికారాన్ని స్వీకరించిన తరువాత అన్ని బ్యాంకులు ఎంత మొత్తాన్ని రైటాఫ్‌ చేశాయి, పాత బకాయిలను ఎంత మొత్తం వసూలు చేశాయి అన్న విషయాలను ప్రకటిస్తే చాలు. మిన్నువిరిగి మీద పడ్డా మాట్లాడకూడదని నరేంద్రమోడీ ఒక వ్రతాన్ని పాటిస్తున్నందున ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ అయినా ఆపని చేయాలి. ఎందుకో గానీ ఇంతవరకు వివరాలు చెప్పకుండా అభిమానుల్లో కూడా అనుమానాలకు తెరలేపుతున్నారు.

     ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం ప్రకారం 2013,14,15 ఆర్ధిక సంవత్సరాలలో 29 ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేసిన మొత్తం లక్షా 14వేల కోట్ల రూపాయలు. రిజర్వుబ్యాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2012 మార్చి ఆఖరుకు పారు బాకీలు రు.15,551 కోట్లు కాగా 2015 మార్చినాటికి రు.52,542 కోట్లకు పెరిగాయి. వంద కోట్లు అంతకంటే ఎక్కువ ఎగవేసిన వారి వివరాలు తమ వద్ద లేవని ఆర్‌బిఐ తెలిపింది.2004-15మధ్య రు.2.11లక్షల కోట్లను రద్దు చేయగా వాటిలో లక్షా 14వేల 182 కోట్లు 2013-15 మధ్య చేసినవే వున్నాయి. తొమ్మిది సంవత్సరాలలో కాంగ్రెస్‌ చేయలేని పనిని మూడు సంవత్సరాలలో మోడీ చేశారన్నమాట. ఎంత అభివృద్ధి ? అందుకే పెద్ద కరెన్సీ నోట్ల రద్దును బడా పారిశ్రామికవేత్తలంతా ఆకాశానికి ఎత్తుతున్నారా ? కాంగ్రెస్‌ హయాంలో ఏటా నాలుగు శాతం చొప్పున పెరిగితే 2014,15 సంవత్సరాలలో దేశంలో రెండవ పెద్ద బ్యాంక్‌ అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రద్దు చేసిన బాకీలు 2013-14 మధ్య 98శాతం అయితే మరుసటి ఏడాది 238శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుతం ఏటా 50వేల కోట్లకు పైగానే బకాయిలు పెదరావూరు ఖాతాలోకి పోతున్నాయి.

    ఇలా రద్దు చేయటం అంతా వుత్తిదే, అంకెల గారడీ, బ్యాంకులు చెల్లించాల్సిన ఆదాయపన్ను తగ్గించేందుకు, ఆర్‌బిఐ నిబంధనలను పాటించేందుకు చేసిన లెక్కల సర్దుబాటు తప్ప మరేమీ కాదు, బ్యాంకుల ప్రధాన కార్యాలయాల స్ధాయిలో పారు బాకీలను రద్దు చేసినట్లు చూపినా దిగువ శాఖలలోని పుస్తకాలలో అలాగే వుంటాయని కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు, పెద్దదైన ఎస్‌బిఐ చెప్పాయి. బకాయిల వసూలు సంగతి మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. అనేక బ్యాంకుల పారు బాకీల వసూలు శాతాలు పడిపోతున్నాయనే వాస్తవాన్ని దాచిపెడుతున్నారు. వుదాహరణకు ఎస్‌బిఐ 2012-13లో 19.06శాతం వసూలు చేస్తే 2014-15 నాటికి 10.88శాతానికి పడిపోయినట్లు దాని లెక్కలే వెల్లడించాయి.ఐసిఐసిఐ బ్యాంకులో 26.74 నుంచి 15.96శాతానికి పడిపోయాయి. కెసి చక్రవర్తి తన పత్రంలో వెల్లడించిన సమాచారం ప్రకారం రద్దు చేసిన రుణాలలో కేవలం పదిశాతం లోపుగానే వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధల విలువను తక్కువగా చూపి అయినకాడికి తెగనమ్మే ప్రభుత్వం పారుబాకీల వసూలు విషయంలో మాత్రం తక్కువ ధరలకు ఆస్థులను విక్రయించటానికి నిబంధనలు ఒప్పుకోవు అని చెబుతోంది. మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఎంత