Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

    తన దగ్గరున్న సమాచారం గనుక బయట పెడితే ఏదో జరిగి పోతుందన్నట్లుగా రాహుల్‌ గాంధీ బిల్డప్‌ ఇవ్వటం, అది తుస్సుమనటం తెలిసిందే. చీకట్లను పారద్రోలుతూ వెలుగుతుందనుకున్న ఒక మతాబా, బాగా పేలుతుందనుకున్న దీపావళి బాంబు ఒక్కోసారి తుస్సుమనొచ్చు. అయితే అవి తుస్సుమన్నప్పటికీ వాటి అవశేషాలను తొలగించి వీధిని శుభ్రం చేయాల్సిన బాధ్యత గృహస్తు మీదో స్ధానిక సంస్ధల పారిశుధ్య సిబ్బందిమీదో వుంటుంది. ఇప్పుడు రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలు, ఆ మాటకు వస్తే అవి ఆయన కొత్తగా కనుగొన్నవీ కాదు, తాజాగా బయటపడినవీ కాదు, ఇప్పటికే ప్రముఖ లాయర్‌ ప్రశాంత భూషన్‌ కోర్టులో వేసిన కేసులోనివే. ఇక్కడ రెండు అంశాలున్నాయి.

    ఒకటి నరేంద్రమోడీని సమర్ధిస్తూ బిజెపి నేతలు అత్యంత బలహీనమైన వాదనలు చేశారు. రెండు ఆయన స్వయంగా రాహుల్‌ గాంధీని అపహాస్యం చేశారు. తమ నేత గంగ అంతటి స్వచ్చమైన ముత్యం అన్నది ఒకటి. గంగతో సహా ఏ నది అయినా పుట్టుక స్థానంలో ఎంతో స్వచ్చంగా వుంటుంది. తరువాతే కలుషితంగా మారుతోంది. హిమాలయాల నుంచి బయటపడిన తరువాత గంగ ఎంత కాలుష్యంగా మారిందో మోడీ సర్కార్‌ ప్రకటించిన గంగ శుద్ధి ప్రణాళిక తెలిసిందే.ఎవరైనా పుట్టినపుడు, బాల్యంలో ఎలాంటి మచ్చ లేకుండా వుంటారు. పెరిగేకొద్దీ కథ ప్రారంభం అవుతుంది.మోడీ అయినా అంతే. డైరీల నిగ్గు తేలే వరకు సహారా, బిర్లాల దగ్గర ముడుపులు తన స్వంతానికి తీసుకున్నారా పార్టీ కోసమా అన్నది వేరే విషయం.

    పారిశ్రామిక సంస్ధలు, వ్యక్తులు ఇచ్చే విరాళాలు లేదా ముడుపులు ఎక్కడా ఖాతాలలో పక్కాగా రసీదుల వివరాలతో సహా రాయరు. డైరీలలోనో మరొక చోటో పొట్టి లేదా నిక్‌నేమ్స్‌ పేరుతోనో నమోదు చేస్తారు. ఎందుకంటే ఆ పని చేసే వారు ఆ సొమ్ము స్వంతదారులకు జవాబుదారీగా ఏదో ఒక ఆధారాన్ని చూపాలి. నమ్మకస్తుల ద్వారానే అలాంటి పని చేయిస్తారు. వుదాహరణకు రెండు దశాబ్దాల క్రితం హవాలా కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. అది కూడా ఎస్‌కె జైన్‌ అనే హవాలా వ్యాపారి నమోదు చేసిన డైరీల ఆధారంగా అని ఇక్కడ గుర్తు చేయాలి. ఆ డైరీలలో వామపక్షాలు తప్ప కాంగ్రెస్‌,బజెపి, జనతాదళ్‌ తదితర 18 పార్టీల నేతల పేర్లు వున్నాయి. ఆ వివరాలు బయటకు రాగానే ఆ జాబితాలో ఒకరైన బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ తన లోక్‌సభ సభ్వత్యానికి రాజీనామా చేసి ఆ మచ్చ తొలిగిన తరువాత గానీ తిరిగి సభలోకి అడుగు పెట్టనని ప్రకటించి నాడు ప్రశంసలు పొందారు. దాంతో అనేక మంది కాంగ్రెస్‌, బిజెపి నేతలు కూడా పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా ఆ కేసులో తేలిందేమీ లేదు, నిర్దోషులుగా ప్రకటించారు.

