Tags

, , , , , , ,

సాధ్వి ఖోస్లా

    స్వాతంత్య్ర సమర యోధుల పరంపరనుంచి వచ్చిన కొంత మందికి రెండు విషయాలు మాత్రమే -దేశ భక్తి మరియు గాంధీజీ సిద్ధాంతాలు-ఎరుకలో వుంటాయి. నాకైతే నా రాష్ట్రం పంజాబ్‌ కూడా. పంజాబ్‌ మీద నాకున్న ప్రేమ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు మరియు వాటికి అనుకూలంగా వున్న రాష్ట రాజకీయ పరిసరాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు శక్తి నిచ్చింది. ద్వేష పూరితమైన భారతీయ జనతా పార్టీ మరియు తమను తాము వీరులుగా చెప్పుకొనే దాని సామాజిక మీడియా మరుగుజ్జు యోధులపై పోరాడేందుకు దేశం మీద నాకున్న ప్రేమ బలాన్నిచ్చింది.

    గత మూడు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్‌ మీద నన్ను అసుసరిస్తున్నారు.ఈ రోజు నేనేమీ కాదు మరియు బిజెపితో నా అనుబంధాన్ని ప్రశ్నిస్తున్నారు. స్వాతి చతుర్వేది పుస్తకం అయామ్‌ ఏ ట్రోల్‌ (నేనో వెంటాడే మరుగుజ్జును )లో నేను వెల్లడించిన వాస్తవాలతో మండిపడుతున్న బిజెపి సామాజిక మీడియా సేనలోని అజ్ఞాత ముఖాలు నన్నొక దుష్టశక్తిగా చిత్రిస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాలు పలికే గొంతులేమైనా వుంటే వాటిని మూయిస్తారని నేను చెప్పింది వాస్తవమని వారు రుజువు చేస్తున్నారు.నేను బయటపడి వాస్తవాలను బహిరంగ పరచాలన్న నా నిర్ణయం కాంగ్రెస్‌తో నాకున్న స్వల్పకాల అనుబంధం వలన కాదు, అసత్యాలను వేద వాక్యంగా మార్చటాన్ని అపేందుకు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నమిది. ఎప్పటికప్పుడు వార్తలు అందుతున్న నేటి యుగంలో నిజం కంటే వ్యతిరేక సమాచార ప్రచారాన్ని వాట్సాప్‌, ట్విటర్‌ మరియు ఫేస్‌బుక్‌లలో జనం ఎక్కువగా నమ్ముతున్నారు. ఆ సమయానికి నిజం అడుగున పడిపోయి జరగాల్సిన హాని జరుగుతుంది.

    మన గొప్ప దేశాన్ని గత ప్రభుత్వాలు మలుచుతున్న తీరుతో ఇతర తరుణ వయస్సు భారత పౌరుల మాదిరే నేను కూడా 2013లో అసంతృప్తి చెందాను. నేను మొదటి సారిగా నా ఓటు హక్కును మోడీకి అనుకూలంగా వినియోగించాను, ఎందుకంటే మెరుగైన భారత్‌ గురించి ఆయన దర్శన కోణాన్ని, ఆయనను నమ్మాను. ఆ నమ్మకమే నన్ను 272 మంది మరియు వారితో పాటు వున్న వలంటీర్లతో కూడిన బిజెపి మిషన్‌ (ప్రచార దళం)లో చేరేందుకు ప్రేరణనిచ్చింది.ఆ ప్రచార దళపు ‘సరికొత్త ప్రచార పద్దతులు ‘ వెంటాడటంతో సహా అప్రతిష్టపాలు చేయటం, వాస్తవానికి వక్రభాష్యాలు చెప్పి జనాల న్యాయనిర్ణయాలను అయోమయంలోకి నెట్టటం గురించి నాకు ముందుగా ఏమాత్రం తెలియదు.

