ఎం కోటేశ్వరరావు
ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అన్నట్లుగా ఇప్పుడు ప్రతి రోజూ బడ్జెట్ రోజుగా మారిపోయింది. మనకు బడ్జెట్ అంటే బ్రిటీష్ వారి సాంప్రదాయ ప్రకారం ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం అవుతుంది. ఏం మే ఒకటవ తేదీ నుంచి ఎందుకు ప్రారంభం కాకూడదు అని ఎవరైనా వాదనకు దిగితే విబేధించేందుకేమీ వుండదు. సాంప్రదాయానికి భిన్నంగా రుతువుకు ముందే కూసిన కోయిల మాదిరి కేంద్ర బడ్జట్ ఒక నెల ముందుగానే వచ్చింది. ఏడాదికి ఒకసారి దేశ సంపద పంపిణీకి చేసే కసరత్తే బడ్జెట్. ఇది సామాన్యులకు ఒక పట్టాన అంతుపట్టదు. మేథావుల తరగతిలో ఎంత మందికి అర్ధం అవుతుందన్నది పెద్ద ప్రశ్న. లెక్కించే పద్దతులలో తేడాలు, లోపాలు వున్నాయనే విమర్శలు, ఆరోపణలు ఎలా వున్నప్పటికీ మన దేశంతో సహా ప్రపంచమంతటా అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయన్నది పచ్చి నిజం.దవోస్‌లో ప్రపంచ కార్పొరేట్ల సమావేశాల సందర్భంగా ఆక్స్‌ఫామ్ అనే సంస్ధ విడుదల చేసిన వివరాల ప్రకారం ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకెర్‌బర్గ్ సంపద ఎంత అంటే మన దేశంలో 40శాతం మంది పేదల సంపదకు సమానం. మన దేశంలోని రిలయన్స్ కంపెనీ అన్నదమ్ములలో పెద్ద వాడైన ముఖేష్ అంబానీ దగ్గర 30శాతం మంది సంపదకు సరిపడా వుంది. గత 70 సంవత్సరాలుగా మంచి, పురోగామి బడ్జెట్‌నే ప్రవేశపెట్టామని అధికారంలో కాంగ్రెస్, జనతా, బిజెపి ఇలా ఎవరున్నా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి అదే వాస్తవమైతే దేశంలో అసమానతలు ఇంతగా ఎందుకు పెరిగాయి? ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని అబద్దాలు చెబుతున్నా మేథావులు అర్ధం చేసుకోలేకపోతున్నారా లేక అర్ధమై తాము కూడా ఏనాటికైనా అంబానీలం కావాల్సిన వారిమే కనుక ఈ విధానాన్ని ప్రశ్నించటం, తప్పుపట్టకూడదనుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా ?
ఎన్‌డిఏ ప్రభుత్వం 2017-18 సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. దాని మీద చర్చలు జరుగుతాయో, అసలు పార్లమెంట్ సమావేశాలే పద్దతిగా నడుస్తాయో లేదో తెలియదు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో వడ్డిస్తున్న విధానం నుంచి మరలి గత రెండున్నర సంవత్సరాలుగా పారదర్శకమైన పద్దతిని పాటిస్తున్నట్లు మోడీ సర్కార్ బడ్జెట్‌లో పేర్కొన్నది. ఇప్పటికీ నరేంద్రమోడీని అభిమానిస్తున్నవారు మాకు కనిపిస్తోంది, మాకు కనిపిస్తోందని చెబుతున్నారు కనుక పుణ్యాత్ములకు మాత్రమే కనిపించే దేవతా వస్త్రాల వంటిదే ఇది అనుకోవాలి మరి. దూడగడ్డి కోసం తాడి చెట్టు ఎక్కామని చెప్పినట్లుగా ఒక నెల ముందుగానే బడ్జెట్ ప్రవేశ పెట్టటం గురించి అధికారపార్టీ సమర్ధన వుంది. బడ్జెట్‌ను ముందుగానే ప్రవేశ పెట్టనున్నట్లు గతేడాది సెప్టెంబరులోనే చెప్పామని, దీని వలన ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి పెట్టుబడుల చక్రం తిరగటం ప్రారంభమౌతుందని సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. అదే అయితే ప్రతి ఏడాది ఫిబ్రవరేం ఖర్మ జనవరిలోనే ప్రవేశపెట్టి ఫిబ్రవరి నాటికి ఆమోదం పొందితే ఇంకా స్పష్టత వచ్చి ‘పెట్టుబడుల చక్రం ‘ పూర్తి స్ధాయిలో వేగంగా తిరుగుతుంది, రాష్ట్రాలకు వచ్చే నిధులేమిటో రానివేమిటో మరింత స్పష్టమై వాటి బడ్జెట్లను మరింత స్పష్టంగా రూపొందించుకోవటం కుదురుతుంది కదా ! అలా చేస్తే ఎవరు వద్దన్నారు ? కడుపులో దుష్ట ఆలోచన పెట్టుకొని పిల్లా గడ్డికొస్తావా అన్నట్లుగా ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల ప్రచారం కోసమే ఇది అన్నది అందరికీ తెలిసిన అసలు విషయం. కేంద్ర సర్కార్ పారదర్శకత బండారమిది.
