Tags

, , , , , , ,

Image result for IS really China became Globalisation Hero

ఎం కోటేశ్వరరావు

   అమెరికా, బ్రిటన్‌ వేరే అజండాలతో ముందుకు పోతుంటే దవోస్‌ నిర్వాహకులు చైనా కమ్యూనిస్టుపార్టీ అనే కొత్త హీరోను ముందుకు తెచ్చారు అంటూ ప్రపంచ ధనికుల పత్రిక ఫోర్బ్స్‌ శీర్షిక పెట్టింది. వర్తమాన పరిస్థితులలో ఇలా రాసినందుకు ప్రపంచంలోని కమ్యూనిస్టులు, వామపక్ష శక్తులు గర్వపడాలా లేక ప్రపంచ ధనికుల వేదికలో హీరోగా మారినందుకు లేదా మార్చినందుకు చైనా సోషలిజం గురించి అనుమానించాలా అన్న సందేహం ఎవరికైనా కలగటం సహజం. ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాలలో పాల్గొన్న తొలి చైనా అధ్యక్షుడిగా చరిత్రకెక్కిన గ్జీ జిన్‌పింగ్‌ ప్రపంచీకరణను గట్టిగా సమర్ధించినట్లు వార్తలలో వ్యాఖ్యలు వెలువడ్డాయి. వీటిని చూసిన తరువాత చూశారా మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం, చైనాలో పభుత్వ పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిజం, కమ్యూనిజం లేదు పాడు లేదు అని చెబుతున్నవారు మరింతగా రెచ్చి పోవచ్చు. రాబోయే రోజులలో చైనా కంటే మన దేశ అభివృద్ధి రేటు ఎక్కువగా వుంటుందని, అమెరికా తరువాత రెండో స్ధానంలో వున్న ‘మందుభాయీలను’ వెనక్కు నెట్టి ఆ స్ధానాన్ని ఆక్రమించాలని, పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రపంచంలో ఏ దేశాధినేత చేయని సాహసం చేశారని వంది మాగధుల పొగడ్తలు అందుకుంటున్న మన ప్రధాని నరేంద్రమోడీ ఈ సమావేశాల వైపు కన్నెత్తి చూడలేదు. మోడీగారు స్వదేశంలో కంటే విదేశాలలో ఎక్కువగా ఎందుకు వుంటున్నారన్న విమర్శకు విదేశీ పెట్టుబడుల సాధనకు అని సిద్దం చేసుకున్న సమాధానం చెప్పారు. దవోస్‌ అంటే ప్రపంచ పెట్టుబడిదారులందరూ చేరే కేంద్రం. అలాంటి కేంద్రాన్ని సందర్శిస్తే అన్ని దేశాల పెట్టుబడిదారులను అక్కడే కలుసుకోవచ్చని నరేంద్రమోడీకి తట్టలేదా లేదా చెప్పిన వారు లేరా ? కనీసం చంద్రబాబును చూసైనా నేర్చుకోవచ్చు. చంద్రబాబూ ఆ సమావేశాలకు పోయి నేనూ వెళితే నా గొప్పేముంటుంది అనుకున్నారా ? సరే చంద్రబాబు నాయుడు తన పరివారంతో అత్యంత ఖరీదైన ఈ జాతరకు క్రమం తప్పకుండా వెళ్ళటం పెద్దలతో కలిసిన ఫొటోలు, ప్రకటనలు గుప్పించటం, తడిచి మోపెడు ఖర్చును జనంపై రుద్దటం గత ఆనవాయితీ, షరా మామూలే అనుకోండి. రాజుల సొమ్ము రాళ్లపాలైందన్న సామెతను తిరగరాసుకుంటే ఆంధ్రుల సొమ్ము చంద్రబాబు పరివార విదేశీ యాత్రలపాలు అని చెప్పాల్సి వుంటుంది. గతంలో చేసిన యాత్రలు, దిగిన ఫొటోలు, అయిన ఖర్చులు, పొందిన హామీలు, సాధించిన పెట్టుబడులపై శ్వేత పత్రం సమర్పిస్తే అసలు బండారం బయట పడుతుంది.

