Tags

, , ,

సత్య

    హోటళ్లకు వెళ్లినపుడు ‘టిప్పు’ ఇవ్వాలా వద్దా అన్నది చాలా మందిని వేధించే ప్రశ్న. ఇవ్వటం ఇష్టం లేని నాన్నలు లేచి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే కాలర్‌ పట్టి మరీ లాగి కూర్చోపెట్టి పర్సు తీసి టిప్పు ఇచ్చే భార్య, పిల్లలను చూసే వుంటారు. టిప్పు ఇవ్వకుండా వెళ్లే వారిని సర్వర్లు చూసే చూపు తట్టుకోలేక, అవమానంగా భావించి ఇలా చేస్తారని తెలిసిందే. ఇప్పుడా టిప్పు ఇవ్వటమా లేదా అన్నది మీ ఇష్టం ఇష్టముంటే ఇవ్వండి, విధిగా ఇవ్వాల్సిన అవసరం లేదు అని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ మృదువుగా ప్రకటించింది. టిప్పు చెల్లించాల్సిందే, ఇష్టమైతేనే తినండి లేకుంటే దొబ్బేయండి మీ ఇష్టం అని హోటల్‌ యజమానుల ప్రతినిధి మొహమాటం లేకుండా తెగేసి చెప్పాడు. పెద్ద నోట్ల రద్దు మాదిరి కేంద్ర ప్రకటన ప్రయోజనం లేకుండా పోయింది. ఇష్టమైతే టిప్పు ఇవ్వండి లేకుంటే లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే టిప్పు అని సేవా ఛార్జీలు అని వసూలు చేసే యజమానులపై చట్టపరంగా చర్యలు తీసుకొనే అవకాశాలు లేవన్నది స్పష్టం. అందువలన ఇక్కడ తేలాల్సిన అంశం ఏమంటే వుదారంగా ఇచ్చే టిప్పు లేదా విధిగా వసూలు చేసే సేవా రుసుముపై అసలు ప్రభుత్వ వైఖరి ఏమిటి ? తాను ఇచ్చిన వివరణ ప్రకారం హోటళ్లలో అమలు చేయించే దమ్ము ప్రభుత్వాలకు వుందా అన్నది ప్రశ్న. వసూలు విచక్షణ యజమానులకు, సేవలు నచ్చితే చెల్లించాలా లేదా అనే విచక్షణ వినియోగదారులదీ అని చెప్పటం అదీ కరెక్టే ఇదీ కరెక్టే అని చెప్పటం తప్ప మరొకటి కాదు.

    ‘ బుర్ర వుపయోగించకుండా ఇలాంటి ప్రకటనలు చేయటం వుద్యోగులకు తీవ్ర నష్టదాయకం. యజమానులే కాదు సర్వీసు ఛార్జీలపై ఆధారపడిన హోటల్‌ వుద్యోగులందరూ దీనితో ప్రభావితులౌతారు.మంచి చెడ్డలను ఆలోచించకుండా వారి భుక్తిని ఎలా దెబ్బకొడతారు ‘ అని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు రియాజ్‌ అమ్లానీ వ్యాఖ్యానించారు. ఆహార సేవారంగంతో సంబంధం వున్న 85లక్షల మంది దీనితో ప్రభావితులౌతారని అమ్లానీ చెప్పారు. సేవా చార్జీలు వసూలు చేయాలా లేదా అన్నది రెస్టారెంట్ల యజమానుల ఇష్టం. ఒక వేళ వసూలు చేయాలనుకుంటే ఆ విషయాన్ని పదార్ధాల పట్టికలో లేదా ఇతర విధాలుగా స్పష్టంగా ప్రకటించాలి. దీంతో ఆ సేవలను కోరుకొనే వినియోగదారులకు ఆ విషయం ముందే తెలుస్తుంది.రెస్టారెంట్లు అందుబాటులో వుంచిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలా లేదా అన్నది తేల్చుకుంటారు అని ప్రభుత్వ వినియోగదారుల వ్యవహరాలశాఖ పేర్కొన్నది. హోటళ్లు ఎలాంటి సేవలు అందించినా సేవా ఛార్జీల పేరుతో ఐదు నుంచి ఇరవై శాతం వరకు వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులు రావటంతో కేంద్ర ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది.