ఇక బడ్జెట్ తీరు తెన్నులు చూస్తే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా వుంది. కోర్టుకు చెప్పినట్లు ఏప్రిల్ ఒకటి నుంచి పెట్టుబడుల చక్రం తిరగటానికి దోహదం చేసే ఎలాంటి విప్లవాత్మక విధాన ప్రకటనలేమీ లేవు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా బడ్జెట్‌ను ఒక ప్రహసనంగా మార్చివేశారు. నరేంద్రమోడీ సర్కార్ గురించి చెప్పాల్సిన పనేలేదు. ప్రత్యామ్నాయ పద్దతి లేకుండా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసింది. ఈ ప్రభుత్వానికి ప్రతి దినమూ బడ్జెట్ రోజే. అందుకే ఈ మధ్య ఏ ఒక్క వాణిజ్య సంస్ధ కూడా బడ్జెట్ వస్తోంది ముందుగానే వస్తువులు కొనుక్కోండి అని ప్రకటనలు గుప్పించటం లేదు. బడ్జెట్, పార్లమెంటు ఆమోదంతో పనేమీ లేకుండానే ముందే విధాన ప్రకటనలు, పన్నులు, భారాలను వడ్డించి చూశారా భారాలు లేని బడ్జెట్ ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు. తాజా బడ్జెట్ కూడా అంతే. ఆర్ధిక మంత్రి ప్రసంగంలో డిజిటల్ ఎకానమీ అనే అంశం తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదంటే అతిశయోక్తి కాదు. గతేడాది బడ్జెట్‌కు ముందు అంటే 2015 నవంబరులో కేంద్ర ప్రభుత్వం పది హేను రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ పెద్ద విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. తరువాత జనవరిలో స్టార్టప్, స్టాండప్ ఇండియాల పేరుతో ప్రధాని మరొక ప్రకటన చేశారు.సరే నవంబరు నెలలో చేసిన పెద్ద నోట్ల రద్దు అనే చారిత్రాత్మక నిర్ణయం గురించి చెప్పనవసరం లేదు. అది కూడా ఐదురాష్ట్రాల ఎన్నికల ప్రచార వస్తువుగా వుపయోగించుకొనేందుకే అన్నది స్పష్టం.అన్నింటికీ మించి ఇలాంటి ప్రధాన నిర్ణయాలేవీ హల్వా వంటకంతో ప్రారంభిస్తున్నవీ, పార్లమెంట్‌లో చర్చించి చేస్తున్నవీ కాదు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ లేక బహుళజాతి కార్పొరేట్ సంస్ధల అజెండాలను తయారు చేసే సంస్ధల సలహాలు మొరటుగా చెప్పాలంటే ఆదేశాల ప్రకారం చేస్తున్నవి తప్ప మరొకటి కాదు. ఇది నరేంద్రమోడీ నూతన దారి కాదు, గతంలో మన్మోహస్ సింగ్ కూడా నడిచిన బాట అదే. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చినపుడు గానీ అసలు విషయాలు బయట పడవు. మోడీ సర్కార్‌ను గట్టిగా బలపరిచే ఒక వ్యాఖ్యాత ఈ ఏడాది రెండో బడ్జెట్ లేదా చిన్న బడ్జెట్ వుండదని చెప్పలేము అని పేర్కొన్నారు. ఆర్ధిక సంవత్సరం అక్టోబరుకు మారిపోనుందని చెప్పారు. అందువలన ఈ బడ్జెట్ అంకెలను చూసి భారాలు, రాయితీల గురించి చర్చించటం అసవసర ఆయాసం తప్ప మరొకటి కాదు.