Image result for wef 2017

    ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు స్విడ్జర్లాండ్‌లోని దవోస్‌లో ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశాలు జరిగాయి. ‘ ప్రతి స్పందక మరియు జవాబుదారీ నాయకత్వం ‘ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలను నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచంలో అమలు జరుగుతున్న విధానాల పర్యవసానాల గురించి నేతలు ప్రతిస్పందించటం లేదని, జవాబుదారీయుతంగా వ్యవహరించ కుండా ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారనే విమర్శలు నానాటికీ పెరుగుతున్న నేపధ్యంలో ఈ ఇతివృత్తాన్ని ఎంచుకున్నారని భావించాలి. ప్రపంచీకరణను మరింత ముందుకు తీసుకు పోయే క్రమంలో ఎదురువుతున్న సమస్యలను పరిష్కరించుకొనేందుకు ప్రపంచ బడా కార్పొరేట్‌ సంస్ధలు ఏర్పాటు చేసుకున్న వేదిక ఇది. కాల క్రమంలో కొన్ని మార్పులకు లోనైనప్పటికీ మౌలిక లక్ష్యం మారలేదు. ఏటా కనీసం ఐదువందల కోట్ల డాలర్లకు పైబడి లావాదేవీలు నిర్వహించే బడా కంపెనీలకు మాత్రమే దీనిలో సభ్యత్వం ఇస్తారు. ఎగ్జిబిషన్లలో ప్రవేశం పొందాలంటే ప్రవేశ రుసుం మాదిరి దీని సమావేశాలకు హాజరుకావాలంటే 68వేల స్విస్‌ ఫ్రాంక్‌లు (ఒక ఫ్రాంక్‌ మన రు 67.75 సమానం) అంటే 46లక్షల రూపాయలు చెల్లించాలి. ఇక ఎగ్జిబిషన్‌లోకి వెళ్లిన తరువాత జెయింట్‌ వీల్‌, రంగుల రాట్నం, ఫొటో తీయించుకోవటం ఇలా ప్రతిదానికి ఒక్కో రేటు చెల్లించాలి. దవోస్‌ సమావేశాలలో అలా అన్ని విభాగాలలో ప్రవేశం పొందాలంటే ఆరులక్షల ఫ్రాంకులు అంటే 40 కోట్ల 64లక్షల రూపాయలు చెల్లించాలి. అంత మొత్తం చెల్లించిన కంపెనీ సిఇఓ తనతో పాటు నలుగురిని తీసుకు వెళ్ల వచ్చు. అదనంగా తలకు 18వేల స్విస్‌ ఫ్రాంకులు చెల్లించాలి. చంద్రబాబు అండ్‌కోకు అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేదా ఆయన ద్వారా లబ్ది పొంద చూసే ఏ అనిల్‌ అంబానీయో, మరొక బడా కార్పొరేట్‌ కంపెనీయో ఆ ఖర్చులను భరించాల్సి వుంటుంది.

    దవోస్‌ వేదిక ప్రపంచీకరణను మరింత ముందుకు తీసుకుపోవాలని చూస్తుంటే ప్రపంచీకరణను వ్యతిరేకించే శక్తులు ఆ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయటం, నిరసనలు తెలపటం, పోటీ సమావేశాలు పెట్టటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కేవలం ఎనిమిదిమంది చేతులలో ప్రపంచంలోని 360 కోట్ల మంది పేదల దగ్గరున్న వాటికి సమానమైన సంపదలు కేంద్రీకృతమయ్యాయని ఆక్స్‌ఫామ్‌ సంస్ధ వెల్లడించటం దీనిలో భాగమే. అటువంటి అంతరాలు పెంచే ప్రపంచీకరణను కమ్యూనిస్టు చైనా వ్యతిరేకించాలి కదా ? ఆ పని చేయకుండా జిన్‌పింగ్‌ అలా మాట్లాడటం ఏమిటి ? అన్న ప్రశ్న వెంటనే వస్తుంది.