వసూలు చేశారనేది బ్యాంకులో, ప్రభుత్వమో వెల్లడిస్తే తప్ప వివరాలు లేవు. నిరర్ధక ఆస్తులుగా ప్రకటించిన మొత్తాలు నరేంద్రమోడీ విజయాలకు సూచికగా కొండల్లా పెరిగిపోతున్నాయి. గతేడాది అంతకు ముందున్న రు.3,24,300 కోట్ల నుంచి 2016 మార్చినాటికి రు.4,26,400 కోట్లకు పెరుగుతాయని అంచనా వేశారు. లెక్కల ఆల్జీబ్రాలో సర్దుబాటు, పునర్వ్యస్తీకరించిన మొత్తాలను కూడా కలుపుకుంటే పారు బాకీల మొత్తం రు.9,28,000 కోట్లని చెబుతున్నారు. వుద్ధేశ్యపూర్వకంగా ఎగవేసిన కార్పొరేట్ల రుణాల రద్దు ఈ శతాబ్దంలోనే ఇప్పటికి పెద్ద కుంభకోణంగా వర్ణిస్తున్నారు. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లు డాక్టర్‌ కెసి చక్రవర్తికి రుణాల రద్దు గురించి బాగా తెలుసు. ఆయన చెప్పిన ప్రకారం ఒక కంపెనీ కేవలం ఎనిమిదివేల కోట్ల రూపాయల విలువగల ఆస్తులు మాత్రమే కలిగి వుండి 20వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుందనుకుంటే ఒక వేళ బ్యాంకులు రద్దు చేయాల్సి వస్తే పన్నెండువేల కోట్ల రూపాయలకు మాత్రమే అనుమతించాలి.కానీ పుస్తకాలలో వున్న గడువు మీరిన బకాయిలు మొత్తాన్ని రద్దుచేస్తున్నారు. సాంకేతిక కారణాలతో రద్దు చేయటానికి ఎలాంటి నియమనిబంధనలు, పద్దతులు లేవు, అందువలనే అదొక పెద్ద కుంభకోణంగా పరిగణించాలి. ఇది సరళీకరణ విధానాలు ప్రారంభమైన తరువాత 1993 నుంచి అనుసరిస్తున్నారు. రుణాలే కాదు, అడ్వాన్సులను కూడా రద్దు చేస్తున్నారు. మీరు ఒక చార్టడె ఎకౌంటెంట్‌ను సలహాదారుగా పెట్టుకొని అడ్వాన్సులను టెక్నికల్‌గా రద్దు చేయటానికి అవసమైన విధి విధానాలను రూపొందించుకోవచ్చని బ్యాంకులకు రిజర్వుబ్యాంకే స్వయంగా చెప్పటం విశేషం. గత పదిహేను సంవత్సరాలలో సాంకేతిక కారణాలతో చేసిన రద్దుల మొత్తం మూడున్నరలక్షల కోట్ల రూపాయలు, దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదని, ఈ మొత్తాలకు వడ్డీని కూడా కలిపితే రద్దు చేసిన మొత్తాలు నాలుగు రెట్లు వుంటాయని చక్రవర్తి చెప్పారు. ఎగవేసిన పెద్దల పేర్లు బయట పెట్టాలని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ పని చేయకుండా తప్పించుకుంటున్నారు.వారి నుంచి బాకీలు వసూలు చేయకపోవటం ఒకటైటే 2018 నాటికి బాసెల్‌-3 నిబంధనల ప్రకారం బ్యాంకులకు ప్రభుత్వం మరో 2.4లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులు సమకూర్చాల్సి వుంటుందని చెబుతున్నారు. అంటే ఇది కూడా ప్రజల సొమ్మే.దీన్ని ఎలా సమకూర్చుతారనేది చూడాల్సి వుంది. చిత్రం ఏమిటంటే కాంగ్రెస్‌ అధికారంలో వుండగా ప్రతిపక్ష బిజెపి నేత యశ్వంతసిన్హా ఆర్ధికశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా వున్నారు. రుణాల రద్దును సమీక్షించేందుకు ఒక సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని రిజర్వుబ్యాంకును ఆ కమిటీ కోరింది. నరేంద్రమోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గవర్నర్‌గా వున్న రఘురాం రాజన్‌ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూడటానికి, దాడి చేయటానికే తన సమయాన్ని వెచ్చించింది తప్ప ఆ కమిటి ఏమైందో తెలియదు.