ఇది సమగ్రబడ్జెట్ కాదు అనేందుకు కారణాలు అందరికీ తెలిసినవే. ఇదే కాదు, అన్ని రాష్ట్రాల బడ్జెట్లు ఒక విధంగా మూడు లేదా ఆరునెలలకు అవసరమయ్యే ఖర్చులకు అనుమతి పొందే ఓట్ ఆన్ ఎకౌంట్ వంటివే. ఎందుకంటే వస్తు,సేవల పన్ను జూలై లేదా సెప్టెంబరు నుంచి అమలులోకి వస్తుంది. మన ఆదాయంలో సింహభాగం దాని నుంచే రావాల్సి వుంది. దాదాపు 1400 వస్తువులపై ఎంత పన్ను విధిస్తారో, దాని పరిధిలోకి రానివేవో ఇంకా తెలియదు. ఇదొక ప్రధాన కారణమైతే అమెరికా పద్దతుల్లో జనవరి నుంచి డిసెంబరు వరకు ఆర్ధిక సంవత్సరాన్ని కూడా మార్చాలని ఇప్పటికే ఒక కమిటీ చేసిన సిఫార్సు గురించి కూడా ఈలోగా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ప్రపంచబ్యాంకు,ఐఎంఎఫ్, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్ధలన్నీ కూడా అదే కోరుతున్నాయి. అదే జరిగితే 2018 బడ్జెట్ ఏ సెప్టెంబరో, అక్టోబరులోనే ప్రవేశ పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్, తరువాత మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌ఘర్ ఎన్నికలు జరగాల్సి వుంది. ఇవన్నీ బిజెపి పాలిత రాష్ట్రాలు. వాటి ఫలితాలు 2019లో జరిగే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ఎన్నికల ఏడాది ఎలాగూ ఓట్ ఆన్ ఎకౌంట్ మాత్రమే ప్రవేశపెడతారు. అంటే మోడీ సర్కార్‌కు 2018 బడ్జెట్ కీలకం, బహుశా ఆ కారణంగానే కావచ్చు, తాజా బడ్జెట్‌లో ఎలాంటి ప్రజాకర్షక ప్రతిపాదనలు చేయలేదు. ఇంత ముందుగా చేస్తే జనం మరిచిపోయే అవకాశం వుంది కనుక ఎన్నికల సంవత్సరాలలో అయితే తాము సొమ్ము చేసుకోవచ్చన్నది బిజెపి ఆలోచన.
ప్రతి బడ్జెట్ సమావేశానికి ముందు ప్రభుత్వం తమ విధానాలు, విజయాల గురించి చెప్పుకొనేందుకు పార్లమెంట్ వుభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్వారా ఒక ప్రసంగం చేయిస్తుంది. మోడీ ప్రభుత్వ ‘ఘనత ‘ ఖాతాలో వేస్తారో మరొకదానిలో వేస్తారో తెలియదు గానీ అసాధారణ రీతిలో వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి ప్రసంగానికి 651 సవరణలు ప్రతిపాదించారు. ఇదొక రికార్డు అని చెప్పవచ్చు. వీటిలో మోడీ సర్కార్‌పై విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా పోరాడుతున్నట్లు చెబుతున్న కాంగ్రెస్ నుంచి ఒక్కటంటే ఒక్క సవరణ కూడా లేకపోవటం ఒక కిక్కు. గతంలో వేసిన కుర్చీలు చాలక అనేక మంది ఎంపీలు నిలబడి ప్రసంగాలను వినేవారని, తాజా ప్రసంగానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని మీడియాలో వ్యాఖ్యలు వెలువడ్డాయి. జన గణమణ పాడుతుండగానే కొందరు ఎంపీలు వెళ్లిపోవటం ప్రారంభించారని కూడా రాశారు. రాజ్యసభ సభ్యులు ప్రతిపాదించిన సవరణల్లో పెద్ద నోట్ల రద్దు గురించి రాష్ట్రపతి సరిగా చెప్పలేదన్నది ఒక ప్రధాన అంశం.ఈ సవరణల మీద ఓటింగ్ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం కూడా వుంది.
