Tags
2016 US Elections, Democratic National Committee, Donald trump, RUSSIA, Russian Involvement in the US Election, US Election, Vladimir Putin, WikiLeaks
ఎం కోటేశ్వరరావు
నిరసన తెలిపితే లేని పోని దేశభక్తి లేదనే ముద్రవేయించుకోవటం ఎందుకని గానీ లేక నిజంగానే నల్లధనంపై నరేంద్రమోడీ జరుపుతున్న పోరులో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు లేక సైనికురాలుగా భావించటం వల్లగానీ దేశంలో బ్యాంకు ఖాతాలున్నవారందరూ వంతుల వారీగా బ్యాంకులు, ఎటిఎంల ముందు నిలబడేందుకు సర్దుబాటు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పోలవరం తాత్కాలిక డామ్ నిర్మాణాన్నే శాశ్వత డామ్ అన్నరీతిలో ఏ రోజు ఎంత మట్టి తీశారు, ఏ రోజు కాంక్రీట్ వేయాలో చెబుతూ పెద్ద మేస్త్రీ పని చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అర్జునుడికి చెట్టుమీది పిట్టతప్ప మరేమీ కనిపించనట్లుగా చంద్రశేఖరరావుకు కేంద్రంతో బంధుత్వం తప్ప మరేమీ కనిపించని కారణంగా మెలకువగా వున్నా మరో విధంగా వున్నా దాని గురించే మాట్లాడుతున్నారు. నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యల కారణంగా ఇప్పటికైతే పార్లమెంట్‌లో చర్చ తప్పించుకోగలిగాం తరువాతేమిటిరా భగవంతుడా అని లోలోపల ఆందోళన పడుతున్నా పైకి మాత్రం ప్రతిపక్షాలపై మరింతగా దాడి చేస్తూ జనాన్ని నమ్మించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎవరి పాత్రల్లో వారు అమోఘంగా లీనమయ్యారు. పై ముగ్గురు పాత్రధారులు అర్రులు చాచే అమెరికాలో ఏం జరుగుతోందో చూద్దాం.
వాషింగ్టన్ పోస్టు పత్రిక రెండు రోజుల క్రితం ఒక వార్తను ప్రచురిస్తూ దానిలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఒక గ్రాఫిక్ బొమ్మను ప్రచురించింది. వారి మధ్య సంబంధాలు అలా వున్నాయని చెప్పేందుకు అలా చేశారని వేరే చెప్పనవసరం లేదు. గతకొద్ది రోజులుగా అమెరికన్లు తమ అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందా లేదా అని తెలియక కాళ్లు తొక్కుకుంటున్నారు. మనం రోజూ టీవీలలో చూసే హాలీవుడ్ సినిమాలలో అమెరికన్ సిఐఏ, ఎఫ్‌బిఐ ఏజంట్లు ఎంతో తెలివిగల వారిగా, మిగతా దేశాల వారంతా వారి ఎత్తులకు చిత్తయ్యే అమాయకుల మాదిరిగా కనిపిస్తూ మనకు వినోదం అందిస్తుంటారు. వారంతా ఇప్పుడు అవుననీ కాదని చెప్పలేకపోతున్నారు. రెండు రకాలుగానూ చెబుతున్నారు. ఇంతకూ విషయం ఏమిటంటే అమెరికా ఎన్నిలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు స్వయంగా పుతిన్ పర్యవేక్షణలో రష్యన్లు జోక్యం చేసుకున్నారన్నది సమస్య. ట్రంప్ దానిని నమ్ముతున్నట్లే మాట్లాడుతున్నాడు. ఎక్కడ కావాలంటే అక్కడ అమెరికా జోక్యం చేసుకోగలదు తప్ప అమెరికాలో ఎవరూ వేలు పెట్టలేరు మనం అంత గొప్ప మేథావులం, దేనిలో అయినా అమెరికాయే నంబర్ ఒన్ అని ఇప్పటి వరకు అమెరికన్లలో వ్యాపింపచేసిన ఒక అభిప్రాయం.
నువ్వు నీ భార్యను తిట్టటం, కొట్టటం మానుకున్నావా అని ఎవరినైనా ప్రశ్నించి సమాధానం చెప్పమని అడగండి, ఏ సమాధానం వస్తుందో చూడండి. అవును అంటే ఇప్పటి వరకు తిడుతూ, కొడుతున్నట్లు అంగీకరించినట్లు, లేదు అంటే ఇంకా కొనసాగిస్తున్నట్లు. అమెరికన్లు కూడా అదే స్థితిలో పడిపోయి అవును, కాదు అని చెప్పలేక జుట్టుపీక్కుంటున్నారు. ట్రంప్ అధ్యక్ష పదవి స్వీకరించిన తరువాత జనవరి 20 నుంచి ఈ సమస్య మరుగునపడి కొత్త అంశాలపై కేంద్రీకరిస్తారనుకోండి.
