Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

‘ అధికార కేంద్రాన్ని కాపాడు కోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్ధేశం లేదు,రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ‘ ఈ మాటలు అన్నదెవరో తెలుసా మిన్నువిరిగి మీద పడ్డా మాట్లాడేందుకు నిరాకరిస్తున్న నరేంద్రమోడీ ! మరి ఈ మాటలు ఎలా చెప్పారు అని వెంటనే అడిగేందుకు ఆయన భక్తులు కాచుకొని వుంటారు. కాస్త నిదానించండి. గురువారం(24వ తేదీ) మోడీ తన ఘన చరిత్రలో ఒక రికార్డును బద్దలు చేశారు. 2013 ఆగస్టు 28న రూపాయి విలువ డాలరుకు రు.68.85కు పడిపోయి ఒక రికార్డు నమోదు చేసింది. నరేంద్రమోడీ సర్కార్‌ 2016 నవంబరు 24న దాని రు.68.86కు దిగజార్చి పాత రికార్డును బద్దలు చేసింది. మరి పై వ్యాఖ్య ఎప్పుడు చేశారు ?http://www.business-standard.com/article/politics/modi-blames-upa-govt-s-inaction-for-falling-rupee-113082000623_1.html 2013 ఆగస్టు 19న, అప్పటికే రూపాయి విలువ పతన అవుతున్నది, దాని గురించి గుజరాత్‌ ముఖ్యమంత్రి హోదాలో చేసిన విమర్శ అది.మరి ఇపుడేమంటారు ? ఈ నెలాఖరులో మనసులోని మాటలో అయినా ఏదైనా చెబుతారేమో చూద్దాం ! అంతకు ఒక నెల రోజుల ముందు రూపాయి విలువ రు.60.15కు పతనమైన సమయంలో లాయరూ, ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా వుండి, అప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న రవిశంకర ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.http://www.firstpost.com/politics/bjp-blames-upas–gross-mismanagement-for-rupee-fall-946409.html ‘పూర్తిగా ఆర్ధిక వ్యవస్ధ దుర్నిర్వహణ’ కారణంగా రూపాయి పతనం అవుతున్నదన్నారు. ‘ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) మరియు విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ)తో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించే యుపిఏ విధాన కారణంగానే ఇలా జరుగుతున్నదని చెప్పారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వుద్దీపన పధకాన్ని వుపసంహరించిన కారణంగా మన దేశం నుంచి డబ్బు తరలి పోయినందున రూపాయి విలువ పడిపోయిందని లాయర్‌గారు వాదించారు. ‘యుపిఏ ఏర్పడినపుడు డాలరకు రూపాయి విలువ రాహుల్‌ గాంధీ వయస్సుతో సమంగా వుంది. ఈ రోజు సోనియా గాంధీ వయస్సుకు దగ్గర అవుతున్నది.అది మన్మోహన్‌ సింగ్‌ వయస్సుకు దగ్గర అవుతుందేమోనని భయంగా వుంది ‘ అని చమత్కరించారు.

     ఇప్పుడు రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది, యుపిఏ పాలనా విధానాలను మార్చి రూపాయి విలువను పెంచకుండా లేదా కనీసం పతనం చేయకుండా నిలువరించటంలో ఎవరు మోకాలడ్డారు ? ఎవరైనా సూటిగా సమాధానం చెప్పేవారున్నారా ?http://inr.fx-exchange.com/usd/2014_05_26-exchange-rates-history.html నరేంద్రమోడీ అధికారం స్వీకరించిన 2014 మే 26వ తేదీన డాలరుకు రూపాయి విలువ రు.58.73 వున్నట్లు పై ఆధారం తెలియ చేస్తున్నది. ఇప్పుడు మన ప్రధాని వయస్సు 66, రూపాయి విలువ ఇది రాస్తున్న సమయానికి రు.68.44 వుంది. ఇంతగా పతనం కావటానికి ఏ స్టెరాయిడ్స్‌ ఇచ్చారు ? యుపిఏ కంటే ఏ భిన్న విధానాలు అనుసరించిన కారణంగా ఈ పతనం సంభవించింది. త్వరలో 70 రూపాయలకు చేరనున్నదని విశ్లేషకులు ఎందుకు జోశ్యం చెబుతున్నట్లు ?