    ఐరోపా యూనియన్‌లో చేరితో ప్రయోజనం జరుగుతుందని అనుకున్నాము. అటువంటిదేమీ కనిపించటం లేదు కనుక బయటికి పోయి, విడిగా మా లావాదేవీలు మేము నిర్వహించుకుంటాం అంటూ జరిపిన ప్రజాభిప్రాయ సేకరణే బ్రెక్సిట్‌ అన్నది తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో, ఎన్నికలు ముగిసిన తరువాత మెక్సికో, చైనా తదితర దేశాల నుంచి చేసుకొనే దిగుమతులపై పది నుంచి 50శాతం వరకు పన్ను విధిస్తామని, అమెరికా వుద్యోగాలను బయటికి పంపే కంపెనీలపై చర్య తీసుకుంటామని ఇంకా అనేక రక్షణ చర్యలు తీసుకోవటం తద్వారా వుద్యోగాలు కల్పిస్తానంటూ ఎన్నికల సందర్భంగా అమెరికా వూరూ వాడా అంతా తిరిగి చెప్పారు. ఇంకా అనేక ధనిక దేశాలలో అలాంటి మాటలు మాట్లాడేవారి వైపే మొగ్గేందుకు జనం సిద్ధ పడుతున్నారన్నది పరిణామాల విశ్లేషణ.( ప్రపంచ సంస్ధలకు మన మార్కెట్‌ తెరిచిన మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని ముఖ్యమైన యుపిఏ ప్రభుత్వ విధానాలన్నింటినీ, రూపాయి విలువ పతనాన్ని బిజెపి పదేళ్లపాటు వ్యతిరేకించి జనంలో వున్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు అంతకంటే దారుణంగా ఆ విధానాలనే మరింతగా అమలు జరుపుతోంది, దానికి తగిన మూల్యం చెల్లిస్తుంది అది వేరే విషయం. ) నిజానికి ఇవన్నీ ప్రపంచ ధనిక దేశాలు ఇంతకాలం నుంచి చెబుతున్న ప్రపంచీకరణ , ప్రపంచ వాణిజ్య సంస్ధ, దాని తరఫున జరుగుతున్న చర్చల ప్రక్రియకు విరుద్దం.

    పెట్టుబడిదారీవర్గం, సామ్రాజ్యవాదులు వాణిజ్యం పేరుతో ప్రపంచం మీద వలసవాదాన్ని రుద్ధి ఎవరి బలం కొద్దీ వారు ప్రపంచాన్ని ముక్కలుగా చేసి పంచుకున్నారన్నది గత చరిత్ర. దానికి ప్రతిఘటన ఎదురుకావటం, చివరకు యుద్ధాలతో సామ్రాజ్యవాదులు చావు దెబ్బలు తిని తోక ముడిచారు. ఆ తరువాత తమ దోపిడీని కొనసొగించేందుకు రూపొందించిన నయా వలస లేదా నూతన దోపిడీ పద్దతులలో భాగమే ప్రపంచీకరణ. ఇది కమ్యూనిస్టులు కోరుకున్నది లేదా ముందుకు తెచ్చిన అవగాహన కాదు. ప్రపంచ కార్మికులారా ఏకం కండు అన్న పిలుపు దోపిడీ సమాజాన్ని కూలదోయటానికి, సమసమాజాన్ని నిర్మించటానికి తప్ప దోపిడీకి కాదు.

    బ్రిటీష్‌ వారి స్ధానంలో ప్రపంచ సామ్రాజ్యవాదుల, పెట్టుబడిదారుల నాయకురాలిగా ముందుకు వచ్చిన అమెరికా ఒకవైపు ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను ఆక్రమించుకోవటంతో పాటు మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలలో ఆవిర్బవించిన నూతన సోషలిస్టు రాజ్యాలను, వాటికి మార్గదర్శనం చేస్తున్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని దెబ్బతీయటం అనే లక్ష్యాన్ని కూడా ఎంచుకున్నారు. దానిలో భాగంగానే సోషలిస్టు దేశాలను దెబ్బతీయటానికి, వాటికి ఆధునిక పరిజ్ఞానం, అవసరమైన పెట్టుబడులు అందకుండా చేసి సోషలిజం విఫలమైంది, పెట్టుబడిదారీ విధానమే దిక్కు అని చెప్పేందుకు గతంలో పెట్టుబడిదారీ దేశాలు అనేక చర్యలు, ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.దానిలో భాగంగానే అమెరికన్లు దశాబ్దాల తరబడి క్యూబాను అష్టదిగ్బంధనం కావించారు. ఈ పూర్వరంగంలోనే చైనాతో సహా మిగిలిన సోషలిస్టు దేశాలు సోషలిస్టు సంస్కరణలకు తెరతీశాయి. వీటిపై కమ్యూనిస్టుపార్టీలు, లేదా వామపక్ష మేథావులలో కొన్ని భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. ఫోర్బ్స్‌ వంటి పత్రికలు చైనా అధ్యక్షుడి ప్రసంగానికి ప్రపంచీకరణను సమర్ధించే హీరోగా వర్ణిస్తే చైనాలో అంతర్భాగంగా వుంటూ పెట్టుబడిదారీ వ్యవస్ధను కలిగి వున్న హాంకాంగ్‌ మీడియా విలన్‌గా పేర్కొన్న విషయాన్ని గమనించాలి.