ఇక బడ్జెట్ విషయానికి వస్తే తినబోతే ఆవుల్లో దున్నబోతే దూడల్లో అన్నట్లుగా వుంది. ఎగుమతులు ఎందుకు తగ్గాయంటే అంతర్జాతీయ పరిస్థితులు అంటారు, అదే నోటితో తమ ఘనత కారణంగా అభివృద్ధి బహుబాగుంది అని చెబుతారు. అంకెల గారడీ తప్ప ఇదెలా సాధ్యం ! మన ఆర్ధిక వ్యవస్ధ అధిక వృద్ది రేటుతో పురోగమిస్తున్నదని, కావాలంటే ఐఎంఎఫ్ కూడా చెప్పింది చూడమంటున్నారు. అన్నింటికీ శకునం చెప్పే బల్లి తానే కుడితిలో పడినట్లు అన్ని దేశాల గురించి జోశ్యం చెప్పే ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్ధలేవీ 2008 నుంచి ధనిక దేశాలను, తరువాత వాటి అడుగుజాడల్లో నడిచే మన వంటి దేశాలను పట్టి పీడిస్తున్న ఆర్ధిక సంక్షోభాన్ని పసిగట్టటంలో ఘోరంగా విఫలమయ్యాయి. అందువలన అవి చెప్పే జోశ్యాలను సమర్ధనకు తీసుకోవటం జనాన్ని తప్పుదారి పట్టించటమే.
గతేడాది ప్రపంచంలో సంభవించిన ప్రధాన ఆర్ధిక, రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో పెద్ద అనిశ్చితిని ఎదుర్కోనున్నదని, 2017లో అమెరికాలో వడ్డీ రేట్లు పెంచే ఆలోచన వున్నందున వర్ధమాన దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు వచ్చే పెట్టుబడులు తగ్గవచ్చని, బయటకు వెళ్లే మొత్తాలు ఎక్కువ కావచ్చని, వస్తువుల ధరలలో అనిశ్చితి ముఖ్యంగా ముడి చమురు ధరల కారణంగా వర్ధమాన దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని, రక్షణాత్మక చర్యలు పెరుగుతున్న కారణంగా వస్తువులు, సేవలు, జనం విషయంలో ప్రపంచీకరణ వెనుక పట్టు పట్టే సూచనలు మన ముందున్న సవాళ్లని చెబుతూనే రాబోయే రోజుల్లో ఆర్ధిక వ్యవస్ధ బాగా పురోగమించనున్నదని చెప్పారు.
అసలు ప్రణాళికా సంఘమే రద్దయింది కనుక 2017-18 బడ్జెట్‌లో ప్రణాళిక-ప్రణాళికేతర అనే విభజనే లేకుండా పోయింది. అందువలన వివిధ రంగాలకు కేటాయింపులు, గతంతో పోల్చుకోవటానికి వీలు లేకుండా పోయింది. రైల్వే బడ్జెట్‌ను రద్దు చేసి సాధారణ బడ్జెట్‌లో దాన్నొక శాఖగా కలిపివేశారు.లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికి తీస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేశారు. ఇది పంచపాండవులు-మంచం కోళ్ల కథను పునరావృతం చేసేట్లున్నది. తొలుత నల్లధనం ఆరులక్షల కోట్లని, తరువాత దానిని మూడు లక్షల కోట్లని అనధికారిక అంచనాలు చెప్పిన వారు ఇప్పుడు అసలు మాట్లాడటం లేదు. ఎందుకయ్యా అంటే బ్యాంకులకు తిరిగి వచ్చిన నోట్లను ఇంకా లెక్క పెడుతూనే వున్నారట. కొన్ని వార్తల ప్రకారం ఆగస్టులో రిజర్వు బ్యాంకు వార్షిక నివేదికలో మాత్రమే ఆ వివరాలు వెల్లడి అయ్యే అవకాశం వుంది. అయితే ప్రతిపక్షాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో అంత తేలికగా వదలవు గనుక ఈ సందర్భంగా అయినా వెల్లడి అవుతాయా అన్నది చూడాల్సిందే.