     2015 నవంబరులో అమీర్‌ ఖాన్‌ దేశంలో నాడున్న పరిస్ధితుల గురించి తన మనోభావాలను వ్యక్తం చేసినపుడు అరవింద గుప్తా నాయకత్వంలోని బిజెపి ఐటి విభాగం ఎలక్ట్రానిక్‌ వాణిజ్య సంస్ధ అయిన స్నాప్‌డీల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వున్న ఆ నటుడిని తప్పించేందుకు గాను ఒత్తిడి చేస్తూ ఒక సామాజిక మీడియా ప్రచారాన్ని నిర్వహించింది. ఆ నటుడిని వెంటాడాలని, వివిధ వేదికలపై అతనిపై బురద చల్లాలని, అతని సినిమాలు చూడకుండా జనాన్ని రెచ్చగొట్టాలని మాకు (బిజెపి ఐటి విభాగంలోని వలంటీర్లకు) ఆదేశాలు జారీ చేశారు. నా భావజాలం మరియు ఆత్మ బిజెపి మతోన్మాద దళంలో భాగస్వామి అయ్యేందుకు అనుమతించలేదు.భ్రమలు తొలిగిన నేను దాని నుంచి బయటపడ్డాను. వత్తిడి కారణంగా 2016 జనవరిలో స్నాప్‌డీల్‌ అమీర్‌ ఖాన్‌తో తన సంబంధాలను రద్దు చేసుకుంది.

     అటువంటి చర్యల తీవ్ర పర్యవసానాలను మనం గుర్తించలేదు. ఒక నటుడిగా ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇండ్లలో వుంటూ మన హృదయాలను దోచుకున్న వ్యక్తి ఆకస్మికంగా ఒక ‘ముస్లింగా’ మారిపోయాడు. ద్వేషాన్ని వ్యాపింప చేయటానికి సామాజిక మాధ్యమం ఒక ప్రమాదకర సాధనంగా మారిపోయింది, అదికొన్ని సందర్భాలలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కూడా దారితీయవచ్చు. చివరికి మతం కూడా రాజకీయాల మాదిరి మనల్ని విడదీయలేదు.

జాతి వ్యతిరేకిగా ముద్ర

     దాదాపు రెండు సంవత్సరాలు తీవ్ర స్ధాయిలో ప్రధాన మంత్రికి ట్విటర్‌ మీద మద్దతు పలికాను, చురుకుగా బిజెపికి ప్రచారం చేశాను, వారి ఎజండాలలో భాగంగా స్మృతి ఇరానీ, కిరణ్‌ ఖేర్‌ వంటి బిజెపి నాయకులకు తోడ్పడ్డాను. నేను వ్యతిరేకించిన సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఏ కూటమికి నాయకత్వం లేకపోవటాన్ని, దిగజారిన విధానాలను కూడా విమర్శించాను. ఇదే సమయంలో పంజాబ్‌ మీద వున్న నా అభిమానం రాష్ట్రంలో వున్న భయంకరమైన మాదకద్రవ్యాల వ్యాప్తిని వెల్లడిస్తూ దాని మీద ఒక డాక్యుమెంటరీని తీయించేందుకు కూడా నడిపించింది. ఆందోళన కలిగించే వాస్తవాలను ప్రధాన మంత్రి దృష్టికి తెచ్చేందుకు ట్విటర్‌ ద్వారా ఒక వర్తమానం కూడా పంపాను. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని మోడీ వాగ్దానం చేశారు, అయితే అందుకు సహాయం చేసేందుకు నేను చేసిన వినతులను విస్మరించారు.

  ప్రధాన మంత్రి నిర్లక్ష్యం నన్ను కాంగ్రెస్‌ వైపు తిరిగేట్లు చేసింది. నేను గట్టిగా బలపరిచిన నరేంద్రమోడీ విస్మరిస్తే నా వినతులను రాహుల్‌ గాంధీ విన్నారు. కాంగ్రెస్‌ వుపాధ్యక్షుడితో కలిసినప్పటి నా చిత్రాలను సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బిజెపి వెంటాడే సేనకు నా కృతజ్ఞతలు. రహస్యంగా వుంచిన వారి క్రీడను నేను బయట పెట్టటాన్ని నా రాజకీయ అజండాలో భాగంగా చూపుతున్నారు. నేను నిర్మించిన డాక్యుమెంటరీని 2016 మార్చి 18న రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్‌తో నా ఏకైక సంబంధం అది మాత్రమే.

