సత్య
డబ్లు నల్లదీ తెల్లదీ వుంటుందా ? వుండదు. పన్ను కట్టకుండా తప్పించుకొనేందుకు లెక్కలలో చూపనిదానిని నల్లధనం అంటున్నాం. అలాగే కమ్యూనిస్టు చిచ్చుబుడ్లు, కానివారి చిచ్చుబుడ్లు వుంటాయా ? వుండవు. మొన్న దీపావళి సందర్భంగా చైనా బాణ సంచా కాల్చటం దేశద్రోహ చర్యగానూ, కాల్చకపోవటం దేశభక్తిగానూ అన్ని రకాల మీడియాలో రాతలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ ప్రభుత్వానికి దిశానిర్ధేశం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంఘాలన్నీ జై భజరంగ భళీ అంటూ వీధుల కెక్కి చైనా వస్తువులను దగ్దం చేయటం, వాటిని నిషేధించాలంటూ వీరంగం వేయటాన్ని చూశాము. అలా చేయటమే దేశభక్తిగా ప్రచారం చేశారు. అనేక మంది నిజమే అనుకొని వాట్సప్ గ్రూపులలో అలాంటి సందేశాలు పెట్టారు. తెల్లవారే సరికి చైనా ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసి దేశభక్తిని చాటుకోవాలని వుపదేశాలు చేశారు. ఇదంతా మన దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న తీవ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తున్నదని, దానికి చైనా మద్దతు ఇస్తున్న కారణంగా చైనాను వ్యతిరేకించాలనే వాదనలను ముందుకు తెచ్చారు. ఇంకా కొందరైతే చైనాను నాశనం చేసేందుకు గాను మన పురాణాలు, సంస్కృత గ్రంధాలు, వేదాలలో గట్టి శాపాలు ఏమైనా వున్నాయోమో వెతికితీసేందుకు కూడా ప్రయత్నించారంటే అతిశయోక్తికాదు. ‘దేశభక్తి ‘ అంతగా పెరిగిపోయింది మరి !
ఎంత వారలైనా కాంత దాసులే అని చెప్పారు. దాని సంగతి ఏమోగాని ఈ రోజుల్లో డాలర్ల ముందు మోకరిల్లేందుకు ఎంతకైనా తెగించేవారు వున్నారు. అమెరికా అంతటి కమ్యూనిస్టు వ్యతిరేకే తాను కట్టుకున్న మడిని విప్పి గట్టున పెట్టి చైనా వెంటపడింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున వుంటుందా ? చైనా వ్యతిరేకతను విపరీతంగా రెచ్చగొట్టిన సంఘపరివార్ నాయకత్వం కూడా ఇప్పుడు అదే చేస్తున్నది. అమెరికా ఒక వైపున కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే మరోవైపున చైనా, వియత్నాం, క్యూబా వంటి కమ్యూనిస్టు దేశాలతో సంబంధాలను పెంపొందించుకుంది. ఇప్పుడు మన దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ కూడా అదే గేమ్ ఆడుతోంది.
మన పురాణాలలో ‘సరసింహుడు’ వున్నట్లే చైనా పురాణాలలో రెక్కలున్న భయంకర సర్పం వుంది.దాన్ని ‘డ్రాగన్ ‘ అంటున్నారు. అది మనలను కబళించి వేస్తున్నదని చెప్పిన వారికి ఇప్పుడు దేవతగా మారిపోయిందట.http://retail.economictimes.indiatimes.com/news/industry/boycott-china-dragon-now-angel-for-indian-startups/55522378 నిక్కర్ నుంచి పాంట్స్‌కు మారినంత సులభంగా, ఇది కూడా వేదాల్లో వుంది, దీన్ని కూడా వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అన్నట్లుగా కాషాయ తాలిబాన్లు సమర్ధిస్తున్నారు. ఎందుకంటే వ్యతిరేకించినట్లు , నరేంద్రమోడీ దిష్టి బొమ్మలు తగుల బెట్టినట్లుగానీ ఎక్కడా వార్తలేమీ కనిపించటం లేదు. కనీసం సామాజిక మాధ్యమాల్లో కూడా జాడ లేదు.ఎంత అవకాశవాదం !
