Tags

, , , ,

Image result for tamil nadu assembly

సత్య

    తమిళనాడు ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామి శనివారం నాడు అసెంబ్లీలో తన ‘బల’ నిరూపణ చేసుకున్నారు. తమిళ మురికి గుంటలో చేపలను పట్టాలని చూసిన బిజెపి, డిఎంకె దాని వెన్నంటి వున్న కాంగ్రెస్‌లకు శృంగభంగమైంది. పళని స్వామి నాయకత్వం రేపేమి చేస్తుంది, పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయి అని ఈ రోజు వూహించటం కష్టం. కొంతమంది వూహలు, వాంఛలకు భిన్నంగా అన్నాడిఎంకెలో మెజారిటీ సభ్యులు శశికళ నాయకత్వంలోని పళనిస్వామికి మద్దతుగా నిలిచారు. కాంపులో వున్న ఎంఎల్‌ఏలు బయటికి వస్తే మరొక కాంపులోకి దూరతారన్న అంచనాలు తారు మారు కావటంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న డిఎంకె, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌ ఆశలు ఆవిరై సాధారణంగా జరగాల్సిన బలనిరూపణ ప్రక్రియను అపహాస్యం పాలు చేసినట్లుగా కనిపిస్తోంది.

    అసెంబ్లీలో అవాంఛనీయ వుదంతాలు జరగటం తమిళనాడుకు కొత్త కాదు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిని తిరిగి ఎన్నుకోవటం కూడా సామాన్యంగా జరుగుతోంది. దాని కొనసాగింపుగానే శనివారం నాడు కూడా కుర్చీలు లేచాయి, చొక్కాలు చిరిగాయి. ఎంజిరామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా మరణించినపుడు ఆయన భార్య జానకిని సిఎంను చేశారు. ఆమె బలనిరూపణ సమయంలో జరిగినదానితో పోలిస్తే శనివారం నాటి సంఘటనలు ఒక లెక్కలోవి కాదు. ఆ రోజు కొందరు గూండాలు అసెంబ్లీలోకి ప్రవేశించి ఎంఎల్‌ఏలను చితకబాదారని, తరువాత పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆరోజు కాంగ్రెస్‌ శాసనసభ్యులు నాటి స్పీకర్‌ చర్యను వ్యతిరేకించారు, దెబ్బలు తిన్నారు. ఇపుడు కూడా అదే జరిగింది. నాటి స్పీకర్‌ పిహెచ్‌ పాండియన్‌ ఇప్పుడు పన్నీరు సెల్వం శిబిరంలో, కాంగ్రెస్‌ వారు ఈసారి వారు డిఎంకె పక్షాన వున్నారు. మీడియాకు ప్రవేశం లేకుండా తలుపులు మూసి నిర్వహించిన బలనిరూపణ ప్రక్రియలో ఏం జరిగిందనేది ఎంఎల్‌ఏలు చెప్పిందే సమాచారం. శాసనసభ్యులు రౌడీల మాదిరి ప్రవర్తించినప్పటికీ వారిని గౌరవించాల్సిందేనని కమల్‌ హసన్‌ వ్యంగ్యంగా అన్నారు. కుష్బూ, సిద్ధార్ధ శశికళ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.

   అధికారం తప్ప మరొక పరమార్ధం ఎరుగని పాలక రాజకీయాలు నెరిపే అందునా రాష్ట్రాలలోని కుటుంబపార్టీల ( వాటినింకేమాత్రం ప్రాంతీయ పార్టీలని పిలవాల్సిన అవసరం లేదు) పరిణామాలు ఎటుతిరుగుతాయో తెలియని స్ధితి. స్వాతంత్య్ర వుద్యమానికి సారధ్యం వహించిన పార్టీగా 1947 తరువాత ప్రారంభమైన కాంగ్రెస్‌ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు కుటుంబపార్టీగా మార్చివేసేందుకు ప్రయత్నించారు. ఐదుగురికి ఐదూళ్లు కాదు గదా సూది మోపినంత కూడా ఇచ్చేది లేదన్న కౌరవుల మాదిరి వ్యవహరించటంతో దానికి వెలుపల వున్న వారు అధికారం కోసం పడిన తపన అనేక చోట్ల ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి నాంది పలికింది. రాష్ట్రాలు, వాటి సమస్యలపట్ల అవలంభించిన నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రాల అధికారాల కోసమంటూ ప్రారంభమైన పార్టీలు గత నాలుగు దశాబ్దాల కాలంలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో అంటకాగటం, తమ అధికారాన్ని నిలుపుకొనేందుకు ఏ పార్టీ వారు వస్తే ఆ పార్టీ వారిని రాష్ట్ర అభివృద్ధి కోసం అనే పేరుతో చేర్చుకోవటం ( ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ది పేరుతో జరుగుతోందనుకోండి) సాధారణంగా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రాలు-జనం- హక్కులు ఏమీ లేవు. అధికారం-సంపాదన-అధికారం అనే వలయంలో కుటుంబపార్టీలు తిరుగుతున్నాయి.

   ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల హక్కుల పేరుతో రంగంలోకి వస్తే బిజెపి అనేక పార్టీల రంగులు మార్చి(జన సంఘం-జనతా పార్టీ-భారతీయ జనతా పార్టీ) తమ రూటే సపరేటు, కాంగ్రెస్‌కూ మాకూ పోలికే లేదంటూ ముందుకు వచ్చింది. దీనిలో కాంగ్రెస్‌లో, ఇతర ప్రాంతీయ పార్టీలలో వున్న అన్ని అవలక్షణాలతో పాటు అధికారం కోసం అవసరమైతే మతోన్మాదాన్ని, ఘర్షణలను కూడా రెచ్చకొట్టేందుకు వెనుకాడదన్న విమర్శ, వాస్తవం గురించి తెలిసిందే. తమకు లొంగని రాష్ట్ర ప్రభుత్వాల, పార్టీల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటున్నది గత మూడు సంవత్సరాలుగా చూస్తున్నదే. గవర్నర్లను ఎలా వుపయోగిస్తున్నదీ తెలిసిందే. కాంగ్రెస్‌ రంగు బయటపడటానికి యాభై సంవత్సరాలు పడితే ఈ పార్టీ అసలు రంగు బహిర్గతం కావటానికి ఐదు సంవత్సరాలు కూడా అవసరం లేదని నిరూపించుకుంది. అంత స్పీడుగా వుంది.

    అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక కావటాన్ని కొంత మంది ప్రశ్నించారు. నిజమే ఆమె జయలలిత స్నేహితురాలిగా తప్ప ఇతరత్రా పార్టీలో ఏమీ కాని మాట నిజమే. అది తప్పయినపుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడి కుమారుడిగా తప్ప లోకేశ్‌ ఏం చేశారని ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. తెలంగాణాలో తెరాస పరిణామాలను చూసినా అదే వైఖరి కనిపిస్తుంది. జయలలితకు కూడా కుటుంబం వున్నట్లయితే కూతురో కొడుకో నాయకత్వ స్ధానాన్ని ఆక్రమించేవారు. పార్టీకోసం, ప్రజల కోసం ఏ నాడూ ఏమీ చేయని వారు అధికారపీఠం కోసం అర్రులు చాస్తున్నపుడు, ఎవరినైనా ఆమోదించే స్ధితిలో జనం వున్నపుడు జయలలిత మేనకోడలిగా తాను కూడా ఎందుకు ప్రయత్నించకూడదని దీపా జయకుమార్‌ ప్రయత్నించటంలో ఆశ్చర్యం ఏముంది.

    ప్రజాస్వామ్యం పదికాలాలపాటు బతికి బట్టకట్టాలంటే ఇలాంటి పరిణామాలను జనం సహించాలా ? అనేక కారణాలతో వ్యతిరేకించటం లేదన్నది వాస్తవం. కాంగ్రెస్‌ అనుసరిస్తున్న విధానాలనే బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్నా ప్రశ్నించే ధోరణి వ్యక్తం కావటం లేదు. అందుకే వాటి మధ్య విధానాల మీద రాజీ- అధికారం కోసం కుమ్ములాటలు తప్ప ఎలాంటి పేచీ వుండటం లేదు. మన చేత్తో మన కంటినే పొడుచుకుంటున్నామని గుర్తించే రోజు వచ్చినపుడే వుప్పు-కప్పురాలకు తేడా తెలుసుకోగలుగుతాము. కమ్యూనిస్టు పార్టీలు చిన్నవిగా వున్నా, కొన్ని చోట్ల అధికారానికి వచ్చినా ఎక్కడా ఇలాంటి అవలక్షణాలు ఆ పార్టీలలో కనిపించటం లేదు. అవినీతి, అక్రమాల గురించి వేలెత్తి చూపటానికి లేదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా సైద్ధాంతిక , విధానాల ప్రాతిపదికగా అవినీతి రహిత పార్టీలు, శక్తులను ఎంచుకొనే క్రమాన్ని ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు వేగవంతం చేయటం అనివార్యం.

