ఎం కోటేశ్వరరావు
అధికారంలో వున్న వారి మాటలకు అర్ధాలే వేరు ! పెద్ద పెద్ద జలాశయాలకు పడే గండ్లు తొలుత చిన్నవిగానే వుంటాయి, తరువాత పూడ్చలేని విధంగా తయారవుతాయి. అమెరికా అధ్య్ష పీఠంపై కూర్చున్న డోనాల్డ్ ట్రంప్ ఏ రోజు ఏం మాట్లాడతారో, ఏ పిచ్చి పనులు చేస్తారో తెలియని స్ధితి. ఆతగాడి చర్యలు ఎటు దారితీస్తాయో వెంటనే వూహించటం కష్టం. పాలకవర్గాలు తాము ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని జనం మీదో, మరొక దేశం మీదో నెట్టాలని నిర్ణయించుకుంటే రెచ్చగొట్టుడు, పిచ్చిపనులు చేయటం గత చరిత్ర అనుభవం. ప్రస్తుతానికి రెండు దృశ్యాలను వూహించ వచ్చు. ఒకటి, ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసిన ట్రంప్ తనకు ఓటు వేసిన జనాన్ని సంతృప్తి పరచాలంటే ఏదో ఒకటి చేస్తున్నట్లు నటించటం అవసరం కనుక ఆ స్క్రిప్టులో భాగంగా ఇలా చేస్తుండి వుండాలి. రెండవది, ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర వడిదుడుకులను ఎదుర్కొంటోంది, దానికి పెద్ద దిక్కుగా వున్న అమెరికా తన స్ధాయికి తగిన రీతిలో సమస్యలను ఎదుర్కొంటోంది. అందువలన తన బలాన్ని వుపయోగించి ప్రపంచాన్ని తన చెప్పుచేతల్లో, తన పెరటి దొడ్డిగా మార్చుకొనేందుకు పూనుకొని వుండి వుంటే ట్రంప్‌ను ఒక పావుగా వుపయోగించి తన జూదాన్ని అయినా ప్రారంభించి వుండాలి. ఏది అనేది కొద్ది వ్యవధిలోనే తేలిపోతుంది. ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపై ప్రయాణ నిషేధం విధిస్తూ ట్రంప్ శుక్రవారం నాడు ఒక వుత్తరువును జారీ చేశాడు. శనివారం నాడు ఆ దేశాల నుంచి వచ్చిన వారు అమెరికా గడ్డపై అడుగుపెట్టకుండా అధికారులు అడ్డగించటంతో వచ్చిన వారు పలు విమానాశ్రయాల్లో నిరసనలకు దిగారు. వారం రోజుల పాటు ఆ వుత్తరువులను నిలిపివేయాలని శనివారం నాడు (జనవరి 28న) న్యూయార్క్ కోర్టు ఆ నిషేధాన్ని ఆదేశాలు జారీ చేసింది. మరికొన్ని రాష్ట్రాల కోర్టులు కూడా ఇదే మాదిరి ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అమెరికా పౌర హక్కుల యూనియన్ (ఎసిఎల్‌యు) న్యూయార్క్‌లోని కెనడీ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ఇరాకీ ప్రయాణీకుల తరఫున కోర్టుకు వెళ్లినప్పటికీ తాను జారీ చేసిన వుత్తరువు అమెరికా అంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నది. కొంత మంది ట్రంప్‌కు ఇది తొలి ఎదురు దెబ్బ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ‘మన దేశానికి బలమైన సరిహద్దులు మరియు తీవ్రమైన నిఘా వుండాలి. ఇప్పుడు ఐరోపా, ప్రపంచమంతటా వాస్తవంగా ఏం జరుగుతోందో చూడండి-భయం కరమైన గందర గోళం ‘ అంటూ ఆదివారం వుదయం ట్వీట్ ద్వారా వ్యాఖ్యానించాడు. అంతకు ముందు ఏడు దేశాల ప్రయాణీకులపై ఆంక్షలు విధించాను తప్ప ముస్లింల మీద విధించిన నిషేధం కాదంటూ ఎప్పటి నుంచో మన దేశం గట్టి నిఘా వేసి వుండాల్సింది, రాబోయే రోజులలో ఆ పని చేయబోతున్నాం అంటూ ఐఎస్‌ను ఓడించేందుకు 30రోజుల్లోగా ఒక పక్కా ప్రణాళికను తయారు చేయాలని ట్రంప్ ఆదేశించాడు.
అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చున్నా నడిపేది అక్కడి బడా కార్పొరేట్లు తప్ప మరొకరు కాదు. నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం చూస్తుంటే తలతిక్క రాజు పనుల మాదిరి కనిపిస్తున్నాయి. ఎన్నికల సందర్బంగా ఏమి చెప్పినా కార్పొరేట్లకు ఇబ్బంది లేదు, ఓట్ల కోసం పడే పాట్లుగా వినోదం చూస్తారు. అధికారానికి వచ్చిన తరువాత ఎలా వ్యవహరిస్తారనేదే వారికి ముఖ్యం. ఆ రీత్యా చూసినపుడు ట్రంప్ పిచ్చి ప్రకటనలు ఎత్తుగడగా కేవలం జనాన్ని మభ్యపెట్టటానికేనా అని కూడా అనుమానించాల్సి వుంటుంది. తమ వస్తువులు, పెట్టుబడులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎక్కడ బడితే అక్కడ ప్రవేశించటానికి ఎక్కడ ఎలా తిరిగినా మా దొడ్లో ఈనితే చాలు అన్నట్లుగా ఏ దేశంలో తిరిగినా చివరకు తమ దొడ్లలో లాభాలను పదిల పరుచుకోవటానికే కార్పొరేట్లు సరిహద్దులు, ఆటంకాలు లేని ప్రపంచీకరణ భావనను ముందుకు తెచ్చారు. ఐరోపా యూనియన్ పేరుతో ఇప్పటికే ఐరోపా ధనిక దేశాలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఇంకా ముందుకు పోవటం ఎలా అన్నది దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ స్ధితిలో అసలు సరిహద్దులు లేని దేశం ఒక దేశమా అంటూ ట్రంప్ ఐరోపా యూనియన్, ప్రపంచం ముందు ఒక కొత్త సవాలును విసిరారు.
తెనాలి రామకృష్ణ సినిమాలో తాను నియోగినని, ఎలా కావాలంటే అలా వినియోగించుకోవచ్చని రామకృష్ణ పాత్రధారి చేత చెప్పించారు. ( ప్రాసకోసం వుపయోగించారు తప్ప నియోగులు అలాంటి వారని నేను అనుకోవటం లేదు ) పెట్టుబడిదారులు మాత్రం అలాంటి వారే. తమకు అవసరాలకు అనుగుణ్యంగా మాట్లాడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. వారు తమకు అవసరం అనుకుంటే వున్న చోట గోడలు పడగొడతారు, లేని చోట కొత్త గోడలు కడతారు. పాతిక సంవత్సరాల క్రితం కమ్యూనిజాన్ని కూల్చివేశామని ప్రకటించిన అమెరికా పాలకులు దానికి చిహ్నంగా బద్దలు కొట్టించిన బెర్లిన్ గోడను చూపారు. దాని శిధిలాల ముక్కలను ఇండ్లకు తీసుకుపోయి విజయ చిహ్నాలుగా అలంకరించుకున్నారు. గత 70 సంవత్సరాలుగా పాలస్తీనా రాజ్యం ఏర్పడకుండా అడ్డుకోవటమే గాక, దాని భూభాగాలను క్రమంగా ఆక్రమిస్తూ, జనం రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ఇజ్రాయెల్ నిర్మిస్తున్న గోడలను అమెరికా సమర్ధిస్తోంది. అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పుడు పని చేసినట్లు ఇప్పుడు అదే అమెరికన్లు స్వయంగా మిగతా వారి కంటే పెద్ద గోడను నిర్మించేందుకు పూనుకున్నారు. నాడు తూర్పు జర్మనీని బలవంతంగా పశ్చిమ జర్మనీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఆ పని చేస్తే ఇప్పుడు తమ సమాజంలో తలెత్తిన అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు మెక్సికో సరిహద్దులలో గోడ నిర్మాణానికి పూనుకున్నారు. నిజంగా ఆ పనిచేస్తారో లేదో తెలియదుగానీ గోడ నిర్మాణానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వుత్తరువులపై సంతకాలు చేశారు. అందుకు అవసరమయ్యే నిధులను పార్లమెంట్ మంజూరు చేసి, చట్టపరంగా ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకపోతే గోడ నిర్మాణం ఏప్రిల్ తరువాత ప్రారంభమౌతుంది.
