Tags

, , , , , ,

ఎంకెఆర్‌

    ప్రధాని ప్రధాని నరేంద్రమోడీ మడమ తిప్పరు అని మన వెంకయ్య ప్రకటించి ఒక రోజు కూడా గడవక ముందే వెనక్కు తిరిగి గురువారం నాడు రాజ్యసభలో అడుగు పెట్టాల్సి వచ్చింది.మౌన మునిగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చాలా కాలం తరువాత రాజ్యసభకు హాజరై నోట్ల రద్దుపై నోరు తెరిచారు. బయట హావభావ ప్రదర్శనలతో జనాన్ని ఆకట్టుకొనే న్రరేంద్రమోడీ కొద్ది సేపు రాజ్యసభలో కంటి చూపుతప్ప నోట మాటలేకుండా కూర్చున్నారు. రాజ్యసభలో కొద్దిసేపు ఇబ్బంది పడుతూ కూర్చున్నట్లు కనిపించిన ప్రధాని భోజన విరామం తరువాత హాజరు కాలేదు. దాంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చిన శుక్రవారం నాటికి రాజ్యసభ వాయిదా పడింది.

    ప్రతి అంశాన్ని నరేంద్రమోడీ చుట్టూ తిప్పుతూ ఆయన ప్రతిష్టను పెంచేందుకు ఒక పధకం ప్రకారం ఆయన చుట్టూ వున్నవారు నిరంతరం ఆలోచిస్తున్నారు. అందుకు ఏ అవకాశం వస్తుందా అని చూసే మంత్రాంగపు యంత్రాంగానికి దూరదృష్టి, పర్యవసానాల గురించి ఆలోచన లేదా లేక సమస్య వచ్చినపుడు చూసుకుందాం లెమ్మని పప్పులో కాలేశారా ? పాకిస్ధాన్‌పై సర్జికల్‌ దాడులు జరిపింది సైన్యం అయినప్పటికీ వాటి ఖ్యాతి ప్రధానికి దక్కించేందుకు చేసిన ప్రయత్నం తెలిసిందే. గతంలో కూడా అలాంటి దాడులు జరిపినప్పటికీ వాటికి పని గట్టుకొని ప్రచారం కల్పించలేదు. చరిత్రలో తొలిసారిగా మన మిలిటరీ సర్జికల్‌ దాడులు జరిపినట్లు, దానికి ప్రధాని రాజకీయ నిర్ణయమే కారణమని అందువలన ఆ ఖ్యాతి ప్రధానికి దక్కాలని బిజెపి నేతలు వాదించారు. దాడుల వీడియోలు కూడా తీశామని సైనికాధికారుల చేత చెప్పించారు. అయితే వాటిని బయట పెట్టాలని కోరటం, అవి రహస్యం కనుక బయట పెట్టేది లేదని ప్రభుత్వం తప్పించుకుంది.

    పెద్ద కరెన్సీ నోట్లను చరిత్రలో అనేక దేశాలలో రద్దు చేశారు. ఎక్కడా ఇలా రచ్చయినట్లు ఒక్క వుదంతం కూడా కనిపించటం లేదు. ఇదేదో నల్లధనాన్ని వెలికి తీసే పెద్ద చర్య అని ఆ ఖ్యాతి నరేంద్రమోడీ ఖాతాలో వేయాలని అట్టహాసంగా ఆయన చేత రద్దు ప్రకటన చేయించారు. కీర్తి కండూతి గురించి మోడీ పడుతున్న తిప్పలుగా వాటిని అర్ధం చేసుకుందాం. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రసంగం చేసిన తరువాత దాని గురించి అధికారులు విలేకర్ల సమావేశాలలో వివరణ ఇవ్వటం ఒక ఆనవాయితీ. ఎందుకంటే బడ్జెట్‌ రూపకల్పన చేసేది వారే గనుక. నోట్ల రద్దు నిర్ణయం రిజర్వుబ్యాంకు ప్రమేయం లేకుండా జరగదు కదా ! ప్రధాని ప్రకటన చేసిన కొత్త నోట్ల మార్పిడి సమస్యల గురించి రిజర్వు బ్యాంకు గవర్నర్‌ పటేల్‌ ఇంతవరకు ఎందుకు నోరు విప్పలేదు. ప్రకటన చేసి రాజకీయ ఖ్యాతి పొందేందుకు మాత్రం సిద్దం సుమతీ అన్నట్లు నరేంద్రమోడీ తయారా ? తలెత్తిన సమస్యల గురించి వివరణ ఇవ్వటానికి మాత్రం నోరు విప్పరా? పోనీ మీడియా ముందుకు రావటానికి బిడియమైతే పార్లమెంట్‌ చర్చలో పాల్గొని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టి దేశ ప్రజలకు భరోసా ఇవ్వటానికి కూడా ముందుకు రారా ? ఇదెక్కడి చోద్యం. ఇబ్బందులు పడుతున్న వారంతా తమకు ఓటేయని వారని లేక నల్లధనం వున్నవారని భావిస్తున్నారా ?

