Tags

, , , ,

Image result for people have got quinsy,demonetisation

ఎం కోటేశ్వరరావు

    నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు చెప్పినట్లు అచ్చే దిన్‌ (మంచిరోజులు) ఎప్పుడు వస్తాయో తెలియటం లేదుగానీ పెద్ద నోట్ల రద్దుతో పరిస్థితి అంగిట్లో ముల్లులా తయారైంది. దాన్ని మింగలేము, ఒక పట్టాన బయటకు తీయలేము. సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటకు వచ్చాయట. (ఈ సామెత రంకు  చేసే ఆడ మగా ఇద్దరికీ వర్తిస్తుంది). విదేశాల్లో వున్న నల్లధనాన్ని బయటకు తెస్తే ప్రతి వారి బ్యాంకు ఖాతాలో తలా పదిహేను లక్షల రూపాయలు వేయవచ్చని నరేంద్రమోడీ ఎన్నికలలో వూరూ వాడా చెప్పారు. అది నల్లధనాన్ని తెచ్చి ఖాతాల్లో వేస్తామని చెప్పినట్లు కాదు, ప్రతిపక్షాలు, మీడియా దానిని నిజంగానే మోడీ చేసిన వాగ్దానంగా చిత్రించి తమ నేతను బదనాం చేస్తున్నాయని మోడీ భక్తులు లేదా అనుయాయులు చెబుతున్నారు. మోడీకి నీడగా భావించే బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా దాని గురించి అడిగితే అలాంటి వాగ్దానం చేసినట్లు గానీ చేయలేదని గానీ ఎటూ చెప్పకుండా అరే భాయ్‌ ఎన్నికలలో అనేకం చెబుతుంటాం ఇదీ వాటిలో ఒకటి అని చిరుగడ్డాన్ని సవరించుకుంటూ చెప్పారు.

Image result for venkaiah naidu,demonetisation

     ఇక అచ్చే దిన్‌కు సంబంధించి వాగ్దానం చేసిన మాట నిజమే గాని ఎన్ని రోజుల్లో అని చెప్పామా ? అంటూ ఎప్పుడో ఎదురుదాడికి దిగారు మన తెలుగువాడైన వెంకయ్య నాయుడు.http://indianexpress.com/article/india/india-others/venkaiah-naidu-defends-pm-narendra-modi-1-year-is-too-short-to-judge/ మోడీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న తరువాత ఒక సభలో మాట్లాడుతూ ఏడాది కాలంలో ఎవరైనా ఒక బిడ్డను కనవచ్చు, ఆ బిడ్డ పెరిగి పెరిగి పెద్దయి పరుగెత్తటానికి సమయం పడుతుందా లేదా ! అలాగే జనం ఓపిక పట్టాలి. కొత్త వస్తువులను సృష్టించటానికి నరేంద్రమోడీ ఏమీ ఇంద్రుడు కాదు’ అన్నారు. దీన్నే అచ్చ తెలుగులో గోడమీద అప్పు రేపు అని రాయటం అని చెప్పుకోవాలి. ఎప్పుడు వచ్చి చూసినా అదే దర్శనమిస్తుంది. వెంకయ్య నాయుడిగారి ప్రాస ప్రకారం సిద్దాంతం లేదా రాద్దాంతం ప్రకారం బిడ్డ పుట్టి పరుగెత్తగానే మంచి రోజులు రావు. పరిపూర్ణ వ్యక్తిగా ఇంకా ఇంకా చాలా చాలా జరిగినపుడే మంచి రోజులు వస్తాయి.

