Tags

, , ,

ఎం కోటేశ్వరరావు

    మత, మితవాద శక్తులు వివాదాస్పదం గావించిన మళయాళ చిత్రం ‘ఆమీ ‘ నిర్మాణం సజావుగా సాగుతుందా? సాగినా ప్రేక్షకులను చూడనిస్తారా అనే వూహాజనిత ప్రశ్నలను కాసేపు పక్కన పెడదాం. అసలు ఈ చిత్రంలో ఏ ముందో చూడకుండానే దర్శకుడు, నటీ నటులపై వత్తిడి తీసుకురావటం,సామాజిక మీడియాలో బెదిరింపులకు పాల్పడం మన దేశంలో కొన్ని శక్తుల అసహన ధోరణులు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపించటం లేదూ ! తన జాతీయతను ఎవరూ ప్రశ్నించజాలరని, తాను హిందువునే అంటూ రచయిత్రి కమలా సురయ్య జీవిత కథ ఆధారంగా నిర్మించే చిత్రంలో కమల పాత్ర ధరించటానికి తనకు హక్కుందని, తాను నటిస్తానని సినీ నటి మంజు వారియర్‌ స్పష్టం చేశారు. సుప్రసిద్ధ నటి విద్యాబాలన్‌ మాదిరి మంజుపై కూడా తిరోగామి శక్తులు వత్తిడిని ఇంకా పెంచుతాయా? ఆమె వాటిని తట్టుకొని చెప్పినట్లు చిత్రంలో నటించగలరా అన్న సందేహాలు వుండనే వుంటాయి.

     భిన్నాభిప్రాయాన్ని, అసమ్మతి, విమర్శలను జాతి వ్యతిరేకంగా చిత్రించే నాజీ పోకడలను జనం మెదళ్లలోకి క్రమంగా ఎక్కిస్తున్న తరుణమిది. మన దేశం స్వల్పకాలం ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని చూసింది తప్ప నాజీ, ఫాసిజం స్వరూపాన్ని చూడలేదు. అలాగని నిజమైన ప్రజాస్వామిక వ్యవస్ధను కూడా చూడలేదన్నది కూడా అంతే వాస్తవం. ఇది నిజంగా ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన పరిస్ధితి.మనకు తెలియని వాటి గురించి జనానికి తెలియచేయటం కంటే తెలిసినట్లుండి, నిజంగా తెలియని ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చెబితే దానికి వ్యతిరేకమైన నియంతృత్వం గురించి చైతన్యవంతులను గావించటం సులభం అవుతుంది.

   తాము మాంసం తింటామని తెలియ చేసేందుకు ఎముకలను మెడలో వేసుకు తిరగరన్నది తెలిసిందే. అలాగే నియంతలు, ప్రజాస్వామ్యాన్ని ఏడునిలువుల లోతున పాతిపెట్టాలనుకొనే శక్తులు కూడా అదే మాదిరి ప్రవర్తిస్తాయి.తమ భావజాలాన్ని, రాజకీయాలను వ్యతిరేకించే వారిని సామాజిక మాధ్యమంలో ఎలా వేధిస్తారో, వెంటాడుతారో ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. ఇప్పుడు సినీనటి మంజు వారియర్‌ను కూడా అలాగే వేధించి, వెంటాడుతున్నారు. సాహితీలోకంలో, కేరళలో మాధవికుట్టి అనే పేరుతో రచనలు చేసి జీవిత చివరి కాలంలో కమలా సురయ్యాగా మారిన కమలాదాస్‌ గురించి పరిచయం చేయనవసరం లేదు. కేరళలోని ఒక ఛాందసవాద నాయర్‌ కుటుంబంలో జన్మించిన ఆమె తన రచనలలో స్త్రీ, పురుష లైంగిక సంబంధాలు, సమాజంలోని అక్రమ సంబంధాల గురించి నిర్మొహమాటంగా చర్చించటం కొంత మందికి మింగుడు పడలేదు.ఆమె రచయిత్రిగానే గాక పత్రికల్లో వివిధ అంశాలపై రచనలు చేశారు. ప్రముఖ రచయిత్రుల సరసన స్ధానం సంపాదించారు. తన 65వ ఏట ఆమె హిందూమతాన్ని వదలి ముస్లింగా మారారు. ఆ సమయంలో పెద్దవివాదమే చెలరేగింది. నాడు ఆమెపై ధ్వజమెత్తిన పరంపరకు చెందిన వారే ఇప్పుడు మరోసారి మరో రూపంలో దాడికి దిగారు. తన 75వ ఏట 2009లో ఆమె మరణించారు. ఆమె హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా మతం మారారని కొందరు ఆక్షేపిస్తే ఒక ముస్లిం పారిశ్రామికవేత్తతో వున్న సంబంధాల కారణంగా మతం మారారని కొందరు నిందించారు. ఇప్పుడు ఆమె జీవిత కథా ఇతివృత్తంతో సినిమా తీస్తున్న దర్శకుడు కమల్‌గా సుప్రసిద్ధుడైన కమాలుద్దీన్‌ మహమ్మద్‌ మాజిద్‌ అనే ఒక ముస్లిం అని అతగాడు తీస్తున్న సినిమా గనుక అది లవ్‌ జీహాద్‌ను ప్రోత్సహించేదిగా వుంటుందని కొందరు ధ్వజమెత్తారు. తొలుత కమలాదాస్‌ పాత్రకు విద్యాబాలన్‌ను ఎంపిక చేసి మేకప్‌ టెస్టులు, దుస్తులు అన్నీ సిద్ధం చేసుకొని చిత్రీకరణకు వెళ్లబోయే ముందు కథనాన్ని మార్చిన కారణంగా తాను నటించలేనని ప్రకటించారు. హిందూత్వ శక్తుల దాడికి భయపడి ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారని గతేడాదే మళయాల చిత్రసీమలో, మీడియాలో వార్తలు వచ్చాయి.

