Tags

, , , , ,

Image result for masood azhar,  Dalai Lama

ఎం కోటేశ్వరరావు

    ఈ ప్రశ్న రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వుండాలని కోరుకొనే అనేక మందికి ఆవేదన కలిగిస్తోంది, అదే సమయంలో శత్రుపూరిత సంబంధాలుండాలని కోరుకొనే వారికి ఆనందం కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. అసలేం జరుగుతోంది ? ఐక్యరాజ్యసమితి పరిభాషలో సాంకేతిక అంశాలు ఎలా వున్నప్పటికీ ఆచరణలో మన దేశానికి వ్యతిరేకంగా వుగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్లుగా మన ప్రభుత్వం చెబుతున్న మౌలానా మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా పరిగణిస్తూ తీర్మానం చేయకుండా ఏప్రిల్‌, అక్టోబరులో భద్రతా మండలిలో తీర్మానం చేయకుండా అడ్డుకుంది. దాని అభ్యంతరాల గడువు డిసెంబరు 31తో ముగియనుంది. అయితే రెండు రోజుల ముందే చర్చకు వచ్చిన ఈ అంశాన్ని మరోసారి అడ్డుకొన్నది. దీంతో వుగ్రవాదం పట్ల చైనా ద్వంద్వ ప్రమాణాలను అసుసరిస్తోందని మన దేశం విమర్శించింది. సరిగ్గా ఈ సమయంలోనే అంటే బుధవారం నాడు కజకస్తాన్‌, మంగోలియా, మన దేశ (కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతాన్ని అనుకొని వుండే) -చైనా సరిహద్దులలో వున్న చైనా రాష్ట్రం గ్జిన్‌జియాంగ్‌లో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంపై వుగ్రవాదులు దాడి చేసి ఒక కార్యకర్త, భద్రతా సిబ్బంది ఒకరిని హత్య చేశారు. వెంటనే పోలీసులు దాడిలో పాల్గొన్నవారిలో ముగ్గురిని కాల్చివేశారు. అనేక సార్లు ఇస్లామిక్‌ తీవ్రవాదులు అక్కడ దాడులకు పాల్పడిన కారణంగా ఇప్పుడు కూడా వారే అయి వుండవచ్చని వార్తలలోని వ్యాఖ్యలను బట్టి అనుకోవాలి. ఆ వుగ్రవాదులను ఇరుగు పొరుగు దేశాల వారు పెంచి పోషించి రెచ్చగొడుతున్నందున దాడులు చేస్తున్నట్లు చైనా గతంలో విమర్శించింది. చైనా కూడా వుగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది కదా అలాంటపుడు మసూద్‌ అజార్‌పై చర్యను ఎందుకు అడ్డుకుంటున్నట్లు అన్న సందేహం కొంత మందికి కలుగటం సహజం.

    ఈ సమస్య గురించి గురించి ఏకపక్షంగా ఒక వాదననే సమర్ధిస్తూ చర్చించిన వారిని దేశ భక్తులుగానూ, భిన్న కోణాల గురించి వివరించే వారిని దేశ ద్రోహులు లేదా చైనా అనుకూలురుగానో చిత్రించే వాతావరణంలో వున్నాం. ప్రస్తుతం ముస్లిం పాకిస్థాన్‌, కమ్యూనిస్టు చైనాను వ్యతిరేకించటమే అసలు సిసలైన దేశ భక్తిగా కాషాయ సర్టిఫికెట్లు ఇస్తున్న రోజులివి. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పిన సిపిఎంను చైనా అనుకూల పార్టీగా చిత్రించిన వారిలో ఆర్‌ఎస్‌ఎస్‌, అది గతంలో తన రాజకీయ విభాగంగా నడిపిన జనసంఘం ముందు వరుసలో వున్నాయి. అప్పటికీ ఇప్పటికీ సిపిఎం తన వైఖరిని మార్చుకోలేదు. సరిహద్దు గురించి సంప్రదింపులు జరిపేందుకు అర్హత కేంద్రంలో అధికారంలో వున్నవారికి మాత్రమే వుంటుంది. సిపిఎంకు అటువంటి అవకాశం రాలేదు. అంతకు ముందు చైనాతో యుద్ధానికి అవసరమైతే తాము రంగంలోకి వస్తామంటూ వీధులలో ప్రదర్శనలు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు జనతా పార్టీ ముసుగులో ఒకసారి అధికారానికి వచ్చారు, రెండవ సారి బిజెపి పేరుతో, మూడవ సారి కూడా అదే పేరుతో అధికారానికి వచ్చి చేసిందేమిటయ్యా అంటే సామరస్య పూర్వరంగా చైనాతో చర్చలు జరపటమే కాదు, కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా చైనా కమ్యూనిస్టుపార్టీతో అధికారిక సంబంధాలు పెట్టుకొని చైనా యాత్రలు చేసి వస్తున్నారు. అదనంగా వ్యాపారలావాదేవీలతో మునిగి తేలుతున్నారు. చైనాతో ఒకవైపు సంబంధాలు నెరుపుతూనే మరోవైపు చైనా వ్యతిరేక రాజకీయాలలో కూడా భాగస్వాములు అవుతున్న పెద్దలు దేశ భక్తులుగా చెలామణి అవుతున్నారా లేదా ? దీనికి నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, ఇతర బిజెపి మిత్రపక్ష నేతలెవరూ మినహాయింపు కాదు. అలాంటపుడు మసూద్‌ అజార్‌ను చైనా కాపాడటం కూడా అదే రాజకీయాలలో అంతర్బాగమే అని అభిప్రాయపడిన వారు చైనా అనుకూలురు, దేశద్రోహులు ఎలా అవుతారు ?