   అసలింతకీ అచ్చే దిన్‌ అనే నినాదం కూడా నరేంద్రమోడీ స్వంతం కాదట. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నుంచి అరువు తెచ్చుకున్నదని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.http://blogs.timesofindia.indiatimes.com/chakallas/truth-behind-narendra-modis-acche-din-slogan/ 2012 జనవరి ఎనిమిదిన జైపూర్‌లో జరిగిన ప్రవాస భారతీయుల సభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఏర్పడిన మాంద్య పరిస్థితుల నుంచి బయటపడి త్వరలో మంచి రోజులు వస్తాయంటూ ఆశాభావం వెలిబుచ్చారు. ఆ మరుసటి రోజు గుజరాత్‌ ముఖ్య మంత్రిగా నరేంద్రమోడీ మాట్లాడారు. అప్పటికే తన గుజరాత్‌ మోడల్‌ అభివృద్ది గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఆ సభలో వుక్కు దిగ్గజం ఎల్‌ఎన్‌ మిట్టల్‌ కూడా వున్నారు. నరేంద్రమోడీ తనదైన ప్రత్యేక శైలిలో వుపన్యాసం ప్రారంభిస్తూ మిట్టల్‌వైపు చూపుతూ ఇదిగో ఆయన లండన్‌లో తినే టొమాటాలు, బెండకాయలు కూడా గుజరాత్‌లో పండినవే అంటూ తన ఘనతతో ప్రారంభించారు. తరువాత నిన్న మన ప్రధాన మంత్రి మంచి రోజుల గురించి చెప్పారు. నేను కూడా చెబుతున్నాను త్వరలో ఆ మంచి రోజులు నిరుపమాన రీతిలో తీసుకొస్తాం’ అని చెప్పగానే సభలో మోడీ మోడీ అంటూ పెద్ద స్పందన వచ్చిందట. దాంతో ఇది బాగుందని ఆ నినాదాన్ని కొనసాగించారట. అయితే అది ఇప్పుడు అంగిట్లో ముల్లులా తయారైందని ఇటీవలనే గడ్కరీ చెప్పారట. అంటే దానిని అమలు జరపలేము, అలాగని ఆ వాగ్దానానికి దూరంగా పోలేక అటూ ఇటూగాని స్థితిలో వున్నట్లు అంగీకరించటమే. బహుశా అందుకేనేమో తాజాగా 50 రోజుల్లో మంచి రోజులు అంటూ పెద్ద నోట్ల రద్దు సందర్భంగా కొత్త నినాదమిచ్చారని కోవాలా ?

    దీన్నుంచి తప్పించుకోవటానికి షరతులు వర్తిస్తాయని కొన్ని స్కీములకు కంపెనీలు షరతు పెట్టినట్లుగానే ముందు కొన్ని రోజులు ఇబ్బందులు పడాలి, తరువాత అంతా మంచే అని చెప్పారు. అంటే యాభై రోజుల తరువాత వెంటనే మంచి రోజులు రానట్లే. డిసెంబరు 31 తరువాత ఎలాగూ నరేంద్రమోడీ తిరిగి మౌన ప్రతంలోకి లేదా ఏ విదేశాలకో వెళ్లిపోతారు కనుక ఆయన మాట్లాడరు. మనం తిరిగి వెంకయ్య సమాధానాలు వినటానికి సిద్ద పడాలి. ఎన్నో రోజులు లేవు గనుక ఏం చెబుతారో చూద్దాం !

Image result for people have got quinsy,demonetisation

     చలామణిలో వున్న కరెన్సీలో రద్దు చేసిన పెద్ద నోట్ల మొత్తం 14.44 లక్షల కోట్లని ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పుడు కొత్త 500, 2000 నోట్లతో పాటు మిగిలిన పాత కరెన్సీ కూడా ప్రచురించి పంపిణీ చేసింది కేవలం 4.61లక్షల కోట్ల రూపాయలకు మాత్రమే అని రిజర్వుబ్యాంకు స్వయంగా ప్రకటించింది. ఇప్పటికి బ్యాంకులకు చేరిన పాతనోట్ల మొత్తం విలువ 12.4 లక్షల కోట్లు ఆ తరువాత నాలుగు రోజులు గడిచాయి కనుక. మరో యాభైవేల కోట్లయినా డిపాజిట్‌ అయి వుంటాయని అంచనా. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది కనుక రద్దయిన 14.44 లక్షల కోట్లకు గాను కేవలం తొమ్మిది లక్షల కోట్లు అచ్చువేస్తే చాలని ప్రభుత్వం భావించినట్లు వార్తలు వచ్చాయి. వెయ్యి రూపాయల నోట్లు పూర్తిగా రద్దు చేస్తామని(ఇప్పటికి, పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి రేపేం ప్రకటిస్తారో తెలియదు ) చెప్పినందున వాట స్ధానంలో రెండు వేల నోట్లు ఎలాంటి చిల్లర సమస్యలను తెస్తున్నాయో గత కొద్ది రోజులుగా చూస్తున్నాము. అంటే అంతకంటే తక్కువ నోట్లు అచ్చువేయాలి. ఒక రెండువేల నోటుకు ఐదు వందలైతే నాలుగు, వంద అయితే 20,యాభై అయితే 40, ఇరవై అయితే వంద ఇలా తగ్గే కొద్దీ అచ్చేయాల్సిన నోట్ల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వానికి అదొక తలనొప్పి. చిల్లర కావాలన్నా జనం కమిషన్లు ఇచ్చుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు అవసరమైన నోట్ల ముద్రణ కూడా వచ్చే ఏడాడి ఏప్రిల్‌ నాటికి, అదే మొత్తం నోట్లు అచ్చేయాలంటే జూలై వరకు పడుతుందని చెబుతున్నారు.

