Tags

, ,

ఎం కోటేశ్వరరావు

    1860లో అమెరికా రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్‌ చరిత్ర సృష్టించాడు. ఆయన బానిసత్వాన్ని వ్యతిరేకించాడు. వైట్‌ హౌస్‌లో ఆయన ఆశీనుడు కావటాన్ని సహించలేని దక్షిణాది రాష్ట్రాలలోని బానిసల యజమానులు ప్రత్యేక దేశ ఏర్పాటును ప్రకటించి అంతర్యుద్ధానికి కారకులయ్యారు. రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తిరుగుబాటుదార్లు లొంగిపోయి అంతర్యుద్ధం ముగిసింది అనుకుంటున్న తరుణంలో బానిసత్వాన్ని సమర్ధించే ఒక వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. ఆదే రిపబ్లికన్‌ పార్టీ తరఫున తాజాగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీస్వీకారం చేస్తున్న సమయంలో అమెరికాతో సహా అన్ని ఖండాలలో నిరసన ఎదుర్కొన్న వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వదరుబోతులకు అమెరికా సమాజం పెట్టింది పేరు. ఇంతవరకు అలాంటి వారెవరూ అధ్యక్ష స్ధానంలో కూర్చోలేదు. డోనాల్ట్‌ ట్రంప్‌తో అది కూడా జరిగిపోయింది. మహిళలు, కార్మికులకు, సామాన్య జనానికి, ముస్లింలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసి ఒక ఫాసిస్టుగా ముద్రపడి ప్రపంచ వ్యాపితంగా నిరసనలకు కారకుడయ్యాడు. అమెరికా వంటి దేశాలలో సాధారణ నిరసన ప్రదర్శనలంటే బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని కొన్ని వందల మంది వీధులలోకి రావటం తప్ప సంఖ్య ఎక్కువగా వుండదు. యుద్ధవ్యతిరేక వుద్యమం వంటి సందర్భాలలోనే లక్షల సంఖ్యలో హాజరైన వుదంతాలు వున్నాయి. అలాంటిది ఇప్పుడు ఆ స్ధాయిలో ముఖ్యంగా మహిళలు లక్షల మంది వీధులలోకి వచ్చి అనేక నగరాలలో ప్రదర్శనలు జరిపారు. ఒక వ్యక్తి ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి దేశాధినేత ఎన్నికైనట్లు ప్రకటించగానే అనేక దేశాలలో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తటం తెలిసిందే. డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు వున్నప్పటికీ అమెరికన్‌ సమాజం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాలు, తీరు తెన్నులను చూసి ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే నిరసనలు వ్యక్తం చేశారు. అంతకంటే పెద్ద స్ధాయిలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాపితంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావటం బహుశా ఆధునిక ప్రపంచ చరిత్రలో అమెరికా అధిపతి డోనాల్డ్‌ ట్రంప్‌తోనే ప్రారంభమై వుండాలి.ట్రంప్‌ తన పదవీకాలంలో ఎలా ప్రవర్తిసాడు, ఏవిధంగా ముగుస్తుందన్నది ఆసక్తికరం.