   చరిత్రలో రోమ్‌ నగరం తగులబడుతుంటే చక్రవర్తి నీరో ఫిడేల్‌ వాయించుకుంటూ కాలక్షేపం చేశారని, జనం నరకయాతన అనుభవించారని చదువుకున్నాం. ఇప్పటికి 60 మంది వరకు నోట్ల మార్పిడి, నగదు తీసుకొనే సందర్భంగా మరణించినట్లు వార్తలు. రోజూ లక్షల మంది ఆఫీసులు, ఫ్యాక్టరీలకు సెలవులు పెట్టి బ్యాంకులు, ఏటిఎంల ముందు గంటల తరబడి వరుసలలో నిలబడటం. వివాహాలు చేసుకొనే వారికి ఆ ఆనందమే లేకుండా పోతోంది. ఎందుకు పెట్టుకున్నామురా ముహూర్తాలు అని నిట్టూర్చుతున్నారు. రోగులు చికిత్సలను వాయిదా వేసుకుంటున్నారు ? ఆరునెలలని కొందరు, ఇంకా ఎక్కువ కాలం కొనసాగుతుందని మరికొందరు, వున్న పాత నోట్లను మార్చుకోవటం ఒక సమస్య అయితే ఇస్తున్న రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవటం ఎలా అన్నది పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో రిజర్వుబ్యాంకు అధిపతి చెప్పరు. యాభై రోజులు ఓపిక పట్టమని, పరిష్కారం అవుతుందని ప్రధాని పార్టీ సమావేశాలు, ప్రయివేటుగా చెప్పటం తప్ప బహిరంగంగా నోరు పిప్పరు. చివరకు వారాల తరబడి పార్లమెంట్‌కూ రారు. మరి ఏం చేస్తున్నట్లు ? పార్లమెంట్‌లో సమాధానం చెప్పటం అప్రతిష్టగా భావిస్తున్నారా ? పోనీ అదైనా ఏ వెంకయ్య నాయుడో మరొకరి చేతో చెప్పించండి,జనం అర్ధం చేసుకుంటారు.

   ప్రపంచంలో ఎక్కడైనా ఒక్కచోటైనా ఒక్కరంటే ఒక్కరు కరెన్సీ మార్పిడికి వచ్చి ఇలాంటి దిక్కుమాలిన చావుకు గురయ్యారా ? వుంటే బిజెపి సామాజిక మీడియా సైనికులు బయటపెట్టగలరా ? లేక అది కూడా రహస్యం అంటారా ? కార్మికులు ఒక రోజు సమ్మె, లేదా హర్తాళ్‌కు పిలుపు ఇస్తే రోజు ఎంత నష్టమో లెక్కలు వేసి రోజంతా బ్రేకింగ్‌ న్యూస్‌ పేరుతో సంచలనంగా ప్రకటించే మీడియాకు నవంబరు తొమ్మిది నుంచి పని పాటలు మాని వరుసలలో నిలబడుతున్న జనం కనిపించటం లేదా ? వారంత పని పాటలు లేనివారిగా కనిపిస్తున్నారా ? ఏడాది ఆఖరులో సెలవులు వుండవు, పెట్టాల్సి వస్తే జీతం నష్టం తప్ప మరొక మార్గం లేదు. నోట్ల రద్దు వలన వచ్చే లాభం ఏమిటో చెప్పరు. కనీసం క్యూల్లో నిలబడే జనానికి వచ్చే జీతం నష్టం గురించి మీడియా ఎందుకు మౌనం వహిస్తోంది?

