Tags

, , , , , ,

కేరళ హర్తాళ్ దృశ్యమ్

ఎం కోటేశ్వరరావు

    పెద్ద కరెన్సీ నోట్ల రద్దు సందర్భంగా పౌరుల మీద రుద్దిన ఇబ్బందులకు నిరసనగా అనేక పార్టీలు విడివిడిగా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నాడు (నవంబరు 28న) దేశ వ్యాపితంగా వచ్చిన స్పందన గురించి రకరకాల వార్తలు, వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అది ఏ రూపంలో జరిగింది ? జయప్రదమైందా విఫలమైందా అన్న లెక్కలు వేయబోవటం లేదు. జయప్రదమైంది అంటే దాని అర్ధం బిజెపి చిత్రిస్తున్నట్లు నిరసనకు మద్దతు ఇచ్చిన వారందరూ నల్లధనాన్ని, అవినీతిని సమర్ధించేవారు కాదు. విఫలమైంది అంటే ముందు చూపులేకుండా, అనాలోచితంగా నరేంద్రమోడీ చేసిన పిచ్చిపనిని ఆందరూ ఆమోదించినట్లూ కాదు. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యను పక్కదారి పట్టించేందుకు గత కొద్ది రోజులుగా నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాణీగారి ప్రతిపక్షం, రాణీగారీ అనుకూల పక్షాల మాదిరి వ్యవహరిస్తున్న మీడియా సంస్ధలు, వాటిలో పనిచేసే షార్ట్‌ హాండ్‌ జర్నలిస్టులు ఈ సమస్యపై కూడా తమ పాత్రలను చక్కగా పోషిస్తున్నారు.

   గత ఇరవై రోజులుగా దేశ విదేశాల విశ్లేషకుల నుంచి వెలువడుతున్న వ్యాఖ్యలు, సమాచారం ప్రకారం నోట్ల రద్దు వలన నల్లధనం రద్దు పెద్ద ప్రహసనంగా మారనున్నట్లు కేంద్రంలోని పెద్దలు గ్రహిస్తున్న కారణంగానే దానినొక రాజకీయ అంశంగా ప్రతిపక్షాలపై దాడి చేసేందుకు, నగదు రహిత ఆర్ధిక లావాదేవీల పెంపుదల ప్రచార అంశంగా మార్చి వేస్తున్నారు. పార్లమెంట్‌లో ఎంత రచ్చ జరిగినా బయట తప్ప అక్కడ మాట్లేడేందుకు నరేంద్రమోడీ ఇప్పటికీ విముఖంగానే వున్నారు. అంటే అసలు సమస్య నుంచి జనం దృష్టిని వేరే వివాదంపైపు మార్చేందుకు చూస్తున్నట్లుగానే భావించాలి. నోట్ల రద్దును స్వాతంత్య్రానంతర తొలి విప్లవాత్మక చర్య అన్నంత గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోడీ దాని గురించి మాట్లాడటానికి, చర్చించటానికి పార్లమెంట్‌కు హాజరు కాకపోవటమే పెద్ద వైఫల్యం. ఎంతకాలం మౌనంగా వుంటారు, ఎంతకాలం తప్పించుకుంటారు ? గతంలో ఏదైనా ఒక అంశంపై పాలకపార్టీని నిలదీయాలంటే భిన్న ధృవాలుగా వున్న పార్టీలు సైతం పార్లమెంట్‌లో సమన్వయం చేసుకొనేవి. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్‌లో ఎవరికి వారు తమ అభిప్రాయాలు వెల్లడించటమే కాదు, నోట్ల సమస్యపై వెలుపల కూడా ఒకే రోజు వివిధ రూపాలలో విడివిడిగా ఆందోళనకు పిలుపు ఇవ్వటం బహుశా ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. నోరు వుంది కదా, మీడియాలో ఎక్కడ లేని ప్రచారం దొరుకుతోంది కదా అని పాలకపార్టీ నేతలు సంబర పడవచ్చు. ఎందుకైనా మంచిది, భవిష్యత్‌లో ఎటుబోయి ఎటువస్తుందో ఒక అవకాశం అట్టిపెట్టుకుందామని చంద్రబాబు నాయుడి వంటి వారు ఒకవైపు మంచిదని చెబుతూనే మరోవైపు అసంతృప్తి గళం వినిపించటం మామూలు విషయం కాదు.

