Tags

, , , , , , ,

సత్య

    కాషాయ తాలిబాన్లకు దేశభక్తి గురించి ఆకస్మికంగా మెలకువ వచ్చిందా ? లేక ఎవరైనా వెనుకనుంచి పొడుస్తున్నారా ? కాషాయ పరంపరలో భాగమైన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు వారం రోజుల క్రితం పేటిమ్‌ సంస్ధలో చైనా పెట్టుబడుల గురించి అధ్యయనం చేయాలని తన విభాగమైన స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం)ను కోరినట్లు వారం రోజుల క్రితం మీడియాలో ఒక వార్త వచ్చింది. ప్రభుత్వం ఈ విషయమై విచారణ జరపాలని కోరుతున్నట్లు తాజాగా ఆ సంస్ధ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ వెల్లడించారని ఒక వార్తా సంస్ధ ఆదివారం నాడు తెలిపింది. పద్నాలుగు నెలల క్రితం మన దేశానికి చెందిన పేటిమ్‌ కంపెనీలో 68కోట్ల డాలర్లకు 40శాతం వాటాను చైనా ఇ కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా కొనుగోలు చేసినట్లు లోకానికంతటికీ తెలిసిందే. అదేమీ రహస్యంగా జరగలేదు. ఇన్ని నెలల తరువాత ఆ లావాదేవీ, దాని పర్యవసానాలపై విచారణ జరపాలని కోరటమే విచిత్రం. ఇది వారికి కలిగిన ఆలోచనా , వేరే ఎవరినైనా సంతుష్టీకరించేందుకు ఇలా చేస్తున్నారా ? చైనా కంపెనీలు మన దేశ సంస్ధలలో పెట్టుబడులు పెట్టటం, వాటాలు కొనుగోలు చేయటం ఈ వారంలోనే ప్రారంభమైందా ?

     స్వదేశీ జాగరణ మంచ్‌ వారు చెబుతున్న అభ్యంతరం ఏమిటి ? పేటిమ్‌ ద్వారా చైనా కంపెనీలు మన దేశ సమాచారాన్ని తెలుసుకొని దుర్వినియోగం చేసే అవకాశం వుందని, అసలు ఏ కంపెనీకి ఎంత వాటా వుందో, ఎలా ఇచ్చారో వెల్లడించాలని కోరటంతో పాటు పేటిమ్‌ తన వాణిజ్య ప్రకటనలలో ప్రధాని నరేంద్రమోడీ బొమ్మను వుపయోగించుకోవటం అభ్యంతరకరం అని మహాజన్‌ చెప్పారు. పది సంవత్సరాల పాటు అధికారంలో వున్న యుపిఏ సర్కారు సంస్కరణలను సంపూర్ణంగా అమలు జరపలేదని, తాము వాటిని పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నామని బాసలు చేసిన కారణంగానే విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలు, వాటి కనుసన్నలలో మెలిగే మీడియా నరేంద్రమోడీకి మద్దతు ఇచ్చాయన్నది బహిరంగ రహస్యమే. దానిలో భాగంగానే విదేశీ పెట్టుబడులకు ద్వారాలు మరింతగా తెరిచిన ఖ్యాతి తమదే అని చెప్పుకుంటున్న కాషాయ ‘దేశ భక్తులు’ ఆ విదేశీ పెట్టుబడుల గురించి లబలబలాడటం ఎనిమిదో ప్రపంచ వింత.

    చైనా సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న డెంగ్‌ సియావో పింగ్‌ ఒక మాట చెప్పాడు. మనం కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు ఈగలు, దోమలూ కూడా ప్రవేశిస్తాయి, వాటి బెడదను వదిలించే శక్తి తమకు వుందన్నారు. మన దేశ పాలకవర్గం కూడా సంస్కరణల పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధ కిటికీని బాహాటంగా తెరిచింది. మన ప్రధాని నరేంద్రమోడీ పెట్టుబడుల కోసం తిరగని విదేశీ నగరం లేదు, కలపని చేయిలేదు. ఎక్కడా ఫలానా దేశాల నుంచి పెట్టుబడులు వస్తే తిరస్కరిస్తాం అని ఎన్నడూ, ఎక్కడా చెప్పలేదు. అందువలన అనేక దేశాల కంపెనీలు వచ్చిన మాదిరే చైనా కంపెనీలు కూడా అన్ని దేశాలలో ప్రవేశించినట్లుగానే మన దేశంలో కూడా కాలుపెడుతున్నాయి. మన దేశానికి చెందిన అనేక కంపెనీలు విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి. అక్కడి సమాచారాన్ని తెలుసుకుంటున్నాయి. దుర్వినియోగం చేసినట్లు గమనిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఏ ప్రభుత్వానికైనా సర్వ హక్కులూ వున్నాయి. అలాంటిది కేవలం చైనా కంపెనీలే దుర్వినియోగం చేస్తాయని చెప్పటం వెనుక ఆంతర్యం ఏమిటి ?మన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తాయనుకుంటే అది ఒక్క చైనా కంపెనీయే చేస్తుందని, మిగతా కంపెనీలు చేయవనే గ్యారంటీ ఏముంది. తనకు మార్గదర్శనం చేసే, తన కార్యకలాపాలను సమీక్షించే స్వంత సంస్ధలే డిమాండ్‌ చేస్తున్నాయి గనుక చైనాతో సహా మన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అన్ని విదేశీ కంపెల గురించి గతంలో తీసుకున్న చర్యలేమిటి? భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో కేంద్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రం ద్వారా ప్రకటించటం అవసరం.

     పేటిమ్‌ కంపెనీ ఏ లావాదేవీలనైతే నిర్వహిస్తున్నదో వాటినే ముఖేష్‌ అంబానీ రిలయన్సు జియో మనీ పేరుతో నిర్వహించేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత పేటిమ్‌ లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయని మీడియా వార్తలు తెలుపుతున్నాయి. తాను వెనుకబడిపోతానని అంబానీ ఆందోళన చెందుతున్నారా ? సరిగ్గా ఈ సమయంలో స్వదేశీ జాగరణ మంచ్‌కు పేటిమ్‌ విదేశీ (చైనా) సంబంధాల గురించి గుర్తుకు వచ్చింది. నిత్యజీవితంలో మన సమాచారాన్ని తెలుసుకోని,తెలుసుకోలేని విదేశీ కంపెనీలు ఏమున్నాయి గనుక. మనం మాట్లాడే ప్రతి మాటా, పంపే ప్రతి ఎస్‌ఎంఎస్‌, ప్రతి ఇ మెయిల్‌ సమాచారాన్ని అవసరం వున్నా లేకపోయినా అమెరికా సిఐఏ ఎప్పటిప్పుడు సేకరిస్తున్నదని తెలిసిందే. ఆధార్‌ కార్డుల గురించి అందరికీ తెలిసిపోయింది. పాన్‌ కార్డుల ద్వారా ఎవరి నగదు లావాదేవీలేమిటో ఎవరైనా తెలుసుకోవచ్చు. టీవీలలో అమర్చిన సాధనాల ద్వారా మన ఇండ్లలో, చివరికి పడక గదుల్లో ఏం జరుగుతోందో కూడా తెలుసుకొనే రోజులు వచ్చాయి. మన సమాచార గోప్యత ఎక్కడుంది కనుక. వాటన్నింటినీ వదలి చైనా గురించి మాత్రమే సందేహాలు వెలిబుచ్చేవారి గురించి సందేహించాల్సిన అవసరం కలుగుతోంది. ఎవరికైనా ఏజంట్లుగా పని చేస్తున్నారా ? ప్రపంచంలో ఏ దేశం కూడా చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన వార్తలు మనకు తెలియదు. పాలస్తీనా అరబ్బులను ఇక్కట్ల పాలు చేస్తున్న ఇజ్రాయెల్‌ వస్తువులను బహిష్కరించాలని కొన్ని ముస్లిం సంఘాలు ఎప్పటి నుంచో పిలుపులు ఇస్తున్నాయి.

Image result for boycott chinese products

    సదరు స్వదేశీ జాగరణ మంచ్‌ గత కొంత కాలంగా చైనా వస్తు బహిష్కరణ గురించి సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. నిజమే కదా అని అమాయకులు వీర సైనికుల్లా పని చేస్తున్నారు. అధికారంలో వున్న వారి ప్రతినిధులేమో చైనా వస్తు బహిష్కరణ సాధ్యం కాదని చెబుతుంటారు. అక్కడి వస్తువుల కొనుగోలుకు అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కేటాయిస్తుంటారు ! డాలర్ల కేటాయింపు నిలిపివేస్తే చైనా వస్తువుల దిగుమతులు ఎప్పుడో ఆగిపోయి వుండేవి కదా ! మోడీ సర్కారు ఆపని ఎందుకు చేయదు ? దొంగతనంగా దిగుమతి అయితే పట్టుకోకుండా ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారు ? ఏమిటీ నాటకం, ఎవరిని మోసం చేద్దామని ? ఎవరి చెవుల్లో పూలు పెడతారు ? ఇంతకాలం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ తమ ప్రతినిధులు సర్కారు పగ్గాలు చేపట్టి చైనాతో నానాటికీ బంధం పెంచుకుంటూ పోతుంటే మిన్నకుండటం ఆత్మవంచన కాదా ? వీధుల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టటం పరవంచన కాదంటారా ? ఎందుకీ ద్వంద్వ ప్రమాణాలు ?

    నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత మన దేశంలో చైనా పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి అయ్యాయని మీడియా కోడై కూస్తున్నది.http://www.livemint.com/Politics/X9NBWqqs0JzkX0OQ3UaMQO/Chinese-investments-in-India-increased-sixfold-in-2015.html 2000 ఏప్రిల్‌ నుంచి 2016 మార్చి నెల వరకు మన దేశంలో చైనా పెట్టుబడుల మొత్తం 135 కోట్ల డాలర్లయితే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 230 కోట్ల డాలర్లు వచ్చాయట.http://www.vccircle.com/news/economy/2016/08/30/chinese-investment-india-shoots-23-bn-past-3-months-against-135-bn-2000-16 వీటి గురించి స్వదేశీ జాగరణ మంచ్‌ ఎందుకు మాట్లాడదు ? విచారణ జరపాలని ఎందుకు డిమాండ్‌ చేయదు ? ఈ ఏడాది అక్టోబరు 6-7 తేదీలలో ఢిల్లీలో స్వయంగా నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ చైనా ప్రభుత్వంతో కుదుర్చుకున్న పెట్టుబడుల సహకార ఒప్పందాల గురించి ఎందుకు ప్రశ్నించదు ?

    నల్ల ధనాన్ని వెలికి తీసే పేరుతో ఆ పని చేసిన వారు తరువాత బాణీ మార్చి నగదు రహిత లావాదేవీల గురించి ఎక్కువగా చెబుతున్నారు. చెప్పుకోలేని బాధ ఏమిటో సానుభూతి చూపుదాం. నోట్ల రద్దు తరువాత బిజెపి నేతలందరూ ఇప్పుడు చైనా భజన చేస్తున్నారు. మన కంటే పెద్ద దేశమైన చైనాలో నగదు రహిత కార్యకలాపాలు జయప్రదం అయినపుడు మన దేశంలో ఎందుకు కావు అన్నది వారి ఒక ప్రశ్న. చైనా చర్యలను సమర్ధించిన కమ్యూనిస్టులు అదే పని మన దేశంలో చేస్తే విమర్శిస్తారు ఎందుకు అని ఎదురుదాడికి దిగుతున్నారు. రోజంతా చైనా కమ్యూనిస్టు వ్యతిరేకతను నూరిపోయటం, సాయంత్రం కాగానే దాన్ని అడ్డం పెట్టుకొని తమ చర్యలను సమర్ధించుకోవటం. అవకాశవాదానికి హద్దులు లేవు. మేథోపరంగా ఎంతదివాళా స్ధితిలో వున్నారో కదా !

   నల్లధనాన్ని, నగదు రహిత లావాదేవీలను కమ్యూనిస్టులే కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించటం లేదు. చైనా ఆర్ధిక వ్యవస్ధ మన కంటే ఎన్నోరెట్లు పెద్దది. అక్కడ నగదు రహిత లావాదేవీలను మోడీ సర్కార్‌ మాదిరి బలవంతంగా రుద్దలేదు. తగినంత నగదు రాదని, నగదు రహితానికి మళ్లాలని తెలంగాణా ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి కె. ప్రదీప్‌ చంద్ర ప్రకటించటాన్ని బట్టి తగినన్ని నోట్లను ముద్రించేందుకు మోడీ సర్కార్‌ ముందుకు రావటం లేదని తేలిపోయింది. నగదు రహిత కార్యకలాపాలకు అవసరమైన ఏర్పాట్లు చేయని, కార్డులు గీకటానికి నిరాకరించే విద్యా, వైద్య సంస్ధలు, దుకాణాల తగిన గడువు నిచ్చి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కార్డుల వినియోగం భారం కాదని జనాన్ని ఒప్పించగలిగితే వారే దుకాణాలలో డిమాండ్‌ చేస్తారు. ఒక పరిమితి దాటిన లావాదేవీలు కార్డుల ద్వారా మాత్రమే చేయాలని, అందుకు రెండున్నర శాతం రుసుం అదనం అని వసూలు చేస్తే శిక్షించటం వంటి చర్యలు తీసుకుంటే క్రమంగా అలవాటు పడిపోతారు. ఆ పని చేయకుండా పొమ్మనకుండా పొగపెట్టినట్లు నగదును అందుబాటులో లేకుండా చేసి బలవంతంగా అమలు చేయపూనుకోవటం ఏ ప్రజాస్వామిక లక్షణం ?