నేడు ఎవరి దగ్గర డాలరు వుంటే వారి హవా నడుస్తోంది. చివరకు అమెరికా వాడు కూడా తనకు డాలర్లు కావాలంటే చైనా దగ్గర అప్పుతీసుకొనే దుస్ధితిలో పడిపోయాడు. చైనా కంపెనీలు ఇప్పుడు డాలర్లను పట్టుకొని ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడులకు అవకాశం వుంటే అక్కడకు వెళుతున్నాయి. వాటిలో ప్రయివేటువి, ప్రభుత్వ రంగానికి చెందినవీ వున్నాయి. ఎందుకంటే 2050 వరకు ఒకే దేశం రెండు వ్యవస్ధలు అన్న విధానానికి అనుగుణంగా చైనా ప్రధాన భూభాగంలో ప్రయివేటు పెట్టుబడులు పెట్టటానికి, హాంకాంగ్, మకావూ ప్రాంతాలు విలీన సమయానికి అక్కడ వున్న ప్రయివేటు పెట్టుబడులు కొనసాగటానికి అనుమతించేందుకు విధానపరంగానే నిర్ణయించింది. పెట్టుబడి ప్రధాన లక్షణం లాభం. అది ఎక్కడ వుంటే అక్కడకు ప్రవహిస్తుంది. అది కమ్యూనిస్టు దేశమా, వ్యతిరేక దేశమా, బిజెపి ఏలుబడిలో వుందా, కాంగ్రెస్ పాలనా అన్నదానితో నిమిత్తం లేదు. ఎకనమిక్ టైమ్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం దివ్యాంక్ తురాఖియా ఏర్పాటు చేసిన మీడియా.నెట్ అనే మన దేశ కంపెనీని 90 కోట్ల డాలర్లకు బీజింగ్ మిటెనో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ కంపెనీ కొనుగోలు చేసింది. అలీబాబా కంపెనీ పేటిమ్, స్నాప్‌డీల్ కంపెనీలలో భారీ పెట్టుబడులు పెట్టింది. దిదీ చుక్సింగ్ అనే కంపెనీ ఓలా టాక్సీ కంపెనీలో భాగస్వామిగా చేరింది. ఇలా అనేక కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు, భాగస్వాములుగా వుండేందుకు ముందుకు వస్తున్నాయి. దీని వలన లాభమా నష్టమా అంటే ఆర్‌ఎస్‌ఎస్ దేశ భక్తులు సమాధానం చెప్పాలి. ముందే చెప్పుకున్నట్లు చైనా అయినా మరొక దేశ కంపెనీ పెట్టుబడులు పెట్టినా లాభాలు ఎవరికి చెందుతాయన్నదే గీటు రాయిగా వుండాలి. చైనాలో విదేశీ పెట్టుబడులు, లేదా ప్రయివేటు రంగంపై అక్కడి ప్రభుత్వానికి పూర్తి పట్టువుంది. వాటి వలన వస్తున్న లాభాలలో గణనీయ వాటా అక్కడి జనానికి చేరుతున్నది. మన దేశంలో చైనా ప్రభుత్వ రంగ సంస్ధలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. వాటి మీద వచ్చే లాభాలు చైనా ప్రజలకు చేరతాయి.మన దేశంలో అటువంటి విధానాలు, పరిస్ధితి వుందా ? పెట్టుబడిదారీ విధానాలు అనుసరిస్తున్నంత కాలం సంస్కరణలతో వచ్చే లాభాలు పెట్టుబడిదారులకు తప్ప సామాన్యులకు కాదని గత పాతికేండ్ల మన దేశం అనుభవం రుజువు చేసింది. చైనాలో పరిస్ధితి అందుకు భిన్నంగా వుంది.
చైనాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు కొన్ని వున్నాయి. మనకు చైనా వ్యతిరేకమైతే అక్కడి కంపెనీలు మన దేశంలో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నాయి ? చంద్రబాబు నాయుడు వంటి వారు చైనా వెళ్లి బుల్లెట్ రైలు ఎక్కి మన దేశంలో కూడా అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టమని ఎందుకు కోరుతున్నారు ? మన దేశానికి చైనా వ్యతిరేకమైతే ప్రధాని నరేంద్రమోడీ ఆ విషయాన్ని ఎందుకు బహిరంగంగా దేశ పౌరులకు తెలియచెప్పటం లేదు? చైనా నుంచి దిగుమతులు మాత్రమే నష్టదాయకమని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తోందా ? అన్ని దేశాల దిగుమతులు నష్టం అని చెబుతోందా ? ఏటేటా చైనా నుంచి దిగుమతులు ఎందుకు పెరుగుతున్నాయి ? దిగుమతి చేసుకొనే వారందరూ దేశ ద్రోహులేనా ?