    సమస్య తీవ్రత కారణంగా సామాన్యులే కాదు చివరికి ఆర్ధిక మంత్రి కుటుంబం కూడా ఎలా ఇబ్బంది పడుతుందో చూడండి అని నమ్మించేందుకు వండి వార్చిన కట్టుకధలలో భాగంగా కొన్ని పత్రికలలో ఒక వార్త వచ్చింది. ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ గారు ఒక వంద మందికి విందు ఏర్పాటు చేయమని తన సతీమణికి చెప్పారట. తీరా ఆమె తన, భర్త ఖాతాల నుంచి 24వేల చొప్పున తీసుకున్న డబ్బుతో 50 మందికి మాత్రమే ఏర్పాటు చేయవచ్చని చెప్పారట. సరే పెద్ద వారు అంత ఖరీదైన విందులు ఇస్తారు వదిలేద్దాం. నరేంద్రమోడీ, చంద్రబాబు గారు నగదుతో పని లేకుండా అంతా కార్డులతో ఎంత సులభంగా నడిపించవచ్చో జనానికి చెబుతున్నారు. కేంద్రమంత్రి కుటుంబం వంద మంది విందుకు సరిపడా అవసరమైన ఖర్చులకు నగదు లేక ఇబ్బంది పడ్డారంటే వారికి కూడా అలాంటి కార్డులు లేనట్లే కదా ? ఒక వేళ వుంటే ఇలాంటి కట్టుకధలు ఎందుకు పుట్టినట్లు ?

    మరొక కధ. ఇది స్వయంగా నరేంద్రమోడీ చెప్పిన పిట్ట కధ. తాను టీ అమ్మిన సమయంలో పేదలు స్ట్రాంగ్‌ టీ అడుగుతుండేవారట. అలాగే ఇప్పడు నల్లధనంపై గట్టి చర్య తీసుకున్నా అన్నారు. ఒకే. ఆయన టీ అమ్మినట్లు చెబుతున్న ప్రాంతాలు రైల్వే స్టేషన్‌, బస్టాండ్లలో అమాయకులు తప్ప రోజూ టీ తాగే వారు ఎవరైనా స్ట్రాంగ్‌ టీ అడుగుతారా ? అలాంటి చోట్ల స్ట్రాంగ్‌ టీ దొరకటం ఎంత నిజమో పెద్ద నోట్ల రద్దుతో గట్టి చర్య కూడా అంతే నిజం !

   సాంప్రదాయక మీడియా, సామాజిక మీడియాలో అనేక మంది ఈ నిరసనను భారత బంద్‌ పిలుపుగా వర్ణించారు. బంద్‌లు జరపకూడదని, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కూడా 1997లో సమర్ధించిన తరువాత ఏ పార్టీ కూడా బంద్‌ పిలుపులు ఇవ్వటం లేదు. అయితే తరువాత మరొక కేసు సందర్భంగా బంద్‌లు జరపటం ప్రజాస్వామ్య బద్దమే అని అదే కోర్టు 2009లో చెప్పిందనుకోండి. సోమవారం నాడు స్ధానిక పరిస్థితులను బట్టి వివిధ రూపాలలో నిరసన తెలపమని వామపక్షాలు పిలుపు ఇచ్చాయి.http://cpim.org/pressbriefs/observe-november-28-all-india-protest-day ఈ లింక్‌లో సిపిఎం అధికారిక ప్రకటన వుంది. దానిలో ఎక్కడా బంద్‌ అన్న పదం లేదు.

