Tags

, , , , ,

Image result for narendra modi bhakts

ఎంకెఆర్‌

బాబాయ్‌ బాగున్నావా !

ఏదోరా అబ్బాయ్‌ మీ నరేంద్రమోడీ పుణ్యమాని అని మా ఇంటిదాని పోరు పడలేక రోజూ అలా ఏటిఎం, బ్యాంకుదాకా వెళ్లి ఇలా గంటల తరబడి నిలబడి వస్తుంటే కాళ్లు లాగుతున్నాయ్‌. ఇదిగో ఇప్పుడే వచ్చా బ్యాంకులో రెండువేల రూపాయల నోటిచ్చారు. భోంచేసి సాయంత్రానికి దాన్ని మళ్లా మార్చటానికి మరో గంట ఆ షాపూ ఈ షాపుకూ తిరగాలి !

సరేగాని బాబాయ్‌ ఈ రోజు పత్రికలు చూశావా మా బిజెపి ఎంఎల్‌ఏ ఒకాయన పెళ్లికి ఇంతింత ఖర్చు చేయటం అవసరమా అన్నాడని ఒక యువతి ఔరంగాబాదులో తన పెళ్లి కోసం కేటాయించిన 150 కోట్ల రూపాయలతో తన గ్రామం వెళ్లి 90 మందికి సింగిల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టించిందట చూశావా మా వారెంత నిరాడంబరులో !

చూశాన్రా అబ్బాయ్‌ మీ పార్టీనేత గాలి జనార్డనరెడ్డి, నితిన్‌ గడ్కరీ కుమార్తెల వివాహాలు ఎంత నిరాండబరంగా జరిగాయో లోకంతో పాటు నేనూ చూశా. సరేగానీ అబ్బాయ్‌ నీకు ఆ యువతి వార్త చదివి అనుమానాలు రాలేదా ?

నీకన్నీ అనుమానాలే ప్రతిదానినీ అనుమానిస్తావు. ఏముంది అందులో అనుమానించటానికి ?

కాదురా అబ్బాయ్‌ టీ అమ్మిన మోడీ, ఇండ్లు తుడిచిన మోడీ అన్న మీ పిట్టకథల మాదిరి ఇది కూడా అనుమానంగా వుంది. నూటయాభై కోట్లతో 90 సింగిల్‌ బెడ్‌ రూం ఇళ్లా, ఒక్కో ఇంటికి కోటీ అరవైఆరు లక్షల అరవై ఆరువేల ఆరువందల అరవై ఆరు రూపాయల అరవయ్యారు పైసలు అంటే ! నల్లధనాన్ని తెల్లధనంగా లెక్కల్లో చూపేందుకు వేసిన ఎత్తుగడ కాదు కదా ? చదివిన నీ లాంటి వారికి ఎలాగూ బుర్రతక్కువే అనుకో , చెప్పేవాడికి వినేవాడు లోకువ గనుక ఏదో ఒకటి చెబుతారు. వారికిి బుర్రలేకపోతే రాసిన వారికి వుండొద్దా ! ఇంతకీ దానికి స్వచ్చభారత్‌ పధకం కింద మరుగుదొడ్డి కట్టించారో లేదో విద్యాబాలన్‌కు ఫిర్యాదు చెయ్యి .

ఏంటి బాబాయ్‌ ఆ వార్త అతిశయోక్తి అంటావా ?

అరే అబ్బాయ్‌ రోజూ మీడియాలో అలాంటి కట్టుకధలు, అతిశయోక్తులు వస్తూనే వుంటాయి. నీకు అసలైన అతిశయోక్తి చెప్పనా అదేమిటంటే నోట్ల రద్దు తరువాత ప్రధానితో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు మాత్రమే నట, ఇంకెవరూ మాట్లాడలేదని, తాను చెప్పిన కొన్ని సలహాలు, సూచనలు కనుక ప్రధాని అమలు చేస్తే బంగారు భారతమే అని స్వయంగా ఆయనే చెప్పారు. అసలు మోడీకి నోట్ల రద్దు సలహా ఇచ్చింది తానేనని చంద్రబాబు నాయుడు చెప్పారా. దాంతో తలెత్తిన సమస్యల పరిష్కారానికి సలహా మాత్రం చంద్రశేఖరరావు చెప్పారట. మొత్తానికి మోడీకి కుడిఎడలమల ఢాల్‌ కత్తుల మాదిరి ఎలా వున్నారో కదా !

ఏదోలే బాబాయ్‌ ఎంత చెట్టుకు అంతగాలి, ఎవరి తిప్పలు వారివి. ఇప్పటికే తెలంగాణాను బంగారంగా మార్చేశారు కదా, తన కుమార్తెకు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే దేశం మొత్తాన్ని కూడా బంగారు భారతంగా మార్చివేద్దామని సలహా ఇచ్చి వుంటారేమోలే !