   చిత్రం ఏమిటంటే అద్వానీ శిశ్యుషుడినని, ఆయన సభ్యుడిగా వున్న మార్గదర్శక మండలి సలహామేరకు పని చేస్తున్నానని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ రాజీనామా సంగతి తరువాత, ముందసలు ఆ డైరీల సంగతి నిగ్గుదేల్చమని దర్యాప్తు సంస్ధలను ఆదేశించటానికి కూడా ముందుకు రాలేదెందున్నది అసలు ప్రశ్న. హవాలా డైరీలలో, సహారా, బిర్లా డైరీలలో బిజెపితో పాటు కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలందరూ వున్నారు. అందుకే తేలు కుట్టిన దొంగ మాదిరి మోడీ సర్కార్‌ మౌనంగా వుండిపోయిందా ? సరే వెంకయ్య నాయుడు తన పాండిత్యాన్ని మొత్తాన్ని వుపయోగించి ఆ డైరీలు బయట పడింది కాంగ్రెస్‌ హయాంలో అప్పుడెందుకు వాటి గురించి చెప్పలేదని చెట్టుకింద లాయర్‌ మాదిరి ప్రశ్న వేశారు. ఆ డైరీలు 2013 అక్టోబరులో, 2014 నవంబరులో నరేంద్రమోడీ అధికారానికి వచ్చాక సిబిఐ, ఆదాయపన్ను శాఖ దాడులలో బయట పడ్డాయి.తమకు దొరికిన వాటిపై ఏ చర్య తీసుకోవాలన్నది ఆ సంస్ధల విధి. తమకు దొరికిన వాటి గురించి ఎటూ తేల్చకుండా మీన మేషాలు లెక్కించటాన్ని చూసిన తరువాత కామన్‌ కాజ్‌ అనే ఒక స్వచ్చంద సంస్ద 2015లో సుప్రీం కోర్టుకు వెళ్లింది.అంటే సిబిఐ, ఆదాయపన్ను శాఖలపై తెరవెనుక నుంచి వత్తిడి వచ్చిందన్నది స్పష్టం. ‘అవినీతి వ్యతిరేక నరేంద్రమోడీ హయాం ‘ ఇలా జరగటం ఏమిటి ? గంగ మాదిరి కాలుష్యం సోకిందా ?

     ఈ డైరీలపై దాఖలైన కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల తర్కం అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. డైరీలలో పేర్లు వున్నంత మాత్రాన వాటిపై విచారించటం కుదరదని,ఇలాంటి వాటిపై దర్యాప్తులకు ఆదేశిస్తే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయంటూ ఎవరైనా ఒకరు ప్రధానికి ఇంత డబ్బు ముట్టచెప్పామని తమ డైరీలలో రాసుకున్నంత మాత్రాన ఎలా విచారణ జరపాలి అంటూ మరింత స్పష్టమైన సాక్ష్యాలతో రావాలని చెప్పి చింతకాయల రవి సినిమాలో ప్రతిదానికీ సర్టిఫికెట్‌ల ఫ్రూఫ్‌ కావాలనే పాత్రధారిని గుర్తుకు తెచ్చింది. భవిష్యత్‌లో అక్రమంగా నిధులు ఇచ్చేవారు, పుచ్చుకొనే వారు కేసులు, శిక్షల నుంచి తప్పించుకొనేందుకు అనుసరించాల్సిన సులువైన పద్దతిని చెప్పినట్లు , తప్పించుకొనేందుకు అవసరమైన తర్కాన్ని సిద్ధం చేసినట్లుగా వుంది. బిర్లా డైరీలను నమోదు చేసిన వారు తమకు హవాలా మార్గంలో నగదు వస్తుందని, దానిని తమ యజమానుల ఆదేశాల మేరకు రాజకీయ నేతలకు అంద చేస్తాని విచారణలో చెప్పారు. బిర్లా కంపెనీ చైర్మన్‌ సుబేందు అమితాబ్‌ కూడా విచారణలో గుజరాత్‌ సిఎంకు 25 కోట్లు అందచేసినట్లు అంగీకరించారు. అయితే గుజరాత్‌ సిఎం అంటే గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌ అని చెప్పారు. సి,ఎం అనే పదాలకు ఆ కంపెనీ పేరుకు పొంతన కుదరటం లేదు. దాని గురించి అడిగితే అదంతే అనటం తప్ప సరైన వివరణ ఇవ్వలేదు. పోనీ అక్రమ పద్దతుల్లో నగదు తీసుకున్న సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలేమన్నా తీసుకున్నారా ? అదీ లేదు. దీని వాస్తవాలను తేల్చాల్సింది ఎవరు? అందుకే ఆ డైరీలపై దర్యాప్తు జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్లు న్యాయవాది ప్రశాంత భూషన్‌ చెబుతున్నారు. హవాలా కేసులో దొరికిన డైరీలలో పొట్టి పేర్లు మాత్రమే వున్నాయి. అయినప్పటికీ దర్యాప్తు జరపటానికి అవి చాలని అప్పుడు సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పుడు పేర్లు, డైరీలు మరింత స్పష్టంగా వున్నప్పటికీ మరింత స్పష్టమైన ఆధారాలు కావాలని అదే కోర్టు వ్యాఖ్యానించటం గమనించాల్సిన అంశం. రాహుల్‌ గాంధీ చెప్పిన అంశాలపై రాజకీయంగా అపహాస్యం చేయవచ్చు, సామాజిక మీడియాలోని తన భక్తులు, సైన్యానికి వుత్సాహం తెప్పించవచ్చు. అంతటితో అది అయిపోదు, కోర్టు లేదా మోడీ సర్కార్‌ దీనిపై ఏదో ఒక వైఖరిని వెల్లడించకతప్పదు. ఆ డైరీల నిగ్గు తేల్చనంత వరకు మోడీవైపు వేలు చూపుతూనే వుంటారు .