    ఇక నిరసన రూపం గురించి పాక్షికం, విఫలం, తీవ్ర అంతరాయం ఇలా రకరకాలుగా వర్ణించటాన్ని చూడవచ్చు. తొంభై బస్‌లు ఆగిపోయి ప్రయాణీకులు లేకుండా పంతానికి పది తిప్పినా, రోజంతా మూసి సాయంత్రం కొద్ది సేపు దుకాణాలు తెరిచినా పాక్షికం అని చిత్రించ వచ్చు. స్వతంత్ర భారత చరిత్రలో అనేక బంద్‌లు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. అన్ని నిరసనలలోనూ అందరికీ సంబంధించిన సమస్యలు ఎప్పుడూ వుండవు. నోట్ల రద్దు అందుకు మినహాయింపు. సామాన్యుడైనా, ముకేష్‌ అంబానీ అయినా రోడ్డు మీదకు వచ్చి ఒక చాయ్‌ తాగాలంటే స్వయంగా లేదా డ్రైవర్‌ ద్వారా అయినా డబ్చిచ్చి తాగాలే తప్ప చెక్కు లేదా కార్డు గీక్కో మంటే కుదరదు. అందువలన ఇది అందరికీ సంబంధించిన సమస్య కనుక దీనికి ఒక ప్రత్యేకత వుంది. చిత్రం ఏమంటే తాను పేదలకు టీ అమ్మానని చెప్పిన మోడీ ఆ పేదలు టీ డబ్బులను కార్డులు, చెక్కుల రూపంలో ఇవ్వలేరని అర్దం చేసుకోలేకపోయారు. అందువలన నిజంగా అమ్మారా అని ఎవరైనా సందేహించే ఆస్కారం కూడా వుంది.

   నోట్ల రద్దు నల్లధనం రద్దుకు అని చెప్పారు. తీరా ఇప్పుడు పెద్ద లందరూ అసలు నోట్లతో పని లేకుండా మీ చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోనుంటే చాలు, దాని మీద మీటలు నొక్కటం నేర్చుకుంటే అంతా అయి పోతుందని వూదర గొడుతున్నారు. నోట్ల రద్దును వేల కోట్ల సంపదలున్న పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు సమర్ధిస్తూ ప్రకటనలు చేయటాన్ని చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

   ఒకటి. నోట్ల రద్దు మరుసటి రోజు నుంచి జరిగిన పరిణామాలను చూస్తే డబ్బుతో పని లేకుండా కార్డులు గీకి వస్తువులు అమ్మే చోట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి, డబ్బుతీసుకొని అమ్మే దుకాణాలలో తగ్గాయి. అంటే పెద్ద దుకాణాల వారు ఈ నోట్ల రద్దు వెనుక చక్రం తీప్పారా ? కారణం ఏదైనా తనకు కూడా అలాంటి కార్డులు గీకే హెరిటేజ్‌ దుకాణాలు వున్నాయి కనుక ముందు చూపుతో పెద్ద నోట్లు రద్దు చేయాలని అందరి కంటే ముందే కేంద్రానికి లేఖ రాశారా ? చంద్రబాబు నాయుడు కార్డుల ద్వారా లావాదేవీలు జరిపించేందుకు నాలుగు కమిటీలను కూడా వేశామని ప్రకటించారు. మంచిదే. త్వరలో కార్డులు కూడా ఇప్పిస్తారు. ఫోన్లు కూడా ఇప్పిస్తామంటున్నారు కనుక సందేహం లేదు. ( వుద్యోగాలకు బదులు ఫోన్లు, గీకే కార్డులు కావాలని జనాన్ని తిప్పించుకోవచ్చు ) అవి వచ్చిన తరువాత ఏ రోజు పని చేస్తే వచ్చిన ఆరోజు కూలి డబ్బులతో వస్తువులను కొనుగోలు చేసే వారు పల్లె టూళ్ల నుంచి సాయంత్రానికి బ్యాంకులున్న పెద్ద గ్రామాలు లేదా పట్టణాలకు వెళ్లి తమ కూలి డబ్బులను బ్యాంకుల్లో వేయాలి. ఆ సమయానికి బ్యాంకులు మూసివేస్తారు కనుక ఆ రాత్రికి అక్కడ వుండి మరుసటి రోజు వుదయం లేదా వేరే వారికి ఇచ్చి తమ ఖాతాలలో వేయించుకొని మరుసటి రోజు సాయంత్రానికి కార్డుపై సరకులు కొనుక్కోవాలి. ప్రతి రోజు కూలి డబ్బులను అలానే చేయాల్సి వుంటుంది. లేదా కులానికొక కార్పొరేషన్‌ పెట్టినట్లుగా బ్యాంకులు కూడా పెట్టించి వాటి శాఖలను ప్రతి వూరిలో లేదా ఏ కులపు వారికి ఆ కులవీధులలో ఏర్పాటు చేసి అక్కడే వేయించవచ్చు.