పెద్ద నోట్ల రద్దు నల్ల ధనం వెలికితీతకే అని చెప్పినప్పటికీ చివరకు అది డిజిటల్ ఆర్ధిక లావాదేవీలను జనంపై బలవంతంగా రుద్ధేందుకు అన్నది స్పష్టమైంది. అదనపు భారం పడకుండా వుంటే నగదు రహిత లావాదేవీలను జరపటానికి జనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. పేటిఎం, రిలయన్స్, తదితర కార్పొరేట్ల ఆదాయాలు పెంచటానికే అన్నది తేలిపోయింది. ప్రభుత్వమే ప్రతిదానికి వినియోగ చార్జీలు, సేవా పన్ను పేరుతో జనాన్ని బాదుతుంటే ప్రయివేటు సంస్ధలు అదీ కేవలం వడ్డీ వ్యాపారం చేసే బ్యాంకులు, బ్యాంకేతర ఆర్ధిక సంస్ధలు వుచితంగా సేవలు అందిస్తాయని నమ్మటానికి జనం చెవుల్లో పూలుపెట్టుకొని లేరు. నగదు రహిత లావాదేవీలు జరిగితే అవినీతి వుండదన్నది ఒక ఎండమావి. అవినీతికి-నగదు రహితానికి సంబంధం లేదు. అమెరికాలో 45శాతం నగదు రహితమే, అయినా అది ప్రపంచ నల్లధనానికి అగ్రస్ధానంలో వుంది, కెనడాలో 57, బ్రిటన్‌లో 52శాతం నగదు రహితమే, ఆ రెండూ ప్రపంచంలో నల్లధనంలో అగ్రస్ధానంలో వున్న పది దేశాలలో వున్నాయి. ఇక ప్రపంచంలో నల్లధన కుబేరులు, పన్నుల ఎగవేతదార్లందరికీ ఆశ్రయం కల్పిస్తూ, అవినీతిని ప్రోత్సహించే స్విడ్జర్లాండ్ వంటి దేశాల గురించి చెప్పాల్సిందేముంది. నరేంద్రమోడీ నోట్ల రద్దు నిర్ణయం తరువాత హైదరాబాదు వంటి అనేక పట్టణాలలో కొన్ని చిన్న దుకాణదారులు పోయిన వ్యాపారాన్ని రాబట్టుకొనేందుకు నగదు రహిత లావాదేవీలకోసం మిషన్లు పెట్టారు. ప్రస్తుతం నగదు సాధారణ స్థాయికి రావటంతో అనేక చోట్ల వాటిని ఎత్తివేశారు. జనాన్ని నగదు రహితం వైపు మళ్లించటానికి ఈ బడ్జెట్‌లో సహజంగానే పెద్ద పీట వేశారు. బ్యాంకుల్లో పది లక్షలు, ఆధార్‌తో లింక్ చేసే మరో 25లక్షల మిషన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. మూడులక్షల రూపాయల కంటే నగదు లావాదేవీలు జరపరాదనే నిర్ణయం రాబోయే రోజుల్లో చేయనున్నారు. అంతా బాగుందని ఒకవైపు చెబుతారు, మరోవైపు అభివృద్ధి వుద్దీపన పేరుతో పారిశ్రామిక సంస్ధలపై పన్ను రేటు తగ్గిస్తున్నారు.ఏటా యాభై కోట్లకు లోబడి లావాదేవీలు జరిపే వాటిపై ఆదాయపన్ను 25శాతానికి తగ్గించటం అదే. ఎన్నో ఆశలు పెట్టుకున్న వుద్యోగుల విషయానికి వస్తే ఇది వట్టిస్తరి మంచి నీళ్ల వంటిదే. ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయంపై పన్ను రేటు పది నుంచి ఐదు శాతానికి తగ్గించి పండుగ చేస్కోండి అన్నట్లుగా ఫోజు పెట్టారు. దీని వలన అంతకు మించి ఆదాయం వున్నవారికి 12,500 రూపాయలు తగ్గుతాయి. ఇంతకు మించి మరొకటి లేదు.
