ఎం కోటేశ్వరరావు
నగదు రహిత లావాదేవీలను ఎక్కువగా నిర్వహించేందుకు అవసరమైన పద్దతులను సూచించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్వీనర్‌గా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. నగదుకు బదులు కార్డు గీకి కార్యకలాపాలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు లేకున్నా బలవంతంగా అయినా ఆ పద్దతికి మళ్లించేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మరికొద్ది రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే జనం అనివార్యంగా అటువైపు మళ్లుతారని గత కొద్ది రోజులుగా పేటిమ్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరగటాన్ని బట్టి చెప్పవచ్చు.
నల్లధనాన్ని అరికట్టే పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్రమోడీ వెంటనే నగదు రహిత కార్యకలాపాల గురించి ఎందుకు తొందర పడుతున్నారో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఒక కమిటినీ ఎందుకు వేశారో, గురువారం నాడు రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ ప్రకటనతో స్పష్టమైంది. నోట్ల రద్దుకు దీనికి ఏదైనా సంబంధం వుందా ? ముఖేష్ ప్రకటించిన వివరాల ప్రకారం సోమవారం నుంచి దేశవ్యాపితంగా కోటి మంది వ్యాపారులను జియో మనీతో అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేశారు. దానికి వీలు కల్పించే జియో వుచిత డేటా, ఫోన్ సౌకర్యాన్ని మరో మూడు నెలల వరకు వుచితంగా అందచేయనున్నారు. ఆధార్ నంబరు అనుసంధానంతో చిన్న ఎటిఎంలను మార్చినెల నాటికి దేశ వ్యాపితంగా నాలుగు లక్షలు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు అన్ని బ్యాంకులకు వున్న ఎటిఎంల కంటే ఇవి రెట్టింపు. ఇప్పటికే రెండులక్షల దుకాణాలతో ఈ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. దుకాణాలతో లావాదేవీలు మాత్రమే గాక వ్యక్తుల నుంచి వ్యక్తులకు కూడా లావాదేవీలు జరపవచ్చు. వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాల నుంచి వ్యాపారి ఖాతాకు సొమ్ము బదలాయించటమే కాకుండా వ్యాపారులు దీనితో తమ బ్యాంకు ఖాతాలలో కూడా నగదు జమచేయటానికి వినియోగించవచ్చు.ఎస్‌బిఐతో కలిసి నగదు చెల్లించే బ్యాంకు లైసన్సును కూడా జియో తీసుకున్న విషయం తెలిసిందే.ఇప్పటికే జియో ఫోన్ కనెక్షన్ల ద్వారా ఐదు కోట్లకు పైగా ఆధార్ కార్డుల సమాచారాన్ని రిలయన్స్ సేకరించింది. అంటే బ్యాంకింగ్ వ్యవస్ధకు సమాంతరంగా ఆర్ధిక కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ సంస్ధ పధకాలతో వున్నట్లు చెప్పవచ్చు.
నగదు రహిత కార్యకలాపాల నిర్వహణ ద్వారా పారదర్శకతను పెంచుతామని, అవినీతిని అరికడతామని చెప్పటాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే దేశంలో పుష్కలంగా నిరక్షరాస్యత, అమాయకత్వం నిండి వుండి, అనువైన వ్యవస్థాగత సౌకర్యాలు లేకపోతే సామాన్య జనం నోట్ల రద్దు మాదిరి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. రెండవది నూటికి నూరుశాతం నగదు రహిత దేశాలు, ప్రాంతాలుగా వున్న చోట్ల అవినీతి రూపం మార్చుకుంది తప్ప పోలేదు. నూతన ఆర్ధిక విధానాలు, ప్రపంచీకరణ పేరుతో గత పాతిక సంవత్సరాలుగా అనుసరించిన విధానాలు వుపాధి రహిత అభివృద్ధికి బాటలు వేశాయి. పర్యవసానంగా ఆర్ధిక అసమానతలు మరింతగా పెరిగాయి. ప్రపంచవ్యాపితంగా జరిగిన పరిణామమే మన దేశంలో కూడా జరిగింది.
