Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

    మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజు ఒక రూపాయకు కొన్న ఒక వస్తువు ధర నరేంద్రమోడీ పదవిలోకి వచ్చే నాటికి రు.58.58కి పెరిగింది. రెండున్నర సంవత్సరాల తరువాత జనవరి ఆరవ తేదీన రు.67.96కు చేరింది, డిసెంబరు నాటికి రు.69.50 పెరగవచ్చని కొందరి అంచనా. ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన మంచి రోజులంటే ఇవా ?

    2014 సాధారణ ఎన్నికలలో నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి విజయం సాధించనున్నదనే అంచనాలు వెలువడిన సమయంలో అమెరికా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ ప్రతినిధులు అమిత్‌ ప్రకాష్‌, క్రిస్టిన్‌ ఆక్వినో రూపాయి విలువ పెరగటం నరేంద్రమోడీ నిర్ణయాత్మక విజయానికి సూచిక అని వ్యాఖ్యానించారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఒక అమెరికన్‌ డాలరుకు 2014 మార్చి నెలలో వున్న 61.19 రూపాయల నుంచి 45-40కి పెరిగే క్రమంలో ఎన్నికల ఫలితం ఒక వుత్ప్రేరకంగా పని చేయగలదని, ఒక వేళ బలహీన సంకీర్ణం ఏర్పడితే 2013 అగస్టు 28 నాటి రికార్డు పతనం 68.85ను అధిగమించ వచ్చని సిటీ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ ఆసియా-పసిఫిక్‌ అధిపతి ఆడమ్‌ గిల్‌మౌర్‌ చెప్పిన మాటలను వారు వుటంకించారు. అంతే కాదు, మోడీ విజయం సాధిస్తే అది ఆట తీరునే మార్చివేస్తుందన్నది మార్కెట్‌ అభిప్రాయమని కూడా ఆడమ్‌ వ్యాఖ్యానించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక్క బిజెపికే సంపూర్ణ మెజారిటీతో నరేంద్రమోడీ సంఖ్యరీత్యా అత్యంత బలమైన ప్రధానిగా అవతరించారు. అయితేనేం రూపాయి విలువ పెరగలేదు కదా పతనమై రు.68.86పైసలను తాకి 2016 నవంబరు 25న సరికొత్త రికార్డును సృష్టించింది. అప్పటి నుంచి 67-68కి అటూ ఇటూగా కదలాడుతోంది.ఈ ఏడాది డిసెంబరు నాటికి నరేంద్రమోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టగలరని రూపాయి మరింత పతనమై 69.50కి చేరవచ్చని రాయిటర్‌ వార్తా సంస్ధ తన విశ్లేషణలో పేర్కొన్నది. అది పక్కా పెట్టుబడిదారులు నడిపే కంపెనీ తప్ప కమ్యూనిస్టులకు, మోడీ విమర్శకులకు ఎలాంటి సంబంధం లేనిది.

