Tags

, , ,

ఎంకెఆర్‌

    డామిట్‌ కథ అడ్డం తిరిగింది. పెద్ద నోట్ల రద్దు గురించి చంద్రబాబు నాయుడు కొత్త పల్లవి అందుకున్నారు. ‘ఓపినీయన్స్‌ అప్పుడప్పుడూ చేంజ్‌ చేస్తుంటేనే కానీ పొలిటీషియన్‌ కానేరడు !'( అభిప్రాయాలను అప్పుడప్పుడూ మార్చుకుంటూ వుంటేనే కానీ రాజకీయవేత్త కానేరడు) గురజాడ అప్పారావు పంతులు గారు గిరీశం పాత్ర ద్వారా ఎంత చక్కగా చెప్పారు. 1862-1915 మధ్య కేవలం 53 సంవత్సరాలు మాత్రమే జీవించిన గురజాడ ఆ నాటి రాజకీయ నేతల తీరు తెన్నులను చూసే అలాంటి వ్యాఖ్య చేశారంటే నేడే గనుక ఆయన వుండి వుంటే బాబోయ్‌ ఇంకేమైనా వుందా !

    ‘ ఒక ప్రముఖ రచయిత రాసిన ప్రతిదానినీ మెచ్చుకోవాలని నమ్మే అలవాటు తెలివి తక్కువ వారికి వుంటుంది. నా వరకైతే నాకు సంతృప్తినిచ్చే దానినే నేను చదువుతాను మరియు నా అభిరుచులకు తగినదానినే అభిమానిస్తాను’ అన్నాడు ప్రముఖ ప్రెంచి రచయిత ఓల్టేర్‌. చంద్రబాబు, నరేంద్రమోడీ నోటి నుంచి ఏది వస్తే అదే ప్రామాణికం అని నమ్మేవారు ఈ మాటలు తమకు ఎంతవరకు సరిపోతాయో ఆలోచించుకోవటం మంచిది. పెద్ద నోట్ల రద్దు గురించి కేంద్రానికి సిఫార్సు చేసిందే తానే అంటూ కేంద్రానికి రాసిన లేఖ గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చి నరేంద్రమోడీ ప్రశంసలు అందుకొనేందుకు ప్రయత్నించటాన్ని లోకమంతా చూసింది. ఇప్పుడు ఆ నిర్ణయం తెచ్చిన సమస్యలు, పర్యవసానాలను చూసి పెద్ద నోట్ల రద్దు తాను కోరుకున్నది కాదని, తలెత్తిన సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలియటం లేదని రోజంతా ఆలోచించినా తట్టటం లేదని సెలవిచ్చారు. బ్రూటస్‌ నువ్వు కూడానా ! అని స్నేహితుడిగా వుండి వెన్నుపోటు పొడిచిన బ్రూటస్‌ గురించి రోమన్‌ చక్రవర్తి జూలియస్‌ సీజర్‌ వాపోయినట్లుగా బహుశా గత రాత్రి నరేంద్రమోడీ కూడా ఒంటరిగానో లేక అమిత్‌ షా, వెంకయ్య నాయుడి వంటి తన నీడలను పిలిపించుకొనే చంద్రబాబు నాయుడి గురించి అనుకొని వుండి వుండాలి.

    సరే చంద్రబాబు నాయుడంటే పోలవరం తాత్కాలిక డామ్‌ మట్టి తీయిస్తూ, కాంక్రీట్‌ పోయిస్తూ ఆ పనేమీ లేకపోతే నేను నిదురపోను మిమ్మల్ని నిదురపోనివ్వనంటూ అధికారులతో ఏదో ఒక ప్రయోజనం లేని దాని గురించి సమీక్షపేరుతో తీరిక లేకుండా వుండి వుంటారనుకుందాం. లక్షల రూపాయల ప్రజాధనం పందారం చేస్తూ ఆయన నియమించుకున్న సలహాదారులేం చేస్తున్నట్లు ? రాజు మెచ్చిందే రంభ అన్నట్లుగా చంద్రబాబు మనసెరిగి నోట్ల రద్దు అంతా సజావుగానే జరిగిపోతుందంటూ, వాస్తవ పరిస్థితిని వివరించకుండా తప్పుదారి పట్టించి వుంటారా ?