   2014 ఎన్నికలు భారత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేశాయి. మీడియాలో ప్రచారం ఎలా పొందాలో తెలిసిన ప్రధాన మంత్రి ఇంటర్నెట్‌ ద్వారా జనాలకు చేరువ అవుతున్నారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా జనానికి తెలియచేస్తున్నారు. ఆయనను మిలియన్ల మంది అనుసరిస్తున్నారు, కానీ ఆయన మాత్రం కొద్ది మంది ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుసరిస్తారు. వారిలో ఎక్కువ మంది దూషిస్తూ వెంటాడతారని బాగా తెలిసిన వారే. ప్రధానిని సందర్శించి, శుభాకాంక్షలు తెలిపేందుకు ఇలా దూషించే వారిని ఎప్పటికప్పుడు ఆహ్వానిస్తూ వుంటారు. ఇలా వెంటాడే వారిని ప్రోత్సహించనని బిజెపి చెప్పుకునేట్లయితే ఇలాంటి అక్రమ చర్యలకు వ్యతిరేకంగా ముఖ్యంగా తమ కార్ఖానా నుంచి తయారై బయటకు వస్తున్న వాటి గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదు?

   సామాజిక మాధ్యమ వేదికను నిర్మాణాత్మక అభివృద్ధికి వినియోగించుకోవటానికి బదులు తమ వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడించించిన వారిని అవమానించే విధంగా తన దిగువ సేనను వినియోగించుకుంటోంది. ఏ వ్యక్తి, సంస్ధ లేదా సమాజం అభివృద్ధి చెందాలంటే సానుకూల విమర్శలు ఆరోగ్యకరమైనవి, కానీ అసహ్యంగా విమర్శించటం, వ్యక్తిత్వాలను దెబ్బతీయటం అవాంఛనీయం. ప్రధానిని సమర్ధించే పేరుతో జనాలను మరియు వారి వ్యక్తిత్వాలను దెబ్బతీస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల చీకటి చిత్రాన్ని మాత్రమే ఇది బయట పెడుతోంది. వ్యతిరేకుల, జర్నలిస్టుల, రాజకీయనేతలు మరి ఇతరులెవరి ప్రతిష్టనైనా దెబ్బతీయాలని కిరాయి వలంటీర్లకు మార్గదర్శనం చేశారు. భిన్నమైన వైఖరి కలిగి వున్న ఎవరినైనా మోడీ మరియు జాతి వ్యతిరేకిగా వర్ణించారు. ఎంత అసహ్యంగా అయితే అంతగా మహిళలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్‌ గాంధీ,ఆయన తల్లి సోనియాగాంధీలపై తప్పుడు ప్రచారం చేశారు, బర్ఖాదత్‌ వంటి జర్నలిస్టులను చంపేస్తామని, మాన భంగం చేస్తామని బెదిరింపులు చేశారు.

  బిజెపి ప్రచారాన్ని బయటపెట్టిన మాకు అన్ని జీవన రంగాల నుంచి ప్రజామద్దతు వెల్లువెత్తుతున్నది. ఈ అంశం దేశంలోని మారుమూలలకు కూడా ప్రయాణించింది. వ్యతిరేక భావజాలాన్ని అణచివేసేందుకు పాలకపార్టీ సామాజిక మీడియాను వినియోగించుకోవటాన్ని జనం ప్రశ్నిస్తున్నారు.అంతిమంగా బిజెపి సామాజిక మీడియా సేన మరియు మద్దతుదారుల లక్ష్యంగా పుస్తక రచయిత్రి స్వాతి చతుర్వేది మరియు నేను వుంటాము. వారు మాపై బూతులు, కించపరిచే ప్రచారం, బెదిరింపులతో దాడి చేస్తారు. ఇదంతా ఎందుకంటే వారి చీకటి రహస్యం బట్టబయలైంది, నిజం గాయపరుస్తుంది.

   నేను నా ఆత్మ చెప్పినట్లు నడిచాను. వ్యతిరేక భావాలు కలిగి వున్న వ్యతిరేకులు లేదా ప్రముఖులకు వ్యతిరేకంగా కించపరిచే ప్రచారం చేయటానికి సామాజిక మీడియాను ఎలా సాధనంగా చేసుకుంటున్నారో నా అందమైన దేశం, దాని ప్రజలు తెలుసుకోవాలన్నది నా ఆలోచన మరియు విధి.

ప్రేమ కంటే ద్వేషం త్వరగా విస్తరించటం విచారకరం !

నేను మార్పు కోసం నరేంద్రమోడీకి ఓటు వేశాను తప్ప ద్వేషం కోసం కాదు. !

నేను చెప్పాల్సింది చెప్పాను, నేను నమ్మిందే చేశాను, చేసిందే చెప్పాను. ఇది నేను చెబుతున్న నిజం !

స్క్రోల్‌.ఇన్‌ సౌజన్యంతో