ఎం కోటేశ్వరరావు
బుధవారం నాడు ప్రవేశపెట్ట నున్న బడ్జెట్ సందర్బంగా ఆనవాయితీ ప్రకారం ముందురోజు మంగళవారం నాడు వుభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, ఆర్ధిక సర్వేను విడుదల చేశారు. రాష్ట్రపతి ప్రసంగం అంటే ప్రభుత్వం రాసి ఇచ్చేది తప్ప మరొకటి కాదు. వాటిలో జనానికి బాగా తెలిసిన అంశాలను మరింత వివరంగా చెప్పారు. దేశమంతా ఎదురు చూస్తున్న అంశాన్ని విస్మరించటం విస్మయం కలిగిస్తోంది. నల్లడబ్బును అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేశామని స్వయంగా నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. గడువు ముగిసి నెల రోజులు దాటి పోయింది. అయినా ఇంతవరకు ఎంత మొత్తంలో నల్లడబ్బును వెలికి తీశారో, అసలు బ్యాంకులకు తిరిగి వచ్చిన సొమ్మెంతో, మోడీ సాధించిన విజయాలేమిటో చెబుతారనుకుంటే ఇక్కడా ‘మౌనమే ‘ పాటించారు. ఆర్థిక సర్వేలోని అనేక అంశాలను తరువాత పరిశీలించవచ్చు. గత పార్లమెంట్ సమావేశాలలో పట్టుమని పదినిమిషాలు కూర్చోకుండా, చర్చలో పాల్గొనకుండా తప్పించుకున్నారనే విమర్శలను మూటగట్టుకున్న ప్రధాని నోట్ల రద్దు గురించి ఆర్ధిక సర్వే ఏం చెప్పిందో చూద్దాం.
దేశంలో నల్లధనం ఎంత వుంది అన్నదానికి ఇప్పటి వరకు మౌనంగా వున్న సర్కార్ ఆర్ధిక సర్వేలో మన్‌కీ బాత్‌ను(మనసులోని మాట) కొత్త భాషలో బయటపెట్టింది. వంద రూపాయలు, అంతకంటే తక్కువ విలువ వున్న నోట్లు ప్రతి ఏటా వంద అచ్చువేశారనుకుంటే ఏడాది తిరిగే సరికిలో వాటిలో 33 పాతబడిపోయి, వినియోగంలోంచి తీసివేసి కొత్త నోట్లు వేస్తారు. అలాంటివి ఐదు వందల నోట్లు 22శాతం, వెయ్యి రూపాయలవి 11శాతం వుంటాయట. పెద్ద నోట్లు పాతబడటం తక్కువ శాతం వుండటం అంటే వాటిని వినియోగించకుండా దాచివేస్తున్నట్లు పరిగణిస్తే ఆ మొత్తం 7.3లక్షల కోట్ల రూపాయలని, దానిని నల్లధనంగా పరిగణిస్తారట. నలిగిపోయి పనికిరాకుండా పోయే నోట్లను అమెరికాతో పోల్చి చూస్తే నల్లధనాన్ని మూడులక్షల కోట్ల రూపాయలుగా అంచనా అని ఇది జిడిపిలో రెండుశాతమని పేర్కొన్నారు. మరి ఈ మొత్తమైనా బయటకు వచ్చిందా అంటే జవాబు లేదు. పార్లమెంట్ సమావేశాలలో అయినా చెబుతారా ? వేచి చూద్దాం !
ఈ సమావేశాలకు ముందు తొమ్మిదివేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగవేసి, అందరి కళ్ల ముందునుంచే విదేశాలకు పారిపోయిన విజయ మాల్యకు రుణాల మంజూరు, పారిపోయేందుకు అవకాశం ఇవ్వటం గురించి పరస్పరం బిజెపి, కాంగ్రెస్‌లు విమర్శించుకున్నాయి. ఇలాంటి మాల్యలు ఎందరో తీసుకున్న రుణాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులలో పేరుకు పోయిన నిరర్ధక ఆస్థుల తగ్గింపుకు చర్యలు తీసుకొనేందుకు ఆస్థుల పున:నిర్మాణ కంపెనీల(ఎఆర్‌సి)తో పాటు ప్రభుత్వ రంగ ఆస్థుల పునరావాస సంస్ధ(పిఏఆర్‌ఏ)ను కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఈ సర్వేలో వెల్లడించింది. అతి పెద్ద, అత్యంత క్లిష్టమైన వుదంతాలలో ప్రభుత్వ రంగ సంస్ధల నిరర్ధక ఆస్థురుల తగ్గింపునకు రాజకీయంగా కఠిన నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుగా ఈ సంస్ద పని చేస్తుందట.