    ప్రధాని నరేంద్రమోడీ విధానాలను తప్పు పట్టే వారు బిజెపి, దానిని సమర్ధించే పార్టీలు అధికారంలోకి రాకూడదని కోరుకొనే వారే అనటంలో ఎలాంటి శషభిషలకు తావులేదు. మోడీ ప్రభుత్వ విధానాలు బాగు, బాగు , బహు బాగున్నాయి, వెనక్కు తిరిగి చూడనవసరం లేదని పొగిడేవారి గురించే అనుమానించాలి. ఇటీవలి కాలంలో ఇలాంటి వారు అనేక వాదనలను ముందుకు తెస్తున్నారు. మోడీ విధానాలు బాగులేకపోతే ఆయనను అంత ఎక్కువ మంది ఎలా సమర్ధిస్తున్నారు అన్నది వాటిలో ప్రధానమైనది. బలపరిచే, వ్యతిరేకించే సర్వేల బండారం, బాగోతం అందరికీ తెలిసిందే. వాటిని పక్కన పెడితే మోడీని సమర్ధిస్తున్న వారందరూ ఆయన విధానాలకు ఆమోద ముద్ర వేశారనే నిర్ణయానికి వస్తే పప్పులో కాలువేసినట్లే. పెద్ద నోట్ల రద్దు విషయమే తీసుకుంటే తాము ఇబ్బందులు పడినా జనం రెచ్చి పోలేదంటే అర్ధం దేశంలో తొలిసారిగా ఏదో మంచి చేస్తున్నాడు, యాభై రోజులే అంటున్నారు కదా చూద్దాం అని సహించారు తప్ప ఆ నిర్ణయ పర్యవసానాలన్నీ తెలిసి మద్దతు ఇవ్వలేదు. అసలు వాటి పర్యవసానాల గురించి రద్దు చేసిన నరేంద్రమోడీి గానీ, ఆయనకు సలహా ఇచ్చిన అంతరంగికులు, చివరకు తానే సలహాయిచ్చానని చెప్పుకున్న , మోడీ కంటే మేథావి అని ఆయన చుట్టూవున్నవారు భావించేే చంద్రబాబు నాయుడు, అంతిమంగా అమలు జరిపిన రిజర్వుబ్యాంకు సైతం నిర్దిష్టంగా ఫలానా ప్రయోజనం లుగుతుంది అని చెప్పలేదని తెలుసుకోవటం అవసరం. ఈ జన్మలో కష్టాలు అనుభవించినా పరలోకంలో స్వర్గ సుఖాలు దక్కుతాయి అన్నట్లుగా తాత్కాలికంగా నష్టం జరిగినా భవిష్యత్‌లో మంచి జరుగుతుంది అని తప్ప అధికార పక్షం లేదా దానిని సమర్ధిస్తున్నవారు గానీ తాత్కాలిక నష్టాలు , శాశ్వత లాభాలు ఎలా వుంటాయో ఎవరైనా చెప్పారా ?

     చైతన్యం, మూఢత్వం, అసంతృప్తి, అభిమానం అనేక కారణాలతో తరతమ స్థాయిలలో వుండే మన దేశంలో గుడ్డిగా నమ్మినట్లే, గుడ్డిగా వ్యతిరేకించటం కూడా సాధారణ విషయమే. అందువలన జనం వ్యతిరేకతలు, సమర్ధనలను కాసేపు పక్కన పెడదాము. కాంగ్రెస్‌ నేతలు దేశాన్ని అన్ని రంగాలలో గాడి తప్పించారు, మేము వస్తే తిరిగి గాడిలో పెడతామనే కదా బిజెపి అండ్‌ కో పార్టీలు, వాటిని భుజాన వేసుకొని మోసిన పవన్‌ కల్యాణ్‌ వంటి పెద్దలు చెప్పింది. తాను పదవిని స్వీకరించగానే విదేశాలలో పోయిన పరువును తిరిగి రాబట్టానని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం మరి దేశం సంగతేమిటి? ఆర్ధిక వ్యవస్ధ విషయమేమిటి?

     అన్ని విషయాలను ఒకేసారి చర్చించటం కుదరదు గనుక రూపాయి విలువ- పతనం, పటిష్టత పర్యవసానాల గురించి చూద్దాం. మన్మోహన్‌ సింగ్‌ గారి పాలనలో ఆయన వయస్సు పెరుగుతున్న మాదిరి రూపాయి విలువ పడిపోతున్నదని బిజెపి, నరేంద్రమోడీ విమర్శించారు. 2013లో మన్మోహన్‌ సింగ్‌ హయాం మొత్తం మీద గరిష్టంగా ఒక డాలరుకు 68.85 రూపాయల వరకు పడిపోయింది.

     2014 మే 25న నరేంద్రమోడీ పదవీ బాధ్యతలను స్వీకరించిన సమయానికి 58.58 గా వుంది. ఇది తమ మోడీ ఘనతే అని అభిమానులు చెప్పారు. రూపాయి విలువ పతనం, పెరుగుదల చరిత్రను చూస్తే https://knoema.com/infographics/rygejhb/rupee-devaluation-against-dollar-1947-till-date ప్రధానిగా జవహర్‌ లాల్‌ నెహ్రూ వున్న సమయంలో 1947 నుంచి 1950 మధ్య ఒక రూపాయి నుంచి రు.4.76కు పడిపోయింది. ఆ ఏడాది నుంచి నెహ్రూ మరణించిన తరువాత లాల్‌ బహదూర్‌ శాస్త్రి పాలనలో 1965 వరకు స్ధిరంగా ఒక డాలరుకు రు.4.76 పైసలు వుంది. శాస్త్రి మరణించిన 1966లో రు.6.36కు పడిపోయింది. తరువాత ఇందిరా గాంధీ హయాంలో రు.6.36 నుంచి 1976లో రు.8.96కు పడిపోయి, ఆమె దిగిపోయే నాటికి రు.8.75కు పెరిగింది. జనతా పార్టీ నేత మొరార్జీ దేశాయ్‌ పాలనలో పెరుగుదల తప్ప పతనం లేదు, రు.8.75 నుంచి రు.8.14కు పెరిగి పెరిగింది.

    రెండవ సారి ఇందిరా గాంధీ అధికారానికి వచ్చిన సమయంలో రు.7.86గా వున్నది కాస్తా ఆమె మరణించే నాటికి రు.11.36కు పతనమైంది. తరువాత రాజీవ్‌ గాంధీ ఏలుబడిలో రు.16.23కు దిగజారింది.1989లో అధికారానికి వచ్చిన విపి సింగ్‌ హయాంలో రు.17.50కి, నూతన ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు గాంచిన పివి నరసింహారావు పాలనలో రు.22.74 నుంచి 35.43కు తగ్గింది. హెచ్‌డి దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ పాలనా కాలంలో రు.41.26కు చేరింది. తరువాత బిజెపి నేత ఎబి వాజ్‌పేయి పాలనలో రు.48.61కి పతనమై చివరికి రు.45.32కు పెరిగింది. మన్మోహన్‌ సింగ్‌ పది సంవత్సరాల కాలంలో కిందికీ మీదికీ పడుతూ లేస్తూ రు.45.32 నుంచి గరిష్టంగా 68.85 వరకు పతనమై నరేంద్రమోడీ అధికారానికి వచ్చే సమయానికి రు.58.43కు పెరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మోడీ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ గరిష్ట పతనాన్ని తాకి 2017 జనవరి ఆరున రు.67.96 గా ముగిసింది. పది సంవత్సరాల మన్మోహన్‌ సింగ్‌ కాలంలో నిఖర పతనం పదమూడు రూపాయలకు అటూ ఇటూగా అయితే రెండున్నర సంవత్సరాల నరేంద్రమోడీ పాలనలో పది రూపాయలకు అటూ ఇటూగా వుంది. మోడీని అభిమానించే వారు దీనిని విజయం అంటారా పతనంగాక మరేదైనా పేరు పెడతారా ?

    రూపాయి విలువ పతనమైతే సామాన్య జనానికి జరిగే నష్టం ఏమిటి? పోనీ నరేంద్రమోడీకి ఏదైనా లాభం వుంటుందా ? మోడీకి, మన్మోహన్‌ సింగ్‌కో మరొకరికో వ్యక్తిగత నష్టం గురించిన సమస్య కాదిది. మనిషికి బిపి పెరిగినా, తగ్గినా శరీరంలో ఎటువంటి ప్రమాదకర మార్పులు సంభిస్తాయో ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా కరెన్సీ విలువ వుద్ధాన, పతనాలు అలాంటి పర్యవసానాలకే దారితీస్తాయి. అంటే మొత్తం జనాన్ని ముఖ్యంగా సామాన్య జనాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయి. ఎలాగో చూద్దాం.