   రెండు. బ్యాంకుల వద్దకు చలామణిలో వున్న సొమ్ము పెద్ద మొత్తంలో చేరింది. వెంటనే అనేక బ్యాంకులు తమ వద్ద సొమ్ము దాచుకున్నవారి డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటను తగ్గించేశారు. అంటే ఆ మేరకు సుజనా చౌదరి, రాజగోపాల్‌ వంటి పెద్దల కుటుంబాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధలకు ఇచ్చే రుణాల రేట్లు కూడా తగ్గిపోతాయి. గత రెండున్నర సంవత్సరాలుగా ఇలాంటి కంపెనీలకు వడ్డీ రేట్లు తగ్గించాలని సుబ్రమణ్యస్వామి వంటి వారు వారందరూ పని గట్టుకొని రఘురామ్‌ రాజన్‌కు రెండోసారి అవకాశం ఇవ్వకుండా వుర్జిత్‌ పటేల్‌ను తెచ్చి పెట్టుకోవటం, ఆయన ఆధ్వర్యంలో పెద్ద నోట్ల రద్దు వెనుక పెద్దల హస్తం కూడా వుందా ?

   మూడు. బ్యాంకులలో దోపిడీలు జరుగుతున్నాయని ఎవరైనా బ్యాంకులను మూసి వేస్తారా ? ఎలుకలున్నాయని ఇంటినే తగుల పెట్టుకుంటారా ? రొట్టెను ముక్కలుగా కోయటానికి చాకు బదులు పెద్ద కత్తులను వాడతామా ? పెద్ద సుత్తులతో బాదుతామా ? నరేంద్రమోడీ సర్కార్‌ అదే చేసింది. అసలు మన దేశంలో పాకిస్థాన్‌ లేదా మరొక దేశం నుంచి గానీ వస్తున్న లేదా మన దేశంలో మేకిన్‌ ఇండియా ‘ముద్రణ పరిశ్రమల’ నుంచి వస్తున్న కోయంబత్తూరు నోట్లుగా పిలిచే దొంగ నోట్లు ఎన్ని వున్నాయి? నల్లధనం ఎంత?

    నల్లధనం ఎంత అనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద కూడా కచ్చితమైన సమాధానం లేదు. రెండవది నల్లధనం మొత్తం కూడా నగదు రూపంలో దొంగ నిల్వలుగా లేదు.అధిక భాగం నల్లధనం స్విట్జర్లాండ్‌, పనామా వంటి పన్నులు లేని ప్రాంతాలకు తరలిపోయింది. అక్కడి నుంచి కేవలం తపాల పెట్టె చిరునామా లేదా సూట్‌కేసు కంపెనీల పేరుతో వున్న వాటాల రూపంలో, రియలెస్టేట్‌, బంగారం తదితర రూపాలలో ప్రపంచమంతటికీ పోతోంది. అలాంటి చోట్ల, వివిధ రూపాలలో డబ్బు దాచుకున్న పెద్దలందరూ మోడీ చర్య మంచిదేనని పొగడటమే విషాదం. వారిని వదలి జనానికి ఇబ్బందులు కలుగుతున్నాయని, వాటిని పరిష్కరించాలని కోరుతున్న, విమర్శిస్తున్నవారిని నల్లధనులను బలపరిచేవారిగా బిజెపి, దాని మిత్రపక్షాలు చిత్రిస్తున్నాయి. మన దేశంలోకి విదేశీ పెట్టుబడుల రూపంలో వస్తున్న మొత్తాలలో కూడా నల్లధనం వుంది. ఎంత వంతే అంత ఎర్రతివాచీ పరచి ఆహ్వానించటం తప్ప వాటి మంచి చెడ్డలను కనుగొనేందుకు పాలకులు ప్రయత్నించటం లేదు.

