Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

    తెల్లగా వున్నంత మాత్రాన వుల్లి మల్లి అవుతుందా, వుప్పు కప్పురంబు చూడ ఒక్కటిగ నుండు చూడ చూడ రుచుల జాడ వేరయా అన్న ప్రఖ్యాత తెలుగు సామెతలు, సామ్యాల గురించి చాలా మంది వినే వుంటారు. నా చిన్న తనంలో ఫొటో తీయించుకోవటం అన్నది చాలా మందికి ఒక తీరని కల. తిరునాళ్లకు వెళ్లినపుడు లేదా పట్టణాలకు వెళ్లినపుడు అక్కడ స్టూడియోలకు వెళితే మోటారు సైకిలు మీద, గుర్రం మీద కూర్చున్నట్లు ఫొటోలు తీయించుకుంటే చెప్పలేని ఆనందం. ఎందుకంటే అవి ఆ నాడు సామాన్యులకు అందుబాటులో వుండేవి కాదు. ఎవరైనా గ్రామానికి మోటార్‌ సైకిల్‌ మీద వస్తే గ్రామం మొత్తం అబ్బో అన్నట్లుగా చూసేది, ఒకప్పుడు బైసికిలు(సైకిల్‌ను బైసికిలుగా ఆమె నోట మొదటిసారి విన్నాను) ఎక్కినపుడు కూడా అలాగే చూసేవారని మా తాతమ్మ చెప్పేది.

   ఇప్పుడు మన ప్రధాని నరేంద్రమోడీకి కూడా అలాంటి సరదాయే కలిగిందా అన్న అనుమానం వస్తోంది. లూధియానాలో జరిగిన ఒక కార్యక్రమంలో మహాత్మా గాంధీ మాదిరి చరఖా ముందు కూర్చొన్నపుడు తీసిన ఫొటోను ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ కాలండర్‌, డైరీలపై ముద్రించారు. అసలు ఖాదీ అంటే సామాన్యులు వాడే ముతక రకం వస్త్రం. ఇస్త్రీ లేకుండా ఖాదీ దుస్తులు ధరిస్తే అదేదో సినిమాలో చెప్పినట్లు చాల బాగోదు. ఇప్పుడు ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీవరకు చిల్లర రాజకీయాలు చేసే వారు, ఫ్యాన్సీగా ధనికులు తప్ప సామాన్యులెవరూ వాడటం లేదు. వాటిని ధరించి పొలాల్లో, ఫ్యాక్టరీలలో పనిచేసే సామాన్యులెవరూ మనకు కనిపించరు. ఖద్దరు మాదిరి కనిపించే మర మగ్గాలు లేదా మిల్లు వస్త్రాలు మార్కెట్‌లో ఖాదీగా చెలామణి అవుతున్నాయన్నది కూడా వాస్తవమే.

    ఇక నరేంద్రమోడీ ఫొటోలంటే పడి చస్తారనేది ఇప్పటికి అనేక సందర్భాలలో రుజువైంది. ప్రధాన మంత్రి కనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం వున్న ఏ శాఖ లేదా సంస్ధ కాలండర్‌లో అయినా ఫొటో వేయటాన్ని తప్పుపట్టనవసరం లేదు. స్వాతంత్య్ర వుద్యమ కాలంలో జనంలో స్వాతంత్య్ర కాంక్ష రగిల్చేందుకు గాంధీ ఖాదీ తయారీని విదేశీ వ్యతిరేక స్వదేశీ వుద్యమంగా చేెపట్టారు, స్వయంగా వడికారు. గాంధీ అంటే ఖాదీ, ఖాదీ అంటే గాంధీ అన్న నానుడి వునికిలోకి వచ్చింది. ఇప్పుడు నరేంద్రమోడీ విదేశీ వస్తువులకు మన తలపులను మరింత బార్లా తెరిచి తానొక బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాలనుకుంటున్నారు. దేశానికి ఏ మాత్రం వుపయోగపడినా కూడా తప్పులేదు. అంబానీ జియో వేదిక, ప్రకటనలు చూస్తే మనకు అది కనిపిస్తుంది. ఖాదీ విషయంలో ముఖ్యమంత్రిగా గుజరాత్‌లో, ప్రధానిగా దేశంలో ప్రత్యేకంగా చేసిందేమీలేదు. ఖాదీ నూలు వడికే వారి బతుకుల దైన్య స్ధితే అందుకు నిదర్శనం. తాజా వివాదానికి వస్తే ఖాదీ సంస్ధ కాలెండర్‌పై గాంధీని అనుకరించిన ఫొటో వేయటమే అభ్యంతరకరం. చారిత్మ్రాత్మక గాంధీ ఫొటోకు, నరేంద్రమోడీ పాల్గొన్న ఒక సభలోని చిత్రానికి తేడా ఏమిటంటే ఆయన చొక్కా వేసుకోలేదు, సాదాసీదాగా నిజంగా నూలు వడుకుతున్నపుడు తీసింది. మోడీది డిజైన్డ్‌ చరఖా, ఖాదీ చొక్కా, కుర్తా వేసుకుకొని ఫొటో కోసం ఫోజిచ్చిన చిత్రం. అందుకే చూసే వారికి మొదటి ఫొటో సహజంగా కనిపించింది, రెండవ చిత్రం ఎబ్బెట్టుగా వుంది. బహిరంగ సభలలో మిత్రోం అంటూ సంబోధించే ఫొజుతో వున్న ఏ ఫొటోను అయినా ఒకవైపు, రెండవ వైపు గాంధీ ఫొటోను కాలండర్‌పై ముద్రించి వుంటే ఇంతటి వివాదం తలెత్తి వుండేది కాదు.

