Tags

, , , , ,

ఎంకెఆర్‌

   ఒక అయిడియా జీవితాన్నే మార్చేసింది అనేది ఈ రోజుల్లో ఒక జోకుగా మారిపోయింది. పెద్ద నోట్ల రద్దు, లెక్కకు మించిన బంగారంపై దాడుల వార్తలు రెండవసారి కూడా గద్దె నెక్కాలన్న నరేంద్రమోడీ ఆశల మీద నీళ్లు చల్లుతాయా ? అసలు తొలి అయిదు సంవత్సరాలూ పదవిలో కొనసాగటాన్నే ప్రశ్నార్ధకం చేస్తాయా ? జ్యోతిష్కులకు పెద్ద సవాల్‌ ఇది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు అనే నరేంద్రమోడీ అయిడియా – లేఖ రాసిన చంద్రబాబు తన వాటా ఖ్యాతి గురించి ఏమంటారో తెలియదు – అనేక మంది ప్రాణాలను తీసి, జనాన్ని నానాయాతనలకు గురి చేస్తోంది. ఇలాంటి మహత్తర అయిడియా పేటెంట్‌ హక్కు తనదేనా లేక మరొకరిదా అన్నది స్పష్టం చేయాల్సిన బాధ్యత మోడీగారి మీదే వుంది. నోట్ల రద్దు నిర్ణయం ఏక్షణంలో తీసుకున్నారో గాని పెద్దలు ఒక మాట మీద నిలకడగా లేరు. ఎన్ని నిర్ణయాలు , ఎన్ని మార్పులు ! ఏ రోజు బ్యాంకులలో ఎంత డబ్బు ఇస్తారో తెలియదు, ఏ ఎటిఎం ఎప్పుడు తెరుచుకుంటుందో అసలే తెలియదు. అనేక అంశాలను ముందే కనిపెట్టి చెప్పేశాం అని గొప్పలు చెప్పుకొనే జ్యోతిష్కులు, జ్యోతిషాన్ని పాఠాలుగా చెబుతున్న విశ్వవిద్యాలయాల మేథావులు గానీ నోరు మెదపటం లేదు. వారి దురవస్థకు జాలి పడాలి. నోట్ల రద్దు దెబ్బకు గ్రహాలు కూడా గతి తప్పి డబ్బుకోసం క్యూలలో నిలవటానికి వెళ్లి వుండాలి. ఒక ఎటిఎం నుంచి మరో ఎటిఎం వద్దకు పరుగులు తీసే క్రమంలో తమ చిరునామాలే మరచిపోయాయా ? లేకపోతే మన జ్యోతిష్కులు ఈ పాటికి ఏదో ఒకటి చెప్పే వుండేవారు.

    గత కొద్ది రోజులుగా వెలువడుతున్న సమాచారం, తీరు తెన్నులను చూస్తే మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌కు ప్రధాని నరేంద్రమోడీకి వున్న తేడా ఏమిటని అనేక మంది విశ్లేషించేపనిలో పడ్డారు. చరిత్ర అవసరం లేదని చెప్పిన వారంతా ఇప్పుడు తుగ్లక్‌ చరిత్రను చదువుతున్నారు. దేశం మొత్తాన్ని అంటే దక్షిణాదిని కూడా తన పాలనలోకి తెచ్చుకోవాలంటే ఢిల్లీ దూరంగా వుంది కనుక రాజధానిని దేశం మధ్యలోకి తరలించాలని తుగ్లక్‌ భావించాడు. అలాగే బిజెపిని వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో గెలిపించి పటిష్టపరచాలంటే నోట్ల రద్దు వంటి చర్యలు అవసరమని మోడీ భావించినట్లు కనిపిస్తోంది. తుగ్లక్‌ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరి( మహారాష్ట్రలోని దౌలతాబాద్‌)కు మారుస్తూ పరివారంతో పాటు రాజధాని జనాన్ని మాత్రమే ఇబ్బంది పెట్టాడు. మోడీ దేశం మొత్తాన్ని యాతనలకు గురి చేస్తున్నారు. నెలాఖరుకు కాస్త నొప్పి తగ్గుతుందని, తరువాత కొంత కాలం వరకు వుంటుందని ఆర్ధిక మంత్రి అరుణ్‌జెట్లీ చెప్పేశారు. తుగ్లక్‌ నగదు రద్దు చేసి అభాసుపాలయ్యాడు. మోడీ పాత పెద్ద నోట్లను వుపసంహరించి ఏం కాబోతున్నారో డిసెంబరు ఆఖరు నాటికి స్పష్టత రానుంది.

