Tags

, , , , , , , ,

ఎం కోటేశ్వరరావు

    భవిష్యత్‌లో తమ దేశం ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదుగుతుందని , దానికి డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి అబద్దాలకోరుగా పేరు తెచ్చుకున్న ఒక అధ్యక్షుడిని తమ వారసులు ఎన్నుకుంటారని గానీ 240 సంవత్సరాల క్రితం స్వాతంత్య్ర సాధనకు పోరాడిన అమెరికన్లు అస్సలు వూహించి వుండరు. వారి చరిత్రలో ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించకుండా, ఏ విధానాన్ని అమలు జరపకుండానే ప్రజలలో పలుకుబడి కోల్పోయి, వివాదాల మధ్య నూతన అధ్యక్షుడు వైట్‌ హౌస్‌లో ఆశీనుడౌతాడని గానీ ఏమాత్రం ఆలోచించి వుండరు. ఇదే సమయంలో ట్రంప్‌ వ్యవహరిస్తున్న అపారదర్శక తీరును చూస్తే తరుణం రాకుండానే ముందే కూసిన కోయిల మాదిరి కొంత మంది విశ్లేషకులకు రష్యాతో అమెరికా పాలకవర్గం సయోధ్యకు అమెరికా పాలకవర్గం పావులు కదుపుతోందా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. వర్తమాన పరిస్థితులలో అది సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా బలంగానే వున్నాయి. ప్రతిదానికీ అయితే గియితే అనే మినహాయింపులు, బొమ్మా బొరుసులూ వున్నప్పటికీ ఎత్తుగడలు, తాత్కాలికంగానే అయినా అంతర్జాతీయ పరిణామాలలో ఏదీ అసాధ్యం కాదని గత చరిత్ర రుజువు చేసింది.

    సాధారణ జనం ఓట్లలో మైనారిటీ, అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీలో మెజారిటీ తెచ్చుకొని అధ్యక్షుడిగా ఎన్నికై ఈ నెల 20న పదవీ బాధ్యతలు స్వీకరించబోయే డోనాల్డ్‌ ట్రంప్‌ తొలి సారిగా, పదవి నుంచి దిగిపోయే బరాక్‌ ఒబామా కొద్ది రోజుల క్రితం చివరి విలేకర్ల సమావేశాలు నిర్వహించారు. గత ఎనిమిది సంవత్సరాల ఏలుబడిని అమెరికన్లతో పాటు ప్రపంచమంతా చూసింది గనుక పదవి నుంచి దిగిపోయే ఒబామా చెప్పిన దానిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. మొత్తం పదవీ కాలమంతా దేశాన్ని దురాక్రమణ యుద్ధాలలో నిమగ్నం చేసి, కోట్లాది కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేసి తగుదునమ్మా అంటూ ప్రపంచ శాంతి బహుమతి స్వీకరించి నోబెల్‌నే అపహాస్యం చేసిన పెద్దమనిషిగా చరిత్రకెక్కాడు. తొలి పత్రికా గోష్టి కంటే ముందే తన మంత్రులను ఎంపిక చేసిన తీరు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తన విధానాలు ఎలా వుండబోతున్నాయో ట్రంప్‌ స్పష్టం చేశారు కనుక తనపై వార్తలు రాసిన కొన్ని మీడియా సంస్ధలకు హెచ్చరికలు చేయటం మినహా పత్రికా గోష్టిలో సరికొత్తగా చెప్పిందేమీ లేదు.

