Tags
Comet Ping Pong, fake news, Hillary Clinton, Narendra Modi, photos, Pizza Gate, Pizza Gate Fake News
సత్య
ప్రస్తుతం ప్రతిదీ నకిలీ, కల్పిత మయం. దీంతో ఏది నిజమో కాదో, ఎవరు నిజాయితీ పరులో కాదో తెలుసుకోవటం ఎంతో కష్టంగా మారుతోంది. నిజాన్ని నిగ్గు తేల్చే ఓపిక, వనరులు అందుబాటులో లేకపోవటంతో అనేక మంది అనుమానం వచ్చినా కాదని ఖండించలేని, విశ్వసించలేని పరిసి&థతి అయితే ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న తీరు తెన్నులను చూస్తే అత్యధికులు నమ్ముతున్నారు. ఈ బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు నకిలీ, కల్పితాంశాలను సాంప్రదాయక, సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ముందుకు తెస్తున్నారు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా ప్రపంచంలో అనేక చోట్ల కట్టుకథలను ప్రచారంలో పెట్టి సొమ్ము చేసుకుంటున్నవారు వున్నారన్నది నమ్మలేని నిజం. ప్రత్యర్ధులను దెబ్బతీయటానికి కొందరు వీటిని ఆశ్రయిస్తే తమ నేతలను గొప్పవారిగా చిత్రించేందుకు కొందరు వుపయోగించుకుంటున్నారు. ఈ రెండింటికీ హిల్లరీ క్లింటన్, నరేంద్రమోడీని వుదాహరణగా చెప్పవచ్చు.
మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం డిసెంబరు నాలుగవ తేదీన వాషింగ్టన్ డిసిలోని కామెట్ పింగ్ పాంగ్ అనే ఒక పీజా దుకాణానికి ఒక వ్యక్తి వచ్చాడు. వస్తూనే తన చేతిలో వున్న తుపాకితో ఢాం ఢాం మ్మని కాల్పులు జరిపాడు. అమెరికాలో అలా వచ్చి ఇలా కాల్పులు జరిపి కొంత మందిని చంపి, తనను తాను కాల్చుకొని లేదా భద్రతా దళాలకు దొరికి పోవటం సాధారణ విషయం. అయితే పింగ్ పాంగ్‌లో జరిపిన కాల్పులలో ఎవరూ గాయపడలేదు. కాల్పులు జరిపిన వ్యక్తి తాపీగా తన ఆయుధాన్ని అప్పగించి పోలీసులకు లొంగిపోయాడు అది అమెరికా చరిత్రలో ఎనిమిదవ వింత !
మన పాత తెలుగు సినిమాలలో మాదిరి గిర్రున తిరుగుతూ వెనక్కు వెళితే తప్ప ఈ అసాధారణ వరిణామం గురించి అర్ధం కాదు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ‘పిజాగేట్ ‘ పేరుతో ఒక వార్త అమెరికన్లను వూపివేసింది. అదేమిటంటే పైన పేర్కొన్న పింగ్ పాంగ్ రెస్టారెంట్‌లోని సెల్లార్లో చిన్న పిల్లలతో సెక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని దాని వెనుక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ ఆమె ప్రచార బాధ్యతలు చూసే మేనేజర్ జాన్ పొడేస్టా వున్నారని ఒక వార్త వచ్చింది. అది పిజా దుకాణం కనుక దానికి పిజాగేట్ అని పేరు పెట్టారు. ఆ వార్తలో ఆ దుకాణ చిరునామా, ఆ భవనంలోని ఏభాగంలో సెక్స్ నిర్వహిస్తున్నారో స్పష్టంగా పేర్కొన్నారు. తట్టి మరీ లేపి ఈ వార్త విన్నారా అని అడిగినట్లుగా ప్రత్యర్ధి డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఆ వార్త తెలియని వారికి కూడా తెలిసే విధంగా చేయాల్సిందంతా చేశారు. ఇంకే మంది అనేక మంది ఆ షాప్ యజమాని, దానిలో పని చేసే సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అవి న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలలో కూడా వార్తలయ్యాయి.బాబోయ్ ఈ బెదిరింపులు, అసలు కుట్రవార్త గురించి దర్యాప్తు చేసి నిగ్గుదేల్చండని పిజా షాప్ యాజమాన్యం ఎఫ్‌బిఐని, సామాజిక మీడియా కంపెనీలను కోరింది.అయినా సరే ప్రచారం ఆగలేదు. షాపు యజమాని, క్లింటన్ మేనేజర్ మధ్య జరిగిన ఇమెయిల్ వుత్తర ప్రత్యుత్తరాలంటూ ఒక వెబ్సైట్ బయట పెట్టటంతో అందరూ పీజా గేట్ నిజమే అనుకున్నారు. దానిలో పేర్కొన్న పీజా షాపులోని ఆహార పదార్ధాల పేర్లను సంకేత భాష అంటూ అర్ధాలు తీసి వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులను భరించలేక షాప్ మేనేజర్ వుద్యోగానికి రాజీనామా చేయాలని అతని భార్య పోరు పెట్టింది.