    నోట్ల రద్దు వలన ఆహా ఎన్ని ప్రయోజనాలో ఓహో ఎన్ని ప్రయోజనాలో, 50 రోజుల తరువాత తడాఖా చూడండి, ముందుకాస్త నొప్పి వుంటుంది కానీ తరువాత అంతా మంచే అని చెప్పటం తప్ప నల్లధనం ఎంత వస్తుందో, దానితో ఏమి చేయవచ్చో అపర మేథావిగా నీరాజనాలు అందుకుంటున్న నరేంద్రమోడీగానీ, అంతకంటే ఎక్కువ తెలివితేటలు వున్నాయని చుట్టుపక్కల వుండే వారి ప్రశంసలు అందుకొనే చంద్రబాబు గానీ లేదా వారికి మద్దతు ఇస్తున్న మీడియా విశ్లేషకులు గానీ నిర్ధిష్టంగా చెప్పలేదు. మూడు నుంచి ఐదులక్షల కోట్ల రూపాయల మేరకు నల్లధనం బయటకు వస్తుందని, ఈ మొత్తాన్ని ప్రభుత్వ లోటు తీర్చుకునేందుకు లేదా నరేంద్రమోడీని మరోసారి గద్దె నెక్కించేందుకు వీలుగా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయటం లేదా విజయమాల్య వంటి ఘరానా పెద్దలకు ఇచ్చిన అప్పులను రద్దు చేయటం ద్వారా నష్టపోయిన బ్యాంకులకు పెట్టుబడిగా పెట్టి ఆదుకోవటం వంటి అనేక పిట్టల దొరల వూహాగానాలు వెలువడ్డాయి. వాటిని ఇప్పటికీ నమ్ముతున్నవారు గణనీయంగా వున్నారు. సమాజంలో మధ్యతరగతికి లోలకం లక్షణం వుందని అనుభవజ్ఞులు చెబుతారు. గోడగడియారాలలో లోలకం ఆ వైపు ఈ వైపు తిరుగుతుంటుంది తప్ప మధ్యలో ఎప్పుడూ ఆగదు. అలాగే పొలో మంటూ నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తిన వారు అంతే వేగంతో కిందకూడా పడేయగలరు. ఏం జరుగుతుందో తెలియదు కనుక తోటి వారు కాస్త కనిపెట్టి వుండటం మంచిది.

    నవంబరు 29న రాజ్యసభకు ఆర్ధికశాఖ సహాయ మంత్రి తెలియచేసినదాని ప్రకారం పెద్ద నోట్లు రద్దు చేసే సమయానికి దేశంలో 1716.5 కోట్ల ఐదు వందల నోట్లు, 685.8 కోట్ల వెయ్యిరూపాయల నోట్లు చలామణిలో వున్నాయి.(దీనిలోనే నల్లధనం కూడా కలసి వుంది) వాటి మొత్తం విలువ 15.44 లక్షల కోట్లరూపాయలు. రిజర్వు ప్రకటించినదాని ప్రకారం నవంబరు 27 తేదీ నాటికి బ్యాంకుల వద్ద డిపాజిట్‌ చేసిన పెద్ద నోట్ల విలువ రు.8.45లక్షల కోట్లు. నోట్ల మార్పిడికి ప్రభుత్వం ఇచ్చిన 50 రోజుల గడువులో 18 రోజులలో జమ అయిన మొత్తం ఇది. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం పదిలక్షల కోట్ల మేరకు జమ కావచ్చని అంచనా. అంటే ఐదులక్షల కోట్లకు అటూ ఇటూగా నల్లధనం బయటకు రావచ్చని మోడీ సర్కార్‌ లెక్కలు వేసుకుంది. అయితే ఇది పంచపాండవులు-మంచం కోళ్ల కథను గుర్తుకు తెస్తోంది.http://www.thehindu.com/business/Economy/Deposits-of-withdrawn-notes-nears-Rs.11-lakh-crore/article16738256.ece  ప్రకారం 14.15లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో వుంది. చెలామణిలో వున్న నోట్ల విలువ గురించి లెక్కలలో తేడాలు వుంటున్నాయి. అందువలన కొన్ని వేల కోట్లు అటూ ఇటూగా 14లక్షల కోట్లని అందరూ చెబుతున్నారు. డిసెంబరు 30 నాటికి బ్యాంకుల వద్ద ఎంత మేరకు పెద్ద నోట్లు జమ అవుతాయో చూసిన తరువాత రిజర్వుబ్యాంకు తాము ముద్రించిన నోట్లెన్నో, తమ వద్దకు వచ్చినవెన్నో లెక్కించి రాని వాటిని నల్లధనంగా ప్రకటిస్తుంది. అంటే ఆ మేరకు తిరిగి అదనంగా ముద్రించి ఆ సొమ్మును ఏం చేయాలో ప్రభుత్వ నిర్ణయం మేరకు అది చేస్తారు. అంతకు ముందు డిపాజిట్‌ చేసిన తీరు తెన్నులను బట్టి నవంబరు 30వ తేదీ నాటికి 11లక్షల కోట్ల మేరకు డిపాజిట్‌ అయివుంటుందని బ్యాంకర్ల అంచనా. అంటే ప్రభుత్వం అనుకున్న ఐదులక్షల కోట్లు కాస్తా మూడుకు పడిపోయాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పాతనోట్లే ఎక్కువగా చెలామణిలో వున్నాయి. వాటిని కూడా డిపాజిట్‌ చేయటానికి ఈనెలాఖరు వరకు గడువు వుంది కనుక, చివరి నిమిషంలో జమ చేసే వారు కూడా గణనీయంగానే వుంటారు కనుక మిగిలిన మూడులక్షల కోట్లలో ఎంత జమ అవుతుంది అన్నది ప్రశ్న. ఇంక ఈ మొత్తం జమ కాకుండా వుండేట్లు చూడు మనువా, మా మోడీ పరువు కాపాడు మనువా అని ఆయన వీర భక్తులు రహస్యంగా మొక్కుకోవటం ప్రారంభించటం మంచిది. ఎందుకంటే ఇంకే మాత్రం బ్యాంకుల్లో జమ అయినా జనం అడిగే ప్రశ్నలకు వారి దగ్గర సమాధానాలు వుండవు. ఎవరైనా దీని మీద కూడా కొత్త నోట్లతో పందాలు కాసే ప్రమాదం లేకపోలేదు.