   చైనా సంస్కరణలతో నిమిత్తం లేకుండానే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనే నూతన పరిస్థితులలో మార్కెట్లను స్వాధీనం చేసుకొనేందుకు నూతన ఎత్తుగడలతో సామ్రాజ్యవాదులు నాంది పలికారు. దాని పర్యవసానమే బ్రెట్టన్‌ వుడ్‌ కవలలుగా పిలుస్తున్న ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ. అవి రెండూ అంతర్జాతీయ ద్రవ్య విధానాన్ని రూపొందించాయి. ఆ విధానంలో అంతర్భాగంగా వుండే వాణిజ్యం సాఫీగా సాగేందుకు, పెట్టుబడులకు రక్షణ కల్పించటంతో పాటు వాణిజ్య సరళీకరణకు గాను వివిధ దేశాలు అప్పటి వరకు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలను సడలించేందుకు వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందం( జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ టారిఫ్‌ (గాట్‌)పై 23 దేశాలు జెనీవాలో ఏడు నెలలపాటు చర్చలు జరిపి 1947 అక్టోబరు 30న సంతకాలు చేశాయి. తరువాత దాని అమలులో తలెత్తే సమస్యల పరిష్కారానికి చర్చలు ఎవరు ప్రారంభిస్తే లేదా ఎక్కడ ప్రారంభమైతే ఆ దఫా చర్చలు అని పిలిచేవారు. అలా ఫ్రాన్స్‌లోని అనెసీలో రెండవ దఫా చర్చలు 1949లో 34 దేశాలతో ప్రారంభమై ఐదు నెలల్లో ఐదువేల సరకులపై పన్నుల తగ్గింపునకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. 1950 టొరొక్వే(బ్రిటన్‌) ఎనిమిదినెలలు, 1956 జనీవా-2 ఐదునెలలు, 1960 దిలియాన్‌(అమెరికా మంత్రి) 11నెలలు, 1964 కెన్నడీ(అమెరికా అధ్యక్షుడు) 37నెలలు, 1973 టోక్యో 74నెలలు, 1986 వురుగ్వే 87నెలల చర్చల తరువాత ఒప్పందాలు కుదిరాయి. ఆ తరువాత ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటివో) వునికిలోకి వచ్చింది. దాని ఆధ్వర్యంలో 2001లో ప్రారంభమైన దోహా చర్చలు 16 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఎప్పుడు వస్తాయో తెలియని స్ధితి. దీనికి కారకులు ఎవరు? మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌, మా ఇంటి కొస్తూ మాకేం తెస్తావ్‌ అంటున్న ధనిక దేశాల అత్యాశ, పెట్టుబడిదారీ వ్యవస్ధలో పెరుగుతున్న సంక్షోభమే అన్నది కొందరి అభిప్రాయం.

