సత్య
నిజం నాలుగు వేసే లోగా అవాస్తవం అరవైై అంగల దూరం ప్రయాణిస్తున్న కాలమిది. ప్రపంచవ్యాపితంగా కల్పిత, నకిలీ వార్తలు ప్రచారం, వేగం రోజు రోజుకూ పుంజుకుంటోంది. అలాంటి వాటిని సృష్టించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు కూడా రంగంలోకి వస్తున్నాయన్నది నమ్మలేని నిజం. ఒక వస్తువు చివరి వినియోగదారుడికి చేరక ముందే దాని నకిలీ తిష్టవేస్తున్నట్లుగానే నిజమైన వార్తలతో పాటు కల్పిత వార్తలను కూడా అమ్మి సొమ్ము చేసుకోవటం వర్తమాన వ్యాపారాలలో ఒకటిగా మారింది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత లోక్‌సభ ఎన్నిలకు ముందు నుంచీ మన దేశంలో ఈ వ్యాపారం తామరతంపరగా పెరిగింది. ఒక సాంస్కృతిక సంస్ధ ముసుగులో పని చేస్తున్న వారు ఒక పెద్ద కల్పిత, నకిలీ, పుకార్ల కర్మాగారాన్నే పెట్టారు. దానికి అనుబంధంగా అనేక చిన్న ఫ్యాక్టరీలు నెలకొల్పారు. వందల మందిని నియమించి కోట్లాది రూపాయల వేతనాలతో నడుపుతున్నారు. తమకు వ్యతిరేకమైన రాజకీయ పార్టీలు, వాటి నేతలు, తమ పట్ల విమర్శనాత్మక వైఖరిని కలిగి వున్న జర్నలిస్టులు, మేథావులు, ఇతరులను అన్ని రకాలుగా తప్పుడు ప్రచారాలతో, ఇతర విధాలుగా దెబ్బతీయటం నిత్య కార్యక్రమం. వీటి బండారాన్ని జనం తెలుసుకొనే సమయానికి అవి చేయాల్సిన పని, ప్రయోజనం, హాని చేస్తాయి. ఒక వార్త నిజమా కాదా అని నిర్ధారణ చేసుకొనే అవకాశం, తీరిక అందరికీ వుండదనే బలహీనతను వాటి సృష్టి కర్తలు సొమ్ము చేసుకుంటున్నారు. తాము నమ్మిన వార్త అవాస్తవమని తెలుసుకున్నవారు నిజమైన వార్తలను కూడా ఒక పట్టాన నమ్మరు. ప్రతిదానినీ అనుమానిస్తూ వుంటారు. స్వార్ధశక్తులకు కావాల్సింది కూడా అదే. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, సారా, కులం, మతం, మీడియాలో డబ్బిచ్చి వార్తలు రాయించుకోవటం వంటి ప్రలోభాలతో పాటు కల్పిత వార్తలు కూడా ఒకటిగా చేరాయని 2016 మరింతగా నిరూపించింది. అందుకే ఒక సంస్థ ముగిసిన ఏటిని అబద్దాల సంవత్సరంగా ప్రకటించింది.
ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచంలో కల్పిత వార్తలకు మన దేశం ఒక ప్రధాన మార్కెట్‌గా మారుతోంది. దేశంలో 16కోట్ల వాట్సాప్‌లుంటే నెలకు వంద కోట్ల సార్లు వినియోగిస్తున్నారని అంచనా. ఫేస్ బుక్ ఖాతాలున్నవారు 15 కోట్లు, ట్విటర్‌లో 2.2కోట్ల మంది వున్నారని చెబుతున్నారు. వీటి ప్రభావం ఎంతగా వుందంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా తామెక్కడ వెనుకబడిపోతామో అన్న భయంతో సోషల్ మీడియాలో ప్రచారంలో పెడుతున్న చెత్తను స్వీకరించి పాఠకులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామం. గతేడాది జనాన్ని బురిడీ కొట్టించిన అనేక వార్తలలో కొన్నింటిని చూద్దాం.