    ఒక గీత పెద్దదా చిన్నదా పెద్దదా అని చెప్పటానికి మరో గీత అవసరం. అలాగే నల్లధనం సమస్య కూడా. షిండర్‌ అంచనా ప్రకారం ఖండాలవారీగా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాలలో నల్లధనం 41-44శాతం మధ్య వున్నది.ఆసియాలో అది 28-30శాతం. అధికారికంగా ప్రకటించిన జిడిపి లెక్కల ప్రకారం 96 అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు 38.7శాతం. అదే అంచనా ప్రకారం మన దేశంలో 23-26శాతం మధ్య వుంది. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులలో 35శాతం మారిషస్‌ నుంచి 14శాతం సింగపూర్‌ కంపెనీల పేరుతో వస్తోంది. దీనిలో ఎక్కువ భాగం మన దేశం నుంచి తరలిన నల్లధనమే అని వేరే చెప్పనవసరం లేదు. చైనాకు ఒక్క హాంకాంగ్‌ నుంచే 73శాతం వస్తోంది. అది చైనా నుంచి తరలి వెళ్లిన నల్లధనం అనుకోవచ్చు లేదా హాంకాంగ్‌లో విదేశీయులు దాచుకున్నది కావచ్చు.

   ఇక నకిలీ నోట్ల విషయానికి వస్తే ఇది ప్రపంచవ్యాపిత సమస్య. అమెరికా డాలర్లనే పెద్ద ఎత్తున ముద్రిస్తున్నారు. అయినా డాలర్లను అమెరికా రద్దు చేయలేదు. మన దేశంలో చలామణిలో వున్న నోట్ల మొత్తం 16లక్షల కోట్లు. వాటిలో నకిలీ నోట్లు 400 కోట్లు. అంటే 0.03శాతం. అనేక దేశాలలో వాటి నివారణకు నిరంతరం చర్యలు తీసుకుంటూనే వుంటారు.అనుమానం వచ్చిన సిరీస్‌ నోట్ల వుపసంహరణ వాటిలో ఒకటి.మన దేశంలో కొద్ది నెలల క్రితం ఐదువందల నోట్లపై ముద్రించిన సంవత్సరం వుందా లేదా అని చూసుకోమని జనాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా తెచ్చిన రెండువేలు, ఐదు వందల నోట్లకు సైతం నకిలీలను తయారు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. వాటిపై నిరంతర నిఘాతప్ప ఇప్పుడు చేసిన మాదిరి చర్యలు కాదు.

    సోమవారం వారం నాటి నిరసన సమర్ధనీయమా, కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే నోట్ల రద్దు చేసిన నాడు వున్న మద్దతు తరువాత క్రమంగా తగ్గిపోయిందన్నది వాస్తవం. ఒక వైపు మోడీని సమర్ధిస్తూనే చేసిన పని బాగాలేదని విమర్శించేవారి సంఖ్య పెరిగింది. ప్రతిపక్షాల విమర్శలకంటే సామాన్యుల్లో వచ్చిన విమర్శనాత్మక స్పందనే బిజెపి వారిని భయపెడుతోంది. దాన్ని దాచుకొనేందుకు నానా పాట్లు పడుతున్నారు.