   దర్శకుడు కమల్‌ విషయానికి వస్తే నరేంద్రమోడీ పెద్ద నోట్ల రద్దు చర్యను విమర్శించాడు. సినిమాహాళ్లలో జాతీయ గీతాలాపన సందర్భంగా లేచి నిలబడని వారిపై పోలీసులు చర్యలు తీసుకోవటాన్ని విమర్శించారు. రాజకీయంగా బిజెపి, హిందూత్వశక్తులు ఇది మింగుడు పడలేదు. జాతీయ గీతాన్ని గౌరవించకపోతే ఈ దేశం వదలి పోవాలని కూడా కొందరు బిజెపి నేతలు కమల్‌ను కోరారు. విద్యాబాలన్‌ వెనక్కు తగ్గిన తరువాత మంజూ వారియర్‌ను సంప్రదించగా ఆమె అంగీకరించారు. గతంలో ఆమె కమల్‌ చిత్రాలలో నటించారు. సామాజిక మాధ్యమాలలో తనపై దాడి, వేధింపులకు దిగిన వారికి మంజు వారియర్‌ అదే మాధ్యమం ద్వారా తన ఫేస్‌బుక్‌లో సమాధానమిచ్చారు.

    ‘ నేను కమల్‌ సార్‌ను నా గురువుగా చూస్తాను. ఇరవై సంవత్సరాల తరువాత ఆయనలోని ఒక గొప్ప కళాకారుడితో పని చేసే అవకాశం వచ్చినందుకు వుద్విగ్నతకు లోనవుతున్నాను తప్ప ఆయన రాజకీయాలను చూసి కాదు. నా దేశమే నా రాజకీయాలు. ప్రార్ధనలు చేసేందుకు నేను రోజుకు రెండుసార్లు దేవాలయాని వెళతాను. అదే విధంగా ఒక చర్చి, ఒక మసీదు ముందుకు వెళ్లినపుడు కూడా నేను అదే మాదిరి భక్తితో తలవంచుతాను.’ అని మంజు పేర్కొన్నారు. భిన్న రాజకీయాలు, భావజాలాలు వున్న వారు అనేక మంది కలసి పని చేస్తున్నారంటే ఒక మంచి సినిమా నిర్మాణ లక్ష్యం తప్ప మరొకటి కాదు.

    మంజుపై తిరోగామి శక్తులు దాడి, బెదిరింపులకు దిగితే ఆమె అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమంలో స్పందించారు. తాను హిందువునని చెప్పుకోవటం సంఘపరివార్‌కు లొంగిపోవటంగా కూడా వర్ణించినవారు లేకపోలేదు. కొందరు ఎత్తుగడగా ఆమె అలా ప్రకటించిందన్న వారు కూడా వున్నారు. దేశంలో నెలకొన్న అసహన ధోరణుల నుంచి రక్షణ పొందేందుకు ఆమె జాతీయత కింద రక్షణ పొందారని ప్రముఖ రచయిత ఎంఎన్‌ కరాసెరీ వ్యాఖ్యానించారు. ‘ఆమె అభత్రాభావానికి లోనైవుంటే అందుకు ఆమెను నేను తప్పుపట్టటం లేదు. ఆమె ఇప్పటికే తన జీవితంలో అనేక విషాదాలను చూశారు. ఆమె సున్నిత మనస్కురాలైన కళాకారణి తప్ప రాజకీయవేత్తకాదు. ఆమెకు విద్వేష రాజకీయాలు తెలియవు ‘ అన్నారు. మత జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చే వారికి కళ అన్నా కళాకారులన్నా ప్రేమ వుండదు. అందువల్లనే ఎంఎఫ్‌ హుస్సేన్‌, సల్మాన్‌ రష్డి వంటి వారి చిత్రాలు, రచనలను వ్యతిరేకిస్తారు. సృజనాత్మక స్వేచ్చను వ్యతిరేకించటంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒకటే అని కూడా కరసెరీ వ్యాఖ్యానించారు. ‘కమలా సురయ్యా జీవితం నిజంగా ఎంతో సమ్మోహనమైంది. స్త్రీ లైంగికత్వం గురించి ఎంతో నిజాయితీగా ఆమె రచనలను విప్లవాత్మకం కావించింది. ఆమె జీవిత చరమాంకంలో ప్రేమ కోసం ఇస్లాంలోకి మారటంద్వారా విమర్శలపాలయ్యారు.ఆమె జీవిత మంతా వివాదాల మయం. ఒక కళాకారిణికి ఇవన్నీ ఎన్నో సవాళ్లను ముందుకు తెస్తాయి. మంజు ఒక యువ మహిళ, ఆమెకు సూక్ష్మ రాజకీయ బేధాలను గ్రహించలేకపోవచ్చు, తన పాత్రను అంగీకరించే సమయంలో దాని పరిధిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని వుండవచ్చు ‘ అన్నారు.