అవున్రా అబ్బాయ్‌ ఒకరేమో ప్రత్యేక హోదాతో నిమిత్తం లేకుండా ప్రత్యేక పాకేజితో బంగారు ఆంధ్రగా మార్చేశారు, మరొకరేమో దేశమంతటినీ మార్చేందుకు పూనుకున్నారు. ఏమి దేశ భక్తి !

భలే గుర్తు చేశావు బాబాయ్‌ దేశభక్తి అంటే గుర్తుకు వచ్చింది. ఏం బాబాయ్‌ నల్లధనాన్ని రద్దు చేయటం మంచిదే అంటారా ! దానిలో భాగంగా తీసుకొనే చర్యలను కొద్ది రోజులు ఓర్చుకోలేరా ! మీరు దేశభక్తులు కాదా !!

ఓర్చుకుంటాను రా అబ్బాయ్‌…… డిసెంబరు 30 వరకు. ఆ లోగా ఆగ్రహిస్తే దేశ భక్తులు కాదని, బ్యాంకుల ముందు కూడా వుగ్రవాద, పాక్‌ అనుకూల నినాదాలు చేసినట్లు ముద్రవేసి మీరంతా జనాన్ని ఎక్కడ తంతారోనని కిక్కురు మనకుండా జనం ప్రతి రోజూ క్యూలలో నిలబడుతున్నారు. ఎన్నిరోజులిలా అని ఎవరిని కదిలించినా డిసెంబరు 30, ఇంకా కొద్ది రోజులే కదా అంటున్నారు.

నీ చోద్యంగానీ బాబాయ్‌ జనం భయపడే అలా వుంటున్నారంటావా !

నిన్ను, నీలాంటి వారి పనులు చూస్తే అలా అనాలనిపిస్తోంది గానీ, జనం ఏదో మంచి జరుగుతుందనే ఆశతోనే క్యూలలో నిలవటం అలవాటు చేసుకున్నారు.

హమ్మయ్య మా మోడీ తీసుకున్న చర్య గురించి ఎంత కాలానికి ఒక మంచి మాట చెప్పావు బాబాయ్‌ ! కానీ బాబాయ్‌ నీతో చెప్పటానికి భయమెందుకు గానీ జనానికి అంత నమ్మకం వుండటాన్ని చూస్తే మాకు భయమేస్తోంది.

మీకు భయమా ! పొద్దున లేస్తే ప్రజాస్వామ్యం గురించి పారాయణం చేస్తారా ! పార్లమెంట్‌లో మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు గానీ బయట మోడీ-షా అలా కనిపించటం లేదుగా !

నూటికి నూటయాభై మంది మమ్మల్ని బలపరుస్తున్నారు, నగదుకు ఇబ్బంది లేదు, అంతా బాగుంది అని బయట గప్పాలు కొట్టటం కాదురా మన డబ్బును మన ఖాతా నుంచి ఒక కార్డు మీదో, చెక్కు మీదో పట్టుమని పది వేలు తీసుకురావటం చేతకాదు గానీ శేఖరరెడ్డి లాంటి వాడి ఇంటికి కోట్లు కోట్లు ఎలా పంపిస్తున్నారు అంటూ అమ్మా, చెల్లి నన్ను ఆట పట్టిస్తున్నారు. ఆలస్యంగా ఇంటి కెళ్తే క్యూలో నిలబడి వస్తున్నానంటే నమ్మటం లేదు. డబ్లు లేకుండా ఇంటి కెళ్లాలంటే ఏదోగా వుంది. మొన్నటికి మొన్న కూరగాయల షాపులో ఐదు రూపాయల కొత్తిమీర, కరేపాకు తీసుకొని గీక్కోమని కార్డు ముందు పెడితే షాపు ఆంటీ ఎగాదిగా చూసి జాలి పడి డబ్బు వద్దులే బాబూ తరువాత ఎప్పుడన్నా ఇవ్వు అంటూ నా మొహాన కొట్టింది. తల తీసేసినట్లయింది.

అబ్బా అయితే మీ ఇంట్లోనే అనుమానం ప్రారంభమైందన్నమాట !

ఏ మాటకామాటే చెప్పుకోవాలి బాబాయ్‌ ఇన్ని రోజులు క్యూలలో నిలబడినపుడు జనం వేస్తున్న జోకులు చూస్తుంటే ఒక వైపు నవ్వొస్తోంది, అఫ్‌ కోర్సు అమ్మాయిలు కూడా వుంటున్నారు గనుక ఎంజాయ్‌ చేస్తున్నాం అనుకో . కానీ మరోవైపు మా మోడీని తుగ్లక్‌, నీరో అంటుంటే మా డాడీనే అన్నట్లుగా నీరసం, కోపం వస్తోంది. అసలు చివరికి ఏమౌతుంది బాబాయ్‌ !

అరే అబ్బాయ్‌ ఏమౌతుందో అనేక మంది పెద్దలు ఇప్పటికే చెప్పారు ! కోట్లకు కోట్లు కొత్త నోట్లు కొందరిళ్లలో దొరుకుతుంటే ఏం జరుగుతోందో మీరందరూ స్వయంగా చూస్తున్నారు. మేము ఏదన్నా అంటే మీరు నల్లధనులను బలపరుస్తున్నారంటూ గయ్యాళి నోరేసుకొని ఇంతెత్తున లేస్తున్నారు.

కాదు బాబాయ్‌ ఒకవైపు రిజర్వుబ్యాంకు వారేమో డిసెంబరు పదినాటికే 12.44 లక్షల కోట్ల మేరకు రద్దయిన నోట్లు బ్యాంకులకు వచ్చాయని చెబుతుంటే మరోవైపు ఆర్ధికశాఖ కార్యదర్శి శక్తికాంతదాస్‌ ఒక నోటును రెండుసార్లు లెక్కవేసి వుంటారులే, లేకపోతే అంత మొత్తం ఎక్కడ జమ అవుతుంది అంటాడేమిటి బాబాయ్‌ !

నువ్వు కుర్రాడివి అనుభవం తక్కువ. అవసరం ఎక్కువ వున్నపుడు మన దగ్గర ఎంత తక్కువుందో తెలిసి కూడా ఒక వెయ్యి అయినా పెరుగుతాయోమో అని ఒకటికి మూడు సార్లు లెక్కపెట్టుకుంటాం. ఇప్పుడు వూహించని విధంగా కరెన్సీ చేరుతుంటే అంత రాకూడదురా బాబూ కనీసం లక్ష కోట్లయినా తగ్గాలిరా భగవంతుడా అని శక్తి కాంతదాస్‌ కూడా అదేపని చేస్తున్నాడేమో ? ఈ వరస చూస్తుంటే రద్దయిన నోట్ల కంటే బ్యాంకుల దగ్గరకు ఎక్కువ వస్తుందని భయపడుతున్నాడో లేక వస్తే చెప్పకుండా దాచేందుకు లెక్కల గందరగోళం చేయబోతున్నారేమో ?

ఏమో బాబాయ్‌ ! దాసుగారేమో అలా చెబుతున్నారు. మన అశోక్‌ గజపతిరాజు గారి దివాణంలో సహాయ మంత్రిగా వున్న జయంత్‌ సిన్హా గారేమో సొమ్మంతా తిరిగి రావటం అద్బుతం, రెండు మూడులక్షల కోట్ల రూపాయలను బయటపెట్టకుండా ఎక్కడో అడవుల్లో తగుల బెడితే ఎవరి దగ్గర నగదు వుందో, దాన్ని ఎలా వుపయోగిస్తున్నారో తెలియకుండా పోయేది కనుక బ్యాంకుల్లో వేయటం మంచిదేగా అంటున్నాడేమిటి బాబాయ్‌ ! ప్రతిపక్షాలేమో నోట్ల రద్దు పెద్ద కుంభకోణం అంటున్నాయి. యూ టూ బ్రూటస్‌ అన్నట్లుగా మోడీ మంచోడే అంటూనే బాబా రామ్‌దేవ్‌ కూడా ఇది రెండు మూడు లక్షల కోట్ల కుంభకోణం అంటున్నారు. అవినీతి బ్యాంకర్లు ప్రధానిని తప్పుదారి పట్టించారని చెబుతున్నాడు . అంతా అయోమయంగా వుంది.

మీ వారందరికీ ఇదొక జబ్బు, కిందపడ్డా మాదే విజయం అంటారు . చెప్పిందేమో నల్లధనాన్ని వెలికి తీయటం అని ప్రచారమేమో నగదు రహితం ! ఇప్పుడేమో అంతా బ్యాంకుల్లోకి రావటం కూడా మంచిదేగా అంటారా ? అసలు మీరు ఒక మాట మీద కట్టుబడి వుంటారా ?

నీకు తెలియందేముంది బాబాయ్‌ నువ్వు మాత్రం ఓటమిని ఒక పట్టాన ఒప్పుకుంటావా అయినా నాకు తెలియక అడుగుతున్నా ఇన్ని రోజులూ ఖాళీగా వుండి ఎంపిలందరూ నియోజకవర్గాలకు వెళ్లి నోట్ల రద్దు ప్రయోజనాల గురించి జనానికి చెప్పమని అమిత్‌ షా ఆదేశించారట. నన్ను మా అమ్మ తిట్టినట్లే అమిత్‌ షాకు కూడా ఇంట్లో తలంటారంటావా !

ఏమో నాకయితే పక్కింట్లోకి తొంగి చూసే అలవాటు లేదు గానీ…. తలంటించుకోవటం మాత్రం తెలుసు !

కాదు బాబాయ్‌ కలుగుల్లోంచి పందికొక్కులు బయటకు వచ్చినట్లు ఎక్కడ దాడి చేస్తే అక్కడ కొత్త నోట్లు కోట్లకు కోట్లు, బంగారం కడ్డీలకు కడ్డీలు దొరుకుతోంది.దీన్ని చూస్తున్న జనం నోట్లు దొరక్కపోతే ఇంకా సహనంతోనే వుంటారంటావా ? అందుకే మాకు భయమేస్తోంది !