     దీంతో అనేక మంది హోటల్‌ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవా రుసుము వసూలు గురించి తెలిపే ఏర్పాట్లు చేయటం అనేక పర్యవసానాలకు దారితీస్తుంది. ఇప్పటికే 15 శాతం వాట్‌, ఇతర సెస్సులతో వెనుకా ముందు చూసుకొనే వినియోగదారులు అంత మొత్తం టిప్పుకూడా చెల్లించాలంటే అది లేని రెస్టారెంట్లకు వెళతారు. యజమానులు ఇచ్చే నామ మాత్ర జీతాలతో ఎవరు పని చేస్తారు, జీతం కంటే టిప్పు ఎక్కువ వస్తుందనే ఆశతో పని చేస్తున్న కార్మికులకు సమస్యలు వస్తాయి. అమెరికాలో కొందరు యజమానులు టిప్పు రద్దు చేసిన సందర్భాలలో పని చేసేందుకు కార్మికుల లభ్యత సమస్యలు ఏర్పడ్డాయని, హొటళ్లలో పని చేసే వారి వేతనాలు చాలా తక్కువగా వుంటాయి కనుక వారికి కాస్త అదనంగా చెల్లించేందుకు టిప్పు వసూలు చేస్తామని అక్కడి యజమానులు నమ్మ బలుకుతారు. ప్రపంచవ్యాపితంగా టిప్పు ఒక సమస్యగా తయారైంది.

    ఐరోపా కులీన కుటుంబాలలో విందులు, వినోదాలు ఏర్పాటు చేసినపుడు వచ్చిన అతిధులు మెచ్చుకోలుగా పనివారికి కొంత సొమ్మును ఇవ్వటంతో ప్రారంభమైన టిప్పు ఇప్పుడు విధిగా చెల్లించాల్సిన వాటి జాబితాలో చేరిపోయింది. అయితే ప్రపంచమంతటా ఇది ఒకే విధంగా లేదు. అసలు టిప్పు తీసుకోవటం అనేది కార్మికుల గౌరవ మర్యాదలకు సంబంధించిన అంశం. ప్రభుత్వాలు లేదా మార్కెట్‌ ప్రతి పనికీ ఒక వేతనం లేదా విలువ నిర్ణయిస్తున్నాయి. ప్రతి వారు తాము ఏ పని చేసినా గౌరవ ప్రదమైన జీవితం గడిపేందుకు అవసరమైన వేతనం లేదా ప్రతిఫలం పొందటం న్యాయం. ఆ విధంగా చూసినపుడు ఒక హోటల్లో పని చేసే కార్మికులకు అలాంటి వేతనాలు ఇవ్వాల్సిన బాధ్యత యజమానులదే. వారి వేతనాల ఖర్చు, ప్రభుత్వ పన్నులను కూడా కలుపుకొని ఆహార పదార్ధాల ధరలను నిర్ణయించాలి. ఆ ధరలకు సిద్దపడిన వినియోగదారులే వస్తారు. అలాగాకుండా కార్మికులకు నామమాత్ర వేతనాలిచ్చి, వారిని ఆదుకొనే పేరుతో టిప్పు లేదా సేవా రుసుము అంటూ అదనంగా వసూలు చేయటాన్ని మరొక విధంగా చెప్పాలంటే కార్మికులకు వేతనాలు చెల్లించే బాధ్యతను వినియోగదారులపై నెట్టి యజమాని వుచితంగా లేదా నామమాత్ర వేతనాలతో పని చేయించుకోవటం, కార్మికులకు చెల్లించాల్సిన పిఎఫ్‌, ఇఎస్‌ఐ చెల్లింపుల వాటాను యజమానులు ఎగవేయటమే. దీని వలన అంతిమంగా నష్టపోయేది కార్మికులే. మన దేశంలో హొటళ్లు అసంఘటిత రంగంగా వున్నందున వాటిలో పని చేసే వారు కూడా శాశ్వతంగా వుండటం లేదు. రుచిగా వంట చేసే వారికి మంచి డిమాండ్‌ వున్నందున అలాంటి వారికి ప్రభుత్వ నిర్ణయించిన వేతనాలకు కొన్ని రెట్లు అదనంగా ఇచ్చి నియమించుకుంటారు. ఇతర పని వారికి నామ మాత్ర లేదా రోజువారీ వేతనాలతో పనులకు పెట్టుకుంటారు. యజమానికి కోపం వచ్చినా, కార్మికులకు కోపం వచ్చినా పని గోవిందా. నిరుద్యోగులు ఖాళీగా వుండకుండా ఏదో ఒక పని చేయాలి కనుక తాత్కాలిక వెసులుబాటుగా హోటళ్లను ఎంచుకుంటారు.ఈ బలహీనతను యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు.

    చివరిగా ఒక ప్రశ్న. హోటళ్లలో సేవ నచ్చకపోతే టిప్పు చెల్లించాలా లేదా అన్నది వినియోగదారుడి ఇష్టమని చెబుతున్న ప్రభుత్వం అది తాను అందించే సేవలకు సైతం వర్తింప చేస్తుందా ? సేవలకు చార్జీలు వసూలు చేస్తున్న ప్రభుత్వం వాటి మీద అదనంగా రుసుముల పేరుతో వసూలు ఎందుకు చేయాలి? చెత్త సెస్సు వసూలు చేస్తున్నా రోడ్లు శుభ్రంగా వుండటం లేదు, అలాంటపుడు దాన్నెందుకు చెల్లించాలి ?