చిత్రం ఏమిటంటే పీజాగేట్ కుంభకోణం నిజమని గానీ, కాదని గానీ ఎఫ్బిఐ ప్రకటించలేదు. హిల్లరీ క్లింటన్ స్వయంగా పిల్లలను హత్య చేసింది అనే ఒక వీడియో రంగంలోకి వచ్చింది. తరువాత దానిని వుపసంహరించుకున్నారు. అయితే అప్పటికే అది చేయాల్సిన హాని చేసింది.నాలుగులక్షల 20వేల మంది దానిని కాపీ చేసుకున్నారని తేలింది. న్యూయార్క్ పోలీసు వర్గాల కధనం పేరుతో వార్తలు వచ్చాయి. హిల్లరీ క్లింటన్ ఇంటిపై దాడి జరిగిందనే బ్రేకింగ్ న్యూస్‌లు వచ్చాయి. వాటి మీద సోషల్ మీడియాలో వ్యాఖ్యానాల గురించి ఇంక చెప్పేదేముంది. ఎన్నికలైపోయాయి.హిల్లరీ క్లింటన్‌కు జరగాల్సిన నష్టం, ట్రంప్‌కు లాభం కలిగింది.
మరోసారి గిర్రున తిరిగి వర్తమానంలోకి వస్తే వుత్తర కరోలినా నివాసి 28ఏండ్ల ఎడ్గార్ మాడిసన్ వాల్చ్ అనే యువకుడు పిల్లలను రక్షించేందుకంటూ తుపాకితో రెస్టారెంట్‌కు వచ్చాడు. పిల్లలతో సెక్స్ రాకెట్ నడిచిందన్న సెల్లార్ కోసం చూశాడు. అసలు ఆ భవనానికి సెల్లారే లేదని తేలింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా పీజా గేట్ అనేది ఒక కట్టుకధ అని తెలుసుకొని గాలిలోకి కాల్పులు జరిపి తన ఆయుధాన్ని అక్కడి సిబ్బందికి అప్పగించి తానెందుకు వచ్చిందీ చెప్పాడట. మా రెస్టారెంట్లో గనుక సెల్లార్ వుండి వుంటే ఏం జరిగి వుండేదో, కట్టుకధలు ఎలాంటి పరిస్ధితులను తెస్తాయో ఈ రోజు మీరు చూశారు. ఇక ముందైనా ఇలాంటి వాటిని నమ్మకండని యజమాని వేడుకున్నాడు. అయితే ఈ వుదంతాన్ని కూడా కొంత మంది కట్టుకథగా కొట్టి పేస్తున్నవారు లేకపోలేదు. కొందరైతే పోలీసులు ఆడించిన నాటకంగా కూడా చెప్పారు. ఏది ఏమైనా క్లింటన్ ఓటమికి ఇది కూడా తన వంతుగా తోడ్పడిందని చెప్పవచ్చు.
ఇక కట్టుకధలతో లబ్ది పొందిన వారిలో మన ప్రధాని నరేంద్రమోడీ ఒకరని చెప్పవచ్చు. ఆయన గురించి సామాజిక మీడియాలో ఎన్నికల సందర్భంగా వ్యాపింప చేసిన కథలు ఎన్నో. వాటిలో ఒకటి మోడీ యువకుడిగా వున్నపుడు ఆర్ఎస్ఎస్ సమావేశాల సందర్భంగా గదులను వూడ్చిన నిరాడంబరుడు అంటూ సామాజిక మాధ్యమాలలో తిప్పిన ఫొటో ఒకటి. అసలూ, దానికి నకిలీని దిగువ చూడవచ్చు.
ఈ ఫొటో గురించి ఫేస్బుక్ దర్యాప్తు బృందం కొన్ని విషయాలను బయట పెట్టింది. చాలా మంది ఇప్పటికీ నరేంద్రమోడీ నిరాడంబరతకు ఆ చిత్రాన్ని వుదాహరణగా చూపుతున్నారు. అంతగా జనంలోకి వెళ్లింది. అసలు ఆ ఫొటో స్వాతంత్య్రానికి ముందు 1946లో అసోసియేటెడ్ ప్రెస్ తీసిన ఫొటో అని అది ఇ బే నుంచి స్వీకరించారని తేలింది. అంటే అప్పటికి అసలు నరేంద్రమోడీ పుట్టలేదు. ఆ ఫొటో ఎలా సంపాదించారనేది ఇంకా రహస్యంగానే వుంది. దొంగలు తమకు తెలియకుండానే కొన్ని ఆనవాళ్లను వదులుతారని పోలీసు చెబుతారు. ఈ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. అది 1988 నాటిదని దానిలో పేర్కొన్నారు. ఆ సమయంలో నరేంద్రమోడీకి అలాంటి గడ్డం లేకుండా వున్నారని కొందరు 1980దశకంలో ఎల్‌కె అద్వానీతో కలసి వున్న ఒక ఫొటోను వుదహరించారు. దాన్ని పక్కన పెడితే మహారాష్ట్ర బిజెపి మీడియా విభాగపు సహ కన్వీనర్‌గా వున్న ప్రీతీ గాంధీ ఆ చిత్రం నరేంద్రమోడీదే అంటూ 2013జూలై 12 తెల్లవారు ఝామున రూపా పంజారియాకు ట్వీట్ చేశారు. ఈ విషయాలు కావాలంటే దిగువ లింక్‌లో వున్నాయి చూసుకోవచ్చు.http://fbinvestigations.blogspot.in/2014/04/modi-fake-vs-real.html