సోషలిస్టు సోవియట్‌ను కూల్చివేయటంలో విభీషణుడి పాత్రధారిగా వున్న బోరిస్ ఎల్సిన్‌ను రష్యా అధ్యక్షుడిగా ఎన్నిక చేయించటంలో అమెరికన్ల పాత్ర, జోక్యం జగద్విదతం. అక్కడే కాదు, సోవియట్ల స్ధానంలో స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన ప్రతి రిపబ్లిక్‌లో తమకు అనుకూలమైన వారిని గద్దె నెక్కించేందుకు అమెరికా ప్రయత్నించిందన్నది కూడా బహిరంగ రహస్యమే. తమ దేశ అంతర్గత వ్యవహారాలలో రష్యా జోక్యం చేసుకుందని అంగీకరించటం అంటే తమ వైఫల్యాన్ని అంగీకరించటం, లేదంటే నిరూపించి జనాన్ని నమ్మించాల్సి వుంటుంది. అనేక కొత్త ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వుంటుంది. అందుకే రెండవది అంత తేలిక కాదు.
ఈ ఏడాది జూన్‌లో వికీలీక్స్ స్ధాపకుడు జులియన్ అసాంజే డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చెందిన వేలాది ఇమెయిల్స్‌ను బహిర్గతం చేశాడు. అది రష్యన్ల జోక్యంతో జరిగిందని హిల్లరీ క్లింటన్ అవకాశాలను దెబ్బతీసేందుకు ఆ పని చేశారని డెమోక్రాట్లు ఆరోపించారు. ఇప్పటికీ వారు అదే చెబుతున్నారు. సెప్టెంబరు నెలలో చైనాలో కలిసినపుడు జరిగిందేదో జరిగింది ఇంతటితో ఆపండి లేకపోతే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కొంటారని పుతిన్‌ను ఒబామా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. మరుసటి నెలలో వైట్ హౌస్ అధికార ప్రతినిధి రష్యన్లపై ఇదే ఆరోపణ చేశాడు, రుజువులు చూపకపోయినా జరిగిందని తాము గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పాడు. అదే నెలలో పార్లమెంటరీ విదేశాంగ శాఖ కమిటీ ముందు మాట్లాడిన ఎఫ్‌బిఐ డైరెక్టర్ ఇతర దేశాల ఎన్నికలలో జోక్యం చేసుకున్న చరిత్ర రష్యాకు వున్నదని చెప్పాడు.
పుతిన్ స్వయంగా మెయిల్స్ బయట పెట్టేందుకు ఆదేశించినట్లు వచ్చిన వార్తలను డిసెంబరులో రష్యా ఖండించింది. డోనాల్డ్ ట్రంప్ కూడా రష్యన్ల జోక్యం వార్తలను తోసిపుచ్చారు. ఎన్నికలలో హిల్లరీ ఓడిపోయిన ఫిర్యాదు చేస్తున్నారు తప్ప అధ్యక్ష భవనం ముందుగానే ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు. అందువలన బాధ్యతలు స్వీకరించిన తరువాత చర్యలు తీసుకుంటారో లేదో కూడా తెలియదు.
ఇంతవరకు ఆరోపణలు, ప్రత్యారోపణలు, మీడియాలో విశ్లేషణలు తప్ప అధికారికంగా రష్యా గూఢచారులు, స్వయంగా పుతిన్ జోక్యం చేసుకున్నారనేందుకు ఒక్క ఆధారాన్ని కూడా అమెరికన్లు చూపలేదు. ఇమెయిల్స్‌ను అసలు వీకీలీక్స్ బయట పెట్టిందన్నది కూడా సందేహమే. రష్యన్ హాకర్ గుసిఫర్ 2 ఒక మెయిల్‌లో వేలాది మెయిల్స్, ఫైల్స్‌ను తాను వికీలీక్స్‌కు ఇచ్చినట్లు చెప్పాడు కనుక రష్యన్ సంబంధాన్ని వూహిస్తున్నారు. అయితే డెమోక్రాట్ల కార్యాలయంలో పనిచేసే 27 సంవత్సరాల సేథ్ రిచ్ అనే ప్రజావేగు వాటిని బయటకు పంపాడన్నది ఒక కథనం. అతన్ని జూలై 10న గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఎందుకు చంపారో తెలియదు. అయితే అతని హంతకుల జాడ చెప్పిన వారికి 20వేల డాలర్ల బహుమానం ఇస్తామని అసాంజే ప్రకటించటంతో ఆ వుదంతం మరో మలుపు తిరిగింది.రష్యన్లు తమకు సమాచారం అందచేశారన్న డెమోక్రాట్ల ఆరోపణలను తోసిపుచ్చాడు. తాను రష్యా ప్రమేయం వున్న ఎనిమిది లక్షల ఫైళ్లను బయట పెట్టానని కూడా అన్నాడు. వుజ్బెకిస్తాన్‌లో బ్రిటన్ రాయబారిగా పనిచేసిన మురే ఫైళ్లను లీక్ చేశారు తప్ప హాక్ చేయలేదని, ఆపని చేసిందెవరో కూడా నాకు తెలుసు, అతన్ని కలుసుకున్నాను, అతను రష్యన్ కాదు, అక్కడ పనిచేసే వ్యక్తే అన్నాడు.
