Tags

, , , , , , , ,

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఫ్రీడం హౌస్‌ విమర్శ

   తాము కోరుకున్న రీతిలో వార్తల ప్రచురణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా సంస్ధలపై బహుమానం-బలి ఆయుధంగా ‘ప్రకటనలను’ వుపయోగిస్తున్నాయని అమెరికా కేంద్రంగా పని చేసే ఫ్రీడం హౌస్‌ 2016 నివేదికలో మన దేశ పరిస్థితి గురించి పేర్కొన్నది. కోరుకున్న రీతిలో వార్తలు ఇస్తే బహుమానంగా ప్రకటనల జారీ, విమర్శనాత్మకం, వ్యతిరేక వార్తలు ఇచ్చిన వారికి శిక్షగా ప్రకటనలు ఇవ్వకపోవటం గురించి మన నిత్యజీవితంలో చూస్తున్నదే. ఆ నివేదికలో మన దేశం గురించి రాసిన కొన్ని అంశాలు ఇలా వున్నాయి. అంతకు ముందు సంవత్సర నివేదికలో పత్రికా స్వేచ్చలో 40, రాజకీయ వాతావరణంలో 20 వ స్ధానాలలో వున్నది కాస్తా 2016లో రెండింటిలో ఒక పాయింటు చొప్పున తగ్గి 41,21గా వున్నట్లు, భారత్‌ను పాక్షిక స్వేచ్చ వున్న తరగతి కింద పరిగణిస్తున్నట్లు పేర్కొన్నది.

    దక్షిణాసియా పరిధిలో భారత మీడియా 2015 సంవత్సరంలో అత్యంత స్వేచ్చాయుతమైనదిగా వుండగా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కింద మీడియా సిబ్బంది ఆటంకాలను ఎదుర్కోవటం కొనసాగింది. ప్రభుత్వ అధికారులను కలుసుకోవటంలో ఇబ్బందులను ఎదుర్కొన్నామని జర్నలిస్టులు చెప్పారు, ఆ ఏడాదిలో ప్రభుత్వ సెన్సార్‌ షిష్‌ను అతిగా వుపయోగించి నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరుగుతోందా అని దేశవ్యాపిత చర్చ జరగగా జర్నలిస్టులు, రచయితలు తమ పనికి సంబంధించి బెదిరింపులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. విధి నిర్వహణ కారణంగా ఒక జర్నలిస్టు హత్యకు గురయ్యాడు. శిక్షలు పడని వాతావరణం నెల కొన్న కారణంగా హింసాకాండను ప్రోత్సహించారు.

ముఖ్య పరిణామాలు

    సతాయింపు లేదా ఇబ్బంది కలిగించేందుకు వుద్ధేశించిన సమాచారాన్ని ఇంటర్నెట్‌లో పెట్టటాన్ని నేరపూరిత చర్యగా పరిగణిస్తూ 2000 సంవత్సర ఐటి చట్టంలోని ఒక సెక్షన్‌ను నిలుపు చేస్తూ 2015మార్చినెలలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీలో 2012లో సామూహిత అత్యాచారం, హత్యకు గురైన ఒక వైద్య విద్యార్దినిపై నిర్మించిన ఒక డాక్యుమెంటరీని అదే నెలలో అధికారులు నిషేధించారు. ఫేస్‌బుక్‌లో విమర్మనాత్మక రిపోర్టులు పెట్టాడన్న కక్షతో వుత్తర ప్రదేశ్‌కు చెందిన పాలక సమాజవాదీ పార్టీకి చెందిన వారు జర్నలిస్టు జగేంద్ర సింగ్‌ను జూన్‌ నెలలో సజీవదహనం చేశారు. ఆగస్టునెలలో గుజరాత్‌లో పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శనలు జరిగిన సమయంలో జనం గుమి కూడ కుండా, వార్తలు, సమాచారాన్ని వెల్లడికానివ్వకుండా చేసేందుకు గుజరాత్‌ ప్రభుత్వం మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది.