మంచిదే. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అప్పులను బిజెపి ఏలుబడిలో ఇబ్బడి ముబ్బడిగా పారుబాకీలుగా ప్రకటించి రద్దు చేశారనే తీవ్ర విమర్శలను నరేంద్రమోడీ సర్కారు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నెల ఏడున అప్పుల రద్దుకు నిరసన తెలుపుతూ బ్యాంకు వుద్యోగుల సంఘాలు ఆందోళనకు పిలుపు ఇచ్చిన పూర్వరంగంలో కారణం ఏదైనా మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సరే ఆచరణలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో దేశం చూడబోతోంది. ఎందుకంటే ఇటీవల ప్రతి కార్పొరేట్ కంపెనీ అధిపతీ నరేంద్రమోడీ చర్యలకు మద్దతు ప్రకటించి ‘దేశభక్తి ‘ సర్టిఫికెట్‌ను తమకు తామే ఇచ్చుకుంటున్నారు.
నరేంద్రమోడీ సర్కార్ సాధించిన విజయాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు గనుక వాటి వివరాల్లోకి పోనవసరం లేదు. ఆ ప్రచారంలో చోటుదొరకని అంశాలలో బ్యాంకుల నిరర్దక ఆస్థుల పెరుగుదల ఒకటి. గతేడాది సెప్టెంబరు 30 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్థుల విలువ ఆరులక్షల 30వేల 323 కోట్ల రూపాయలు. అవెంత వేగంగా పెరుగుతున్నాయంటే జూన్-సెప్టెంబరు కాలంలో 79,977 కోట్లు పాత బాకీలకు తోడయ్యాయి. ఈ మొత్తం ఎంత అంటే బ్యాంకులు వంద రూపాయల రుణం ఇచ్చాయనుకుంటే 12 రూపాయలు నిరర్ధక ఆస్థులుగా తేలాయి. ఇవన్నీ కేంద్ర మంద్రి సుజనా చౌదరి వంటి ఘరానా పెద్దలు తీసుకున్న వందల కోట్ల రూపాయల మొత్తాలకు చెందినవే. ఒక్క రష్యాతప్ప ఇంత మొత్తంలో బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కార్పొరేట్ పెద్దలు మరొక ఏ వర్ధమాన దేశంలోనూ లేరట. సరే రష్యా అంటే సోషలిస్టు వ్యవస్ధను కూలదోసి పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధను పునరుద్దరించిన సమయంలో దొంగలదోపిడీ జరిగిందనుకోండి.
వ్యవసాయం గిట్టుబాటు గాక లేదా పంటలు పోయి, రకరకాల కారణాలతో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దౌర్బాగ్య పరిస్థితి రైతాంగంలో వుంది. ఎక్కడా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న పారిశ్రామిక, రాజకీవేత్తల గురించి మనం ఎక్కడా వినం, కనం. ఎందుకంటే వారు స్వంత డబ్బులతో లావాదేవీలు నిర్వహించరు గనుక. ప్రభుత్వ రంగ ఆస్థుల పునరావాస సంస్ధ(పిఏఆర్‌ఏ)ను ఎందుకు ఏర్పాటు చేయవలసి వస్తోందో ఆర్ధిక సర్వేలో చెప్పారు. ‘ రుణాల ఎగవేత సమస్య గురించి ప్రజలు చేస్తున్న చర్చలలో బ్యాంకుల పెట్టుబడి గురించి కేంద్రీకరించారు. ఈ రుణాల సమస్యకు పరిష్కారం కనుగొనటం పెద్ద సమస్యాత్మకంగా వున్నందున దానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంది. కొన్ని వుదంతాలలో నిధుల మళ్లింపు వలన సమస్యలు తలెత్తాయి. అయితే అత్యధిక వుదంతాలలో ప్రపంచ ద్రవ్య సంక్షోభం తరువాత ఏర్పడిన ఆర్ధిక వాతావరణంలో అనూహ్య మార్పులు దీనికి కారణమయ్యాయి. దాని వలన టైమ్‌టేబుల్స్, కరెన్నీ మార్పిడి రేట్లు, అభివృద్ధి అంచనాలు తీవ్రంగా తారుమారయ్యాయి. పెద్ద కేసులను పరిష్కరించటం పెనుసవాలుగా మారినందున దీనితో కేంద్రీకరించవచ్చు. రాని బకాయిలను ఆస్థులుగా చూపుతున్నందున వాటిని తగ్గించి ప్రభుత్వ రంగ సంస్ధల ద్రవ్య ఆరోగ్యాన్ని పునరుద్దరించాల్సి వుంది. సరే ఇలా ఎంతో అందమైన భాషలో చెప్పారనుకోండి. ఇక్కడ ఆలోచించాల్సిన అంశాలున్నాయి.
రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్ ఇలాంటి పరిష్కార చర్యలను వ్యవసాయరంగ సంక్షోభం పరిష్కారానికి ఎందుకు తీసుకోదు? ఎవరు అడ్డుపడుతున్నారు. అమెరికా వంటి ధనిక దేశాలలో 2008లో తలెత్తిన సంక్షోభం మన దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సిపిఎం వంటి వామపక్షాలు, ఎందరో ఆర్ధిక వేత్తలు చేసిన హెచ్చరికలను నాడు అధికారంలో వున్న యుపిఏ పెద్దలు కొట్టివేశారు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పెద్దలకు అసలు దాని గురించి పట్టలేదు. ఎక్కడో అమెరికాలో జరిగిన దివాళా పర్యవసానాలు ఎనిమిది సంవత్సరాల తరువాత మన బ్యాంకుల ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసినట్లు మన ప్రభుత్వమే అంగీకరించింది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఏ అనుసరించిన దివాళాకోరు ఆర్ధిక విధానాలనే బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ అనుసరిస్తున్నది. వాటిని వారు బాగా అమలు జరపలేదు, మేం పక్కాగా చేస్తాం అని మరీ చెబుతున్నది. పాలకంటే మంచినీళ్ల ధరలు మోడీ హయాంలో కూడా ఎక్కువగానే వున్నాయి. నీళ్ల వ్యాపార కంపెనీలు తెలివి మీరి ఒక లీటరు బదులు ముప్పావు లీటరు సీసాలను అధిక ధరలకు అమ్ముతున్నాయి. మరి మార్పు ఏమి వచ్చినట్లు ? అందువలన ప్రపంచీకరణ పేరుతో అమలు జరుపుతున్న దివాలాకోరు, ప్రజా వ్యతిరేక ఆర్ధిక విధానాల పర్యవసానాలు రానున్న రోజుల్లో ఇంకా తీవ్రం కానున్నాయి. వాటిని జనం వుమ్మడిగా కాకపోతే ఎవరు పట్టించుకుంటారు. ప్రపంచీకరణతో వచ్చిన సమస్యలను ప్రపంచవ్యాపిత కార్యాచరణతోనే ఎదుర్కోవాలి. కులాలు, మతాలు, బంధుత్వాల పేరుతో జనం మొత్తానికి శఠగోపం పెట్టే విధానాలను వ్యతిరేకించకపోతే నష్టపోయేది జనమే. బ్యాంకుల్లో మన డబ్బు మనం రోజుకు 50వేల కంటే ఎక్కువ తీసుకుంటే పన్ను వేయాలని మన చంద్రబాబు గారి కమిటీ సిఫార్సు చేసింది. వారానికి 24వేల పరిమితిని ఆర్‌బిఐ ఇంకా ఎంత కాలం కొనసాగిస్తుందో తెలియదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో డబ్బున్న మారాజులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు రాజకీయ వత్తిడికి లొంగి కరెంటు ఖాతాలపై పరిమితులను పూర్తిగా ఎత్తివేసింది. ఇలాంటి పనులు సామాన్యుల విషయంలో ఆర్‌బిఐ ఎందుకు తీసుకోలేదు?