‘నరేంద్రమోడీని ప్రపంచ వుత్తమ ప్రధానిగా యునెస్కో ప్రకటించింది’ ఇదొక కల్పిత వార్త.జూన్ నెలలో వాట్సాప్ గ్రూపులలో ప్రారంభమై ఇతర సోషల్ మీడియాలో చెలరేగింది. ఐక్యరాజ్యసమితి గానీ, దాని ఆధ్వర్యంలో నడిచే యునెస్కో వంటి సంస్ధలుగా గానీ అలాంటి అవార్డులు ఇవ్వవు, అయినా సరే అది ఇంకా తిరుగుతూనే వుంది. అలాగే జనగణమనను కూడా వుత్తమ జాతీయ గీతంగా అదే సంస్ధ ప్రకటించిందన్న తప్పుడు వార్త గురించి కూడా తెలిసిందే. ఇది 2008 నుంచి తిరుగుతోంది. ఒకసారి అందుకున్నవారికి అనేక సార్లు వచ్చి వుంటుంది. పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న ఇబ్బందులకు తోడు రెండువేల రూపాయల నోటు వచ్చి చిల్లర సమస్యను జత చేసి మరింత చికాకు కల్పించటాన్ని అందరం చూశాము. సరిగ్గా ఈ సమయంలోనే మన రెండు వేల రూపాయల నోటు ప్రపంచంలో అత్యంత వుత్తమ కరెన్సీ అని యునెస్కో కితాబు ఇచ్చిందనే సమాచారం వాట్సాప్ జనాలను వూపేసింది. ఇప్పటికింకా మీకు రాకపోతే త్వరలో వస్తుంది. ఇలాంటి వాటిని నిజమని నమ్మి ఇతరులకు చేరవేసే మన వాట్సాప్ గ్రూపు వినియోగదారుల తెలివితక్కువ తనం గురించి బిబిసి ప్రపంచానికంతటికీ తెలియచేసింది.
ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టను పెంచేందుకు రంగంలోకి దించిన మరొక వార్త రెండువేల రూపాయల నోటుకు జిపిఎస్ చిప్ అమర్చారన్నది. న్యూఢిల్లీలోని జెఎన్‌యు విద్యార్ధులు దేశ వ్యతిరేక, పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారంటూ సృష్టించిన కల్పిత వీడియోలను పదే పదే ప్రచారం చేసిన జీ న్యూస్‌లోని బిజెపి భక్తుడైన సీనియర్ ఎడిటర్ సుధీర్ చౌదరి రెండువేల నోటుకు జిపిఎస్ చిప్ అమర్చారనే తప్పుడు కధనాన్ని కూడా జీ న్యూస్‌లో ప్రసారం, ప్రచారం చేశాడు. ఆ నోటును వుపగ్రహాలు కనుగొంటాయని, 120మీటర్ల లోతున భూ గర్బంలో దాచినా సిగ్నల్స్ ద్వారా పట్టుకోవచ్చునని ఇదంతా నరేంద్రమోడీ ఘనత అనే అర్ధం వచ్చేట్లుగా కట్టుకధలు చెప్పాడు. దాంతో మిగతా ఛానల్స్ కూడా దానిని కాపీ చేశాయి, కొత్త అంశాలను కలిపి చెప్పాయి. 15 ప్రోటాన్స్, 17 న్యూట్రాన్స్ వున్న రేడియో యాక్టివ్ ఐసోటోప్‌లు కొత్త నోట్లలో వున్నాయని కూడా ప్రచారం చేశారు. నిజమే అని వాట్సాప్ వీరులు ఎలా వ్యాపింప చేసిందీ చూశాము. నరేంద్రమోడీ, బిజెపి భక్తులు దానిని పెద్ద ఎత్తున వ్యాపింప చేశారు. చివరికది అవాస్తవమని తేలింది. మోడీ సర్కార్ నుంచి ప్రశంసలు లేదా ప్రతిఫలం పొందేందుకు ఎఎన్‌ఐ వార్తా సంస్ధ కూడా కల్పిత వార్తలను తయారు చేసి దేశం మీదకు వదిలింది. తన వుద్యోగి ఒకడిని సామాన్యుడి మాదిరి ఒక టీస్టాల్లో నిలబెట్టి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు చెప్పించింది. సామాజిక మీడియాలో కొంత మంది అతనిని గుర్తు పట్టి బండారాన్ని బయటపెట్టటంతో ఆ వార్తా సంస్ధ పరువు మురికి గంగలో కలిసింది.
