ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, తెలుగు దేశం నాయకులకు నిత్యం జర్నలిస్టులు లేనిదే గడవదన్నది తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య(ఎపిడబ్ల్యుజెఎఫ్) తాజాగా ముఖ్యమంత్రికి రాసిన ఒక బహిరంగలేఖలోని అంశాలను చూస్తే గత మూడు సంవత్సరాలలో జర్నలిస్టులతో మాట్లాడటం తప్ప జర్నలిస్టుల సమస్యల గురించి వారివైపు నుంచి వినలేదన్నది స్పష్టం అవుతోంది. జర్నలిస్టులు కూడా రాష్ట్ర ప్రజానీకంలో భాగమే. అయినపుడు వారి గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు ? మీడియా సంస్ధల యజమానుల సంక్షేమం చూస్తే తనకు కావాల్సిన, రావాల్సిన రీతిలో ప్రచారం దొరుకుతుందనే ధీమానా? ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అందుకే వారి లేఖ పూర్తి పాఠం ఇస్తున్నాం.
సామాజిక మీడియాలో పని చేస్తున్న నేను, మీరు అందరం జీతం భత్యం, వేళాపాళా లేకుండా మనకు తెలియని యజమానులకు విపరీత లాభాలు తెస్తూ స్వచ్చందంగా పని చేస్తున్నాం. రాష్ట్రం, దేశంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యజమానులు కూడా తమ సంస్ధలలో పని చేస్తున్న వారికి చట్టప్రకారం ఇవ్వాల్సిందిఇవ్వకుండా, అసలు చట్టాలతోనే పని లేకుండా ఇష్టా రాజ్యంగా వుంటున్నారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. అందుకే వారి సమస్యలేమిటో చూడండి, స్పందించండి.
శ్రీ నారా చంద్రబాబునాయుడు, ది: 30-03-2017
గౌరవనీయ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (ఎ.పి.డబ్ల్యు.జె.ఎఫ్) తరఫున ముందుగా మీకు తెలుగు సంవత్సరాది హేవళంబి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది. త్వరితగతిన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం వ్యక్తిగతంగా మీరు, ప్రభుత్వం చేస్తున్న కృషి తక్కువేమీ కాదు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర కార్యకలాపాలన్నింటినీ ఈ నేల నుంచి కొనసాగించేందుకు చేస్తున్న మీ ప్రయత్నానికి ఫెడరేషన్ మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తోంది. అదేవిధంగా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఫెడరేషన్ మా వంతు కృషిని నిర్వహిస్తుందని తెలియజేస్తున్నాం.
నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా మీడియా రంగం అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచేందుకు వీలుగా ప్రభుత్వం కృషి చేయాలని అభిలషిస్తున్నాం. ఇప్పటివరకు అన్ని దినపత్రికలకు సంబంధించిన ప్రచురణ కేంద్రాలు విజయవాడ కేంద్రంగా నడుస్తున్నాయి. కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ క్రమంగా ఇక్కడ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి అన్నీ హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క ఛానల్ చర్చా కార్యక్రమాలు ఇక్కడి నుంచి చేస్తున్నాయి. ప్రభుత్వం అందించే తోడ్పాటుతో అతి త్వరలోనే అన్ని కార్యకలాపాలు ఇక్కడి నుంచి కొనసాగే కాలం మరెంతో దూరంలో లేదు.
ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అవి అమలవుతున్న తీరుతో పాటు జర్నలిస్టుల ముందున్న సమస్యలను మీ దృష్టికి తీసుకురాదలచి ఈ బహిరంగలేఖ రాస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (ఎ.పి.డబ్ల్యు.జె.ఎఫ్) మహాసభలో, కౌన్సిల్ సమావేశాల్లో చర్చకు వచ్చిన అనేక అంశాలివి.
జర్నలిస్టులకు ఆరోగ్య బీమా
కొత్త రాష్ట్రంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రజల్లో భాగంగా జర్నలిస్టులు కూడా నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు అనంతరం జర్నలిస్టుల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని మీ చేతుల మీదుగా ప్రవేశపెట్టింది. ప్రభుత్వోద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు 1250 రూపాయలు వాటాధనంగా చెల్లిస్తే వైద్య సదుపాయం కల్పిస్తూంది. ఈ పథకం అమలు సమీక్షించేందుకు ఒక కమిటీ వేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. పథకం అమలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలు కావడం లేదు. లివర్, డెంటల్, సాధారణ జ్వరం తదతర అనేక రుగ్మతలు ఈ జాబితాలో లేవు. దీనివల్ల ఈ పథకం పట్ల జర్నలిస్టుల్లో సానుకూల స్పందన లేదు. పథకం అమలు తీరు పర్యవేక్షించేందుకు కమిటీ వేయాల్సి ఉన్నా ఇప్పటివరకు కమిటీ నియమించలేదు.