    నిత్యం అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడి కొట్టుకు చచ్చినట్లుగా అమెరికా గూఢచార సంస్ధల పరిస్థితి తయారైందంటే అతిశయోక్తి కాదు. ప్రతి దేశ అంతర్గత వ్యవహారాలలో ఏదో ఒక రూపంలో జోక్యం చేసుకొని, తన పలుకుబడి, ప్రభావాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు ఎదుర్కొనే అమెరికా ఇప్పుడు తమ వ్యవహారాలలో రష్యా జోక్యం గురించి అవుననీ, కాదనీ చెప్పలేక కొట్టుమిట్టాడుతున్న స్ధితిలో వుంది. అది కూడా నాటకంలో అంతర్నాటకం కూడా కావచ్చునని కొందరు అనుకోవచ్చు. నిత్యం మనం చూసే హాలీవుడ్‌ సినిమాలలో సిఐఏ, ఎఫ్‌బిఐ ఏజంట్లు ఎంతో తెలివిగలవారు , అంతిమ విజయం సాధించేవారుగానూ, మిగతా ప్రపంచ దేశాల వారంతా తెలివితక్కువ వాజమ్మలుగా చిత్రించి చూపుతారు. ఇప్పుడు రష్యన్ల ప్రమేయం గురించిన వివాదంలో అమెరికా నిఘా సంస్ధల అధికారులు పరస్పర విరుద్ధంగా చెబుతూ నగుబాట్ల పాలవుతున్నారు. ఎన్నికల సందర్భంగా రష్యన్‌ గూఢచారులు డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలకు సంబంధించిన వ్యక్తిగత రంకు బొంకులు, వ్యాపారలావాదేవీలు, ఇతర విషయాలన్నింటినీ సేకరించారట. అయితే డోనాల్డ్‌ ట్రంప్‌కు విజయం చేకూర్చేందుకు డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారి సమాచారాన్ని మాత్రమే బహిర్గతం చేశారన్నది ఒక కథనం. దౌత్యపరమైన ఎత్తులు జిత్తులలో అదొక భాగం కావచ్చు. అనేక ప్రపంచ వ్యవహారాలలో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఒబామా, హిల్లరీ క్లింటన్‌లు అనుసరించిన రష్యా వ్యతిరేక వైఖరికి బదులు తీర్చుకొనేందుకు, తాము తలచుకొంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలనే ప్రభావితం చేయగలమని ప్రపంచానికి తెలియ చెప్పేందుకు కావచ్చు. తాము కోరుకున్న డెమోక్రటిక్‌ పార్టీ ఓడిపోయి డోనాల్ట్‌ ట్రంప్‌ ఎన్నికయ్యాడు కనుక అతగాడిని కూడా అదుపులో పెట్టుకొనేందుకు ఆ పెద్దమనిషి బలహీనతలు, రంకు, బొంకులు తదితర సమాచారం కూడా తమ దగ్గర వుందని సంకేతాలు, శాంపిల్‌ సమాచారాన్ని పంపి బ్లాక్‌ మెయిలు చేసేందుకు పూనుకుందన్నది మరొక ఆరోపణ.

   అన్ని రోడ్లూ రోమ్‌కే అన్నట్లు ఇప్పుడు అమెరికాలో ఎవరు ఏం మాట్లాడినా చివరికి దీని దగ్గరకే వస్తున్నది. ఏ యుద్ధంలో అయినా ముందు బలయ్యేది సత్యం. ఇప్పుడు అమెరికాలో కూడా అదే జరుగుతోంది. విరుద్ధ కథనాలు, సమాచారాలతో జుట్టుపీక్కొనే పరిస్థితి. జోక్యం చేసుకున్నట్లు గూఢచార సంస్ధలు నివేదించాయి, అయితే వాటి దగ్గర ఆధారాలు లేవు. నిజమే అని అంగీకరించటం ట్రంప్‌కు ఇబ్బంది, అమెరికా పరువు పోతుంది. కాదని ఖండిస్తే డెమోక్రటిక్‌ పార్టీ, దాని అనుకూల మీడియా వెల్లడిస్తున్న కధనాలకు సరైన సమాధానం లేదు. తనపై రష్యా సేకరించిందన్న సమాచారం గురించి కథనాలు గుప్పించిన మీడియా సంస్ధలపై ట్రంప్‌ తన అధికారిక తొలి పత్రికా గోష్టిలో విరుచుకుపడ్డారు.బజ్‌ఫీడ్‌ అనే ఆన్‌లైన్‌ మీడియా ట్రంప్‌కు సంబంధించి రష్యన్ల దగ్గర వున్నదనే పేరుతో 35పేజీల సమాచారాన్ని ప్రచురించింది. అదంతా చెత్త అంటూ దీనికి గాను ఆ సంస్ధ పర్యవసానాలను అనుభవిస్తుందని ట్రంప్‌ బెదిరింపులకు దిగారు. ఆ సమాచారమంతా పిల్లలు ఆడుకొనేందుకు దుకాణాల్లో కొనే ఆట కరెన్సీ నోట్ల వంటిది తప్ప మరొకటి కాదని సిఐఏ మాజీ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అది వాస్తవమేనని ఎఫ్‌బిఐ అభిప్రాయపడినట్లు మీడియా రాసింది. తాము ప్రచురించిన అంశాలకు కట్టుబడి వున్నామని, ఏది నిజమో కాదో పాఠకులకు వదలి వేస్తున్నామని బజ్‌ఫీడ్‌ సంపాదకుడు ప్రకటించాడు. ప్రజావేగు ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు ఇచ్చిన ఆశ్రయానికి కృతజ్ఞతగా అతనే రహస్య సమాచారాన్ని రష్యన్లకు అందచేసినట్లు కొందరి అనుమానం. రష్యన్లు తమ వద్ద వున్న సమాచారాన్ని అమెరికన్‌ ఏజన్సీలకు చేరవేసే ముందు ట్రంప్‌ వ్యతిరేకులకు కూడా అందించినట్లు వార్తలు వచ్చాయి. తమ అధ్యక్షుడికి రష్యాతో వున్న సంబంధాల గురించి స్పష్టత వచ్చేంతవరకు మీరు ఎలాంటి సమాచారాన్ని అధ్యక్ష భవనం, జాతీయ భద్రతా మండలికి గానీ అందచేయవద్దని, అ సమాచారం రష్యా ద్వారా ఇరాన్‌కు చేరే అవకాశం వుందని అమెరికా నిఘా సంస్ధల అధికారులు ఇజ్రాయెల్‌ సంస్ధలకు చెప్పినట్లు, అది తెలిసి ఇజ్రాయెలీలు నెత్తీనోరు బాదుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. నాటకాన్ని రక్తి కట్టించేందుకు , ట్రంప్‌ను కాపాడేందుకా అన్నట్లు ఆ సమాచారం వాస్తవం కాదని రష్యన్‌ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అయినా సరే దాని మీద రగడ కొనసాగటాన్ని చూస్తే మొత్తం మీద ఎంతో సమర్ధులమని విర్రవీగే అమెరికన్లను ప్రపంచం ముందు వెర్రివారిగా మార్చి రష్యన్లు వినోదం చూస్తున్నారన్నది స్పష్టం.