నిజంగా హాకింగ్ చేసి వుంటే అమెరికా నాసాకు దానిని కనుగొని వెల్లడించే సత్తా వుందని అయితే అది హాక్ కాదు, లీక్ అయినందున ఆ పని చేయలేదని అమెరికా గూఢచార నిపుణులు భావిస్తున్నారు. రష్యా ఎన్నికలలో అమెరికన్ల జోక్యం గురించి 1996లో టైమ్ పత్రిక తన కథనంలో ఎలా జోక్యం చేసుకుందీ వివరించింది. దానిని అమెరికన్లు తోసిపుచ్చలేదు. కమ్యూనిస్టు అభ్యర్ధి జుగనోవ్‌పై రెండవ సారి కూడా ఎల్సిన్ గెలవాలని తాను స్వయంగా కోరుకుంటున్నానని బిల్ క్లింటన్ చెప్పినట్లు ఆయన దగ్గర పనిచేసి డిక్ మోరిస్ చెప్పినట్లు టైమ్ పేర్కొన్నది. ఎన్నికల సమయంలో స్వయంగా ఎల్సిన్‌తో మాట్లాడిన క్లింటన్ ఏమేమి చేయాలో కూడా సూచించారని డిక్ చెప్పాడు. క్లింటన్ జోక్యాన్ని ఆనాడు పుతిన్ వ్యతిరేకించాడని అయితే ఇన్ని సంవత్సరాల తరువాత ప్రతీకారం తీర్చుకోవాల్సినంత అవసరం ఏముందని కొందరు సందేహం వెలిబుచ్చుతున్నారు.
ప్రపంచ రాజకీయాలలో అమెరికన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవలి కాలంలో రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అనేక వుదంతాలలో కనిపిస్తోంది. ముఖ్యంగా సిరియా విషయంలో అది బహిరంగమే. అదే విధంగా బ్రిక్స్ పేరుతో ఒక కూటమి, చైనాతో ప్రత్యేక సంబంధాలను ఏర్పరుచుకోవటం వంటి అనేక విషయాలను చూసినపుడు రష్యన్లు అమెరికాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అటువంటపుడు డోనాల్డ్ ట్రంప్‌ను గద్దె నెక్కించటం ద్వారా రష్యా పొందే ప్రయోజనం ఏముంటుంది? ఆలోచిస్తే మరింత గందరగోళంలో పడిపోవటమే. అయితే అమెరికన్లు దీనిని ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు అన్న ప్రశ్న వస్తుంది. ఎలక్టరల్ కాలేజీ ఓట్ల విషయంలో ట్రంప్ విజయం సాధించాడు తప్ప జన ఓట్లు హిల్లరీ క్లింటన్‌కే ఎక్కువ వచ్చాయి. తమ క్యాంపును నిలుపుకొనేందుకు డెమోక్రాట్లు రష్యన్ల జోక్యం గురించి ఎక్కువగా ప్రచారం, చర్చ చేస్తున్నారనేందుకే ఎక్కువ అవకాశాలు వున్నాయన్నది ఒక అభిప్రాయం. ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ అమెరికన్లు సామ్రాజ్యవాదులు అయితే వారిని ఎదిరించి ప్రపంచ రాజకీయాలలో తమ ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు రష్యాలోని పెట్టుబడిదారులు. అందువలన ఎత్తుగడలలో భాగంగాని అమెరికా రాజకీయ వ్యవస్ధను గందరగోళంలో పడేయటానికి గానీ జోక్యం వంటి చర్యలకు పాల్పడలేదని కూడా చెప్పలేము. ఏదైనా కొంత కాలం తరువాతే వాస్తవాలు బయటికి వస్తాయి. అప్పటి వరకు పండిత చర్చకు పనికి వస్తాయి.