వాట్సాప్‌లోని ఫొటోలను ఐస్ వుగ్రవాదులు దుర్వినియోగం చేసే అవకాశం వున్నందున వెంటనే వాటిని తొలగించాలంటూ ఢిల్లీ పోలీసు కమిషనర్ పేరుతో ప్రచారం జరిగింది. ఒక 20-25 రోజుల పాటు ఫొటోలు పెట్ట వద్దని ఈ లోగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని వాట్సాప్ సిఇఓ చెప్పినట్లుగా దాని కొనసాగింపుగా మరో పుకారు షికారు చేసింది. పది రూపాయల నాణాన్ని రిజర్వు బ్యాంకు రద్దు చేసిందన్న ప్రచారం కూడా ఈ కాలంలోనే వాట్సాప్‌లో తిరిగింది. అనేక చోట్ల దుకాణదారులు వాటిని తీసుకొనేందుకు తిరస్కరించారు. నిరాకరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రిజర్వు బ్యాంకు ప్రకటించాల్సి వచ్చింది.
తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత కుమార్తె అని, అమెరికాలో రహస్యంగా జీవిస్తోందంటూ ఒక ఫొటో వాట్సాప్, సోషల్ మీడియాలో తిరిగింది. అయితే అది అవాస్తవమని, ఆ యువతి ఆస్ట్రేలియాలో వుంటోందని, జయలలితకు సంబంధం లేదని తరువాత తేలింది. జయలలిత మరణించిన తరువాత దీనిని సృష్టించారు.
మన దేశానికి దాదాపు ఎనిమిదివేల కిలోమీటర్ల సముద్రతీరం, పుష్కలంగా వుప్పు తయారీకి అవకాశం వున్నప్పటికీ దేశంలో వుప్పు కొరత ఏర్పడిందన్న వాట్సాప్ మెసేజ్ రాగానే నిజమనుకొని జనం ఎగబడి కిలో వుప్పును మూడు, నాలుగు వందల రూపాయల వరకు ధర చెల్లించి కొనుగోలు చేయటాన్ని చూశాము. కాన్పూరులో వుప్పుకోసం ఒక దుకాణాన్ని లూటీ చేసేందుకు ఎగబడిన జనాన్ని చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు జరిపిన లాఠీ ఛార్జీలో ఒక మహిళ మరణించింది. తన నోట్ల రద్దు చర్యతో దెబ్బతిన్నవారే ఈ పుకార్లు పుట్టించారని నరేంద్రమోడీ ఆరోపించారు.
ప్రధాని నరేంద్రమోడీకి మద్దతు తెలుపుతూ భారత ప్రధమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఒక వటవృక్షంలా తయారై దేశాన్ని, జనాన్ని ఎదగనివ్వలేదంటూ మన దేశంలో బిబిసి విలేకరిగా పనిచేసిన మార్క్‌తులీ వ్యాఖ్యానించారంటూ ఒక నకిలీ వార్తను పుట్టించారు. తానలాంటి వ్యాఖ్య చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.