    భావ ప్రకటన, స్వేచ్చల గురించి రాజ్యాంగం హామీ ఇచ్చినప్పటికీ ఎల్లవేళలా కోర్టులు తగిన విధంగా వాటిని కాపాడలేదు లేదా లేదా ప్రభుత్వ అధికారులు తగిన విధంగా చట్టపరమైన రక్షణలు కల్పించటంలో వాటిని గౌరవించలేదు.మీడియా స్వేచ్చను పరిమితం చేసే అనేక చట్టాలు ఇంకా అమలులోనే వున్నాయి. ప్రభుత్వంపై ద్వేషం లేదా వుల్లంఘన లేదా వ్యతిరేకతను రెచ్చగొట్టటం లేదా ప్రయత్నించటాన్ని దేశ ద్రోహంగా పరిగణించే 1860పీనల్‌ కోడ్‌లోని 124ఏ కొనసాగుతున్నది. భద్రతకు సంబంధించిన అంశాల వార్తలపై నిషేధం, జర్నలిస్టులను శిక్షించే అదికారాన్ని కట్టబెట్టిన 1923నాటి అధికారిక రహస్యాల చట్టం అమలులో వుంది. రోడ్డు నిర్మాణ యంత్రాన్ని తగుల బెట్టేందుకు మావోయిస్టు సానుభూతి పరులకు సహకరించాడనే పేరుతో సోమారు నాగ్‌ అనే జర్నలిస్టును చత్తీస్‌ఘర్‌ పోలీసులు అరెస్టు చేశారు. హింసాకాండ, నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడనే ఆరోపణతో సంతోష్‌ యాదవ్‌ అనే జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు. మీడియా సంస్ధలపై పరువు నష్టం కేసులు కూడా పెరిగాయి. ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీ రాజకీయ అవినీతికి పాల్పడిందని రాసిన కారవాన్‌ పత్రికపై 3.9 కోట్ల డాలర్లకు కేసు వేసింది.

    దేశంలోని టెలికాం కంపెనీల నెట్‌వర్క్‌లో ప్రసారమయ్యే డేటా, ఫోన్‌ కాల్స్‌ను ఒక కేంద్రీయ వ్యవస్ధ ద్వారా అధికారులు తెలుసుకొనేందుకు 2013లో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. ప్రభుత్వ వ్యవస్ధకు అనుగుణంగా ఆ సమాచారం లేదని వెల్లడి అయితే దీర్ఘకాల జైలు శిక్షలు విధించవచ్చు. దానిని 2016లో అమలులోకి తీసుకురానున్నారు. జర్నలిస్టులకు వ్యతిరేకంగా దీనిని దుర్వినియోగం చేయవచ్చు. ఇంటర్నెట్‌ ద్వారా నిఘావేసే ‘నేత్ర’ వ్యవస్ధ ఏర్పాటు గురించి వార్తలు వచ్చాయి.

   కొంత మందికి అనుకూలంగా వార్తలు రాయాలని కొంత మంది మేనేజర్లు జర్నలిస్టులను ఆదేశించటం ఆందోళనకరమైన అంశం. ప్రభుత్వానికి అనుకూలంగా మలిచేందుకు దూరదర్శన్‌ను వినియోగిస్తున్నారు. గొడ్డు మాంసంలో ఐరన్‌ లభ్యం అవుతుందని రాసినందుకు హర్యానా ప్రభుత్వం తన పత్రిక సంపాదకుడిని తొలగించింది. గొడ్డు మాంస వినియోగానికి వ్యతిరేకంగా హిందుత్వవాదులు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పూర్వరంగంలో ఇది జరిగింది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత అధికార ప్రతినిధులు మీడియాతో మాట్లాడవద్దని చెప్పినట్లు తెలిసింది. ఆమేరకు మాట్లాడటం మానివేయటం లేదా ఎంతో కష్టంతో మాట్లాడుతున్నారని గతేడాది మార్చినెలలో 74శాతం మంది జర్నలిస్టులు వెల్లడించారు.

     ప్రభుత్వ రంగ కంపెనీల ప్రకటనలు పోగొట్టుకోకుండా వుండేందుకు కొన్ని మీడియా సంస&థలు స్వయం సెన్సార్‌షిప్పును విధించుకున్నాయి. గతంలో విమర్మశలతో కూడిన వార్తలు రాసిన విదేశీ జర్నలిస్టులకు వీసాలు దొరకటం కష్టమౌతున్నది. ఒక మరాఠీ ఛానల్‌ సంపాదకుడు నిఖిల్‌ వాగ్లేను మితవాద హింసాత్మక హిందూత్వ సంస&థ బెదిరించింది. కేబుల్‌ పంపిణీ నెట్వర్కులను స్వంతం చేసుకుంటున్న రాజకీయ నేతలు తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా లేని టీవీ ఛానళ్లను నిలిపివేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన మీడియాకు లబ్ది చేకూర్చటానికి, నచ్చని వాటిని దెబ్బతీయటానికి ప్రకటనల జారీని సాధనంగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వ లేదా ప్రయివేటు ప్రయోజనాలకు గాను జర్నలిస్టులు, సంపాదకులకు లంచాలతో సహా ప్రలోభాలు అందోళన కలిగిస్తున్నాయి. అదే విధంగా బడా కంపెనీలతో ప్రయివేటు ఒప్పందాల కారణంగా అనేక కంపెనీలలో సంపాదకవర్గం-వాణిజ్య విభాగానికి హద్దులు చెరిగిపోతున్నాయి. పార్టీలు, అభ్యర్ధులకు అనుకూలంగా నోటుకు వార్తల ప్రచురణలపై ఎన్నికల కమిషన్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ విచారణలు జరుపుతున్నప్పటికీ ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున అవి జరుగుతున్నాయి.