సత్య
‘జరిగిన ప్రచారాన్ని చూస్తే నరేంద్రమోడీ వుద్యమం దేశపు వుత్తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసిందనే భావం కలిగింది. అది దేశాన్ని సోషలిజం మరియు విప్లవం వైపు నడిపిస్తుందనిపించింది. ప్రత్యర్ధులను ఆ ప్రచారం వెర్రివాళ్లను చేసింది, ఆశ్యర్యంలో ముంచెత్తి రక్షణ లేని స్థితిలో పడవేసింది, గుక్క తిప్పుకోకుండా దాడులతో వుక్కిరిబిక్కిరి చేసింది. అది కొంత మందిని నేరగాళ్లగా ఆరోపించింది. అవాస్తవాలను ప్రచారం చేసింది. దేశ వ్యవస్ధ యావత్తూ ప్రచారంపై నిర్మితమైంది. భీతిని ఘోరంగా స్థుతించారు.ఈ ప్రచారదాడిలో లక్షల మంది అనుబంధ సంఘాల సభ్యులను సాధనాలుగా వినియోగించారు. మోడీ ప్రచారం మొత్తాన్ని ప్రచార వూహకర్తల పధకాలమేరకు రూపొందించారు .’ నరేంద్రమోడీ నిజస్వరూపం ఏమిటో ముందునుంచీ తెలిసిన వారికి ఈ మాటలు ఆశ్చర్యం గొలపకపోవచ్చు. గత రెండున్నర సంవత్సరాలుగా ఆయన వీర భక్తులుగా మారిన ఎందరినో గత 33 రోజులు ఆలోచనలో పడవేశాయి. ఏమిటిలా జరుగుతోంది అనే అంతర్మధనం వారిలో ప్రారంభమైంది. ఒక అయిడియా జీవితాన్నే మార్చేసింది అంటే ఇదే. పై పేరాలో వర్ణితమైన అంశం నిజానికి నరేంద్రమోడీ గురించి రాసింది కాదు. హిట్లర్ గురించి ‘ ద థర్డ్ రీచ్ ‘ అనే పుస్తకంలో రాసిన ఒక పేరా. అందువలన దానిలో నరేంద్రమోడీ అన్న దగ్గరల్లా హిట్లర్ అని చదువుకోవాలి. నోట్ల రద్దు గురించి జరుగుతున్న ప్రచార తీరు తెన్నులు, దానిని అమలు చేసిన తీరును తప్పుపట్టిన వారిపై జరుగుతున్న ప్రచారదాడిని చూస్తే అది యాదృచ్చికంగా జరుగుతోందా లేక హిట్లర్ ప్రచార వూహాలను బాగా అధ్యయనం చేసిన నరేంద్రమోడి నియమించిన నిపుణుల ఎత్తుగడల మేరకా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. హిట్లర్ లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి.
పార్లమెంట్ భవనాన్ని తానే తగుల బెట్టించి ఆ పని కమ్యూనిస్టులపై ఆరోపించి వారి అణచివేతకు ఒకసాకుగా వుపయోగించుకున్న హిట్లర్ దుర్మార్గానికి ఇప్పుడు రుజువులు అవసరం లేదు. గత కొద్ది రోజులుగా నరేంద్రమోడీ, ఆయన మంత్రులు బాణీ మార్చారు. ప్రతిపక్షాలు తనను పార్లమెంటులో మాట్లాడకుండా అడ్డుకుంటున్నాయని నరేంద్రమోడీ పదే పదే పెద్ద గొంతుకతో చెబుతున్నారు.ప్రతిపక్షాలు నల్లధనులకు మద్దతు పలుకుతున్నాయనేది సరేసరి. ఎంతైనా ప్రధాని కనుక దొంగే దొంగ అని అరచినట్లున్నదని చెప్పటానికి మనస్కరించటం లేదు. పెద్ద నోట్ల రద్దుతో వుగ్రవాదుల పీచమణిచామని చెప్పుకుంటున్నారు. హోంమంత్రి రాజనాధ్ సింగు మన దేశాన్ని విడదీసేందుకు పాక్ ప్రయత్నిస్తున్నదని, మనం తలచుకుంటే దానిని పది ముక్కలు చేయగలమని మాట్లాడారు. నోట్ల రద్దుతో వుగ్రవాదం తగ్గిపోయిందని, వారికి డబ్బులందించే హవాలా మార్గాన్ని కూడా మూసివేశామని చెబుతున్న తరువాత ఈ మాటలు చెప్పటం విశేషం.
పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా పదవీ బాధ్యతలు స్వీకరించే సందర్బంగా నరేంద్రమోడీ పేర్కొన్నారు. అలాంటి దేవాలయానికి ఒక ప్రధానిగా నరేంద్రమోడీ ఒక పూజారి లాంటి వారు. ప్రతి రోజూ పూజారి రాకుండా భక్తులు మాత్రం వచ్చి తమ పాత్ర తాము నిర్వహించి భక్తి రసాన్ని రక్తి కట్టిస్తున్నారు. పూజారి దేవాలయానికి రాకుండా తప్పించుకుంటున్నారని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. దానికి సమాధానం చెప్పకుండా తననే అడ్డుకుంటున్నాయని మోడీ ఎదురుదాడికి దిగారు. బలమైన ప్రధానిగా, ఒక్క మగాడు అన్న భుజకీర్తులు తగిలించుకున్న వ్యక్తి నుంచి ఇంతటి బలహీనమైన వాదన వెలువడటం ఆశ్చర్యం. ఏదో మంచి జరగబోతోందన్న భావనతో తాము ఇబ్బందులు పడుతున్నా ఎంతో సహనం ప్రదర్శిస్తున్న జనం బయట వున్నారు. తిరుగులేని మెజారిటీ వున్న మోడీని పార్లమెంటులో అడ్డుకొనేదెవరు ? ఓటింగ్‌కు అవకాశం వున్న నిబంధన కింద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న మాట నిజం.వాటికా హక్కు లేదా ? పోనీ అదైనా చెప్పమనండి. దానికి బదులు ధర్మోపన్యాసాలతో చర్చను ముగించే నిబంధన కింద జరపాలని అధికారపక్షం మొరాయిస్తోంది. అదే పార్లమెంట్ జరగకపోవటానికి కారణం. గతంలో బిజెపి ప్రతిపక్షంలో వుండగా ఇదే మాదిరి డిమాండ్ చేసిందా లేదా ? అప్పుడు తనకు సరైనది ఇప్పుడు కాకుండా ఎలా వుంటుంది? లోక్‌సభలో ఓటింగ్ జరిగినా మోడీ సర్కార్‌కు ఢోకా లేదు. రాజ్యసభలో ఓడిపోయినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అసలు ప్రతిపక్షాలు ఓటింగ్‌కు పట్టుబడతాయో లేదో కూడా వూహాజనితమే. చర్చను బట్టి ఎవరి రంగేమిటో జనానికి తెలుస్తుంది. అటువంటపుడు అధికారపక్షం భయపడాల్సిన పనేముంది? ప్రజాస్వామిక దేవాలయాన్ని పూజారి బహిష్కరించాల్సిన అవసరం ఏముంది ?
అసలు విషయం ఏమంటే నోట్ల రద్దుతో తలెత్తే ప్రయోజనాల గురించి ఆహా ఓహో అన్నట్లుగా పార్లమెంట్‌లో చెబితే కుదరదు, నిర్ధిష్టంగా జరిగే ప్రయోజనం ఏమిటో ప్రభుత్వం స్పష్టీకరించాలి. చీకట్లో బాణం వేసినట్లుగా అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అనటం తప్ప మరొక అంశం లేదుకనుకనే నరేంద్రమోడీ పార్లమెంట్‌లో మాట్లాడేందుకు సిద్ధం కావటం లేదు. దేశ ప్రజలందరినీ అతలాకుతలం చేసిన ఇంతటి తీవ్ర చర్య గురించి కూడా ప్రధాని మీడియా సమావేశం పెట్ట లేదంటే జర్నలిస్టులను చూసి కూడా భయపడుతున్నారా అని సందేహించాల్సి వస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్ధలో ఒక మంచి వరవడిని నెలకొల్పాల్సిన వారు ఇలా చేయటం నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయటమే. తాను ప్రధాని గద్దె నెక్కెందుకు పార్లమెంట్ సోపానాలు కావాల్సి వచ్చాయి గాని తరువాత మాట్లాడేందుకు మాత్రం పనికిరాకుండా పోయాయా ? ఏంత చిత్రం !