బడ్జెట్‌ను మొత్తంగా చూస్తే వాస్తవాలను ప్రతిబింబించలేదనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు వలన అనేక మంది నష్టపోయారు. ఆ నష్టం గురించి ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశ పెట్టిన ఆర్ధిక సర్వేలో ఆర్ధిక ప్రగతి మందగించిందని, వస్తువులు, సేవల డిమాండ్ పెద్ద ఎత్తున పడిపోయిందని, వుపాధిపోయిందని, వ్యవసాయ ఆదాయాలు పడిపోయాయని పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా అంతా బాగుందని బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి చెప్పారు. లోటు తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవటం గురించి గొప్పగా చెప్పారు. అసలు విషయం ఏమంటే ఖర్చు తగ్గించారు. వర్తమాన సంవత్సరం జిడిపిలో 13.4 శాతం మొత్తం బడ్జెట్‌గా వుంటే వచ్చేఏడాది దానిని 12.7శాతానికి తగ్గించారు.మొత్తం ఆదాయం 9.4శాతం వస్తుందనుకుంటే సవరించిన బడ్జెట్‌లో తొమ్మిదిశాతానికి తగ్గించారు. అయితే కార్పొరేట్‌లకు ఇచ్చిన రాయితీలు మాత్రం అంచనాల కంటే 30వేల కోట్ల రూపాయలు పెరిగాయి. తక్కువ మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించేవారికి 20వేల కోట్లరూపాయల వరకు భారం తగ్గించినప్పటికీ పరోక్ష పన్నుల ద్వారా జనంపై 75వేల కోట్ల మేరకు అదనపు భారాన్ని ప్రతిపాదించారు. ఈ ఏడాది కూడా చమురు వుత్పత్తులపై అధిక ఎక్సయిజ్ డ్యూటీ ప్రాతిపదికన ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రతిపాదించారు. అంటే గత మూడు సంవత్సరాలలో పెంచిన పన్ను తగ్గేది లేదన్నది స్పష్టం. ఇండ్ల నిర్మాణానికి రాయితీల ప్రకటన ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో తెలియదుగానీ రియలెస్టేట్ రంగంలో కాపిటల్ గెయిన్ పన్ను ప్రాతిపదిక సంవత్సరాన్ని 1981 నుంచి 2001కు మార్చటం ద్వారా ఆ రంగంలోని బడా పెద్దలకు విపరీత లాభాలు సమకూర్చేందుకు వీలుకల్పించారు. షెడ్యూలు తెగల సంక్షేమానికి 1.48శాతం, షెడ్యూలు కులాల వారికి 2.44 శాతాల మొత్తమే మొత్తం బడ్జెట్‌లో కేటాయించారు. వారి జనాభాతో పోల్చితే ఇది చాలా తక్కువ. జనాభాలో సగానికి పైగా మహిళలు వున్నప్పటికీ లింగ ప్రాతిపదికన బడ్జెట్‌లో కేటాయింపు కేవలం 5.3శాతమే వుంది.
వుపాధి హామీ పధకానికి కేటాయింపు 48వేల కోట్లకు పెంచినట్లు చెప్పినా వాస్తవానికి గతేడాది చేసిన ఖర్చు 47.5వేల కోట్లకు దగ్గరగానే వుంది తప్ప తగినంత పెంపుదల లేదు.విద్య, వైద్యం వంటి సామాజిక రంగాలకు ద్రవ్యోల్బణం పెరుగుదలకు అనుగుణ్యంగా పెంపుదల లేదు. 2016-17లో 2.2శాతం అని నిర్ణయించినా సవరించిన అంచనా 2.16కు తగ్గింది. రైతుల ఆదాయాలను ఐదు సంవత్సరాలలో రెట్టింపు అని జపం చేయటం తప్ప అందుకు నిర్ధిష్ట చర్యలు లేవు. గతబడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి కేటాయించిన 1.98శాతంలో సవరించిన అంచనా పకారం 1.95శాతం కంటే ఖర్చయ్యే అవకాశం లేదు. మౌలిక సదుపాయాల పరిస్ధితి కూడా ఇంతే.