 

  మనకు చమురు నిక్షేపాలు తగినన్ని లేని కారణంగా అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందువలన ఆ రంగంలో పర్యవసానాలు మన నిత్యజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించిన తరువాత 2014 మే 29 జూన్‌ 11వ తేదీతో ముగిసిన పక్షంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు పీపా(బారెల్‌) ధర 106.72 డాలర్లు వుంది. ఆ రోజుల్లో డాలరు సగటు రూపాయి విలువ రు. 59.17 ఆ లెక్కన మనం రు 6314 లకు ఒక పీపాను కొనుగోలు చేశాము.పీపాకు వంద లీటర్ల పెట్రోలు అనుకుంటే లీటరు రు.63.14 పడుతుంది. డాలర్లలో లీటరుకు 1.07 , ఇప్పుడు అంటే 2016 డిసెంబరు 14-28 మధ్య ఒక పీపాను 53.05 డాలర్లకు , డాలరుకు రు.67.86 చొప్పున రు.3600కు కొనుగోలు చేశాము. అంటే లీటరుకు రు.36 పడుతుంది. డాలర్లలో ధర 0.53. నరేంద్రమోడీ సర్కార్‌ రూపాయి విలువ పతనాన్ని అరికట్టి స్ధిరంగా వుంచి వుంటే లీటరుకు రు.31.38కే వచ్చి వుండేది.అదే ప్రపంచ ఆర్ధికవేత్తలు వూహించినట్లు 45-40 రూపాయలకు పెరిగి వుంటే మరో పది రూపాయలు తగ్గి వుండేది. అన్నీ తానే అయి చూసుకుంటున్న నరేంద్రమోడీ రూపాయి పతనాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు. మరింతగా దిగజారనుందని ఆర్ధిక విశ్లేషకులు ఎందుకు అంచనా వేస్తున్నారు? అరికట్ట లేకపోగా తన హయాంలో పెట్రోలుపై పదకొండు రూపాయల పన్ను పెంచి అదనపు భారం ఎందుకు మోపి నట్లు ?

    రూపాయి విలువ పతనమైతే ఎక్కువ మందికి నష్టం జరిగితే, లాభపడే వారు కూడా వుంటారు. విదేశాలలో వుద్యోగాలు చేస్తూ మన దేశానికి డాలర్లు పంపే వారికి ఇక్కడ రూపాయలు అదనంగా వస్తాయి. మన వస్తువులను దిగుమతులు చేసుకొనే వారు తక్కువ డాలర్లు చెల్లించి లబ్దిపొందుతారు. మన దేశం దిగుమతి చేసుకొనే ముడి చమురు, ఎరువులు, ఔషధాలు, పురుగుమందులు, పప్పుధాన్యాలు, పామాయిల్‌ వంటి ఖాద్య తైలాలకు ఎక్కువ డాలర్లు చెల్లించాలి, పర్యవసానంగా ధరలు పెరుగుతాయి. అవి ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి. రూపాయి విలువ పతనం కారణంగానే ఇటీవలనే అనేక కంపెనీల కార్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే. విదేశాలలో విద్యనభ్యసించేవారిపై భారం పెరుగుతుంది. విదేశాల నుంచి డాలర్ల రూపంలో తీసుకొనే రుణాలకు చెల్లించాల్సిన మొత్తాలు పెరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు వలన తాత్కాలికంగా ఇబ్బందులంటే ఆర్ధిక వ్యవస్ధ మందగించటమే, దాని వలన మూడు నుంచి ఐదులక్షల కోట్ల నల్లధనం వెలికి వచ్చి ఆ మేరకు ప్రభుత్వాదాయం పెరుగుతుందని వేసుకున్న అంచనాలన్నీ తారుమారయ్యాయని 40-50వేల కోట్లకు మించి రావని వార్తలు వస్తున్నాయి. ఏ రోజు లావాదేవీలను ఆరోజు సాయంత్రానికి బ్యాంకులు ఖరారు చేస్తాయి. అలాంటిది పెద్ద నోట్ల డిపాజిట్ల గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా బ్యాంకులకు చేరిన సొమ్మెంతో ఇంకా లెక్కలు వేస్తున్నామని రిజర్వుబ్యాంకు చెప్పటం ఆశ్చర్యంగా వుంది. నోట్ల రద్దు వలన కలిగే లాభం సంగతేమోగాని రెండుశాతం జిడిపి అంటే రెండులక్షల కోట్ల రూపాయల నష్టం ఖాయంగా రానుంది.