అనేక మందికి నగదు రహితం అంటే డబ్బుకు బదులు కార్డులను గీకటం మాత్రమే అనుకుంటున్నారు. రిలయన్స్ వంటి సంస్ధలు మన జేబులను స్మార్ట్‌గా కొల్లగొడతాయి. అంబానీలు నాలుగులక్షల చిన్న ఎటిఎంలు పెట్టినా, ఆరునెలల పాటు వుచితంగా డేటా, ఫోన్ సౌకర్యం కలిగించినా అది తాను సంపాదించిన లక్షల కోట్ల సంపద నుంచి చేస్తున్న దానం కాదని తెలుసుకోవటం అవసరం. వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఇవన్నీ చేస్తున్న పెద్ద మనిషి వడ్డీతో సహా అసలు, లాభాలను రాబట్టుకొనేందుకు చూస్తాడని వేరే చెప్పాలా ? కార్డు డబ్బు లావాదేవీలపై జనానికి అలవాటు చేసేందుకు తొలి రోజుల్లో కొన్ని రాయితీలు ఇస్తారు. తరువాత అసలు నగదుపైనే పరిమితులు విధించి విధిగా కార్డులపై ఆధారపడేట్లు చేస్తారు. అటువంటి పరిస్థితి వచ్చిన తరువాత చార్జీలు, సర్చార్జీల మోత మోగుతుంది. అంటే నగదు కంటే నగదు రహితంతో వినియోగదారులు అధిక మొత్తాన్ని చెల్లించాల్సి వుంటుంది.
వుదాహరణకు క్రెడిట్ కార్డులపై బంకుల్లో పెట్రోలు పోయించుకుంటే ఎలాంటి సర్‌ఛార్జీలు వుండవు అని చెబుతారు. రద్దు చేస్తున్న మాట కూడా నిజం. అయితే ఈ రాయితీ శాశ్వతం కాదు. ఎలాంటి చార్జి వసూలు చేయవు అన్నది కూడా వాస్తవం కాదు. వుదాహరణకు నేను కోటక్ క్రెడిట్ కార్డు మీద రు.1500ల పెట్రోలు కొనుగోలు చేస్తే కార్డును గీకినపుడు ఇచ్చిన రశీదుపై అంతే మొత్తం వుంది. తీరా క్రెడిట్ కార్డు బిల్లు చూస్తే అసలు విషయం తెలిసింది. రు.43.13లు ఎక్కువ వసూలు చేసి దాని నుంచి రు.37.64 తిరిగి జమ చేసినట్లు బిల్లులో పేర్కొన్నారు. మిగిలిన రు.5.49 నేను కోటక్ కార్డు యజమానులకు చెల్లించాను. ఇది ఒక లావాదేవీకి మాత్రమే. ప్రతిదానికి విలువను బట్టి వుంటుంది. అదే నగదు చెల్లిస్తే అదనం వుండదు. ఎలక్ట్రానిక్ పద్దతుల్లో నగదు బదిలీ చేసినా, కార్డు ద్వారా చెల్లించినా కొద్ది రోజులు వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయకపోవచ్చు. వినియోగదారుల తరఫున వ్యాపారి తన లాభంలోంచి ఆ మొత్తాన్ని చెల్లిస్తాడు. తరువాత పరోక్షంగా సరకు ధరలో దానిని కూడా కలిపి మన దగ్గర వసూలు చేస్తాడు. కార్డు మోజు ఖరీదు ఇలా వుంటుంది.
నగదు లావాదేవీ అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్ధలు రోజువారీ వచ్చిన సొమ్ముకు ఒకటో, రెండో,మూడు ఖాతాలలోనో లెక్కలు రాయాలి. మరుసటి రోజు లేక అదే రోజు బ్యాంకుల్లో జమ చేయాలి. సరే ఇప్పుడంటే లెక్క పెట్టటానికి మిషన్లు వున్నాయి కనుక కట్టలు కట్టటానికి, వాటిని బ్యాంకులకు చేర్చటానికి సిబ్బంది, వాహనాలు, రక్షణ అవసరం. నగదు రహితమైతే అవేమీ అవసరం లేదు. అంటే దుకాణాలలో కొన్ని వుద్యోగాలు పోవటం ఖాయం.
నగదు రహిత కార్యకలాపాలు పెరిగితే బ్యాంకులలో వుద్యోగాలు కూడా హరీ అంటాయి. ఇప్పటికే ఎటిఎం మిషన్లు, కంప్యూటర్లు వచ్చి సిబ్బంది తగ్గిపోయారు. పశ్చిమ దేశాలలో కొన్ని బ్యాంకు శాఖలు అసలు నగదు స్వీకరించవు. ఎక్కువ చోట్ల నామమాత్రంగా సిబ్బంది వుంటారు. మన దేశంలో కూడా అదే పునరావృతం అవుతుంది. ఇప్పటికే నగదు జమ చేయటానికి కూడా ఎటిఎంలు వచ్చాయి. అసలు నగదు లేకపోతే ఏటిఎం మిషన్లు అవసరం వుండదు. అంటే ప్రతిదాని దగ్గర వుండే రెండు సెక్యూరిటీ , వాటి నిర్వహణ సిబ్బంది వుద్యోగాలు ఎగిరి పోతాయి.
ఇక నగదు రహిత లావాదేవీల సాధ్యాసాధ్యాల గురించి చూద్దాం. గిరిజన ప్రాంతాల జనం విద్య, వైద్య సౌకర్యాలు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, ఎంతెంత దూరాలు కొండలు, గుట్టలు ఎక్కి దిగుతున్నారో చూస్తున్నాం. వారందరికీ అమలు చేయటం సాధ్యమేనా ? ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పుకొనే అమెరికాలో 2012లో 40శాతం నగదు లావాదేవీలు జరిగాయి, తగ్గే ధోరణిలో వున్నాయి. అక్కడే 2013 లెక్కల ప్రకారం అసలు బ్యాంకులలో ఖాతాలు లేని జనం ఎనిమిదిశాతం అయితే మరో 20శాతం మందికి ఖాతాలున్నప్పటికీ పూర్తిగా వాటిని వినియోగించకుండా ప్రత్యామ్నాయ అంటే నగదు, ఇతర పద్దతులలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు.2014 గ్యాలప్ సర్వే ప్రకారం 29శాతం మందికి క్రెడిట్ కార్డులు లేవు.2009లో చేసిన కార్డు చట్టం ప్రకారం 21 సంవత్సరాల లోపు వారికి క్రెడిట్ కార్డులు ఇవ్వరు. అందువలన నగదు లావాదేవీలను పరిమితం చేసినా, లభ్యతను పరిమితం చేసి అప్రకటిత నిషేధం విధించినా బ్యాంకు ఖాతాలు లేని పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారు. అలాంటి వారు ప్రీపెయిడ్ అంటే మనం సెల్‌ఫోన్లను చార్జింగ్ చేయించుకున్నట్లుగా డబ్బును కార్డులలో వేయించుకోవాలి. ప్రీపెయిడ్ ఫోన్ కాల్ ఎలా ఎక్కువ ఖరీదో ప్రీపెయిడ్ డెబిట్ కార్డుకు కూడా చార్జీలు ఎక్కువ అవుతాయి.
నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టటమంటే జనంపై బలవంతంగా రుద్దటమే అన్నది అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ఫ్రాన్స్‌లో వెయ్యి యూరోల కంటే ఎక్కువ విలువగల లావాదేవీలకు నగదు వినియోగించటం చట్టవిరుద్దం. అనేక దేశాలలో ఇలాంటి ఆంక్షలున్నాయి.కొన్ని ఐరోపా దేశాలలో గ్రీసు వంటి చోట్ల ఒక పట్టణంలో మాత్రమే చెల్లుబాటయ్యే ప్రత్యామ్నాయ కరెన్సీలు కూడా వునికిలోకి వచ్చాయి. అవి కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే కలిగి వుండాలి. కొన్ని చోట్ల పిల్లలకు ఇచ్చే డబ్బును పుస్తకాల వంటికి వాటికి మాత్రమే వుపయోగించాలి. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వినియోగించటం నిషిద్ధం.
బ్యాంకులు పెద్ద మొత్తంలో నగదు నోట్లను ముద్రించటం, వాటిని రవాణా చేయటం, భద్రతను కూడా లాభనష్టాల కోణంలో చూస్తున్నాయి.ఈ ఏడాది జూలై ఎనిమిదిన రిజర్వు బ్యాంకు సమాచారం మేరకు 95శాతం కరెన్సీ అంటే 16.8లక్షల కోట్ల నోట్లు చలామణిలో వున్నాయి. ఏటా నోట్ల ముద్రణ ఖర్చు 3,760 కోట్లు,ఎటిఎంల నిర్వహణకు రు.15,800 కోట్లు ఖర్చవుతున్నాయి. ఈ ఖర్చును కూడా గణనీయంగా తగ్గించేందుకు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు. న్యూఢిల్లీలో నోట్ల రవాణాకు 2014లో 9.1 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు తేలింది.నగదు రహిత లావాదేవీలు నిర్వహించే పశ్చిమ దేశాలలో పెద్ద నోట్లను ముద్రించటం లేదు. అదే బాటలో మన దేశంలో కూడా వెయ్యి నోట్లను ముద్రించకూడదని నిర్ణయించారని, రెండువేల రూపాయల నోట్లను కూడా రద్దు చేసి తరువాత మిగతా నోట్ల ముద్రణను కూడా పరిమితం చేసే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది.నగదు రహిత లావాదేవీలు జనంపై ఆదనపు భారం మోపకూడదు. వీటి వలన పన్ను ఎగవేతలు తగ్గి ఆదాయం పెరుగుతుంది అంటున్నారు కనుక ఆమేరకు జనంపై విధించే పన్నుల భారం కూడా తగ్గాలి. లేదా పెరిగిన ఆదాయాన్ని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు రాయితీల రూపంలో కట్టబెట్టటం కాకుండా జన సంక్షేమానికి వెచ్చించాలి. ఈ విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగి మంచి చెడ్డలను వివరించిన తరువాతే ముందుకు పోయే విషయాన్ని నిర్ణయించాలి .లేకుంటే పెద్ద నోట్ల రద్దు మాదిరి పరిస్థితులు నిత్యకృత్యంగా మారతాయి.