    సామాజిక మీడియాలో మంజు వారియర్‌పై దాడి, బెదిరింపులు, హెచ్చరికలు చేస్తున్నవారు తమ రాజకీయ భావాలను వెల్లడించకపోయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో వారంతా ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానికి చెందిన వారు లేదా దాని ప్రభావానికి లోనైన వారన్నది స్పష్టం. మీడియా ప్రతినిధులు ఈ వివాదం, బెదిరింపుల గురించి ప్రశ్నించినపుడు సామాజిక మీడియాలో ప్రచారం వెనుక తమ పాత్ర లేదని బిజెపి సీనియర్‌ నాయకులు చెప్పారు.’ సామాజిక మీడియాలో చర్చ జరుగుతున్న కారణంగా ఈ చిత్రానికి వ్యతిరేకంగా బిజెపి మరియు సంఘపరివార్‌ ప్రచారం నిర్వహిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి, సామాజిక మీడియాలో వస్తున్నది బిజెపి వైఖరి కాదు. దానికి మా బాధ్యత లేదు ‘ అని బిజెపి కార్యదర్శి బి గోపాల కృష్ణన్‌ చెప్పారు. తమపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఆ వివాదం లేదా ప్రచారంపై తమ వైఖరి ఏమిటో బిజెపి ఇంతవరకు ప్రకటించకపోవటం విశేషం. అనేక సందర్భాలలో కాగల కార్యకర్యం గంధర్వులు తీరుస్తారన్నట్లుగా ఇలా వ్యవహరించటం పరివార్‌ సంస్ధలకు సాధారణమే అన్నది విమర్శ.

    తమకేమీ సంబంధం లేదని బిజెపి నేతలు చెప్పటాన్ని తాము అంగీకరించటం లేదని సామాజిక కార్యకర్త ఎంఎన్‌ పియర్సన్‌ వంటి వారు స్పష్టం చేస్తున్నారు.’ ఇది ఒక గెరిల్లా దాడి వంటిది. సమాజంలో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నవారిని వెనక్కు కొట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో వారి రాజీకీయ అజెండాలో భాగమిది ‘ అన్నారు. అన్ని రకాల ఆలోచనా కోణాలను అంగీకరించే సంప్రదాయమున్న రాష్ట్రంలో అనేక మంది రచయితలు ఎంఎం కలబుర్గి, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌ వంటి వారిని బలిగొన్న విద్వేష ప్రచారాన్ని కొనసాగించే దానిలో మంజు, కమల్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఒక భాగమని సిపిఎం పార్లమెంట్‌ సభ్యుడు ఎంబి రాజేష్‌ విమర్శించారు.

   సినిమా స్క్రిప్టులో మార్పులు చేసిన కారణంగా తాను చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు విద్యాబాలన్‌ చెప్పినప్పటికీ ఇంతవరకు అలాంటి మార్పులేమీ లేవని దర్శకుడు కమల్‌ స్పష్టం చేశారు. నవంబరులో షూటింగ్‌ ప్రారంభం కావాల్సి వుండగా విద్యాబాలన్‌ వెనక్కు తగ్గిన కారణంగా వాయిదా పడింది. జీవిత చరమాంకంలో ఇస్లాం మతం పుచ్చుకున్న కమలాదాస్‌ వివాదాస్పద జీవితం వున్న పాత్రను పోషించటం గురించి విద్యాబాలన్‌ భయపడి వుండవచ్చు. బాలీవుడ్‌లో ఆమె ఇటీవల కొన్ని ఎదురుదెబ్బలు తిన్నది. దక్షిణ భారత్‌లో ఈ సమయంలో ఇలాంటి చిత్రంలో చేస్తే తన భవిష్యత్‌ అవకాశాలను ప్రభావితం చేస్తాయోమో అన్నది కారణం కావచ్చని కమల్‌ వ్యాఖ్యానించారు. బయటి బెదిరింపులకు భయపడి మంజు వారియర్‌ వెనక్కు తగ్గుతుందని తాను భావించటం లేదని అన్నారు. కేరళ, ముంబై, కొల్‌కతాలలో షూటింగ్‌ జరుపుకొని మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాలన్నది నిర్మాతల లక్ష్యం.