   గాట్‌ ఒప్పందం చేసుకున్న తొలి 23 దేశాలలో చైనా ఒకటి అయినప్పటికీ ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన ఏడాదికి చైనాలో కమ్యూనిస్టుల నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని 1970దశకం వరకు ఐక్యరాజ్యసమితి గుర్తించలేదు. అందువలన ప్రపంచ వాణిజ్య చర్చలలో అది భాగస్వామి కాలేదు. 1978లో చైనా సంస్కరణలకు తెరతీసి విదేశీ పెట్టుబడులు, సంస్థల ప్రవేశానికి వీలు కల్పించిన తరువాత 1986లో పరిశీలక హోదాతో అనుమతించారు. తరువాత మిగతా ఏ దేశానికీ లేని విధంగా కఠినమైన షరతులు విధించి 2001లో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనాకు పూర్తి సభ్వత్వం ఇచ్చారు.ఈ పూర్వరంగంలో చైనా అధ్యక్షుడి మాటలను పరిశీలించాల్సి వుంటుంది.

     పిల్లి నల్లదా తెల్లదా అని కాదు చూడాల్సింది అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది కీలకం అన్న చైనా సామెత మాదిరి తమ దేశంలోని 95 కోట్ల మంది జనాభా(1978)కు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమదైన లక్షణాలతో కూడిన సోషలిస్టు సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రకటించింది. అప్పటికే మార్కెట్లకోసం అర్రులు చాస్తున్న అమెరికా, తదితర పెట్టుబడిదారీ దేశాలు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూనే, అక్కడి సోషలిస్టు వ్యవస్ధను కూడా దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాయి. అందుకు చైనా సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌సియావో పింగ్‌ ఒక మాట చెప్పారు. మంచి గాలి, వెలుతురు కోసం కిటికీలను తెరుస్తాము. వాటితో పాటు ఈగలు, దోమలు కూడా వస్తాయి. అయితే వాటిని ఎలా అదుపు చేయాలో మాకు తెలుసు అన్నారు. దానికి అనుగుణ్యంగా తియన్‌మెన్‌ స్క్వేర్‌ పేరుతో జరిగిన కుట్రను చైనా ప్రభుత్వం వమ్ము చేసింది.

   బ్రిటీష్‌ వారు తమ లాభాల కోసం వేసుకున్న రైళ్లలో వారిని దేశం నుంచి పంపివేసేందుకు స్వాతంత్య్ర పోరాటం సాగించిన మహాత్మాగాంధీకూడా ప్రయాణించారు. అవే రైళ్లు గాంధీతో పాటు ఆయన ప్రాణాలు తీసిన హిందూ మతోన్మాది గాడ్సేను కూడా మోశాయన్నదీ తెలిసిందే. అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ అన్నట్లుగా ప్రపంచీకరణను ధనిక దేశాలు ఒకందుకు ప్రారంభిస్తే దాని ద్వారా వచ్చిన నూతన అవకాశాన్ని చైనా, వియత్నాం సోషలిస్టు దేశాలు తమ జనాభా జీవన ప్రమాణాలు పెంచేందుకు వుపయోగించుకున్నాయి. ప్రపంచీకరణ విధానాల ద్వారా తమకు అందుబాటులోకి వచ్చిన చైనా మార్కెట్‌లో లాభాలు పిండుకోవాలని ప్రపంచ ధనిక దేశాలు ఆశించాయి. తమ దగ్గర వున్న అపార శ్రమశక్తిని, ప్రజానుకూల యాజమాన్య పద్దతులను పెట్టుబడిగా పెట్టి జనం కోసం పని చేయాలని కమ్యూనిస్టులు భావించారు. నలభై సంవత్సరాల లావాదేవీలు లేదా అనుభవాన్ని మదింపు చేస్తే తేలిందేమిటి? పశ్చిమ దేశాల ఎగుమతి మార్కెట్‌పై ఆధారపడిన చైనా అదిరిపోయే అభివృద్ది రేటుతో ముందుకు పోయింది. దాని నుంచి దిగుమతులు చేసుకున్న పశ్చిమ దేశాల కార్పొరేట్‌ శక్తులు లాభాలు ఆర్జించాయి. అందుకే మన దేశంలోని కార్పొరేట్‌ శక్తులు కూడా చైనా నుంచి లబ్దిపొందాలని చూస్తున్నాయి. అందుకే వాటికి ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్‌, బిజెపి వంటి జాతీయ పార్టీలతో పాటు చంద్రబాబు, కెసిఆర్‌ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు కూడా చైనా మోజుతో యాత్రలు చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీతో అధికారిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. అమెరికా నుంచి అరువుతెచ్చుకున్న పద్దతులతో ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం ఒకవైపు జనంలో కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతలను రెచ్చగొడుతూనే మరోవైపు అధికారికంగా ఆ మడి బట్టలను విప్పి గట్టున పెట్టి చైనాతో సంబంధాలను కొనసాగించక తప్పనివిధంగా కార్పొరేట్లు దాని మెడలను వంచాయి.