Image result for donald trump oath taking

   ప్రజాస్వామ్యం అంటే అమెరికాలో మాత్రమే వుంటుందన్నది కొందరి ప్రగాఢ నమ్మకం. అర్హత కలిగిన ఓటర్లలో కేవలం 25శాతం మాత్రమే ట్రంప్‌కు ఓటు చేశారు. జనం వేసిన ఓట్లు ట్రంప్‌ కంటే ఆయన ప్రధాన ప్రత్యర్ధిగా వున్న హిల్లరీ క్లింటన్‌కు 28లక్షలు అదనంగా వచ్చాయి. కానీ అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్ట్రరల్‌ కాలేజీలో ఎక్కువ స్ధానాలు రావటంతో ట్రంప్‌ గెలిచాడు.ఇదీ అక్కడి ప్రజాస్వామ్యం తీరు. ప్రపంచీకరణ గురించి ఇంతకాలం సుద్దులు చెప్పిన వారు ఇప్పుడు అమెరికా తరువాతే మిగతా దేశాలు (అమెరికా ఫస్ట్‌ ) అని ట్రంప్‌ మాట్లాడుతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్ధితిలో పడిపోయారు. అలాంటి పెద్ద మనిషి ప్రమాణ స్వీకారం చేస్తుంటే అసాధారణరీతిలో తెలుగు మీడియా వార్తలు ఇచ్చిన తీరు ప్రమాదకర పోకడలను తెలియ చేస్తోంది.ఫాసిస్టులు జనం కోసం కబుర్లు చెప్పి ఆచరణలో కొద్ది మంది తమ చుట్టూ వుండే కుటుంబాలు, బినామీలు, కార్పొరేట్లు, విధేయులకు ఆచరణలో వుపయోగపడతారు. ఎన్నికల ప్రచారంలో అమెరికన్ల వుద్యోగాలు, వుపాధి వంటి అంశాల గురించి, ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసలు వచ్చిన వారు స్ధానికుల వుపాధిని దెబ్బతీస్తున్నారని, ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులపై పెద్ద మొత్తంలో పన్నులు, బయటి వారికి వుపాధి కల్పించే స్ధానిక పెట్టుబడిదారులపై చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ చెప్పటం జనం ఓట్ల కోసమే. ఇప్పుడు అధికారం స్వీకరించారు గనుక కార్పొరేట్లు, విధేయులు, కుటుంబ సేవ ప్రారంభిస్తారు. అత్యంత ధనికులు, పేరు మోసిన కార్మిక వ్యతిరేకులు, జాత్యహంకారులతో కూడిన పచ్చి మితవాద ప్రముఖులందరినీ తన మంత్రులుగా, సలహాదారులుగా నియమించుకొని నాంది పలికారు. ఎన్నికల ప్రచారంలో మెక్సికో, చైనా నుంచి వలసలు వచ్చిన వారి గురించి, ముస్లింలు, మీడియా, కార్మిక సంఘాల గురించి అవాకులు చెవాకులు పేలిన ట్రంప్‌ పదవీబాధ్యతల స్వీకారం సందర్భంగా వాటిని ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా పరోక్షపద్దతులలో తన మద్దతుదారులకు అర్ధమయ్యే రీతిలో మాట్లాడి సంతృప్తి పరచారు. అమెరికా వస్తువులనే కొనాలి, అమెరికన్లకే వుద్యోగాలివ్వాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఒక పెద్ద రియలెస్టేట్‌ వ్యాపారి. తాజమహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరని శ్రీశ్రీ చెప్పినట్లుగా విదేశాల నుంచి వలస వచ్చి అమెరికా రికార్డులలో నమోదు కాకుండా తక్కువ వేతనాలకు పని చేసిన వారినే తాను నిర్మించిన అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, కార్యాలయాల నిర్మాణానికి వుపయోగించుకున్నాడన్నది జగమెరిగిన సత్యం. ఇక తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన వారందరూ ధరించిన కొత్త సూట్లు, కోట్లు, టైలు ఒకటేమిటి సర్వం కారు చౌకగా విదేశీ కార్మికులు తయారు చేస్తే ట్రంప్‌ స్వంత కంపెనీలు దిగుమతి చేసుకున్న సరుకే. ఇలాంటి వ్యక్తిని అమెరికన్లు ఎందుకు ఎన్నుకున్నారన్న ప్రశ్న తలెత్తటం సహజం. సంక్షోభంలో వున్న సమయంలో కార్పొరేట్‌ మీడియా పచ్చి మితవాదులను ఆకాశానికి ఎత్తుతుంది, ఓటర్లను ప్రభావితం చేస్తుంది, కార్పొరేట్‌ శక్తులు కూడా తమ ప్రయోజనాలను నిర్ధాక్షిణ్యంగా కాపాడేవారిని ఎంచుకుంటాయి. ప్రపంచ మంతా ఫాసిస్టు హిట్లర్‌ను వ్యతిరేకిస్తే 1940 అధ్యక్ష ఎన్నికలలో హిట్లర్‌ అనుకూల లిండ్‌ బెర్గ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకొని ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ను ఓడించారు. అందువలన వివిధ కారణాలతో జనం కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటారు. గత 20 సంవత్సరాలుగా అమెరికా సమాజంలో ముఖ్యంగా రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదార్లుగా వున్న వారిలో నియతృత్వ ధోరణులు పెరుగుతున్నాయని పరిశోధనలు వెల్లడించాయి. శ్వేత జాతీయల పార్టీగా అది తయారైంది. గత ఎన్నికలలో ట్రంప్‌కు తోడ్పడిన అంశాలలో అదొకటిగా పరిశీలకులు చెబుతున్నారు.