మెక్సికో గోడ నిర్మిస్తే ఎవరికి లాభం-ఎవరికి నష్టం అన్న చర్చ గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది.ఇప్పుడు ఇంకా పెరిగింది. నిజానికి ఇది కేవలం ఒక గోడ నిర్మాణానికే పరిమితం కాదు.దానితో అమెరికా సమస్యలు పరిష్కారం కావు. ప్రపంచ మంతా ఎల్లలు లేని ఒక కుగ్రామం అని అందరూ ఒకవైపు చెబుతూనే ఏదో ఒక కారణం చూపి గోడలు లేదా కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అలాంటివి వివిధ దేశాల మధ్య 45 గోడలు, కంచెలు వున్నాయి. వాటికి కారణాలుగా చెప్పిన సమస్యలు ఎక్కడా పరిష్కారం కాలేదు. ట్రంప్ చెబుతున్నదాని ప్రకారం అమెరికన్లకు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి వుద్యోగాలు కల్పించాలంటే విదేశాల నుంచి ముఖ్యంగా చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి వస్తున్న దిగుమతులపై పన్ను విధించి తద్వారా స్ధానికంగా వుత్పత్తిని ప్రోత్సహించి నిరుద్యోగ, ఆర్ధిక సంక్షోభ సమస్యను పరిష్కరించాలనే దగ్గర దారి ప్రయత్నమిది. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో-మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరం అన్నట్లుగా మిగిలిన దేశాలు అమెరికా పెద్దన్న పెత్తనానికి తలవంచుతాయంటే అంతకంటే పిచ్చి వూహ మరొకటి వుండదు.
అమెరికా-మెక్సికో సంబంధాలలో రెండు అంశాలున్నాయి. ఒకటి అమెరికా చెబుతున్నట్లు మెక్సికో నుంచి బతకటానికి వచ్చే వారు అడ్డదారుల నుంచి అమెరికాలో ప్రవేశించటం. 1994లో అమెరికా-మెక్సికో-కెనడాలు వుత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా) కుదుర్చుకున్నాయి. ఆ సమయంలో అమెరికా నుంచి మెక్సికో దిగుమతులు ఎక్కువగా వున్నాయి. వాటిని మరింతగా పెంచేందుకు ఆ ఒప్పందం వుపయోగపడుతుందని అమెరికా కార్పొరేట్ శక్తులు ముందుగా అంచనా వేశాయి. అయితే ఆ తరువాత అందుకు విరుద్దంగా జరిగింది. 1995-2016 మధ్య మెక్సికో నుంచి అమెరికా దిగుమతులు 65 నుంచి 295 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇదే సమయంలో అమెరికా నుంచి మెక్సికోకు ఎగుమతులు 68 నుంచి 235 బిలియన్ డాలర్లుగా వున్నాయి. అంటే నాఫ్టా ఒప్పందం వలన మెక్సికో లాభపడింది. ఈ అంకెలను చూపి నాఫ్టా ఒప్పందం ఏకపక్షంగా జరిగిందంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్ మా ఇంటికొస్తూ మాకేం తెస్తావ్ అన్నట్లు వ్యవహరించే పెద్దన్న అమాయకంగా ఒప్పందంపై సంతకం చేశారంటే ఎవరైనా నమ్ముతారా ?