   పెట్టుబడిదారీ విధాన పంధాను అనుసరిస్తున్న దేశాల పాలకవర్గాలు ప్రపంచీకరణ పేరుతో కార్పొరేట్లను మాత్రమే పెంచి తమ కార్మికవర్గానికి హాని చేసే విధానాలు అనుసరిస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం అదే. అందుకే అక్కడ ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలను వ్యతిరేకించిన శక్తుల వెనుక జనం సమీకృతమయ్యారు. కొన్ని మినహాయింపులతో సోషలిస్టు విధానాలను అనుసరిస్తున్న చైనా అదే ప్రపంచీకరణను తన కార్మిక వర్గ జీవన ప్రమాణాల మెరుగుదలకు వుపయోగిస్తున్నది. అందుకే ధనిక దేశాలలో తలెత్తిన సంక్షోభ ప్రభావం పడి కొంత మేర అభివృద్ధి వేగం తగ్గింది తప్ప సంక్షోభంలో పడలేదు. అయినప్పటికీ కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. చైనాలో బిలియనీర్లు ఎలా అభివృద్ధి చెందుతున్నారు? కార్మికవర్గాన్ని దోపిడీ చేయకుండా అది ఎలా సాధ్యం అవుతుంది? వారు చైనా సోషలిస్టు వ్యవస్ధలను కొనసాగనిస్తారా? మరో సందర్భంలో వాటి గురించి చర్చించవచ్చు.ప్రపంచీకరణ పేరుతో మన వంటి దేశాలలో జనంపై రుద్దుతున్న భారాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక వర్గం పోరాటాలు చేయాల్సిందే. దానిలో ఎలాంటి రాజీ వుండనవసరం లేదు. చైనాలో కమ్యూనిస్టులు అధికారంలో వున్నారు. ప్రపంచీకరణ ఫలితాలను జనాలకు అందిస్తున్నారు. ఒకే దేశం రెండు వ్యవస్ధల పేరుతో 2050 వరకు హాంకాంగ్‌, మకావో ప్రాంతాలలో పెట్టుబడిదారీ వ్యవస్ధను కొనసాగనిస్తామని వాటి విలీనం సందర్భంగా ఒప్పందం చేసుకున్నారు కనుక, సంస్కరణలలో భాగంగా పరిమితంగా అయినా ప్రయివేటు పెట్టుబడులను అనుమతించింది కనుక వారు కూడా లబ్ది పొందుతూ వుండవచ్చు. ఆ విధానాల వలన తలెత్తే సమస్యలతో రాబోయే రోజులలో ఏం చేస్తారన్నది చైనీయుల అంతర్గత వ్యవహారం.

   చైనా అధ్యక్షుడు దవోస్‌ సమావేశంలో రక్షణాత్మక చర్యల గురించి చెప్పిన అంశాలు తన వరకు వచ్చేసరికి అమలు జరపటం లేదని చైనాలో అంతర్భాగమైనా పెట్టుబడిదారీ వ్యవస్ధను కలిగి వున్న హాంకాంగ్‌ నుంచి వెలువడే పత్రికలు, అక్కడి పెట్టుబడిదారీ మేథావులు జన్‌పింగ్‌ను ఒక విలన్‌గా వర్ణిస్తున్నారు. తమ దేశానికి చెందిన సంస్ధలను విదేశాలలో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్న చైనా ప్రభుత్వం స్వదేశంలో విదేశీ పెట్టుబడులపై అనేక ఆంక్షలను విధిస్తున్నదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందచేస్తూ స్ధానిక కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలనే షరతులు పెడుతున్నదని వారు విమర్శిస్తున్నారు.