   ఖాదీ సంస్ధ కాలండర్‌పై గాంధీ చిత్రాన్ని తొలగించి మోడీ బొమ్మ ముద్రించటంతో అనేక మంది మనోభావాలు గాయపడ్డాయి . అయితే మాకేంటి అంటారా పోనీ అదైనా చెప్పండి. కాలండర్‌పై గాంధీ బొమ్మ స్ధానంలో నరేంద్రమోడీ చిత్రం పెట్టటాన్ని ఖాదీ సంస్ధ సమర్ధించుకున్న తీరు చిత్రంగా వుంది. ప్రధాని బొమ్మ పెట్టి ఆయన అనుగ్రహం పొందేందుకు ఖాదీ సంస్ద అధికారులు ప్రయత్నిస్తే వారి చర్యను సమర్ధించి నరేంద్రమోడీ కార్యాలయం ప్రజల మనోభావాలను గాయపరిచింది. ఇక హర్యానా బిజెపి మంత్రి అనిల్‌ విజె అర్‌ఎస్‌ఎస్‌ పరివార అంతరంగాన్ని బయటపెట్టారు.

   తమ చర్యను ఖాదీ కమిషన్‌ అడ్డంగా సమర్ధించుకొంటోంది. ‘ గాంధీ తత్వశాస్త్రం, ఆశయాలు, ఆలోచనల ప్రాతిపదికనే మొత్తం ఖాదీ పరిశ్రమ ఏర్పడింది. ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌ ఆత్మ ఆయన, అలాంటి గాంధీని విస్మరించే ప్రశ్నే లేదు. నరేంద్రమోడీ ఎంతో కాలం నుంచి ఖాదీని ధరిస్తున్నారు. ఖాదీతో తన స్వంత శైలిని అభివృద్ధి చేసుకుంటూ సామాన్య జనంలోనూ విదేశీ అతిధులలోనూ ఎంతో ప్రాచుర్యం కల్పించారు. వాస్తవానికి ఆయన ఖాదీకి అతిపెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌, ఆయన భావనలు ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌కు సరిపోయాయి. బొమ్మల ముద్రణకు సంబంధించి ఎలాంటి నిబంధనలు, సాంప్రదాయాలు లేవు, గతంలో కూడా ముద్రించని సందర్భాలు వున్నాయని’ కమిషన్‌ చైర్మన్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా చెప్పారు. ప్రధాని కార్యాలయం కూడా అనవసరమైన రచ్చ అంటూ కొట్టి పారవేసిందని, 1996, 2005, 2011,12,13, 16లో గాంధీ ఫొటో లేదని, కాంగ్రెస్‌ యాభై సంవత్సరాల పాలనలో రెండు నుంచి ఏడుశాతం చొప్పున మాత్రమే ఖాదీ అమ్మకాలు పెరిగాయని అదే గత రెండు సంవత్సరాలలో 34శాతం పెరిగాయంటే ఖాదీని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మోడీ చేసిన యత్నాలే కారణమని కార్యాలయ వర్గాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దానిలో వాస్తవాంశాల కొస్తే మోడీ హయాంలో పెరుగుదల ఏడుశాతమే తప్ప 34శాతం కాదని వార్తలు వచ్చాయి. మిగతా విషయాల కొస్తే కార్యాలయ వర్గాలు పేర్కొన్న ప్రకారమైనా కొన్ని తప్ప మిగతా సంవత్సరాలన్నీ గాంధీ బొమ్మనే ముద్రించారు, ఆయన బోధనలనే ప్రచురించారు తప్ప, దాని బదులు మరొక ప్రధాని బొమ్మను ముద్రించినట్లు , వేరే వారి సుభాషితాలను పేర్కొన్నట్లు ప్రధాని కార్యాలయం, ఖాదీ కమిషన్‌గానీ చెప్పలేదు. మోడీ ఖాదీ ధరిస్తారు కనుక అమ్మకాలు ఎక్కువ అవుతాయన్నది మరొక వాదన, మిగతా ప్రధానులెవరూ ఖాదీ ధరించలేదా ? చేనేత, ఖాదీ ధరించమని ఏదో ఒక సందర్భంలో చెప్పలేదా ?

