Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

    తాంబోలం ఇచ్చేశాను యిహ తన్నుకు చావండి అంటాడు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు, మా మోడీ అడుసు తొక్కారు, కాళ్లు కడిగే విధము చెప్పండీ అంటున్నారు నమో ప్రహసనంలో ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ .

    మొదటిది నాటకం. కరటకశాస్త్రి, ఆయన శిష్యుడు, మధురవాణి నాటకం ఆడి బాల్యవివాహాన్ని తప్పిస్తారు. కధను సుఖాంతం చేస్తారు. రెండవది వాస్తవం. ఎలా ముగుస్తుందో తెలియదు. అన్నింటికంటే ఎలా ముగించాలో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడికి ముందుగానే వుప్పందిన కారణంగా పెద్ద నోట్ల రద్దును రద్దు చేయాలని లేఖ రాసి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం పొందినట్లు అనుకుంటున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు తరువాత ఆ లేఖను చూపి ఆ ఖ్యాతిలో తమ నేతకు భాగముందన్నట్లుగా మీడియాలో ప్రచారం వచ్చేట్లుగా తెలుగుదేశం వారు మేనేజ్‌ చేశారు. రద్దుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు నగదు రహిత లావాదేవీలపై సూచనలు చేసే పేరుతో ఐదుగురు ముఖ్య మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయతలపెట్టినట్లు, దానికి చంద్రబాబు నాయుడిని సారధ్యం వహించమని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్‌జైట్టీ ఫోన్లో కోరినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

     కేంద్రం నుంచి అలాంటి ఆఫరు వచ్చినపుడు మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు ఎగిరి గంతేసి వుండేవారు.అనుకున్నదొకటి అయ్యింది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్ట అన్నట్లుగా తగిన సన్నాహం, పర్యవసానాలను వూహించకుండానే నరేంద్రమోడీ నోట్ల రద్దును ప్రకటించేశారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే సర్వేల లోగుట్టు గురించి చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాంటపుడు నరేంద్రమోడీ తాను చేయించిన సర్వేలో నోట్ల రద్దుకు 93శాతం మద్దతు వుందని చెబితే నమ్మేంత అమాయకంగా చంద్రబాబు వుంటారా ? ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు, ఆ విషయాలలో, అలాంటి రాజకీయ చాణక్యంలో సరిలేరు నీకెవ్వరూ సరసాల సుధాకరా అన్నట్లుగా చంద్రబాబు పండిపోయారు. కేంద్రం ప్రతిపాదించిన కమిటీకి సారధ్యం వహించే విషయాన్ని కాదన్నట్లుగా చంద్రబాబులో పరకాయ ప్రవేశం చేసే మీడియాలో వార్తలు వచ్చాయి. అవునంటే కాదనిలే అని ఆడవారి గురించి అనవసరంగా ఆడిపోసుకుంటారు గానీ చంద్రబాబు కాదు అన్నారంటే నరేంద్రమోడీ దగ్గర దేనికో టెండరు పెట్టి వుంటారని గుసగుసలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే నోట్ల రద్దు పర్యవసానాలపై తలుపు చెక్కతో కాకుండా తమలపాకుతో కొట్టినట్లుగా జనం కోసమైనా తన అసంతృప్తిని వెల్లడించారు. కేంద్రం వద్ద తన పలుకుబడిని వుపయోగించి రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో నోట్లు తెప్పిస్తా అన్నట్లు హడావుడి చేసి అవాక్కయ్యారు. ఇనుము బాగా కాలినపుడే దానిని కావలసిన విధంగా మలచుకొనేందుకు సుత్తి దెబ్బలు వేయాలి. నోట్ల రద్దు గురించి మాట్లాడటానికి పార్లమెంట్‌కు వెళ్ల కుండా ముఖంచాటేయటం ఒక బలహీనత. దానిని ప్రదర్శించిన మోడీని ఎలాంటి ప్రతిఫలం లేకుండా -అదేలెండి రాష్ట్ర అభివృద్ధికే సుమా- వూరికే ఆదుకుంటే ప్రయోజనం ఏముంటుంది ? అది పరిష్కారం అయితే ముఖ్యమంత్రుల కమిటీకి నేతృత్వం వహించటానికి చంద్రబాబు క్షణంలో సిద్దం అవుతారు.