కార్పొరేట్ శక్తులకు కావాల్సింది లాభం. అది స్వంత దేశంలోని కార్మికులకు పని కల్పించి సంపాదించిందా, పొరుగుదేశంలోని కార్మికుల నుంచి పిండుకున్నదా అన్నది వారికనవసరం.ఆ క్రమంలో మెక్సికో నుంచి దిగుమతులు చేసుకోవటమే వారికి లాభసాటిగా మారిందన్నది అసలు విషయం. అదే చైనా, మెక్సికో, మిగతా పేద, వర్ధమాన దేశాల అనుభవం. అత్యంత పేద దేశాలలో ఒకటైన బంగ్లాదేశ్‌లో ప్రపంచంలోని ధనిక దేశాల వాణిజ్య, పారిశ్రామిక సంస్ధలన్నీ తమ దుస్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. నిజానికి బంగ్లాదేశ్ వినియోగం కోసమైతే అన్ని అవసరం లేదు. అక్కడ తయారయ్యేవన్నీ ఎగుమతుల కోసమే. మెక్సికో సుంచి వలసల వలన అక్కడ సమస్య తలెత్తిందనుకుందాం, మరి ఐరోపా ధనిక దేశాల సంక్షోభ సమస్య మాటేమిటి ? అమెరికాలో ఆర్ధిక సమస్యలు తలెత్తి జనానికి అవసరమైన వుద్యోగాలు దొరకక పోవటానికి విదేశాల నుంచి అక్రమంగా వలస వస్తున్నవారే కారణమని అక్కడ వున్న రెండు పార్టీల వారూ చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. అదొక ఎన్నికల సమస్యగా మారింది. ఎవరు ఆ సమస్య గురించి తక్కువ మాట్లాడితే వారు జనంలో పలుచనయ్యే స్థితి. అందువలననే ఎన్నికలకు ముందు, తరువాత హడావుడి చేయటం తరువాత ఏదో చేశామనిపించి జనాన్ని జోకొడుతున్నారు. ధనిక దేశాలలో 2008లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభ పర్యవసానాలు ఆ సమస్యను తాజా ఎన్నికలలో మరింత ఎక్కువగా ముందుకు తెచ్చాయి. ప్రతిపక్షంలో వున్న రిపబ్లికన్ పార్టీ తాము అధికారానికి వస్తే తెల్లవారే సరికి అల్లావుద్దీన్ అద్బుతదీపం మాదిరి పరిష్కరిస్తామని ప్రచారం చేసింది.
నిఘా వేయటంలో ఎంతో ఆధునిక పరిజ్ఞానం వున్న అమెరికాకు అక్రమ వలసలను అరికట్టటం ఒక సమస్య కానే కాదు. మెక్సికో ద్వారా వివిధ లాటిన్ అమెరికా దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించి అధికారికంగా నమోదు కాని కార్మికులుగా పని చేయటం ఎప్పటి నుంచో జరుగుతోంది. ప్రభుత్వాలు కూడా చూసీచూడనట్లు వదలి వేస్తున్నాయి. ఎందుకంటే చట్టబద్దమైన కార్మికులతో పాటు వీరు కూడా పన్నులు చెల్లిస్తారు. సామాజిక భద్రతా పధకాలు, పెన్షన్ వంటి వాటిని వారికి చెల్లించనవసరం లేదు. వలస వచ్చిన వారు తక్కువ వేతనానికి పని చేస్తారు. యజమానులకు అది అదనపు లాభం. స్ధానికులతో పని చేయించుకొనే యజమానులు ఎక్కువ వేతనాలను చెల్లించటంతో పాటు వారి సామాజిక భద్రతా పధకాలకు తమ వాటా చెల్లించాల్సి వుంటుంది. ఇది వారి లాభాలను, పోటీ శక్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పని చేసేందుకు ఎక్కువగా వీరిని వినియోగిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ చెబుతున్నట్లు వారి రాకను నిరోధించేందుకు నిఘా పెంచినా, అడ్డుకునేందుకు పెద్ద గోడను నిర్మిస్తే ఏం జరుగుతుంది?