   దవోస్‌ సమావేశాలలో చైనా అధ్యక్షుడు ప్రపంచీకరణపై సిద్ధాంత చర్చ చేయలేదు. ప్రస్తుతం అమలులో వున్న దానికి భిన్నంగా రక్షణాత్మక చర్యలలో భాగంగా ఎవరైనా వాణిజ్య యుద్ధానికి తలపడితే విజేతలంటూ ఎవరూ వుండరన్నది ప్రధాన హెచ్చరిక. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడే విధంగా లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. ఆకస్మికంగా వాటిలో మార్పులు చేస్తే అన్ని దేశాలూ నష్టపోతాయి. అంటే బయట గాలీ, వెలుతురు వుంటే ఎవరైనా అవి లేని ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూస్తే ఎలా వుంటుందో రక్షణాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా అలాగే వుంటుందని గ్జీ హితవు చెప్పారు. ద్రవ్య పెట్టుబడి అధిక లాభాల కోసం వెంటపడటం, ఏ మాత్రం క్రమబద్దీకరణ లేకపోవటం వల్లే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు మూలం అన్నారు. తాము ప్రపంచీకరణకు కట్టుబడి వున్నామని, మరింతగా క్రమబద్దీకరణకు ప్రయత్నిస్తున్నామని, పెట్టుబడులు పెట్టేవారికి మెరుగైన సమాన అవకాశాలు కల్పిస్తామని అన్నారు. తమది కమ్యూనిస్టు నమూనా అంటూ అందరికీ సరిపోయే ఒకే పద్దతి లేదన్నారు. సముద్రం మధ్యలో తుపానులొస్తే వెనక్కు తిరిగిపోయే అలవాటును ప్రోత్సహించకూడదని చెప్పారు.

   అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీట అంటూ రక్షణాత్మక చర్యలు చేపడితే అమెరికా-చైనా రెండూ నష్టపోతాయని, అందువలన మాటలు తప్ప రెండు దేశాలూ రాజీపడతాయని ఐరోపాలోని వారు భావిస్తున్నారు. చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వాణిజ్య యుద్ధ పర్యవసానాల గురించి హెచ్చరించింది. చైనా తనకు కావాల్సిన వ్యవసాయ వుత్పత్తులను పెద్ద మొత్తంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే, చైనా నుంచి అమెరికన్లు దుస్తులు, బొమ్మలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకొని లబ్ది పొందుతోంది. అమెరికాలో చైనా వాణిజ్యం, ఇతర ఆర్ధిక లావాదేవీల కారణంగా 26లక్షల వుద్యోగాలు కల్పిస్తున్నదని, అమెరికా జిడిపికి 1.2శాతం సమకూర్చిందని 2015 నివేదికలో అమెరికా-చైనా వాణిజ్య మండలి నివేదిక పేర్కొన్నది. చైనా నుంచి వస్తు దిగుమతుల కారణంగా అమెరికాలోని ప్రతి కుటుంబానికి సగటున ఏడాదికి 850 డాలర్లు ఆదాఅవుతున్నాయని ఒక విశ్లేషణ తెలిపింది. అన్నింటి కంటే అనేక అమెరికన్‌ కంపెనీలు చైనాలో ఫ్యాక్టరీలను పెట్టి తమకు అవసరమైన వస్తువులను చౌకగా తయారు చేసుకొని తిరిగి తమ దేశానికే దిగుమతి చేసుకుంటున్నాయి. అందువలన ట్రంప్‌ చెప్పినట్లు చైనా నుంచి వచ్చే వాటిపై దిగుమతి సుంకం విధిస్తే నష్టపోయే వాటిలో అమెరికన్‌ కంపెనీలు కూడా వుంటాయని గ్లోబల్‌ టైమ్స్‌ విశ్లేషకులు హెచ్చరించారు. అదే విషయాన్ని దవోస్‌లో చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్‌పింగ్‌ సామెతలతో, తమలపాకులతో కొట్టినట్లుగా చెప్పారు. దానిని గ్రహించకుండా ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి దిగితే అది మన దేశంతో సహా ప్రపంచమంతటికీ తీరని నష్టాలకు దారి తీస్తుంది.