సమగ్ర బీమా పథకం
జర్నలిస్టులకు తమ వాటాగా 250 రూపాయలు చెల్లిస్తే 10 లక్షల రూపాయల సమగ్ర బీమా పథకం అమలవుతోంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఈ పథకం అమలవుతోంది. ఈ పథకం వల్ల లభించే ప్రయోజనాల గురించిన సమాచారం గ్రామీణ స్థాయి వరకు జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో తెలుస్తున్న పరిస్థితి లేదు. ఈ పథకం అమలు తీరును సమీక్షించేందుకు ఎలాంటి ఏర్పాటు లేదు.
జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు
ప్రభుత్వం రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్ కమిటీతో పాటు జిల్లా కమిటీలు నియమించింది. అందులో వివిధ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించింది. అందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ సిఫారసు చేసిన యేడాదికి గాని సబ్ ఎడిటర్లకు అక్రిడిటేషన్లు కొన్ని పరిమితులతో ఇచ్చారు. కానీ వారికి ఆరోగ్య బీమా కార్డులు ఇవ్వలేదు. అలాగే పలక్ట్రానిక్, కేబుల్ మీడియాలో జర్నలిస్టు పనిచేసే వారందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వలేదు. ఇవి చాలా పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. అయినా ఇప్పటివరకు వారి విషయం తేలలేదు. అన్నింటినీ మించి అక్రిడిటేషన్ల జారీకి సంబంధించి జారీ చేసిన జీవో పాతది. దానికి జతగా అనేక మార్పులు, చేర్పులు చేస్తూ రూపాంతరం చెందిన ఆ జీవోను సమూలంగా మార్చి ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణమైన సమగ్ర జీవోను తీసుకురావడం తక్షణ అవసరం.
దాడుల నివారణకు హైపవర్ కమిటీ
జర్నలిస్టులపై దాడులను నివారించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయి హైపవర& కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇటీవలకాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయి. ఇసుక మాఫియా చేతుల్లో కృష్ణ, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో దాడులు జరిగాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆంధ్రప్రభ విలేకరి శంకర్‌ను హత్యచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టివి 99 విలేకరిపై దాడి చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే సోదరుడు ఆమంచి స్వాములు తన అనుచరులతో బాస అనే పత్రిక విలేకరి నాగార్జునరెడ్డిపై పట్టపగలు పోలీస్ స్టేషన్ ఎదుట పాశవికంగా దాడి చేశారు. దానికి తోడు అతనిపై అక్రమంగా ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇవికాక అనేక జిల్లాల్లో జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు అనేకం. వీటన్నింటిపై చర్యలు తీసుకుని జర్నలిఅ్టల మనోస్థైర్యాన్ని పెంపొందించేందుకు వీలుగా హైపవర్ కమిటీ పనిచేయాలి. జిల్లాస్ణాయి కమిటీలు ఏర్పాటు కావాలి. ఆయా కమిటీలు నామమాత్రపు కమిటీలుగా కాక సమస్య పరిష్కారానికి వేదిక కావాలి. అందుకు వీలుగా ఆ కమిటీలను పరిపుష్టం చేయాలి. జర్నలిస్టులపై దాడులు జరగకుండా నివారించేందుకు వీలుగా చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయిం తీసుకోవాలి. దాడులలో నష్టపోయిన, సర్వం కోల్పోయిన జర్నలిస్టులను ఆదుకునేందుకు వీలుగా శాశ్వత సహాయం అందజేసేందుకు ఒక నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలి. జర్నలిస్టులు పొరపాట్లు, తప్పులు చేసిన సందర్భంలో వారిపై చట్టపరంగా చర్యతీసుకునేందుకు అవకాశాలున్నప్పటికీ అందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం మొత్తంగా మీడియాను భయభ్రాంతం చేయాలని చూడడంగానే భావించి అటువంటి చర్యలను నివారించేందుకు ప్రయత్నించాలి.
జర్నలిస్టుల సంక్షేమ నిధి
జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధిని ఏర్పాటుచేసింది. ఈ పథగం ద్వారా జర్నలిస్టులకు, వారి కుటుంబసభ్యులకు ఆర్ధిక సహాయం అందజేస్తారు. మూడేళ్లుగా ఈ నిధి పర్యవేక్షణకు కమిటీని నియమించలేదు. దీనివల్ల సహాయం పొందాలనుకునే జర్నలిస్టులకు ఆ సదుపాయ, లేకుండా పోయింది. ఈ కమిటీ నిబంధనలను కొన్ని దశాబ్దాల క్రితం రూపొందించారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిబంధలను మార్పుచేయాల్సి ఉంది. అలాగే సంక్షేమ నిధి మొత్తాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ నిధి నిర్వహణకు విధి విధానాల రూపకల్పనతో పాటుగా సంక్షేమ నిధి కమిటీని కూడా తక్షణమే నియమించాలి.