    2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న 61.19 రూపాయల నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. ఆసియాలోని మూడవ పెద్ద ఆర్ధిక వ్యవస్థ అయిన భారత్‌ 2008లో ప్రారంభమైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తరువాత ఇప్పుడే పట్టాలపైకి వస్తున్నదని మోడీ స్టీరింగ్‌ పట్టుకుంటే మరింత వేగం అందుకుంటుందని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యాతలు చెప్పారు. బిజెపి పెద్ద పార్టీగా రావటం ఖాయమని, సంపూర్ణ మెజారిటీకి 40 స్థానాలు తగ్గితే మిత్ర పక్షాలపై ఆధార పడాల్సి వుంటుందని ఎన్నికల జోశ్యాలు పేర్కొన్నాయి. వాటిని అధిగమించి బిజెపి ఒక్కటే సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఆ సమయానికి 2013 ఆగస్టు 28తో పోల్చుకుంటే రూపాయి విలువ 13శాతం పెరిగింది.

    రూపాయి విలువ పెరుగుతున్నదని, అది డాలరుకు 40కి పెరిగితే 2008 ఏప్రిల్‌ నుంచి బలమైన స్ధాయికి చేరినట్లు అవుతుందని ఈ తరుణంలో డాలర్లను అమ్ముకోవటం మంచిదని ఎన్నికల వరకు ఆగితే ఆది ఆలస్యం కూడా కావచ్చని గిల్‌మౌర్‌ జోస్యం కూడిన సలహా ఇచ్చారు. అయితే అది ఎంత కాలంలో జరుగుతుందన్నది ఆయన చెప్పలేదని, బ్లూమ్‌బెర్గ్‌ జరిపిన సర్వే ప్రకారం 2014 డిసెంబరు నాటికి రు.61.21 అవుతుందని 2016 చివరికి 58.50లకు పెరుగుతుందని ఆ సంస్థ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఎందుకు జరుగుతోంది? కారణాలేమిటి ?

    నిత్యం బలమైన కరెన్సీ గురించి బోధనలు చేయటం తప్ప మోడీ-జైట్లీ ద్వయం బ్రిటీష్‌ వలసవాద ఆర్ధిక విధానాలకు మద్దతు ఇస్తున్నారని, ఇంకా బలహీనమైన రూపాయి కొనసాగటం జాతి సిగ్గుపడాల్సిన అంశమని అంశుమన్‌ తివారీ అనే ఆర్ధిక వ్యవహారాల వ్యాఖ్యాత పేర్కొన్నారు.http://www.dailyo.in/business/rupee-narendra-modi-arun-jaitley-rbi-manmohan-singh-pv-narasimha-rao-dollar/story/1/6138.html ఒక దేశ కరెన్సీ జాతి గర్వించదగిన లేదా దగని అంశంగా వుండకూడదు, చేయకూడదని తెలిసినప్పటికీ బిజెపి 2013లో రూపాయి విలువ ఎదుర్కొన్న సంక్షోభాన్ని జాతి సిగ్గుపడే అంశంగా ప్రదర్శించిందని తివారీ పేర్కొన్నారు.

   ‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అని 1991లో రూపాయి విలువను భారీగా తగ్గించిన సమయంలో ఆర్ధిక మంత్రిగా వున్న మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన తర్కాన్ని అంగీకరించాలంటారు తివారి. మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీ మన దేశంలో సరకులను తయారు చేసి చౌకగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు రూపాయి విలువను కావాలనే పతనం గావిస్తున్నారా ? ఎగుమతి ఆధారిత విధానాలను అనుసరించే దేశాలన్నీ తమ కరెన్సీ విలువలను తగ్గించిన చరిత్ర వుంది. నరేంద్రమోడీ సర్కార్‌ విధానం ఏమిటి ?

