Tags
ఎం కోటేశ్వరరావు
పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయాలంటూ ముందుగానే ప్రధానికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడి ఆ చర్యతో తలెత్తిన సంక్షోభ సెగ తగిలింది.ఈనెల 20న సమాచార శాఖ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఇన్ని రోజులైనా నోట్ల రద్దుతో తలెత్తిన సమస్య పరిష్కారం కాకపోవటం పట్ల తనకే అసహనం కలుగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఒక సమస్య పరిష్కారం కాకపోవటం తన రాజకీయ జీవితంలో ఇదే మొదటి సారని, తుపాన్ల తీవ్రత వలన తలెత్తిన నష్టాలను ఎనిమిది రోజుల్లోనే అధిగమించామని, గోదావరి పుష్కరాలలో మొదటి రోజు ఇబ్బంది వచ్చినా తరువాత 14 రోజులు సమర్ధవంతంగా నిర్వహించామని, అలాంటిది పన్నెండు రోజులైనా నోట్ల రద్దు సమస్య అపరిష్కృతంగా వుండటం బాధాకరమని, తనకే అసహనం కలుగుతోందని అలాంటిది ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలన్నారు. తన సహజ శైలిలో తన పరిధిలోని బ్యాంకర్లు ఎలా పనిచేయాలో కూడా చెప్పారనుకోండి.
తాజాగా గురువారం నాడు నిర్వహించిన టెలికాన్ఫరెన్సు (24న) వుపన్యాసం గురించి సమాచార శాఖ విడుదల చేసిన ప్రకటనలో ప్రతిరోజు తాను నోట్ల రద్దు గురించి ఆర్‌బిఐ, ఎస్‌ఎల్‌బిసి, బ్యాంకర్లతో సమీక్ష జరుపుతున్నానని, దీనిని ఒక సంక్షోభంగా తీసుకుంటే అది అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గదని, సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుంటే పరిష్కారం సులువు అవుతుందన్నారు. ప్రతి గ్రామం, వార్డుల్లోని కిరణాదుకాణాలలో కూడా పాస్ మిషన్ వుపయోగించి నగదు రహిత లావాదేవీలవైపు ప్రోత్సహించాలని కోరారు. మొబైల్ కరెన్సీ, ఆన్‌లైన్ లావాదేవీలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం ద్వారానే ప్రస్తుత సమస్యను అధిగమించగలమని చంద్రబాబు వివరించారు.