    నోట్ల రద్దు పర్యవసానాల గురించి జనం అర్ధరాత్రుళ్లు ఎటిఎంల ముందు క్యూలు కడుతుంటే , బ్యాంకుల్లో తమ డబ్బును తాము తీసుకోవటానికి వీల్లేక జనం అవస్తలు పడుతుంటే వాటిని పరిష్కరించాల్సిన కేంద్రం దాని గురించి స్పష్టంగా చెప్పకుండా తక్షణమే నగదు రహిత బదిలీ గురించి సలహాలు చెప్పాలని ముఖ్య మంత్రుల కమిటీని ప్రతిపాదించటం అర్ధంలేని విషయం. నగదు రహిత లావాదేవీల గురించి ఎవరికీ అభ్యంతరం లేదు. దానికి తగిన పరిస్థితులు వున్నాయా లేవా అన్నదే సమస్య. దయ్యాలు తిరిగే సమయంలో ఒక నాయకుడికి ఒక ఆలోచన వస్తే తెల్లవారేసరికి దానిని అమలు జరపాలని పట్టుబడితే కుదరదు. అనేక అభివృద్ది చెందిన దేశాలలో ఇప్పటికీ నగదు లావాదేవీలు గణనీయంగా వున్నాయి. కొన్ని దేశాలలో ఇటీవలి కాలంలో అవి పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అందువలన తగిన సన్నాహాలు చేసుకొని చేయాల్సిన మార్పులను తొందరపడితే పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలే ఏర్పడతాయి. ముందు ప్రభుత్వంతో మొదలు పెట్టి దశలవారీగా అమలు జరిపి అవినీతిని అరికడితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

నీవు నేర్పిన విద్యయే కదా మోడీ !

     ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరగటంలో కాంగ్రెస్‌-బిజెపి మధ్య ఎలాంటి తేడా లేదని తేలిపోయింది. ఓటింగ్‌కు అనుమతించే నిబంధన కింద చర్చకు అధికారపక్షం తిరస్కరించటంతో బుధవారం నాడు లోక్‌సభ పరిమితంగానే కార్యకలాపాలు చేపట్టి గురువారం నాటికి వాయిదా పడింది. గతంలో 2జి స్కామ్‌పై చర్చ సందర్భంగా ప్రధాని మన్మోహస్‌ సింగ్‌ సభకు హాజరై, ఓటింగ్‌కు అనుమతించే నిబంధనల ప్రకారం చర్చ జరగాలని బిజెపి పెద్దలు పట్టుపట్టారు. ఇప్పుడు వారు వీరయ్యారు. అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. పోయినోడే మంచోడనిపిస్తున్నారు. ఎలాగంటే అప్పుడు చర్చ అవినీతి గురించి కనుక కాంగ్రెస్‌ ప్రధాని సభకు రావటానికి సిగ్గు పడ్డారు, సమర్ధించుకోలేని దుస్థితిలో ఆపని చేశారు. ఇప్పుడు నరేంద్రమోడీ సభకు రావటానికి బిడియమెందుకు ? ఇదేమీ అవినీతి అంశం కాదే. నోట్ల రద్దును అవినీతి అని ఎవరూ అనటం లేదే ! ఓటింగ్‌ జరిగేందుకు వీలు కల్పించే నిబంధనల కింద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్‌లో పాలక కూటమికి పూర్తి మెజారిటీ వుంది. అయినా వ్యతిరేకిస్తున్నది. ఈ కారణంగా 16వ తేదీ నుంచి జరుగుతున్న వుభయ సభలలో ఈ అంశంపై ముందుకు సాగటం లేదు.ఒక వేళ ఓటింగ్‌ గీటింగ్‌ జరిగితే దాని వలన ప్రభుత్వం పడిపోయే పరిస్థితులేమీ లేవే ! నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఎవరైనా ఓటు చేస్తే ఎందుకు అలా చేశారో వారే చెప్పాల్సి వుంటుంది.