     నోట్ల రద్దు కారణాలను రోజూ ఒకటే చెబితే జనానికి బోరు కొడుతుందనేమో రోజుకో కొత్త అంశాన్ని చేరుస్తున్నారు. దాన్నొక రాజకీయ క్రీడగా మార్చివేశారు. పార్లమెంట్‌లో పంతాలకు పోవటం, అధికార పార్టీ సభ్యులే రాజ్యసభలో పోడియం ముందుకు వచ్చి కేకలు వేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? నక్సలైట్లను దెబ్బతీయటానికి నోట్ల రద్దు అన్నది ఒక ప్రచారం. ఇంత విశాల భారతంలో వారెంత మంది, ఎన్ని ప్రాంతాలకు విస్తరించారు? టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్‌, ఈశాన్య భారతంలో తప్ప ఆ సమస్య వున్న రాష్ట్రాలెన్ని ? ప్రపంచంలో అనేక చోట్ల మన కంటే వామపక్ష తీవ్రవాదులు, లాటిన్‌ అమెరికా వంటి చోట్ల వామపక్ష తిరుగుబాటు వుద్యమాలు, ఇతర చోట్ల ఐఎస్‌, తాలిబాన్‌ తీవ్రవాదుల సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్న దేశాలు వున్నాయి. ఇరాక్‌, సిరియా, లిబియా వంటి చోట్ల విస్తారమైన ప్రాంతాలే వారి చేతుల్లో వున్నాయి. మన పక్కనే వున్న శ్రీలంకలో దశాబ్దాల తరబడి తమిళతీవ్రవాదులు కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలో వుంచుకున్న విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో టర్కీతో సహా అనేక దేశాలలో కుర్దు తిరుగుబాటుదారుల సమస్య వుంది. వారిని ఎదుర్కొనేందుకు ఆ దేశాలేవీ తమ కరెన్సీ నోట్లను రద్దు చేయలేదు, వారి సమస్యను నోట్ల రద్దుతో పరిష్కరించలేదు.

    పొరుగు దేశం పాకిస్ధాన్‌ నకిలీ నోట్లను ముద్రించి మన దేశంలోకి పంపుతున్నదని చెబుతున్నారు. ఇదేమీ కొత్త సమస్య కాదు. మన దేశంలో కోయంబత్తూరు నోట్ల పేరుతో దొంగనోట్ల ముద్రణ చెలా మణి ఎప్పటి నుంచో వుంది. ఒక అంచనా ప్రకారం ప్రతి పదిలక్షల కరెన్సీ నోట్లలో 250 నకిలీవి వుండగా వాటిలో పట్టుకుంటున్నది పదహారింటినే అని కేంద్ర ప్రభుత్వ సమాచారమే వెల్లడిస్తున్నది. దేశంలో 2015-16లో 90.26 వందల కోట్ల కరెన్సీ నోట్లు చెలామణిలో వుంటే వాటిలో పట్టుకున్న దొంగ నోట్ల సంఖ్య 0.63 మిలియన్లు మాత్రమే అంటే మొత్తం నోట్లలో 0.0007 శాతమే. అందువలన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగి పోయిన ఈరోజుల్లో కొత్త నోట్లకు నకిలీవి తయారు చేయటం అసాధ్యమా ?

   పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయటానికి నరేంద్రమోడీకి స్ఫూర్తి నిచ్చింది పూనా నగరానికి చెందిన ‘అర్ధక్రాంతి ప్రతిష్టాన్‌ ‘ సంస్ధను నిర్వహిస్తున్న అనిల్‌ బొకిల్‌ అని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడా పెద్దమనిషి నేను చెప్పిందొకటి నరేంద్రమోడీ చేసిందొకటి, ఆయన మంచి వాడే కానీ చేసిందాని వలన నల్లధనం బయటకు రాదని మొత్తుకుంటున్నాడు. http://economictimes.indiatimes.com/news/economy/policy/banning-notes-will-not-curb-black-money-says-thinktank-that-called-for-demonetisation/articleshow/55550552.cms మరి ఎవరి సలహాతో ఈ పని చేసినట్లు ? ఒకవేళ పొరపాటు చేస్తే దేశ ప్రజల ముందుకు ఒప్పుకోవటానికి ఇబ్బంది ఏమిటి ? ప్రతిష్ట ఇంకా పెరుగుతుంది !