     అవన్నీ కాదు మన ప్రయోజనాలే ముఖ్యం, చైనా అయినా మరొక దేశమైనా మనకు అనుకూలంగా వున్నంత వరకు వుపయోగించుకోవాలి, లేనపుడు వ్యతిరేకించాలి అని అనుకోవటానికి ఎవరికైనా హక్కుంది తప్ప భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారి మీద రంగులు చల్లితే, బురద వేస్తే కుదరదు. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ అనే అతి తెలివి అనాలి. కొంచెం కటువుగా వున్నప్పటికీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలాంటివి పని చెయ్యవు అని చెప్పక తప్పదు. ఇరుగు పొరుగుతో స్నేహం చేసేటపుడు రెండువైపులా స్నేహ ధర్మం పాటించాలి. ఈ పూర్వరంగంలో మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు కాపాడుతోందో వారి వైపు నుంచి కూడా చూడటం అవసరం.

Image result for masood azhar,  Dalai Lama

      మసూద్‌ అజార్‌, ఆ వరుసలో వున్న ఇంకా అనేక మంది టెర్రరిస్టులను అంతర్జాతీయంగా గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాలనటం నిర్వివాదాంశం. ప్రపంచంలో అనేక దేశాలలో టెర్రరిస్టులు, తిరుగుబాటుదారులు, వేర్పాటు వాదులు ఎందరో వున్నారు. వారు మతాధికారులు, మరొకరు ఎవరైనా కావచ్చు, ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. అలాంటి అభ్యంతరాలున్న జాబితాలు ప్రతి దేశంలోనూ వుంటాయి. మనకు చైనాకు మధ్య సరిహద్దు వివాదం వుంది. వాటిలో లడఖ్‌ ప్రాంతంలోని ఆక్సాయ్‌ చిన్‌, ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ వున్నాయి. బ్రిటీష్‌ పాలకులు మనకు తెచ్చిన అనేక సమస్యలలో ఇదొకటి. బ్రిటీష్‌ ఇండియా విదేశాంగ కార్యదర్శిగా పని చేసిన బ్రిటీష్‌ అధికారి హెన్రీ మెక్‌మోహన్‌ 1914లో గీసిన సరిహద్దు లైన్ల ఆధారంగా అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం-టిబెట్‌ ప్రభుత్వం మధ్య ఒక సరిహద్దు ఒప్పందం కుదిరింది. టిబెట్‌కు అలాంటి అధికారం లేదని వాదించిన చైనా ఆ హద్దును తాను గుర్తించటం లేదని అప్పుడే స్పష్టం చేసింది. అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా వుంచటానికి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు కుట్ర చేసినట్లే , సామ్రాజ్యవాదులు టిబెట్‌ను కూడా స్వతంత్ర రాజ్యంగా మార్చేందుకు కుట్ర పన్నారు. మిలిటరీ చర్య ద్వారా కాశ్మీర్‌ను మన దేశంలో అంతర్భాగంగా చేసినట్లే టిబెట్‌ను కూడా చైనా సైనిక చర్య ద్వారా టిబెట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ సమయానికి మనదిగా బ్రిటీష్‌ వారు మ్యాపులలో చూపిన ఆక్సాయ్‌ చిన్‌ చైనాలో, చైనాకు చెందినదిగా పేర్కొన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో వుంది. దాంతో ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అగత్యం కలిగింది. కాశ్మీర్‌ మన దేశ అంతర్బాగమని కమ్యూనిస్టు చైనా గుర్తించినట్లే, టిబెట్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని మన దేశం కూడా గుర్తించింది. అయితే చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, టిబెట్‌ ప్రత్యేక దేశంగా ప్రకటించిన మత పెద్ద దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటును సైతం అనుమతించింది. అయితే దౌత్యపరంగా వాటికి గుర్తింపు ఇవ్వలేదు తప్ప దలైలామా అండ్‌కో చేసే చైనా వ్యతిరేక కార్యక్రమాలు, కార్యకలాపాలన్నింటినీ మన ప్రభుత్వం అనుమతిస్తున్నది.దీనికి కాంగ్రెస్‌, జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి అనే తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు ఒకటిగానే వ్యవహరిస్తున్నాయి. ఒక వివాదాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నవారెవరైనా దానికి కొత్త పీఠ ముడులను వేయకుండా చూడాలి. కానీ పరిణామాలు అలా లేవు.