     తాను చేసిన నోట్ల రద్దుకు 93శాతం జనం మద్దతు పలికారని ప్రధానే స్వయంగా చెబుతున్నారు. వందకు రెండువందల మంది మద్దతు వుందనే వంది మాగధుల సంగతి సరేసరి. జనం మద్దతు లేకపోతే మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికలలో బిజెపి పెద్ద పార్టీగా ఎలా సీట్లు సంపాదించింది అని కొత్త పాయింటును దొరకబుచ్చుకున్నారు. జనం మద్దతు వుందా లేదా అన్నది తేలాలంటే ఆ సమస్య మీదే ఓటింగ్‌ జరగాలి. నోట్ల రద్దుతో తలెత్తిన జన ఇబ్బందులను ఎప్పటిలోగా తీరుస్తారు, ముందస్తు ఏర్పాట్లు లేకుండా ఇబ్బంది పెట్టే చర్య ఎందుకు తీసుకున్నారని కదా ప్రతిపక్షాలు అడుగుతోంది. ఏ పార్టీ అయినా నోట్ల రద్దును వ్యతిరేకించిందా ? లేదే ! దాని పర్యవసానాల గురించి అడగటానికి ప్రతిపక్షానికి అర్హత లేకపోతే పార్లమెంట్‌కు హాజరై ప్రభుత్వ వైఖరిని ప్రధాని నరేంద్రమోడీ వివరించాలి కదా ! పార్లమెంట్‌తో పని లేకుండా నరేంద్రమోడీ ప్రధాని కాలేదు, ఆయన లోక్‌సభా నాయకుడు. ప్రతిపక్షం చర్చకు అంగీకరిస్తే ప్రధాని సభకు వస్తారు అని పాలకకూటమి వాదిస్తోంది. ప్రధాని రాక నెపంతో పార్లమెంట్‌ను జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షానికి అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలి ? జనం సొమ్మును ఎందుకు వృధా చేయాలి? యాభై రోజులలో అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని, ధరలు తగ్గుతాయని అనటం తప్ప నిర్ధిష్టంగా ఏదీ చెప్పటం లేదు. బంగారం ధరలు తగ్గాయి, జనం దానితో కడుపు నింపుకోలేరు కదా ! కడుపు నింపే పప్పుల ధరలు పెరిగాయి. అలాంటపుడు పాలకులు చెప్పే మాటలను జనం ఎలా నమ్మాలి ?

అత్తమీది కోపం దుత్తమీద చూపినట్లు

       అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లు ( ఇది మహిళలను కించపరచటంగా భావించవద్దని మనవి ) చంద్రబాబు నాయుడు పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులకు బ్యాంకర్లపై నిందమోపి తన పరిధిని అతిక్రమించారు. మధ్యలో వారేమి చేస్తారు. ఒక చెక్కు తీసుకొని ఒక రోజు బ్యాంకుకు వెళ్లి వుంటే సిబ్బంది ఎంత వత్తిడితో గత కొద్ది రోజులుగా పని చేస్తున్నారో చంద్రబాబుకు తెలిసి వుండేది. రిజర్వుబ్యాంకు నోట్లు పంపితే కదా పంపిణీ చేసేది. తెలుగు నేలలో కొన్ని మీడియా సంస్ధలు ఒక కొత్త లాజిక్‌ను తయారు చేశాయి. అదేమంటే తెలుగుదేశం అధికారంలో వున్నపుడు తమకు మంచివి అనిపించిన అంశాలను చంద్రబాబు ఖాతాలో జమ చేయటం, వైఫల్యాలన్నింటికి అధికారులను బాధ్యులుగా చేసి వారి ఖాతాలో వేయటం. నోట్ల రద్దు పర్యవసానాలకు నరేంద్రమోడీ నిర్వాకాన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా సానుకూలంగా కూడా విమర్శించలేదు. బ్యాంకర్లపై నిందలు మోపి, వారిపై వత్తిడి పెంచి ముఖ్యమంత్రి సాధించేదేమీ వుండదని గ్రహించటం అవసరం.