అంతర్జాతీయ విషయాలకు వస్తే డిసెంబరు నెలలో వచ్చిన ఒక వార్త పాకిస్ధాన్ మంత్రి ఇజ్రాయెల్‌కు హెచ్చరిక చేయటానికి దారి తీసింది. ఏదో ఒక సాకుతో పాకిస్తాన్ గనుక సిరియాకు సైన్యాన్ని పంపితే తాము పాక్‌పై అణుదాడి చేయగలమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెదిరించినట్లు ఒక వార్త వచ్చింది. అది ఎంత వరకు నిజమో తేల్చుకోకుండానే పాక్ మంత్రి ఆసిఫ్ ట్విటర్ ద్వారా ఒక ప్రకటన చేస్తూ తమ దేశం కూడా అణ్వస్త్ర దేశమే అని హెచ్చరిస్తూ వ్యాఖ్యానించారు. తరువాత ఇజ్రాయెల్ మంత్రి అలాంటి ప్రకటన చేయలేదని వెల్లడైంది. నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కల్పిత వార్తల తయారీ కేంద్రాలు, కార్మికులు ఓవర్‌టైమ్ పని చేశారంటే అతిశయోక్తి కాదు. అందుకే పొలైటీ ఫాక్ట్ అనే వెబ్‌సైట్ 2016ను అబద్దాల సంవత్సరంగా వర్ణించింది. కల్పిత వార్తలను తామరతంపరగా తయారు చేయటమే కాదు, వాటిని జనం నమ్మటం కూడా ఆందోళన కలిగించే అంశమే. అమెరికా ఎన్నికలకు మూడునెలల ముందు కాలంలో ఓ ఇరవై కల్పిత వార్తలు పెద్ద ఎత్తున ఆదరణ పొందాయి. వాటిపై వ్యాఖ్యలు, ఇష్టపడిన(లైక్), పంచుకున్న (షేర్) వారి సంఖ్య 8.71 మిలియన్లని తేలింది. ఇదే సమయంలో అమెరికాలోని అగ్రశ్రేణి పత్రికలుగా పరిగణనలో వున్న వాటిలో వచ్చిన 20 ముఖ్య వార్తలపై స్పందించిన వారు 7.36 మిలియన్ల మంది మాత్రమే వున్నారు. అంటే సామాజిక మాధ్యమాలలో కల్పిత వార్తలు ఎంతగా ప్రాచుర్యంలో వున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
అమెరికా అధ్యక్షుడిగా పచ్చిమితవాది డోనాల్డ్ ట్రంప్ గెలవటంలో కల్పిత వార్తలు కూడా ముఖ్య పాత్ర వహించాయంటే అతిశయోక్తి కాదు. దీనిని గుర్తించే వచ్చే ఏడాది తమ దేశంలో జరగనున్న ఎన్నికలలో ఓటర్లు కల్పిత వార్తల బారిన పడకుండా చూసేందుకు కల్పిత వార్తల నుంచి రక్షణకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఈ కేంద్రం అలాంటి వార్తల గురించి ఓటర్లను విద్యావంతులను గావిస్తుందట. ముఖ్యంగా రష్యన్, టర్కిష్ భాష మాట్లాడే జర్మన్ పౌరులు ఈ కల్పిత వార్తల బారిన ఎక్కువగా పడే అవకాశం వుందని భావిస్తున్నారు. కల్పిత వార్తలుగా తేలిన వాటిని తమ వేదికలపై నుంచి తొలగించని సామాజిక మీడియా సంస్ధలకు జరిమానా విధించాలని జర్మన్ పార్లమెంట్ సభ్యులు ఇప్పటికే డిమాండ్ చేశారు. ఫ్రాన్స్‌లో కూడా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో కల్పిత వార్తల ధాటి పెరగవచ్చని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి.