   రష్యన్లు ట్రంప్‌కు అనుకూలంగా , తమకు వ్యతిరేకంగా వ్యవహరించారనే వుక్రోషంతో హాకింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ 35 మంది దౌత్య సిబ్బందిని తన చివరి చర్యగా ఒబామా సర్కార్‌ బహిష్కరించింది. మామూలుగా అయితే అంతే సంఖ్యలో అమెరికా సిబ్బందిని కూడా రష్యా బహిష్కరించి వుండాలి. అయితే తనదైన దౌత్యనీతిని ప్రదర్శించిన పుతిన్‌ ఆపని చేయకుండా ట్రంప్‌ ఎలా వ్యవహరిస్తాడో చూస్తామంటూ బంతిని ట్రంప్‌ కోర్టుకు నెడుతూ ప్రకటన చేశాడు. పుతిన్‌ ఎంతో హుందాగా వ్యవహరించాడంటూ ట్రంప్‌ స్పందించాడు. ఈ వ్యవహారంలో వెలువడుతున్న పలు విశ్లేషణలు అనేక కొత్త కోణాలను జనం ముందుంచుతున్నాయి. వాటిని పూర్తిగా నమ్మటం లేదా కొట్టి పారవేయకుండా పరిశీలించటం అవసరం.

   అధికారమే పరమావధిగా వుండే పార్టీలు, శక్తులకు శాశ్వత మిత్రులు, శత్రువులు అంటూ ఎవరూ వుండరు. సరే సిద్దాంతాలు, కట్టుబడి వుండటాల గురించి ఆశించకూడదనుకోండి. ఏదో ఒక సాకుతో ఆయారాం గయారాంలు ఎక్కడ అధికారం వుంటే అక్కడికి చేరతారు. తమ మంద పెద్దదిగా వుందా లేదా అని తప్ప చేర్చుకొనే వారికి కూడా సిగ్గూ ఎగ్గూ వుండదు. అలాంటి వారిని జనం ఎందుకు ఎన్నుకుంటున్నారన్న ఒక ప్రశ్న ఎలాగూ వుండనే వుంటుంది. అధికారం, దాని కొమ్ముకాసే కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కమ్యూనిస్టు మినహా మిగిలిన పార్టీలన్నీ దేనికైనా పాల్పడతాయి. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులకు తమ ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి తమ లాభాలకు వుపయోగమా కాదా అని చూస్తారు, సత్తా వుందనుకుంటే దెబ్బలాడుకుంటారు, లేదనుకుంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ రాజీపడతారన్నది ప్రపంచ చరిత్ర సారం. కొందరి విశ్లేషణ ప్రకారం ప్రపంచ పరిణామాలలో అమెరికా సరికొత్త రాజకీయానికి తెరలేపుతున్నదనే అనుమానం కూడా వ్యక్తమౌతున్నది.

    రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికన్లు ఆసియాలో జపాన్‌పై దాడి చేశారు. అవసరం లేకపోయినా అణు బాంబులు వేసి ప్రపంచం మొత్తాన్ని బెదిరించారు. జపాన్‌ , ఐరోపాలో జర్మనీ మిలిటరీనికూడా రద్దు చేసి నాటో పేరుతో రక్షణ, పునరుద్ధరణ బాధ్యతల్లో అమెరికా తెరవెనుక వుండి పెద్దన్న పాత్ర పోషిస్తోంది. మిలిటరీ ఖర్చు లేకపోవటంతో అందుకయ్యే మొత్తాన్ని పరిశోధన-అభివృద్ధి, పారిశ్రామిక రంగానికి మరల్చి ఆర్ధిక రంగంలో అమెరికాతో ధీటుగా జపాన్‌,జర్మనీలు తయారయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు అంతరించటంతో వర్ధమాన దేశాల మార్కెట్లలో కొత్త పద్దతులలో ఎలా ప్రవేశించటమా అన్న ప్రపంచ బడా పెట్టుబడిదారుల ఆలోచన నుంచి పుట్టిందే ప్రపంచీకరణ. ఇదే సమయంలో సోవియట్‌ యూనియన్‌-చైనాల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల సమస్యల పూర్వరంగంలో తమ దేశంలో ప్రయివేటు పెట్టుబడులను అనుమతించేందుకు చైనా సంస్కరణల బాట చేపట్టింది. దాంతో అతి పెద్ద చైనా మార్కెట్‌లో ప్రవేశించేందుకు అమెరికన్లు ఐక్యరాజ్యసమితిలో కమ్యూనిస్టు చైనాను అసలైన ప్రతినిధిగానే గాక, తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్‌ కూడా చైనాలో అంతర్భాగమనే వైఖరిని తీసుకున్నారు.

   పెట్టుబడిదారులు ఎప్పటికప్పుడు లాభాల కోసం తమ పద్దతులను మార్చుకుంటూ వస్తున్నారు. మార్కెట్లను పంచుకొనే పోటీలో భాగంగా సామ్రాజ్యవాదుల మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రెండు దశాబ్దాల కాలానికే రెండవ ప్రపంచ యుద్ధానికి సామ్రాజ్యవాదులు తలపడ్డారు. ఆ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసల శకం ముగియటం, బలమైన సోషలిస్టు శిబిరం ఏర్పడటంతో సామ్రాజ్యవాదులు తమ దురాక్రమణ ఎత్తుగడలను, రూపాలను మార్చారు. గతంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటివి తమ దేశాలలో తయారైన పారిశ్రామిక వస్తువులను మన వంటి తమ వలస దేశాలలో విక్రయించి, అవసరమైన ముడిసరకులను దిగుమతి చేసుకొని రెండువైపులా లాభాలను ఆర్జించేవి. ఇప్పుడు తాము ప్రత్యక్షంగా వస్తూత్పత్తిని చేయకుండా, ముడి సరకులను దిగుమతి చేసుకోకుండా కేవలం ఆయుధాల వంటి వాటిని మాత్రమే తయారు చేసి విక్రయిస్తూ పెట్టుబడిని, కొంత మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు తరలించి అక్కడి కార్మికుల చౌక శ్రమ శక్తితో వస్తూత్పత్తి చేసి వాటిని తమ మార్కెట్లకు దిగుమతి చేసుకొని లాభాలు పొందటం ప్రారంభించారు. అందుకే అమెరికా, ఐరోపా ధనిక దేశాల దుకాణాలన్నింటా చైనా, బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాల తయారీ వస్తువులే వుంటున్నాయి. తమ వద్ద ఇంకా మిగిలి వున్న డాలర్లను వర్ధమాన దేశాల స్టాక్‌ మార్కెట్లలో వాటాల క్రయ విక్రయాలతో ఎలాంటి పరిశ్రమలు, వ్యాపారాలు, కార్మికులు, వుద్యోగులు లేకుండానే లాభాలు సంపాదిస్తున్నాయి.