    మన దౌర్భాగ్యం ఎలాంటి దంటే మనకు కావాల్సిన నోట్లను కూడా మనం స్వయంగా అచ్సేసుకొనే స్ధితిలో లేమట. 1997-98లో లక్ష కోట్ల రూపాయల విలువగల వివిధ కరెన్సీ నోట్లను మన రిజర్వుబ్యాంకు బ్రిటన్‌, అమెరికా, జర్మనీలలో ముద్రణ చేయించిందని పార్లమెంటరీ కమిటీ నివేదికలో తేలింది. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటూ దూడగడ్డి కోసం అని చెప్పినట్లుగా ఎందుకీ పని చేశారంటే ఆ మూడు దేశాలు మనకు కావాల్సిన కరెన్సీని వేగంగా ముద్రించి ఇచ్చే సామర్ధ్యం కలిగి వున్నాయని అధికారులు చెప్పారట.http://timesofindia.indiatimes.com/India/House-panel-pulls-up-govt-for-outsourcing-printing-of-currency-notes/articleshow/5878095.cms ఇదంతా కాంగ్రెస్‌ హయాంలో జరిగింది. అవినీతి అక్రమాలకు, కుంభకోణాలకు ఆ పార్టీ పెట్టింది పేరు. చిత్రం ఏమిటంటే కాంగ్రెస్‌ హయాంలో బయటి దేశాలలో నోట్ల ముద్రణ లావాదేవీలలో పాలుపంచుకున్న రెండు కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు తేలటంతో భవిష్యత్‌లో వాటితా లావాదేవీలు జరపకూడదని మన ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని నరేంద్రమోడీ సర్కార్‌ ఎత్తివేయటమే విశేషం. ఎందుకు ఎత్తివేశారయ్యా అంటే అవి 150 సంవత్సరాల నుంచి నోట్లచ్చువేసే వ్యాపారంలో వున్నాయి. ఒక దేశ సమాచారాన్ని మరొక దేశానికి అవి చేరవేసి అవి వ్యాపారాన్ని పొగొట్టుకుంటాయా ? మా దర్యాప్తుల అలాంటిదేమీ లేదని తేలింది. అందుకే ఎత్తివేశామని అధికారులు చెప్పారట. ఇలా పొరుగుసేవల కాంట్రాక్టు కోసం సదరు కంపెనీ ముడుపులు కూడా చెల్లించిందని వార్తలు.http://greatgameindia.com/secret-world-indian-currency-printers-de-la-rue/ ఆ నిషేధం ఎత్తివేసిన తరువాత ఆ కంపెనీ షేర్ల ధరలు బాగా పెరిగాయట కూడా. ఇవన్నీ నరేంద్రమోడీ సర్కార్‌కు తెలియకుండా వుండవు. వీటిపై నిజా నిజాలను వెలికి తీసి జనానికి వెల్లడి చేయాలి. మనకు నోట్లు సరఫరా చేసే లేదా అచ్చువేసే కంపెనీలే పాకిస్థాన్‌కు కూడా చేస్తాయట. అంటే మన నోట్లనే కొన్నింటిని దానికి కూడా సరఫరా చేస్తే ? మనం కూడా అక్కడి నుంచే కొన్ని పాక్‌ నోట్లను తెచ్చుకోవాలా ?