  వారం రోజుల క్రితం సిఎంఐఇ అనే సంస్ధ వేసిన అంచనా ప్రకారం లక్షా 28వేల కోట్ల రూపాయల మేర నోట్ల రద్దు వలన నష్టాలుంటాయట. అంటే ఇంకా జనం దగ్గర వున్న మూడులక్షల కోట్లూ నల్లధనమే అనుకున్నా, అనుకున్నా నిఖర లాభం లక్షా 82వేల కోట్లు మాత్రమే. మూడులక్షల కోట్లలో ఈ నెలాఖరుకు రెండులక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయినా ఆర్ధికంగా నష్టదాయకమే. అది నిఖరంగా ఎంత అన్నది కొత్త సంవత్సర కానుకగా తెలుసుకోవచ్చు.

సిఎంఐఇ లెక్కల ప్రకారం అది వేసిన నష్ట అంచనాలన్నీ తక్కువలో తక్కువ. ఆ యాభై రోజులు బ్యాంకులు, ఎటిఎంల దగ్గర నిలిచిన కారణంగా పోయిన పని లేదా సెలవుల నష్టం మొత్తం 15వేల కోట్ల రూపాయలు.

బ్యాంకులు కొత్త నోట్లను అమర్చేందుకు, గుర్తించేందుకు వీలుగా ఎటిఎంలలో చేయాల్సిన మార్పులకు అయ్యే ఖర్చు రు.35.1వేల కోట్లు.

కొత్త నోట్లను అచ్చు వేయటానికి ప్రభుత్వానికి లేదా రిజర్వుబ్యాంకుకు వదిలే చేతి చమురు రు.16.8వేల కోట్లు.

వ్యాపార, వాణిజ్యాల ప్రత్యక్ష నష్ట అంచనా రు.61.5వేల కోట్లు.

   వీటన్నింటి మొత్తం లక్షా 28వేల కోట్ల రూపాయలు. ఇక ప్రభుత్వానికి సంభవించే నష్టాలను కూడా లెక్కించాల్సి వుంది. అవి కూడా బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా వెల్లడి అవుతాయి. సిఎంఐఇ సంస్ధ వేసిన నష్టాలలో టోల్‌ టాక్సు రద్దు వలన కలిగిన లోటును పరిగణనలోకి తీసుకోలేదు. రోజుకు 80 నుంచి 90 కోట్ల మేర జాతీయ రహదారుల మీద ఆదాయం కోల్పోయినట్లు అంచనా. ఇంకా ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా కలుపు కుంటే నష్టాలు తడిచి మోపెడు అవుతాయి. అవన్నీ ఆయా సంస్ధలు వార్షిక లెక్కలు తయారు చేసేటపుడుగానీ స్పష్టం గావు అందువలన మోడీ సర్కార్‌ నల్ల ధనాన్ని ఈ మేరకు నష్టపోయిన విలువగల దానిని అయినా పట్టుకుంటే జనానికి మిగిలేది ఆయాసం అయినా నల్లధనంపై పోరులో నేను సైతం అన్నట్లుగా ఎంతో కొంత త్యాగం చేశామని గర్వపడతారు-లేకపోతే జనంలో కలిగేది ఆగ్రహం !