   1990 దశకంలో మన దేశం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొన్న కారణంగా మన ఎగుమతులను పెంచాలనే ఒక దివాళాకోరు ఆలోచనతో నాటి సర్కార్‌ ప్రపంచ బ్యాంకులో పని చేసిన మన్మోహన్‌ సింగ్‌ను ఆర్ధిక మంత్రిగా తీసుకొన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ఈ పెద్ద మనిషి ఒక్కసారిగా నాలుగు రోజుల్లో రూపాయి విలువను తొమ్మిదిశాతం వరకు తగ్గించారు. అంతకు ముందు దేశ చరిత్రలో అలాంటి వుదంతం జరగలేదు. ఆ సమయంలో ప్రభుత్వ ఆర్ధిక సలహాదారుగా జైరాం రమేష్‌, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రంగరాజన్‌ వున్నారు.

    గతంతో అంటే 2013 రికార్డు పతనంతో పోల్చితే నాటికీ నేటికీ ఎంతో బేధం వుంది. అప్పుడు రూపాయి విలువ పతనం దేశ బలహీనతగా బిజెపి ప్రచారం ప్రారంభించింది. అ సమయంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై తీవ్ర ప్రభావం చూపే చమురు పీపా ధర 100 డాలర్లకు పైగా వుంది. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 40-50 డాలర్ల మధ్య వుంటోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా వివిధ కారణాలతో రికార్డు స్దాయిలో నవంబరు 11వ తేదీతో ముగిసిన వారంలో 368 బిలియన్‌ డాలర్లు వున్నాయి. అయినప్పటికీ 2013 నాటి మాదిరి రూపాయి విలువ పతనమౌతోంది. ఎందుకిలా జరుగుతోంది?

    రూపాయి పతనమైతే మనకు కలిగే లాభ నష్టాలు ఏమిటి ? మన దేశంలో చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేసే సమయంలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరల పెరుగుదల తగ్గుదల వుంటుందని ప్రభుత్వం జనానికి చెప్పింది. ఈ విధానం ప్రకారం పీపా వంద డాలర్లు వున్నప్పటి కంటే సగానికి సగం ధర తగ్గినందున మన దేశంలో పెట్రోలు ధర కూడా సగానికి తగ్గాలి. ఎందుకు తగ్గలేదో ఎప్పుడైనా మనం ఆలోచించామా? చమురుపై కేంద్ర సుంకాన్ని మోడీ సర్కార్‌ లీటరుకు పన్నెండు రూపాయల వరకు పెంచింది. దీనికి తోడు రూపాయి పతనంపై గుడ్లప్పగించి చూస్తుండటంతో దిగుమతి చేసుకొనే పెట్రోలు ధర పెరిగింది.

    మన దేశాన్ని కేవలం ముడి సరకులు ఎగుమతి దేశంగా వుంచాలని, పారిశ్రామికంగా అభివృద్ది కాకుండా వుంచేందుకు నాటి బ్రిటీష్‌ పాలకులు రూపాయి విలువను ఎక్కువగా వుంచారన్న అభిప్రాయం వుంది. యుపిఏ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బిజెపి రూపాయి విలువ పతనాన్ని దేశానికి అవమానంగా చిత్రించింది. తాను అధికారంలోకి వచ్చిన తరువాత అదే పార్టీ ఇప్పుడు రూపాయి పతనమౌతోంటే గుడ్లప్పగించి చూస్తోంది. నోట మాట రావటం లేదు.