మన దేశంతో సహా ప్రపంచంలో అనేక చోట్ల ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టటానికి కల్పిత వార్తలను తయారు చేస్తున్నారు. వలస వచ్చిన శరణార్ధి బెర్లిన్ నగరంలో 13 సంవత్సరాల రష్యన్ జాతికి చెందిన ఒక బాలికను అపహరించి అత్యాచారం చేసినట్లు ఒక వార్త వచ్చింది. ఇంకేముంది రష్యాలోని ముస్లిం వ్యతిరేక మితవాద శక్తులు చెలరేగిపోయి అనేక చోట్ల ప్రదర్శనలు చేశారు. ఆ దెబ్బకు తట్టుకోలేని రష్యన్ ప్రభుత్వం ఈ వుదంతాన్ని మూసిపెట్టేందుకు జర్మన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించేవరకు వెళ్లింది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరంలో కామెట్ పింగ్ పాంగ్ అనే ఒక పీజా దుకాణ సెల్లార్‌లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ అనుచరులు బాలలతో ఒక వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఒక వార్తను వదిలారు. అది నిజమే అని నమ్మిన ఒక వ్యక్తి అక్కడి బాలలను రక్షించేందుకు వచ్చి పీజా కేంద్రంలో కాల్పులు జరిపాడు. అయితే ఎవరూ గాయపడలేదు. తీరా అక్కడ సెల్లార్ లేదు, వ్యభిచార కేంద్రం లేదని తెలుసుకొని పోలీసులకు లొంగి పోయాడు. హిల్లరీ క్లింటన్ ఐఎస్ తీవ్రవాదులకు నిధులు అందచేసినట్లు, డోనాల్డ్ ట్రంప్ అభ్యర్ధిత్వాన్ని పోప్ ఫ్రాన్సిస్ బలపరిచినట్లు , షరియా చట్టాన్ని ఫ్లోరిడా రాష్ట్రంలో అమలు జరపాలని డెమోక్రటిక్ పార్టీ కోరినట్లు కల్పిత వార్తలు వచ్చాయి. ఇవన్నీ రిపబ్లికన్ పార్టీ వారు డబ్బిచ్చి ప్రత్యర్ధిని దెబ్బతీసేందుకు చేసిన అవాంఛనీయ వ్యవహారాలని వేరే చెప్పనవసరం లేదు.
కల్పిత వార్తల తయారీకి వాటితో లబ్ది పొందే వారి నుంచి డబ్బు తీసుకోవటంతో పాటు వాటిని చదివే, చూసే పాఠకులను ఆకర్షించేందుకు ఆ వార్తలలో పెట్టే ప్రకటనల ద్వారా కూడా తయారీదారులు, వాటిని జనానికి పంచే 180 కోట్ల వినియోగదారులున్న ఫేస్‌బుక్, తదితర వెబ్‌సైట్ల వారికి కాసుల వర్షం కురుస్తోంది.అమెరికాలోని లాస్ ఏంజల్స్ శివార్లలో కల్పిత వార్తల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న జెస్టిన్ కోలెర్ తాను ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా నెలకు పది నుంచి 30వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు అంగీకరించాడు. అమెరికా ఎన్నికలలో కల్పిత వార్తలతో డబ్బు సంపాదిస్తున్నవారిని గమనించిన తరువాత పూర్వపు సోవియట్ రిపబ్లిక్‌లలో ఒకటైన జార్జియాకు చెందిన ఒక కంప్యూటర్ విద్యార్ధి డోనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా కల్పిత వార్తలు తయారు చేస్తే బాగా గిట్టుబాటు అవుతోందని గ్రహించి ఆమేరకు అందుకు పూనుకోగా ఒక నెలలో తనకు గరిష్టంగా ఆరువేల డాలర్లు వచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రికతో చెప్పాడు. కల్పిత వార్తల వేదికగా మారినట్లు తీవ్ర విమర్శలు రావటంతో గూగుల్, ఫేస్‌బుక్ యాజమాన్యం వాటి నివారణకు తాము కొన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.
సాంప్రదాయక మీడియా, సామాజిక మీడియా తీరుతెన్నులను పరిశీలిస్తున్నవారు 2017లో కూడా ప్రజలపై కల్పిత వార్తల దాడి ఎక్కువగానే వుండవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో వాటి నిరోధం, జనానికి చైతన్యం కలిగించే చర్యలపై కూడా దృష్టి సారించారు.