వలసలు ఆగిపోయి కొంతమేరకు స్ధానికులకు వుద్యోగ అవకాశాలు మెరుగుపడవచ్చు. ఇదే సమయంలో లాభాలకంటే నష్టాలే ఎక్కువ అన్నది ఎక్కువగా వినిపిస్తోంది.ప్రపంచ మార్కెట్‌లో ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే ఇప్పటికే అమెరికాలో వుత్పాదక ఖర్చులు ఎక్కువగా వున్నాయనే కారణంతో అమెరికా పెట్టుబడిదారులు కొత్తగా పెట్టే వాటితో పాటు పాత పరిశ్రమలను కూడా వేతన రేట్లు తక్కువగా వుండే దేశాలకు తరలించారు. ఆధునిక పరిజ్ఞానం ఇమిడి వుండే కొన్ని వస్తువులకు సంబంధించిన భాగాలు అమెరికాలో తయారు చేసి వాటిని ఇతర దేశాలకు తరలించి అక్కడ తయారైన వస్తువులను తిరిగి అమెరికాకు దిగుమతి చేసుకుంటున్నారు. ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. వుదాహరణకు జపాన్‌కు చెందిన మన దేశంలోని మారుతీ సుజుకీ ఇండియా కంపెనీలో తయారయ్యే కార్లను జపాన్‌తో సహా మరో వంద దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతేడాడి సెప్టెంబరు నాటికి పదిహేను లక్షల కార్లను ఎగుమతి చేశారు. అలాగే మెక్సికో నుంచి జరుగుతున్నాయి.
ట్రంప్ చెబుతున్నట్లు గోడ నిర్మాణానికి లేదా దిగుమతుల నిరోధానికి 20శాతమో అంతకంటే ఎక్కువో దిగుమతి పన్ను విధిస్తే అది ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనలకు విరుద్దమే గాక అమెరికాకే నష్టం. మెక్సికో నుంచి ఏటా 300 బిలియన్ డాలర్ల విలువగల వస్తువులను అమెరికా దిగుమతి చేసుకొంటోంది. వీటిలో 40శాతం వరకు అమెరికా నుంచి విడి భాగాలను మెక్సికో పంపి అక్కడి నుంచి పూర్తిగా తయారైన వస్తువులు తిరిగి అమెరికాకు వచ్చేవి వున్నాయి. వాటి మీద, అలాగే పూర్తిగా మెక్సికో నుంచి వచ్చే వాటిమీద ఎంత పన్ను విధిస్తే, అవి దిగుమతి చేసుకోవటం అనివార్యం అయితే ఆ మేరకు భారం అమెరికా వినియోగదారులపైనే పడుతుంది. ఇది చైనా, కెనడా, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. దీని వలన తలెత్తే సమస్యలను అధిగ మించాలంటే మెక్సికో, ఇతర దేశాలు కూడా అమెరికా వస్తువులపై దిగుమతి పన్ను విధించటం వంటి చర్యలకు పాల్పడతాయి.అంటే అది వాణిజ్య యుద్ధంగా మారుతుంది. మెక్సికోతో వాణిజ్యంపై ఆధారపడి అమెరికాలో 60లక్షల మంది వుపాధి పొందుతున్నారు. ఒక వేళ మెక్సికోలో వాటి తయారీని నిలిపివేస్తే అమెరికాలోనే వాటిని తయారు చేస్తే కొంత మంది వుపాధి పోవటం, వినియోగదారులపై అదనపు భారం పడటం అనివార్యం. ఇలాంటి ఎన్నో సమస్యలున్న కారణంగానే అలాంటి పిచ్చిపనులు చేస్తే విజేతలంటూ వుండరు, అటూ ఇటూ నష్టపోతారని చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ దవోస్ సమావేశంలో హెచ్చరించారు. అమెరికా కార్పొరేట్లు ట్రంప్ ప్రకటనల లాభ నష్టాలను బేరీజు వేసుకొని తమకు లాభం వచ్చే మార్గాన్నే ఎంచుకుంటారు. అందుకు ఏం చేస్తారో చూద్దాం !