పెన్షన్ పథకం
జర్నలిస్టులకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెన్షన్ పథకం అమలవుతోంది. మన రాష్ట్రంలో చాలా యేళ్లుగా కోరుతున్నప్పటికీ ఒక నిర్ణయం తీసుకోలేదు. అన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు అస్సాం లాంటి రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఒక కమిటీని నియమించి దేశంలోని పరిస్థితిని అద్యయనం చేసి పెన్షన్ పథకాన్న రూపొందించడం అవసరం.
ఇళ్లస్థలాల కేటాయింపు
జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు సంబంధించి అనేక జిల్లాల్లో చాలా యేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. స్థలాల కేటాయింపునకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వు లేకపోవడం వల్ల ఈ సమస్య కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు బలహీనవర్గాలకు కేటాయించే కోటాలో ఇస్తున్నప్పటికీ సొసైటీల ద్వారా స్థలం పొందాలనుకునే జర్నలిస్టులు ఎక్కువమంది ఉన్నారు. కాబట్టి వివాదాలకు ఆస్కారం లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్తలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకువచ్చి సొసైటీల ద్వారా స్థలాలు పొందే ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే కొన్ని చోట్ల చివరిదాకా వచ్చిన సొసైటీలు కేటాయింపు దశలో ఆగినవి ఉన్నాయి. వాటిని కేటాయించాల్సి ఉంది. అలాంటి సొసైటీ విజయవాడలో ఉంది. విశాఖపట్నంలో సొసైటీకి స్థలం కేటాయించినప్పటికీ పొజిషన్ ఇవ్వని పరిస్థితి ఉంది. విజయవాడలో ప్రైవేట్‌గా జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని అభివృద్ది పరుచుకునేందుకు వీలుగా నిధులు కేటాయించాల్సి ఉంది.
ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు భరోసా
ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఇతర సిబ్బందికి సంబంధించి వర్కింగ్ జర్నలిస్టు చట్టం అమలుకు నోచుకోవడం లేదు . ఆ చట్ట పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియాను తీసుకువచ్చేందుకు వీలుగా ప్రభుత్వ చొరవ చూపాల్సి ఉంది. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని అందుకు అనుగుణంగా సవరించేందుకు తగిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. అదేవిధంగా అనేక ఛానళ్లలో ఉద్యోగ భద్రత పంతమాత్రం లేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగ భద్రతకు వీలుగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
మీడియా అకాడెమీ ఏర్పాటు
ప్రభుత్వం ప్రెస్ అకాడెమీని ఏర్పాటు చేయడంలోనే జాప్యం చేసింది. చైర్మన్‌ను మాత్రం నియమించి గవర్నింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని ప్రెస్ అకాడెమీని మీడియా అకాడెమీగా ఏర్పాటుచేయాలి. రాష్ట్రంలో ఉన్న అన్నిరకాల మీడియాను ఒకే సంస్థ పరిధిలోకి తీసుకురావాలి. ఆ సంస్థ మీడియాలో పనిచేస్తున్నవారికి, మీడియాలో ప్రవేశించాలనుకునేవారికి ఉపయోగపడే సంస్థగా రూపుదిద్దాలి. వృత్తినైపుణ్యాన్ని మెరుగుపెట్టేందుకు వేదికగా ఉండాలి. పరిశోధనా కేంద్రంగా ఎదిగేందుకు వీలయిన రీతిలో ఆ సంస్థ కార్యకలాపాలు సాగాలి.
పత్తాలేని జర్నలిస్టు అవార్డులు
జర్నలిస్టుల పేరిట ప్రతియేటా అవార్డులను ప్రభుత్వం ఇస్తోంది. ఈ మూడు సంవత్సరాల కాలంలో ఒక్క యేడాది కూడా అవార్డులు ఇవ్వలేదు. ఇప్పటికైనా అవార్డులు ఇచ్చే ఏర్పాటు చేయాలి. హైకోర్టు అవార్డుల విషయంలో ఇప్పటికే ఒక తీర్పు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటించి ఇవ్వని అవార్డుల విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిది వారాల్లో అవార్డులు అందజేయాలని కోరింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించడం లేదు. గతంలో ప్రకటించిన అవార్డులను వెంటనే ఇచ్చే ఏర్పాటు చేయాలి.