     నాడు మన్మోహన్‌ సింగ్‌ కరెన్సీ విలువ తగ్గింపును సమర్ధించుకుంటూ ‘మారకపు విలువ కేవలం ఒక ధర మాత్రమే. నీవు అమ్మకపు వ్యాపారంలో వుండాలంటే నీ ధర పోటీలో నిలబడేట్లుగా వుండాలి’ అన్నారంటే దాని అర్ధం తక్కువగా వుంచాలనే కదా. అప్పటి నుంచి చూస్తే 1970 నుంచి 1989 వరకు వాణిజ్య లోటుతో వున్న చైనా ఆ తరువాత నుంచి నేటి వరకు తన మిగులును పెంచుకుంటూ పోతూనే వుంది.1990 నుంచి 8.74 బిలియన్‌ డాలర్ల మిగులుతో ప్రారంభమై 2014లో 382 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. మరి మనం ఎక్కడ వున్నాం ? మన వాణిజ్యలోటు పెరగటం తప్ప ఏ ఒక్క సంవత్సరంలోనూ మిగులు లేదు. మన రూపాయి విలువను తగ్గించుకున్నా మన వస్తువులను ఎగుమతి చేయలేని స్ధితి. అయినప్పటికీ నిరుద్యోగ యువతను తప్పుదారి పట్టించేందుకు మేకిన్‌ ఇండియా నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ కాలం గడుపుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వచ్చి ఇక్కడ మన కార్మికుల చేత వస్తువులను తయారు చేయించుకొని ఎగుమతి చేసుకోవాలన్నది ఈ నినాదం వెనుక వున్న లక్ష్యం. ఇన్నేళ్లుగా మనం ఎందుకు విఫలమయ్యాము. అందునా ప్రపంచ ధనిక దేశాలన్నీ ఆర్ధిక మాంద్యం వుండగా ఇప్పుడున్న పరిశ్రమల వుత్పత్తులకే దిక్కు లేకపోతే కొత్తగా ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్న. అందువలన మన ఆర్ధిక విధానాన్ని మన అవసరాలకు తగినట్లు సమూలంగా మార్చుకొని అంతర్గతంగా వస్తువినియోగానికి డిమాండ్‌ పెంచుకుంటేనే ఏ రంగమైనా అభివృద్ది చెందుతుంది. మన యువతకు వుపాధి దొరుకుతుంది.

   విదేశాలకు తక్కువ ధరలకు ఎగుమతులు చేయటానికి మన వనరులన్నీంటినీ వుపయోగిస్తే మన వస్తువులు కొన్న వాడికి తప్ప మనకు లాభం ఏమిటి? ఏ కారణం చేత అయినా కొనే వారు ఎత్తుబడితే మన వస్తువులను ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో వస్తువులు కొనే వారు లేకనే మన వస్తువులు ఎగుమతి కావటం లేదని అందరూ చెబుతున్నదే. అలాంటపుడు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టి మన నరేంద్రమోడీ గారికి మేకిన్‌ ఇండియా పేరు తెచ్చేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే సమస్య?

Image result for On Rupee Fall: modi u turn

    ఏతా వాతా తేలేదేమంటే మన కరెన్సీ విలువ పతనాన్ని అలాగే కొనసాగనిస్తే అది మనకు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా అసలే అంతంతమాత్రంగా మన జీవితాలను మరింత దిగజార్చుతుంది. మోడీ మహాశయుడి అచ్చే దినాలకోసం ఎదురు చూస్తున్న జనానికి ఆకస్మికంగా బ్యాంకుల ముందు పడిగాపులు పడే చచ్చే దినాలు దాపురించాయి. రాబోయే రోజుల్లో రెండు వేల నోట్లు మార్చుకోవటం ఒక సమస్యగా మారే అవకాశం వుంది. ఇప్పుడు రూపాయి మరింతగా పతనమైతే తట్టల్లో డబ్బులు తీసుకు వెళ్లి బుట్టల్లో సరకులు తెచ్చుకొనే రోజులు వస్తాయి. మన సరకులను విదేశాల వారు చౌకగా కొనుక్కుపోతారు. వారిలో పాకిస్తాను వారు కూడా వుంటారని కాషాయ దేశభక్తులు గ్రహించాలి.ఎంకి పెళ్లి సుబ్సిచావుకు వచ్చిందన్నట్లుగా నరేంద్రమోడీ గారి మేకినిండియా పిలుపును జయప్రదం చేయటం కోసం రూపాయి విలువను మరింత పతనం గావిస్తే మనం దిగుమతి చేసుకొనే ఎరువులు, పురుగు మందులు, పెట్రోలియం వుత్పత్తుల వంటి వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. గుజరాత్‌ నమూనా అంటే ఇదేనా ?