    సేనాని అయిన ప్రధాని కార్యాలయమే సమర్ధనకు దిగిన తరువాత సైనికులు మామూలుగా వుంటారా ? ఆదివారం నాడు హర్యానా బిజెపి మంత్రి అనిల్‌ విజ్‌ కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించినప్పటి నుంచి దాని విలువ తగ్గిపోతున్నదని, అందువలన వాటిపై కూడా క్రమంగా ఆ బొమ్మ అంతరించిపోతుందన్నాడు.ఖాదీతో గాంధీ పేరు ముడిపడివున్నంత కాలం దాని అమ్మకాలు పెద్దగా లేవు, తగ్గిపోయాయి. కాలండెర్‌పై బొమ్మ తీసివేయటం మంచి పని.మోడీ బొమ్మ పెట్టిన తరువాత 14శాతం పెరిగాయని అనిల్‌ వ్యాఖ్యానించాడు. వాటిపై విమర్శలు రావటంతో హర్యానా ముఖమంత్రి ఖట్టర్‌ ఒక ప్రకటన చేసి అవి అతని వ్యక్తిగత వ్యాఖ్యలని కొట్టిపారవేశారు. పార్టీకి సంబంధం లేదన్నారు. తరువాత తాను అన్న మాటలను వుపసంహరించుకున్నట్లు అనిల్‌ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. బిజెపి నేతలు ఇలాంటి వదరుబోతు వ్యాఖ్యలు చేయటం తరువాత వాటిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించటం ఒక ఎత్తుగడ, ఒక అలవాటు. కడుపులో వున్నదే బయటికి వస్తుంది తప్ప వేరొకటి కాదు. వాటిని వుపసంహరించుకున్నట్లు ప్రకటించినప్పటికీ అవి తిరుగుతూ వాటిపని అవి చేస్తాయి.

  ఖాదీ వినియోగం పెంపుదలకు నరేంద్రమోడీ ఎంతగానో కృషి చేస్తున్నారనేది ఒక ప్రచారం మాత్రమే. గ్రామాలలో ఖాదీ దారాలను తయారు చేసే కార్మికులకు కనీసవేతనాలు కూడా రావటం లేదని రోజుకు 125-150 మాత్రమే వేతనం వస్తున్నట్లు కొందరు పరిశోధకులు మూడు నెలల క్రితం తమ పత్రంలో ప్రకటించారు.

   కాళ్లు తుడుచుకునే పట్టాలను మన జాతీయ పతాక రంగులు, చిహ్నంతో తయారు చేసి విక్రయించటాన్ని వెంటనే నిలిపి వేయాలని, భారతీయుల మనోభావాలను గౌరవించాలని అంతర్జాతీయ వాణిజ్య దిగ్గజం అమెజాన్‌ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక చేసింది. ఈ మేరకు మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ముందు ఒక ట్వీట్‌ చేసి పాలనా పద్దతుల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. వుపసంహరించకపోతే అమెజాన్‌ కంపెనీ అధికారుల వీసాలను పునరుద్ధరించబోమని హెచ్చరించారు. తరువాత విదేశాంగ శాఖ వాషింగ్టన్‌లోని మన రాయబారిద్వారా అమెజాన్‌ కంపెనీకి నిరసన తెలియ చేయమని చెప్పారు. ఇలాంటివి పునరావృతం కానివ్వబోమని అమెజాన్‌ కంపెనీ చెప్పిందనుకోండి. నిజానికి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ ఆ పని చేయకుండా ట్విటర్‌ ద్వారా హెచ్చరించటం విశేషం.మన జాతీయ జెండాను అలా వుపయోగించటం చట్టరీత్యా నేరమే కాకుండా, మన మనోభావాలను దెబ్బతీసిన అంతర్జాతీయ వాణిజ్య సంస్ధకు హెచ్చరికలు చేసిన పాలకులు గాంధీ బొమ్మ స్ధానంలో నరేంద్రమోడీ చిత్రాన్ని పెట్టి మనోభావాలను గాయపరచటాన్ని ఏమనాలి?

    గాంధీని చంపిన గాడ్సే వారసులు తామరతంపరగా చెలరేగుతున్న ఈ తరుణంలో అలాంటి గౌరవం జాతిపితకు ఇస్తారని ఆశించటమే అసహజం. గాంధీ, గాంధీయిజానికి మేము వ్యతిరేకం, దాన్ని ఏడు నిలువుల లోతున పాతేస్తాం, అందుకే గాంధీని జనం మరిచిపోయేట్లు చేయదలచుకున్నాం అని నిజాయితీగా ప్రకటించి చేస్తే అదో పద్దతి. అలాగాక కొందరు అంటున్నట్లు చరఖా ముందు కూర్చొని గాంధీని అనుకరించి ఫొటోలు దిగితే నరేంద్రమోడీ మహాత్ముడు అవుతారా, ఆయనపై పడిన మచ్చలు తొలుగుతాయా ?