    ఈ క్రమంలో ధనిక దేశాలలో వస్తూత్పత్తి పడిపోయి, ఆధునిక పరిశ్రమలలో రోబోట్ల వినియోగం పెరిగి కార్మికులకు వుపాధి తగ్గిపోయి సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయి. చైనా తన వద్ద వున్న అపార మానవ శక్తిని పెట్టుబడిగా పెట్టి జనానికి వుపాధి కల్పించి, వారి జీవన ప్రమాణాలను పెంచటంతో పాటు ప్రపంచం సంపదలలో రెండవ స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టింది. ఆ పోటీలో అమెరికాతో పోటీ పడుతూ దాని మొదటి స్దానానికి సవాలు విసురుతోంది. అంతర్జాతీయ పరిణామాలలో తనకు పోటీగా మారవచ్చనే భయం అమెరికన్లకు పట్టుకుంది. ఈ పూర్వరంగంలో దానిని కట్టడి చేసేందుకు సైనికంగా చైనా చుట్టూ తన స్థావరాలతో పాటు మిత్రులను సమీకరిస్తోంది.

    ప్రస్తుతం పెద్ద సరిహద్దు వున్న రష్యాతో చైనాకు ఎలాంటి పేచీలు లేవు. రెండు దేశాల మధ్య శతృత్వం కూడా లేదు. ఈ పూర్వరంగంలో రష్యాను కూడా తనతో కలుపుకొనే అవకాశాల గురించి అమెరికన్లు ఆలోచిస్తున్నారనేది ఒక విశ్లేషణ. దానిలో భాగంగానే ట్రంప్‌ ఒకవైపు పుతిన్‌ను పొగుడుతూ చైనాతో బస్తీమే సవాల్‌ అన్నట్లుగా రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నాడు. చైనాలో అంతర్భాగమైనా విడిగా వున్న తైవాన్‌ పాలకులతో మాట్లాడటమే గాకుండా ఒకే చైనా విధానానికి ఎందుకు కట్టుబడి వుండాలన్నట్లుగా మాట్లాడుతున్నాడు. చైనా వస్తువులపై పెద్ద మొత్తంలో దిగుమతి సుంకాలు విధిస్తామని కూడా బెదిరింపులకు దిగాడు. అయితే ఇవన్నీ అంత తేలిక కాదు. రష్యా ఆర్ధికంగా ఇబ్బందులలో వున్నప్పటికీ సిరియా, టర్కీ పరిణామాలలో అమెరికాకు తన సత్తాఏమిటో చూపటమే గాక సవాలు కూడా విసిరింది. రష్యా ఇదే విధంగా కొనసాగితే ఐరోపామీద తన పట్టు, పలుకుబడికి విఘాతం కలగవచ్చనే భయం కూడా అమెరికా పాలకవర్గానికి వుంది. మొత్తం మీద ప్రపంచ పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలో వున్న పరిస్థితుల్లో ఒక పెట్టుబడిదారీ దేశం మరొక పెట్టుబడిదారీ దేశంతో ఘర్షణ పడే అవకాశాలు లేవు. మార్కెట్లను పంచుకోవటంలో రష్యన్‌ పెట్టుబడిదారీ వర్గం కూడా పోటీ పడుతోంది. చైనా, భారత్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాతో కలసి బ్రిక్స్‌ కూటమి ఏర్పాటు చేయటం దానిలో భాగమే. అమెరికన్ల ఎత్తుగడలు బాగా తెలిసిన రష్యా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. రష్యన్‌ పెట్టుబడిదారులు కూడా అదే కోరుకుంటారు.

  చైనాను రెచ్చగొట్టేందుకు ట్రంప్‌ వినియోగిస్తున్న అస్త్రాలతో పోల్చితే రష్యాను ప్రసన్నం చేసుకొనేందుకు విసురుతున్న పూలదండలు ఆసక్తి కరంగా వున్నాయి. తన విదేశాంగ మంత్రిగా రష్యా అనుకూలుడిగా ముద్రపడిన ఎక్సాన్‌ మోబిల్‌ సిఇవో రెక్స్‌ టిల్లర్సన్‌ను నియమించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎక్సాన్‌ కంపెనీకి రష్యాలోని సైబీరియాలో 50 కోట్ల డాలర్ల చమురు ఒప్పందం వుంది. త్వరలో రష్యాపై వున్న ఆంక్షలను ట్రంప్‌ ఎత్తివేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇలాంటి అంశాలకు సంబంధించి వస్తున్న వార్తలలో ఎక్కువ భాగం చీకట్లో వేస్తున్న బాణాల వంటివి. ఒక్కోసారి అవే కొత్త పరిణామాలకు నాంది పలుకుతాయి. కొందరు వూహిస్తున్నట్లు రష్యా-అమెరికాలు ప్రపంచ మార్కెట్లను పంచుకొనేందుకు సయోధ్య కుదుర్చుకుంటే ప్రపంచ రాజకీయాలు మరోమలుపు తిరుగుతాయి.