    ఒక శరణార్ధిగా దలైలామాను మన దేశంలో అనుమతించటం వేరు, ఒక తిరుగుబాటు ప్రవాస ప్రభుత్వ నేతగా కార్యకలాపాలను పదే పదే అనుమతించటాన్ని చైనా సహించదని తెలిసి కూడా అనుమతించటాన్ని ఏమనాలి? మన దేశానికి మసూద్‌ అజార్‌ ఎలాంటి ప్రమాదకర వ్యక్తో చైనాకు దలైలామా అంతకంటే ఎక్కువ ప్రమాదకర వ్యక్తి. 1959లో చైనా ప్రభుత్వంపై విఫల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అప్పటి నుంచి అనేక మంది టిబెట్‌ తిరుగుబాటుదార్లు వుగ్రవాదులుగా మారి అనేక దేశాలలో చైనా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కుట్రలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ చివరి వారంలో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాల పట్టణంలో తొలిసారిగా నాలుగు రోజుల పాటు చైనా వ్యతిరేక సంస్ధల అంతర్జాతీయ సమావేశాన్ని జరుపుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. దలైలామాకు ఎప్పటి నుంచో మన దేశం ఆశ్రయం కల్పించి మద్దతు ఇస్తున్నా బహిరంగంగా అమెరికా, ఇతర దేశాలలో ప్రభుత్వేతర సంస్ధల ముసుగులో పనిచేసే చైనా వ్యతిరేకుల సమావేశాన్ని అనుమతించిన ఘనత నరేంద్రమోడీకే దక్కింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతంగా చైనా అంటోంది. అక్కడి తవాంగ్‌ పట్టణం ఆరవ దలైలామా జన్మ స్ధలం. ఈ ఏడాది మార్చి నెలలో తవాంగ్‌ పర్యటన జరపాలని దలైలామా నిర్ణయించుకున్నారు. చైనాకు అభ్యంతరమని తెలిసి కూడా దేశంలో దలైలామా ఎక్కడికైనా స్వేచ్చగా వెళ్ల వచ్చని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించటం, గతేడాది అరుణాచల్‌ ప్రదేశ్‌లో అమెరికా రాయబారి పర్యటనను అనుమతించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? కాశ్మీర్‌ సమస్యలో మూడో దేశ జోక్యాన్ని మనం అనుమతిస్తామా ?

     దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి మన దేశానికి ఎలాంటి వివాదం, సంబంధం లేదు, మన నౌకలు వెళితే చైనా అడ్డుకున్న వుదంతాలు లేవు. ఆ ప్రాంతంలోని కొన్ని దీవులపై చైనా, జపాన్‌, వియత్నాం, మరికొన్ని దేశాలు వివాదపడుతున్నాయి. ఆ సమస్యను అవే పరిష్కరించుకోవాలి. ఆ ప్రాంతంలో అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం తమ నౌకలు స్వేచ్చగా తిరగటానికి వున్న హక్కును అమలు చేసుకొంటున్నామనే పేరుతో అమెరికా-జపాన్‌ కార్యాచరణ బృందం తమ యుద్ధ నౌకలతో ఆ ప్రాంతంలో 2016 మే-జూలై మధ్య రెండున్నర నెలలపాటు విన్యాసాలు నిర్వహించి చైనాతో కయ్యానికి కాలుదువ్వాయి. వాటితో కలసి జలకాలాడేందుకు మన నాలుగు నౌకలను మోడీ సర్కార్‌ పంపటం ఏమిటి ? అమెరికా, జపాన్‌లకు జూనియర్‌ భాగస్వామిగా మన దేశాన్ని మార్చినట్లా, వాటితో పాటు కలిసి చైనాపై బస్తీమే సవాల్‌ విసిరినట్లా ? జపాన్‌తో అమెరికాకు రక్షణ ఒప్పందం వుంది కనుక అమెరికన్లు ఆ ముసుగులో జోక్యం చేసుకుంటున్నారు. మనకు సంబంధం ఏమిటి ? ఎవరిని సంతోష పెట్టటానికి ఈ పని చేసినట్లు ? మసూద్‌ అజార్‌ విషయంలో చైనా అనుసరిస్తున్నదానికి దెబ్బకు దెబ్బ అని మన దేశంలోని చైనా వ్యతిరేకులు వాదించ వచ్చు. అటువంటి వారికి మసూద్‌తో సహా ఇతర వివాదాలపై చైనాను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది ? మనం చైనా వ్యతిరేకికి ఆశ్రయం ఇచ్చిన మాదిరి మన వ్యతిరేకి మసూద్‌ అజార్‌కు చైనా ఆశ్రయం కల్పించలేదు, అలాంటి వారితో మనకు వ్యతిరేకంగా తన గడ్డపై సభల నిర్వహణకు ఏర్పాటు చేయలేదు. మసూద్‌ అజార్‌ను వుగ్రవాదిగా తీర్మానించబోయే ముందు ఆ సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకుంటున్నారేమో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చైనా కోరింది తప్ప అతను తీవ్రవాది కాదని గానీ అవుననిగానీ చెప్పలేదు. అయితే ఆ వైఖరి ఆచరణలో తీర్మానానికి అడ్డుపడినట్లే అన్నది స్పష్టం. ఇటువంటి వైఖరులతో సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తున్నామని వుభయ దేశాలు చేసే ప్రకటనలకు అర్ధం వుండదు. ఎవరు ముందు తప్పు చేశారు, ఎవరు తరువాత చేశారు అనే వాద ప్రతివాదాలలోకి పోతే పరిష్కారం కుదరదు.

    గత పాతిక సంవత్సరాలలో ముఖ్యంగా గత పది సంవత్సరాలలో మన దేశాన్ని అమెరికాకు దగ్గరగా తీసుకుపోతున్న కొద్దీ ఆ మేరకు పాకిస్థాన్‌ చైనాకు దగ్గర అవుతోంది. గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య వున్న విబేధాలను మన పాలకవర్గం వుపయోగించుకొని లబ్ది పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా-అమెరికా మధ్య వున్న విబేధాలను వుపయోగించుకొని పాకిస్థాన్‌ అదేపని చేస్తోందన్నది స్పష్టం. ఒకవైపు పాకిస్థాన్‌ అమెరికన్లతో దగ్గర సంబంధాలను కొనసాగిస్తూనే చైనాతో రోజు రోజుకూ సంబంధాలను పెంచుకొంటోంది. మనకు చైనాతో వివాదాలు పెంచుకొని అమెరికాతో దగ్గర కావటం లాభమా, చైనాతో వివాదాలను తగ్గించుకొని లాభపడటం మంచిదా అని ఆలోచించుకోవాలి. మనకు, పాకిస్తాన్‌కు ఆయుధాలు విక్రయించి లబ్ది పొందుతున్న అమెరికా ఇప్పుడు చైనాతో మరోసారి మన వివాదాలు పెంచుకోవాలని కోరుకుంటోంది. మన దేశానికి వారి ఆయుధాలను మరింతగా విక్రయించాలంటే చైనాతో లడాయి పెరగాలి. అప్పుడే వారి ఆయుధ పరిశ్రమలు మూడు పూవులు ఆరు ఆయుధాలుగా వర్ధిల్లుతాయి. ఈ పరిణామాల పూర్వరంగాన్ని అర్ధం చేసుకుంటే చైనా తిరుగుబాటుదారుడు దలైలామాను మన దేశం ఎందుకు సమర్ధిస్తుందో, వుగ్రవాది మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు రక్షిస్తుందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు !