ఎంకెఆర్
అన్నా పవర్ స్టారన్నా మీ అభిమానిగా నా ఆందోళన, ఆవేదనదాచుకోలేక ఈ లేఖ రాస్తున్నా. మీ సెక్రటరీలు లేకపోతే సలహాదారులతో ట్వీట్లు ఇప్పించినట్లు కాకుండా నువ్వే స్వయంగా చదువుకో అన్నా, లేకపోతే నిన్ను తప్పుదారి పట్టించే అవకాశం వుంది. ట్వీట్ల ద్వారా అనేక విషయాల మీద మా అన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నాడని తెలిసి అభిమానులం అందరం పొంగిపోయాం. ఇదేంటన్నా అట్టర్ ప్లాఫు సినిమాల మాదిరి తుస్సు మంటున్నాయి. ఒక సినిమా ఫట్టయి డబ్బాలు వెనక్కు తిరిగి వస్తే తరువాత మరో డైరెక్టర్‌తో హిట్టు సినిమా తీసి అభిమానులను అలరించటం తెలిసిందే. ఈ మధ్య నీ రాజకీయ సినిమాలన్నీ ఓపెనింగ్ కలెక్షన్ల తరువాత మరుసటి రోజు నుంచి జనం చూడటం లేదని నీకూ తెలిసి వుండాలి కదా అన్నా. అయినా రాజకీయ డైరెక్టర్లను మార్చినట్లు కనిపించటం లేదు. ఇలాగయితే అభిమానులం ఏం కావాలో తెలియటం లేదన్నా.
ఎప్పుడో ఏడాది క్రితంనాటి విషయాలపై మీ స్టారు ఇప్పుడు ట్వీట్లు ఇస్తున్నాడు పవర్, పంచ్ తగ్గిపోయిందా, ఇప్పటి విషయాల మీద ఏడాది తరువాత ట్వీటుతాడా అని చివరికి బిజెపి వారు కూడా ఎగతాళిగా అంటున్నారన్నా. మాకు తలతీసేసినట్లయింది. ఓడ ఎక్కేంత వరకు ఓడ మల్లయ్య దిగింతరువాత బోడి మల్లయ్య అన్నట్లుగా పద్దతి తప్పితే ఎంతలో ఎంత మార్పో చూడన్నా ! ఇప్పుడు అటు బిజెపి, తెలుగుదేశం వారూ పట్టించుకోవటం లేదు, ఇటు వాటిని వ్యతిరేకించే వారూ నమ్మటం లేదు. దేశమంతా నరేంద్రమోడీ రద్దు చేసిన పెద్ద నోట్ల కంటే ఎక్కువ నగదు బ్యాంకుల్లో జమ అవుతుందా లేదా అని పందాలు కడుతూ డిసెంబరు 30 కోసం అందరూ అటువైపే చూస్తుంటే నువ్వేంటన్నా ఏడాది క్రితపు విషయాల మీద ఇప్పుడు స్పందిస్తున్నావు. అప్పుడు మరచిపోయావా, లేకపొరపాటున ఇప్పుడిచ్చావో తెలియటం లేదన్నా. వాటిని చెల్లని పాతనోట్లని చిన్న పిల్లాడు కూడా పట్టించుకోవటం లేదన్నా !
పెళ్లి మంత్రాలు పెళ్లికి-తద్దినపు మంత్రాలు తద్దినానికి చదవాలన్నట్లుగా సందర్భాన్ని బట్టి కదన్నా స్పందించాల్సింది? చిన్నపుడు మా పిసినారి అమ్మమ్మ లడ్లు, కారప్పూస నెలల తరబడి దాచి చివరికి ఎప్పుడో పిల్లలికి పెడితే ఆమె చూడకుండా బయటపడేసి పారిపోయేవారు. మా కాటమ రాయుడికి అలాంటి సలహాలు ఇచ్చే నిపుణులెవరో గానీ వెతికి పట్టుకొని వీరతాళ్లు వేయాలని మన వారంతా సిద్ధం అవుతున్నారన్నా.
రెండున్నర సంవత్సరాలయినా సాధించిన పెద్ద విజయమిది అని చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేక వుత్తర ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలలో ఓటర్ల ముందుకు ఎలా పోవాలా అని తలలు పట్టుకొని నరేంద్రమోడీ- అమిత్ షా ఒకరి గడ్డాన్ని మరొకరు ు నిమురు కుంటుంటే ఒక అర్దరాత్రి పెద్ద నోట్లు రద్దు ఆలోచన వచ్చినట్లు మన పవర్ స్టార్‌కు ఈ ఆలోచన ఏ సమయంలో వచ్చిందో అని జనం గుసగుసలాడుకుంటున్నారన్నా. ట్వీట్లతో బిజెపి మీద పేలుస్తున్న షాట్లు అరవై ఏండ్ల తరువాత వెనుకటి కెవడో అమ్మా అని అరిచాడన్నట్లుగా వుందిరా అబ్బాయ్ అని మా మాస్టారు అన్నారు. అసలేమీ మాట్లాడని వారి కంటే ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడటం మంచిదే కదా అని సమర్ధించాం అనుకో.
ఒక చిన్న సందేహమన్నా మనం జన సేన రాజకీయ పార్టీని పెడుతున్నట్లా లేనట్లా ? లేక సినిమా టైటిల్ రిజిస్టరు చేసి దశాబ్దాలు గడిచినా తీయకుండా వున్నట్లుగా వుంటామా ? వేముల రోహిత్ ఆత్మహత్యకు కారకులు బిజెపి వారన్నది మీ ట్వీట్ అర్దం అని మేము అనుకుంటున్నాం . రోహిత్ వంటి వారు ఆత్మహత్యకు పాల్పడకుండా ఎలా చూడాలా అన్నది ఆలోచించాల్సింది పోయి బిజెపి వ్యతిరేక పార్టీలు ఆ వుదంతం నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తే బిజెపి , దాని మిత్ర పక్షాలు రోహిత్ దళితుడు కాదని నిరూపించేందుకు ప్రయత్నించాయని మీరు విమర్శించారు. ఈ తర్కం మీ పికె బుర్రలో పుట్టిందా లేక తెలివి తక్కువ మేథావుల నుంచి అరువు తెచ్చుకున్నదా అని ఇక్కడ అడుగుతున్నారన్నా.మీ పీకె అంత పోటు గాడయితే ఎన్నికల సమయంలో బిజెపి-తెలుగుదేశం భుజాలెక్కి, తరువాత అప్పుడప్పుడు సినిమాలు లేనపుడు, కాల్షీట్లు ఖాళీగా వున్నపుడు ఇలా వచ్చి అలా పోవటం తప్ప పీకిందేమిటి అని అడుగుతూ మీకంత సీన్ లేదంటున్నారన్నా !
తప్పును తప్పుగా ఖండించటం తప్పయితే రోహిత్ బలవన్మరణం చెందిన పదకొండు నెలల తరువాత అదీ ఆ సమస్యపై జనం మరచి పోయిన తరువాత పికె ఇప్పుడు తప్పుపట్టటం ద్వారా మీ జనసేన పార్టీ ఏ రాజకీయ ప్రయోజనం ఆశిస్తోంది? తమను దోషులుగా చూపిన పార్టీలపై బిజెపి కూడా ఇదే మాదిరి ఎదురు దాడి చేసింది, దానికి పికె ఆరోపణకు తేడా ఏమిటి ? పోనీ ఇతర పార్టీలను తప్పుపట్టిన మీ నేత ఆత్మహత్యలకు పాల్పడకుండా ఏం చేయాలో ఇంతకాలం తరువాత కూడా ఎందుకు చెప్పలేదు? ఇలాంటి ప్రశ్నలతో జనం మా తలంటుతున్నారన్నా ? మాక్కూడా నిజమే కదా అనిపిస్తోంది. అవు, నోట్ల రద్దు, ఏపికి ప్రత్యేక హోదా ఇలా ఏ సమస్యపై అయినా ఎవరైనా విమర్శిస్తే అధికారంలో వున్న పార్టీలన్నీ రాజకీయ లబ్దికోసమే వీటిపై విమర్శలు చేస్తున్నాయనే కదా ఎదుటి పక్షాలపై దాడి చేస్తోంది. దేశం మీకేమిచ్చిందని కాదు ఆడగాల్సింది దేశానికి మీకేమిచ్చారని ఆలోచించుకోవాలన్నట్లుగా ఇలాంటివన్నీ ప్రత్యర్ధులను నోరు మూయించటానికి అధికారపార్టీ ప్రయోగించే అస్త్రాలు. రాజకీయాలలో ఇవన్నీ పాతబడి తుప్పు పట్టిన ఆయుధాలన్నా !
రాజకీయాలలోకి రాదలచుకుంటే ఎప్పటికప్పుడు స్పందించాలి తప్ప ఆరునెలలకో, సంవత్సరానికో అయితే నలుగురూ నవ్వుతారన్నా, జరిగిందేదో జరిగింది. మీ ట్వీట్లకు మీడియా పెద్దగా స్పందించలేదని మీకు కూడా అర్ధం అయిందనుకుంటా ! ఇక ముందైనా వెంటనే స్పందిస్తేనే ఫలితం, ప్రయోజనం !!
మీ అభిమాని