Protesters at the Women's March in Washington

   ట్రంప్‌ పదవీ బాధ్యతల స్వీకారం సందర్భంగా ప్రపంచవ్యాపితంగా ఆరువందల నగరాలలో లక్షలాది మంది ప్రదర్శనలు చేసినట్లు ఒక వార్తా సంస్ధ కథనం. అమెరికాలో జరిగిన ప్రదర్శనలలో ఎంత మంది పాల్గొన్నారనేదానిపై తమ స్వంత లెక్కలు వేయలేదని, ప్రభుత్వ శాఖలు వేసిన అంచనాలను అందచేస్తున్నామని సిఎన్‌ఎన్‌ పేర్కొన్నది. వాషింగ్టన్‌ నగరంలో అతి పెద్ద ప్రదర్శన జరిగింది. అత్తమీద కోపం దుత్త మీద చూపారన్న సామెత మాదిరి తనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న జనంపై విమర్శలకు దిగితే మరింతగా తన పరువు పోయే అవకాశం వున్నందున ఆ కోపాన్ని మీడియాపై ప్రదర్శించినట్లుగా వుంది. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రమాణాస్వీకారోత్సవంతో పోల్చి తన కార్యక్రమానికి జనం తక్కువగా వచ్చారని, కొన్ని ప్రాంతాలు ఖాళీగా వున్నాయని మీడియా రాయటం, చూపటంపై మరుసటి రోజు ట్రంప్‌ మండి పడ్డారు. సిఐఏ కార్యాలయ సందర్శన సందర్శన సందర్భంగా మాట్లాడుతూ భూమ్మీద నిజాయితీ లేని మనుషులు ఎవరంటే జర్నలిస్టులే అంటూ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పది, పదిహేను లక్షల మంది వచ్చినట్లుగా తనకు కనిపించిందని ట్రంప్‌ చెప్పారు. అయితే వాషింగ్టన్‌ మెట్రో రైళ్లలో ప్రయాణించిన వారి గురించి నమోదైన వివరాల ప్రకారం ఐదులక్షలకు పైగా వుండగా బరాక్‌ ఒబామా తొలిసారి ప్రమాణస్వీకారం సందర్భంగా పదకొండు లక్షలు, రెండవ సారి ఎనిమిది లక్షల వరకు ప్రయాణించినట్లు నమోదైంది. ఒక పత్రిక ట్రంప్‌ సభకు రెండున్నరలక్షల వరకు వచ్చినట్లు పేర్కొన్నది.దానిపై ట్రంప్‌ వ్యాఖ్యానిస్తూ అది అబద్దం తప్ప తప్పుకాదు, అంతకంటే ఎక్కువే వచ్చారు అన్నారు. ప్రమాణ స్వీకార సభకంటే నిరసన ప్రదర్శనకు ఎక్కువ మంది రావటం, మీడియాలో ప్రచారం రావటం ట్రంప్‌ ఆగ్రహానికి అసలు కారణం. ట్రంప్‌ అనుగ్రహం పొందే యత్నంలో భాగంగా అధ్యక్ష భవన సిబ్బంది అధిపతి రెయిన్స్‌ ప్రైబస్‌ కూడా మీడియాపై దండెత్తారు. ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ట్రంప్‌ను చట్ట విరుద్ధ అధ్యక్షుడిగా చిత్రించే మానసిక స్ధితికి మీడియా గురైందని దాన్ని చూస్తూ వూరుకోబోమని, ప్రతిరోజు చీల్చి చెండాడుతామని బెదిరింపులకు దిగారు. బరాక్‌ ఒబామా 2009 ప్రమాణ స్వీకార ఫొటోలను చూస్తే ట్రంప్‌ కార్యక్రమానికే ఎక్కువ మంది వచ్చినట్లు చూడవచ్చన్నారు. ట్రంప్‌ పత్రికా కార్యదర్శి సియాన్‌ స్పైసర్‌ మాట్లాడుతూ ఏడు లక్షల 20వేల మంది ప్రమాణ స్వీకారనికి వచ్చారంటూనే ఎవరి దగ్గరా లెక్కలు లేవన్నారు. స్పైసర్‌ లెక్కను అగ్రశ్రేణి మీడియా సంస్ధలు తప్పుడు లెక్కలుగా వర్ణించాయి. స్పైసర్‌ రుజువు చేయదగిన అవాస్తవాలు చెబుతున్నారని ఒక చర్చా కార్యక్రమంలో యాంకర్‌ చెప్పటంతో ట్రంప్‌ సహాయకురాలు కెలీయానే కాన్వే తమ ప త్రికా కార్యదర్శిని అలా సంబోధిస్తే మీడియాతో సంబంధాల గురించి పునరాలోచించాల్సి వుంటుందని హెచ్చరించారు. వచ్చిన జనం నిజంగా ఎంత మందో లెక్క వేయటానికి అవకాశం లేదని ఆమె వ్యాఖ్యానించటంతో ఒక జర్నలిస్టు నవ్వాడు. దానికామె స్పందిస్తూ మీరు నన్ను చూసి నవ్వవచ్చు, మమ్మల్ని మీడియా ఎలా చూస్తున్నదో చెప్పటానికి మీ నవ్వే చిహ్నం అని వుడుక్కున్నారు. ఇలాంటి ట్రంప్‌, పరివార చర్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయన్నది వెండి తెరపై చూడాల్సిందే.