      ‘నోట్ల రద్దు చిన్న ప్రయోజనాల కంటే మోడీ వ్యూహం ఎంతో సాహసోపేతమైనది’ అనే శీర్షికతో ఆర్‌ జగన్నాధన్‌ అనే ఆయన భక్తుడు ఒకరు రాసిన వ్యాసంలోని అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. నోట్ల రద్దు వలన ఎంతో మేలు జరుగుతుంది, దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనం అని ఇప్పటికీ ఒకవైపు ప్రచారం సాగుతుంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఈ భక్తుడు రాసిన దానికి చిన్న ప్రయోజనాలని పేరు పెట్టటం అంటే ముందే చెప్పాం కదా అని ఎదురుదాడి చేసేందుకే. నోట్ల రద్దుతో జనం ఇబ్బందులపై మీడియా వార్తలతో ఇబ్బంది పడిన భక్తులు భజన బాణీ మార్చారు. మోడీ ఏదో పెద్ద పధకంతోనే ఈ పని చేశారంటూ కొత్త పాట అందుకున్నారు. ‘నోట్ల రద్దు వుత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో విజయం కోసం కాదు, అది జరిగితే అదొక ప్రయోజనకరమైన బోనస్‌ అవుతుంది. ఆయన రాజకీయ లక్ష్యాలు అసాధారణమైనవి. అధికారానికి వచ్చిన వెంటనే నల్లధనంపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.2015లో విదేశీ ఆస్థుల గురించి తొలి స్వచ్చంద వెల్లడి పధకాన్ని ప్రకటించారు.అరవై శాతం పన్ను విధించటంతో అది విఫలమైంది. దాని గురించి గుణపాఠం తీసుకొని ఆదాయ వెల్లడి పధకం (ఐడిఎస్‌) ప్రారంభించారు. సెప్టెంబరులో ముగిసిన దానిలో రు.67,382 కోట్ల మేరకు ప్రకటన చేయించగలిగారు. వాయిదాల పద్దతిలో దానిలో 45శాతం మేరకు వసూలు చేస్తారు.( హైదరాబాదులో ప్రకటించి చేతులెత్తేసిన పదివేల కోట్ల రూపాయల ఆస్థిపరుల వంటి వారు ఇంకా ఎందరున్నారో తెలియదు).తరువాత బినామీ లావాదేవీల నిషేధ సవరణ చట్టాన్ని నోట్ల రద్దుకు కొద్ది రోజుల ముందు నోటిఫై చేశారు. జనం తమ వద్ద వున్న సొమ్మును బ్యాంకులలో డిపాజిట్‌ చేయటాన్ని చూసి పన్నుల చట్టాన్ని సవరించింది. దాని ప్రకారం దాచుకున్న సొమ్మును వెల్లడిస్తే 50శాతం పన్ను వసూలు చేసి, 25శాతం మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా నాలుగు సంవత్సరాల తరువాత చెల్లించే విధంగా ఒక పధకాన్ని ప్రవేశపెట్టారు.అది కూడా పనిచేయకపోతే నగదును మరింత తక్కువ చేసేందుకు, మరింతగా డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్ధవైపు నడిపించేందుకు లక్ష్యాన్ని మార్చారు. పరిశుద్దులయ్యేందుకు ఇవన్నీ ప్రతి వారికి ఒకటికి రెండు అవకాశాలు ఇవ్వటం, అలా చేసే వారికి వేధింపులు లేకుండా చూడటం, ఎన్నో ప్రయోజనాలు లేకుండా బిజెపికి పునాది వంటి మద్దతుదారులైన వాణిజ్య, వృత్తిదారుల ఆగ్రహానికి గురిఅయ్యేందుకు కూడా సిద్ద పడి ఒక రాజకీయ నాయకుడు ఈ సాహసం చేయరు.’ ఇలా జనానికి ఆగ్రహం కలగకుండా మంచి రోజులు ముందున్నాయని నమ్మించేందుకు చేసిన ప్రయత్నమిది అని వేరే చెప్పనవసరం లేదు. చంద్రబాబు రాజకీయ నాయకుడు కనుక ఎటుబోయి ఎటు వస్తుందో అన్న ముందు జాగ్రత్తతో నోట్ల రద్దు తన సలహా వల్లనే జరిగిందని తొలి రోజుల్లో చెప్పుకున్నారు తప్ప తరువాత క్రమంగా అసంతృప్తిని వెల్లడించటం ప్రారంభించారు. తీరా ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. దీనిలో అయినా నిజాయితీ వుందా ? లేక ఆగ్రహిస్తున్న జనాన్ని దువ్వేందుకా ? కారణం ఏదైనా చంద్రబాబును గురజాడ గిరీశం ఆవహించినట్లు కనిపిస్తోంది. అందుకే ఒపీనియన్‌ను చేంజ్‌ చేశారు.