    ప్రతి రాష్ట్రంలో జరిగే ప్రతి రాజకీయ పరిణామం ఒక గుణపాఠం నేర్పుతూనే వుంది. జయలలిత మరణంతో అన్నాడిఎంకె నాయకత్వ సమస్యను ఎదుర్కొన్న తరుణంలో ఆమెకు కేవలం స్నేహితురాలిగా, అక్రమ సంపాదనలో తోడుగా వున్న శశికళ పగ్గాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమై అనూహ్య పరిణామాల మధ్య ఆమెకు శిక్ష పడి జైలు పాలయ్యారు. సమీప భవిష్యత్‌లో ఆమె చట్ట సభలకు పోటీ చేసే అవకాశం లేకపోవటంతో ఇతరులతో కథ నడిపించాల్సి వుంది. మరో నాలుగు సంవత్సరాల పాటు కొనసాగాల్సిన అసెంబ్లీ పూర్తికాలం నడుస్తుందా, అధికారం కోసం ఆతృపడుతున్న డిఎంకె, కాంగ్రెస్‌ కూటమి దానిలో చీలిక తెచ్చి ఆ వర్గం మద్దతుతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అన్నది సమస్య. కేంద్రంలో బిజెపి అధికారంలో వుంది. తన స్ధానాన్ని పటిష్టపరచుకోవాలంటే ఏ గడ్డి కరవటానికైనా వెనుకాడటం లేదని అనేక రాష్ట్రాలలో దాని చర్యలను చూస్తే అర్ధం అవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత వాటిని బట్టి ఏరాష్ట్రాన్ని ఎలా మింగాలో ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది. అసాధారణ సంక్షోభం తలెత్తితే తప్ప ఆరునెలల వరకు పళనిస్వామి మరోసారి బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ అటువంటి పరిస్థితిని ప్రత్యర్ధులు తెచ్చిపెడితే అసెంబ్లీ రద్దుకు ఆదేశించి రాజకీయాలను మరోమలుపు తిప్పినా ఆశ్చర్యం లేదు.

   అన్నాడిఎంకెలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీరు సెల్వం సామర్ధ్యంగల నేత అని గతంలో ఎవరూ చెప్పలేదు, భవిష్యత్‌లో చెప్పే అవకాశమూ వుండదు. అతని అధ్యాయం ముగిసిందని చెప్పవచ్చు. పన్నీరు సెల్వాన్ని అడ్డం పెట్టుకొని కథనడింపించాలని చూసిందనే విమర్శలు ఎదుర్కొన్న బిజెపి ఇప్పుడు మరోదారి చూసుకుంటుంది. డిఎంకెతో అంటకాగి అన్నాడిఎంకెను దెబ్బతీసినా ఆశ్చర్యం లేదు. లేదా ఎన్నికలకు సమయం వుంది కనుక రజనీకాంత్‌ వంటి మరొక సినిమా నటుడిని రంగంలోకి తెచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోనూ వచ్చు. అన్నా డిఎంకెలో శశికళ స్ధానంలో మరో నూతన అధికార కేంద్రం ప్రారంభం కావచ్చు, ఆ పార్టీలో మరో సంక్షోభం అంటూ తలెత్తాలంటే పళని స్వామికి మరో విభీషణుడు తయారు కావాలి. లేదా మరో రెండు సంవత్సరాలు కచ్చితంగా అధికారంలో వుండే బిజెపి ముందు పొలోమంటూ లొంగిపోయి, ప్రతిపక్ష డిఎంకె నుంచి రక్షణ అయినా పొందవచ్చు. డొల్లుపుచ్చకాయల వంటి ప్రాంతీయ, కుటుంబపార్టీలు ఎప్పుడేం చేస్తాయో ఎవరు చెప్పగలరు !