వేతన సిఫారసుల అమలు
పత్రికా రంగంలో పనిచేసే జర్నలిస్టులకు జస్టిస్ గురుభక్ష్ మజీతియా వేతన సిఫారసులను అన్ని యాజమాన్యాలు అమలు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు జర్నలిస్టులు, సిబ్బంది పక్షాన తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడం లేదు. జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ స్థాయి వరకు పనిచేస్తున్న జర్నలిస్టులకు వేతన సిఫారసుల అమలు చేయాల్సిన యాజమాన్యాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు తక్కువ మంది సిబ్బంది ఉన్నట్టు చూపిస్తే మరికొన్ని యాజమాన్యాలు గ్రామీణ ప్రాంత విలేకరుల నుంచి ప్రకటనల సేకరణ పేరిట, సర్క్యులేషన్ పేరిట ఎదురు వసూలు చేస్తున్న పరిస్థితి. వేతన సిఫారసుల అమలు కోసం ప్రభుత్వం త్రైపాక్షిక కమిటీని నియమించింది. అందులో యాజమాన్యాల ప్రతినిధులు మాత్రం సమావేశాలకు హాజరుకారు. కార్మిక శాఖ మౌనముద్ర వీడదు.
మీడియా కమిషన్ అవసరం
ప్రస్తుత పరిస్థితుల్లో మీడియాలో నెలకొన్న పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. పనిచేస్తున్నవారు ఒక విధంగా ఇబ్బంది పడుతుంటే యాజమాన్యాలు తాము చాలా కష్టాల్లో ఉన్నామని చెప్పుకుంటున్నారు. మరోపక్క పుట్టగొడుగుల్లా పత్రికలు, ఛానళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మీడియాలోని వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు భయంలేకుండా ఈ రంగంలో పనిచేస్తున్నవారు కొనసాగేందుకు వీలైన వాతావరణాన్ని కల్పించాలి. అందుకోసం కాలపరిమితితో కూడిన మీడియా కమిషన్‌ను నియమించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లోని వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తే నిజానిజాలు వెల్లడవుతాయి. అందుకు ప్రభుత్వం తగిన చొరవ తీసుకోవాలి.
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా మీరు జోక్యం చేసుకుని పై సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుకుంటున్నాం. మీడియా యాజమాన్యాల పట్ల మీకున్న సానుకూల వైఖరికి సంతోషం. మీడియాలో పనిచేసే జర్నలిస్టుల కష్టనష్టాలను తొలగించే బాద్యత స్వీకరించాల్సింది ప్రభుత్వమే. వేతన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేస్తే వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. మొత్తం మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు రాష్ట్రంలో 20 వేల మందికి మించి ఉండరు. సంఖ్యలో తక్కువ ఉన్నప్పటికీ మా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలి.
మీడియాలో పనిచేస్తున్నవారి సమస్యలను తెలుసుకునేందుకు గతంలో సంఘాలు ఏర్పాటుచేసిన సమావేశాలకు ముఖ్యమంత్రులు హాజరై నేరుగా తెలుసుకునేవారనే విషయం మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడా పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో మీడియాలోని సంఘాలతో ఉన్నతస్థాయి అధికారులతో కూడిన సమావేశాన్ని ముఖ్యమంత్రి సమక్షంలో నిర్వహించడం ద్వారా పలు సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంది. ఈ విషయమై ఫెడరేషన్ తరఫున గతంలో రాసిన లేఖల్లో మేము కోరాం. ఇప్పటికైనా అటువంటి సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా కొంతవరకు వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు వీలవుతుంది.
ప్రభుత్వం విభిన్న వర్గాల ప్రజల కోసం పలు రకాల పథకాలను అమలు చేస్తోంది. వందల కోట్ల రూపాయలను కేటాయిస్తోంది. రాష్ట్రాభివృద్ధి కోసం నూతన ఆవిష్కరణలకు తెరతీస్తోంది. సంక్షేమ పథకాల పేరుతో పెడుతున్న ఖర్చుకు లెక్కేలేదు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి జర్నలిస్టు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మిగిలినవారి కంటే ఒక అడుగు ముందే ఉన్నాడు. అటువంటి జర్నలిస్టు మరింత భద్రతడో కూడిన పరిస్థితుల్లో పనిచేస్తే రాష్ట్రాభివృద్ది మరింత త్వరితగతిన సాగుతుంది. అందుకు మీ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటూ పైన పేర్కొన్న సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తారని ఆశిస్తున్నాం.
అభివందనాలతో
భవదీయుడు
(జి.ఆంజనేయులు)
ప్రధానకార్యదర్శి